మలయాళ మూవీ ఇండస్ట్రీలో ‘‘పవర్ గ్రూప్’’ పాలిటిక్స్?
x

సినీ నటుడు మమ్ముట్టి

మలయాళ మూవీ ఇండస్ట్రీలో ‘‘పవర్ గ్రూప్’’ పాలిటిక్స్?

జస్టిస్ హేమ కమిటీ నివేదికలో ‘‘15 మంది సభ్యుల పవర్ గ్రూప్‌’’ ప్రస్తావన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.


జస్టిస్ హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదుకాగా..అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (AMMA) సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. అధ్యక్ష పదవి నుంచి నటుడు మోహన్‌ లాల్‌ కూడా తప్పుకున్న విషయం తెలిసిందే. నివేదికలో ‘‘15 మంది సభ్యుల పవర్ గ్రూప్‌’’ ప్రస్తావన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

హేమ కమిటీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన, విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యుసిసి) వ్యవస్థాపక సభ్యురాలయిన సీనియర్ నటి రేవతి .. కమిటీ నివేదికపై మలయాళ సినీ ప్రముఖులు మౌనంగా ఉండడాన్ని తప్పుబట్టారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలకు భద్రత లేదని గతంలో పేర్కొన రేవతి.. ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘వాళ్లు (మోహన్‌లాల్‌, మమ్ముట్టి) కూడా మనలాగే షాక్‌లో ఉన్నారని, అయితే మాట్లాడతారన్న నమ్మకం ఉందని అన్నారు.

సాక్ష్యాలుంటే శిక్షించాలి..

ఈ నేపథ్యంలో మోహన్‌లాల్ శనివారం (ఆగస్టు 31) స్పందించారు. “జస్టిస్ హేమ కమిటీ రిపోర్టులో ప్రస్తావించినట్లు నేను ఏ పవర్ గ్రూప్‌లో భాగం కాదు. నాకు ఏ పవర్ గ్రూప్ గురించి తెలియదు.’’ అని పేర్కొన్నారు. కొంతమంది అసోసియేషన్‌ సభ్యులు లైంగిక వేధింపులకు పాల్పడారన్న ఆరోపణలపై కూడా మోహన్ లాల్ స్పందించారు. " సాక్ష్యాలు ఉంటే తప్పు చేసిన వారిని శిక్షించాలి" అన్నారు.

ఎట్టకేలకు స్పందించిన మమ్ముట్టి..

మోహన్ లాల్ తర్వాత మరో ప్రముఖ నటుడు మమ్ముట్టి కూడా హేమ కమిటీ నివేదికపై స్పందించారు. మమ్ముట్టి కూడా సినీ పరిశ్రమలో 'పవర్ గ్రూప్' ఉనికి లేదన్నారు. "జస్టిస్ హేమా కమిటీ నివేదికలో ఆచరణాత్మక సిఫార్సులను అమలు చేయాలి. చట్టపరమైన అడ్డంకులు ఉంటే అవసరమైన మార్పులు చేయాలని నేను కోరుతున్నాను. అంతిమంగా చిత్ర పరిశ్రమ మనుగడ సాగించాలి" అని ఫేక్ బుక్‌లో పోస్టు చేశారు మమ్ముట్టి.

మమ్ముట్టి తన అభిప్రాయాన్ని ఆలస్యంగా పంచుకోవడంపై వివరణ ఇచ్చుకున్నారు. "ఇటువంటి విషయాలపై నటీనటుల సంఘం, నాయకత్వం మొదట స్పందించాలి. సినిమా అనేది సమాజానికి ప్రతిబింబం. సమాజంలోని మంచి చెడు అంశాలు కూడా సినిమాలో కనిపిస్తాయి. సినిమా పరిశ్రమ అనేది సమాజం నిశితంగా పరిశీలించే అంశం. కాబట్టి ఇక్కడ జరిగే ప్రతి చిన్న, పెద్ద సంఘటన చర్చనీయాంశం అవుతుంది. సినిమాతో సంబంధం ఉన్న వ్యక్తులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. జస్టిస్ హేమ కమిటీ పూర్తి నివేదిక ఇప్పుడు కోర్టు ముందుంది. పోలీసులు నిజాయితీగా దర్యాప్తు చేయనివ్వండి. శిక్షను కోర్టు నిర్ణయించనివ్వండి.’’ అన్నారు.

నివేదికలో ‘‘పవర్ గ్రూప్’’

లైంగిక వేధింపుల ఆరోపణలను ఎత్తిచూపిన జస్టిస్ హేమ కమిటీ నివేదిక విడుదలైన తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలో మీటూ ఉద్యమం ఊపందుకుంది. 235 పేజీల నివేదికలో పురుష నిర్మాతలు, దర్శకులు, నటులు ఉన్న 10-15 మంది ‘‘పవర్ గ్రూపు ’’ మలయాళ చిత్ర పరిశ్రమను నియంత్రిస్తున్నట్లు వెల్లడించింది.

నటి సోనియా ఎదురుదాడి..

మరోవైపు మలయాళ నటుడు జయసూర్యపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన నటి సోనియా మల్హర్ ఈరోజు (సెప్టెంబర్ 1) ఎదురుదాడికి దిగారు. జయసూర్య తనపై వచ్చిన ఆరోపణలను అవాస్తవమని పేర్కొనడంతో సోనియా రియాక్టయ్యారు. "నావి తప్పుడు ఆరోపణలు కావు. నేను చెబుతున్నవన్నీ నిజాలు. న్యాయం కోసం పోరాడతా’ అని అన్నారు.

Read More
Next Story