
‘పెరుసు’ అడల్ట్ కామెడీ: ఒక డెత్ ఎరెక్షన్
లైంగిక అంశాన్ని పోర్న్ లాగా కనిపించకుండా హాస్యంగా చెప్పే ప్రయత్నంలో దర్శకుడు ఇలాంగో రామ్ విజయం సాధించారని చెప్పవచ్చు. కానీ…
ఈ మధ్యనే ఫేస్ బుక్ లో పెరుసు సినిమా గురించి ఎవరో సినిమా చాలా బాగుంది.. ఇటువంటి అరుదైన వస్తువుతో అదీ తమిళ సినిమా చరిత్రలో వచ్చిన తొలి సినిమా అని కూడా రాస్తే., ఆసక్తి కలిగి మొన్న రాత్రి చూసాను. అది అడల్ట్ కామెడీ సినిమా కుటుంబం తో కలిసి చూడలేము అని కూడా ఎవరో అన్నారు.గమనిస్తే సినిమా పోస్టర్ లోని అక్షరాలలో u అనే అక్షరాన్ని పైకి స్తంభించిన పురుషాంగం లాగా పైకి సాగ దీసినట్లు చిత్రించారు.సినిమా అంతా చూసాక అలా ఎందుకు పెట్టారో అర్థం అవుతుంది.
అసలు సినిమా చివరి ఘట్టం లో తప్ప సినిమా అంతా ప్రేక్షకుడి కళ్ళకి ఇదే అంటే హాలశ్యామ్ అనే వృద్ధ గ్రామ పెద్దకి చనిపోయే ముందు వచ్చిన స్తంభించిన అంగమే కనిపిస్తుంది.విచిత్రమేమంటే కప్పి ఉంచాల్సిన సందర్భాలు వచ్చినా దర్శకుడు కప్పి ఉంచడు. అతను వేసుకున్న పంచ తప్ప కనపడకుండా మందంగా ఉండే బ్లాంకెట్ కూడా కప్పుడు.అదే ఇక్కడ సెటైర్ . ఇదే ఈ సినిమా అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమా అని తెలియ చేస్తుంది. ఈ సినిమాకి అడల్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు.అలాగని దీన్ని బూతు..అశ్లీల సినిమా అని అనలేము. అర్థం చేసుకోవాలంటే దీన్లో సెక్సువల్ సైన్స్, సెక్స్ సైకాలజీ ఉంది. పురుషుడి లైంగికత ,లైంగిక అవసరాలు, వాటి చుట్టూ అల్లుకున్న అపోహలు,భయాలు,సెక్సువల్ హెల్త్ ,లైంగిక వ్యాధుల చుట్టూ అల్లుకున్న ప్రభుత్వ, కార్పొరేట్ వైద్య వ్యవస్థ ఫార్మా కంపెనీలు కుమ్ముక్కయి స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసం నడిపిస్తున్న సెక్స్ మందుల మార్కెట్ ఉంది.
అయితే,ఇది ఒక్క పురుషుల లైంగిక వ్యాధుల మీదే కాదు స్త్రీల లైంగిక ఆరోగ్యం చుట్టూ కూడా నడుస్తున్న ఒక దుర్మార్గమైన,అమానవీయమైన మందుల వ్యాపారం.అనవసరమైన రహస్యాలతో మార్మికతలతో, భయాలతో,అపోహాలతో ఇంటి బెడ్రూం లోనే కుక్కి దాచి ఉంచుకునే పురుషుడి సెక్స్ సమస్యని మెటఫరీకల్ గా, సున్నితంగా హాస్యంతో మేళవించి బహిరంగ పరిచిన సినిమా ఇది.OTT రివ్యూస్ లో బ్లాక్ కామెడీ,రాంచీ , సెటైరికల్ అని ఉండడంతో అన్నీ వయసుల వాళ్ళు ఎక్కడికక్కడ తమ తమ ఏకాంతాల్లో రహస్యంగా,మహా ఆసక్తిగా , కామెడీ కాబట్టి నవ్వు ఆపుకోలేక నవ్వుకుంటూ చూసేస్తున్నారు. ఎక్కడో అక్కడ కొద్ది పాటి భయంతో చూస్తున్న వాళ్ళూ ఉన్నారు. వాళ్ళు పురుషులు ! ఎందుకంటే సినిమా ఆద్యంతమూ పురుషుడి అంగస్తంభనచుట్టూ ఉంటుంది. అదీ డెత్ ఎరెక్షన్ దృశ్యంతో కొనసాగుతూ ఉంటుంది.
సినిమా చూశాక దర్శకుడు యుగాలుగా ఈ సమాజం ఒక సున్నితమైన అలాగే రహస్యంగా ఉంచుతున్న విషయాన్ని మెటఫరీకల్ గా మార్మికంగా, నిర్భీతిగా బూతు అన్న భావన రాకుండా ఎలా దృశ్యమానం చేసాడో అన్నది చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది.నిజానికి ఈ సెక్స్ టాపిక్ గురుంచి చాలా శాస్త్రీయమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అంటే ఇది పురుషుల లైంగిక సమస్యలకు సంబంధించి,, లైంగికతకి సంబంధించి స్త్రీ పురుష లైంగిక రాజకీయాలకు సంబంధించి ఈ లైంగిక రాజకీయాల్లో పురుషుడు జీవితంలో చాలా సార్లు ఆధిపత్యం తో ,అన్నే సార్లు భయస్తుడుగా కూడా ఉండే వ్యక్తిత్వం గురించి పురుషుడ్ని అలాగ తీర్చి దిద్దిన ఆధిపత్య బ్రామ్హణీయ వ్యవస్థ లోని డొల్లతనం గురించి అన్యాపదేశంగా అయినా చాలా గొప్పగా చూపించిన సినిమా. అయితే ఇది ఇంత రహస్యంగా వ్యవస్థలో కొనసాగుతూ ఉంది దీన్ని అంటే మానవ లైంగికతకి,లైంగిక అంశాలకి సంబంధించిన విషయాలని అంతే బహిరంగంగా ఏ మార్మికతా లేకుండా ఇతర శరీర భాగాలకి సంబంధించిన వ్యాధుల్ని చూపించినంత సహజంగా కూడా చూపించవచ్చు. కానీ లైంగిక అవయవాల చుట్టూ ఒక నిగూడత మార్మికత ,భయం ఒక stigma /taboo ఉన్నట్లు చూపించకపోతే సెక్స్ సినిమాల మార్కెట్ ఎలా నడుస్తుంది? లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి అని ప్రజల్ని భ్రమల్లో పెట్టే కోట్లు సంపాదించే ఫార్మా కంపెనీల మందుల వ్యాపారాలు ఎలా వర్ధిల్లాలి?
ఇక పెరుసు కథలోకి వెళితే..
పెరుసు అంటే తమిళం లో "పెద్ద మనిషి" అని అర్థం.దర్శకుడు ఈ సినిమాలో ఒక 70 ఏళ్లు పైబడిన ఊరి పెద్ద మనిషి పేరు హలాశ్యాం,ఉదయం టీవీ చూస్తూ చనిపోయినప్పుడు అతనికి అంగస్తంభన రావడం,అది మళ్ళీ వెనక్కి సాధారణ స్థితికి తిరిగి రాకుండా అలాగే ఉండిపోవడము అనే ఒక వింత శారీరిక స్థితిని(Anatomical Change)గురుంచి చూపిస్తాడు.
ఊహించని ఈ స్థితి కుటుంబంలో అలజడికి దారితీస్తుంది. కుటుంబ సభ్యులు భయాందోళనకి గురవుతారు, సిగ్గుపడతారు, అవమానపడతారు.ఏం చేయాలో తెలీక తల్లడిల్లుతారు.తండ్రి హఠాన్మరణ దుఃఖంలో కాక ఆ వింత పరిస్థితి నుంచి ఎలా బయట పడాలా అని తర్జన భర్జన పడుతారు. ఒక దశలో తండ్రిని గురుంచి ఇద్దరు కొడుకులు సునీల్,దొరై లు చెడుగా కూడా ఆలోచిస్తారు. హలశ్యామ్ భార్య,కూతురు,కోడలు కూడా సిగ్గు పడతారు ఇబ్బంది పడతారు. శవాన్ని చూసిన వెంటనే వాళ్ళ దృష్టి అంటే ఎవరిదైనా సరే., ముందు శవం పొత్తి కడుపు కిందుగా పంచ కింద స్తంభించిన అంగం మీద పడి ఆశ్చర్యంతో కళ్లు విప్పారి భయాందోలనలతో ఏంటా వాపు అని ఒకరి నొకరు అడుక్కుంటూ ఉంటారు.
కుటుంబ పరువు పోకుండా నలుగురు ముందు తండ్రి శవాన్ని ఎలా అంత్య క్రియలకు సిద్ధం చేయాలి అనే విషయం గురించి చాలా ఆందోళన పడతారు. గ్రామస్థులకు బంధువులకి కూడా తండ్రి మరణ వార్త , కూడా చెప్పరు. ఆఖరికి ఎన్నో అవస్థలు పడి ఒక సాదువుని,అదే సమయంలో డాక్టర్ ని కూడా సంప్రదిస్తారు. ఇక్కడ మూఢ నమ్మకాలకి, సైన్స్ కి మధ్య ఘర్షణ,పోటీని చూపదల్చున్నాడేమో దర్శకుడు? తండ్రి డెత్ ఎరెక్షన్ పోగొట్టి గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు చేయడానికి సాధువూ ,డాక్టర్ ఇద్దరూ వస్తారు.కానీ ఇద్దరి ప్రయత్నాలూ విఫలమవుతాయి. తండ్రి డెత్ ఎరెక్షన్ పోవాలంటే అతని భార్య అంటే సునీల్,దొరయి ల తల్లి వలనే సాధ్యం అవుతుందని సాధువు నర్మగర్భంగా చెబితే తన్ని వెల్లగొడుతారు.సాధువును చూసిన డాక్టర్ కోపంతో అలిగి వెళ్లిపోతాడు.డాక్టర్ డెత్ ఎరెక్షన్ పోవాలంటే సర్జరీ చేసి పెనిస్ తీసేయడం తప్ప వేరే మార్గం లేదంటాడు.డాక్టర్ వెళ్ళిపోయాక డెత్ ఎరెక్షన్ న్ని ప్లాస్టిక్ టేపులతో గట్టిగా అణిచేయాలని చూస్తారు అదీ విఫలమవుతుంది.టీచర్ లాగా టేబుల్ ముందు కూర్చోవాలన్నది తండ్రి చిరకాల కోరిక అని అబద్ధాలు చెప్పి కొంచెంసేపు ఆయన శవం ముందు టేబుల్ పెట్టీ ఎరెక్షన్ కనపడకుండా కూర్చో బెడతారు . అలా చేస్తే ఆయన లైంగిక అవయవాల్లో వచ్చిన మార్పు ఎవరికీ కనపడదని వాళ్ళ ఆశ.కానీ ఈ ప్రయత్నమూ పనికి రాదు.చివరాఖరికి తండ్రిని శవాలను ఉంచే ఫ్రీజర్ లో ఉంచి నడుము దగ్గరనుంచి కిందికి ఎర్రని బట్ట..పూల హారాలతో కప్పి బయట పెడతారు.
అప్పుడే ఊహించని ట్విస్ట్ వస్తుంది. హలాశ్యామ్ భార్యకి,కొడుకులకి తెలియకుండా అక్రమ సంబంధంలో ఉన్న స్త్రీ అక్కడికి వచ్చి ఏడవడం,,ఆ రహస్యాన్ని బహిరంగపరచడం , అది జీర్ణించుకోలేని హలాశ్యాం భార్య, చిన్న కొడుకు దొరయికి ఆ స్త్రీకి మధ్య జరిగిన యుద్దంలో ..కోట్లాటలో అక్రమ సంబంధంలో ఉన్న స్త్రీ చేతులు ఫ్రీజర్ మీద బలంగా పడి దాన్ని కప్పి ఉంచే అద్దం పగిలి ముక్కలవుతుంది. కానీ అదే సమయంలో ఆమె చేతుల బలం,స్పర్శ హలశ్యామ్ స్తంభించిన అంగం మీద పడి అతగాడి డెత్ ఎరెక్షన్ పోతుంది. అది చూసిన కుటుంబం మొత్తం అమితంగా సంతోష పడిపోతుంది. ఆఖరికి శివంగిలా ఆమె మీద పడ్డ హలశ్యాం భార్య కూడా పరమ సంతోషంతో పరిగెత్తుకుపోయి ఆమెను హృదయానికి హత్తుకుంటుంది.ఆమె తన సవితి తన భర్త పరువు కాపాడింది అన్న సంతోషం ఆమెను క్షమించేలా చేస్తుంది. ఆ తరువాత అప్పటిదాకా తండ్రి శరీరంలో వచ్చిన లైంగిక అవయవ మార్పుని జీర్ణించుకోలేక గ్రామస్తులు, బంధువులనుంచి దాచిపెట్టే క్రమంలో తీవ్ర వొత్తిడి ఆందోళనలకి గురి అయిన కుటుంబం., తండ్రి ప్రియురాలి మూలంగా అప్పటిదాకా తండ్రి మరణ దుఃఖాన్ని సహజంగా అనుభవించని వాళ్ళు ఇక అప్పుడు కరువు తీరా ఏడుస్తారు. గొప్పగా అంత్య క్రియలు చేస్తారు. అలా కథ ముగుస్తుంది.
అందరూ సినిమాని హాస్యంగా చూస్తున్నారు. కానీ నాకు మాత్రం అసలు హలాశ్యాం కి మరణం ముందు వచ్చిన డెత్ ఎరెక్షన్ లేదా టెర్మినల్ ఎరెక్షన్ కి ఉండే వైద్య కారణాల గురించి ఆలోచనలో పడిపోయాను.
సినిమాలో గుర్తు చేసే ఐడియాలజీ
సినిమా చూస్తున్నంత సేపూ నన్ను నాలుగైదు అంశాలు ఆలోచింప చేసాయి.
ఒకటి: ఫ్యూడల్ భావజాలం ఉన్న ఈ పితృ స్వామ్య వ్యవస్థలో మానవ లైంగికతకి సంబంధించి, స్త్రీపురుషుల సెక్సువాలిటీ ఇష్యూస్ కి సంబంధించిన ఉన్న ఒక పాక్షిక ధోరణి గురించి, ఏ భయాలకు లోను కాకుండా నిర్మొహమాటంగా నిర్భీతిగా ఇతర ఆరోగ్య సమస్యల గురించి చర్చించినట్లే పురుషుల లేదా స్త్రీల లైంగిక ఆరోగ్యం గురించి ఒక సాధారణత్వంలోనుంచి మాట్లాడకపోవడం అనే దాని గురించి.
రెండు: దీన్ని రహస్యమైన విషయంగా ఉంచుకొని అంటే తమ సెక్స్ సమస్యలను, సెక్స్ లోపాలని రహస్యంగా ఉంచుకొని ఆత్మనూన్యతలకి గురై సిగ్గుతో డాక్టర్ దగ్గరికి వెళ్లకపోవడం గురించి.మూడవ విషయం:డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్ లలో పిప్పర్మెంట్ల లాగా దొరికే, అంగంలో రక్త ప్రసరణ పెంచి తాత్కాలిక అంగ స్తంభన కలిగించే ప్రమాదకరమైన వయాగ్రా, టాడాల్ఫిల్ టాబ్లెట్ ల గురించి. అదీ ప్రిస్క్రిప్షన్ లేకుండా, తీసుకోవాల్సిన డోసుల గురించి. డాక్టర్ వైద్య సలహా లేకుండా,అసలు ఎంత డోస్ వాడాలో కూడా కనీస అవగాహన లేకుండా అత్యధికమైన డోసులు 50 mg నుంచి 200mg వరకు వాడేసి వాటి వలన భయంకరమైన దుష్ఫలితాల పాలైపోయి ,అనారోగ్యాలకి గురై ఒక్కోసారి హటాన్మరణాన్ని కూడా కొని తెచ్చుకోనే పురుషుల గురించి ఆలోచనలో పడ్డాను.చాలా మంది పేషంట్స్ వయగ్రాలు,తాడల్ఫిల్ మాత్రలు వాడి లేని లైంగిక సమస్యలను తెచ్చుకుని తమ దాంపత్య జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు నా దగ్గరికి వస్తారు.వాళ్ళంతా వాళ్ళ భార్యలతో సహా నా కళ్ళ ముందు కదలాడారు..కన్నీళ్ళతో సహా!
మూడు :పెరుసు సినిమాలో చూపించిన మరో అశాశ్రీయమైన విషయం..
సినిమాలో చూపించి నట్లు హలశ్యామ్ ప్రియురాలి చేతి స్పర్శకి prolonged death erection or Live erection పోదు (మనిషి బతికి ఉన్నప్పుడు కూడా)ఎందుకంటే అక్కడ బ్లడ్ clott అయిపోతుంది అంటే గడ్డ కట్టి పోతుంది కనుక. సర్జరీ చేసి clotted blood ను తీసెయ్యాలి.డైరెక్టర్ హాస్యం కోసం ఆమె చేయి పడితే ఎరెక్షన్ పోయినట్లు తీశాడు అంతే !
నాలుగు: తమ వయసు వల్లా, అనారోగ్య సమస్యల వల్ల,ఆ సమస్యలకి వాడుతున్న మందుల వల్ల తమ లైంగిక సామర్థ్యాన్ని సహజంగా కోల్పోయి దాన్ని అంగీకరించలేక.. తమ సెక్స్ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలన్న తాపత్రయంలో ప్రాణాంతకమైన వయాగ్రా లాంటి మందులు వాడే పురుష సమాజం గురించి లేదా పురుషులునలా తయారు చేసిన వ్యవస్థ గురించి నేను ఆలోచనలో పడిపోయాను. ఒక ఫిమేల్ సెక్సాలజిస్ట్ గా నా దగ్గరికి మారేజ్ కౌన్సెలింగ్ కి ,సెక్స్ & రి లేషన్షిప్ థెరపీ కి వచ్చే దంపతులుని చూస్తే ఆందోళన కలుగుతుంది. ముఖ్యంగా వాళ్ళ భర్తలు వయాగ్రా వాడుతున్నారన్న విషయం వాళ్ళ నోటి నుంచి చెప్పినప్పుడు మరీ ఆందోళన కలుగుతుంది. అలాగే చిన్న వయసులో ఉండే లక్షల మంది యువకులు పెళ్లితో సంబంధం లేకుండా అవసరం లేకపోయినా కూడా వయాగ్రా మందు గురుంచిన అపోహాల వల్ల ఇష్టం వచ్చినట్లు ప్రిస్క్రిప్టన్ లేకుండా వాడుతున్నారు. వాళ్ళకి అసలు వయాగ్రా అవసరం ఉండదు. ఓల్డ్ ఏజ్ ,సెక్స్ హార్మోన్ అయిన టెస్టో స్టీరాన్ హార్మోన్ లోపం వల్ల,గుండె,ఊపిరితిత్తుల జబ్బులు, లివర్,కిడ్నీ,షుగర్ , హైపో ధైయిరాడిజిం,ఆర్టీరియో ,Atherosclerosis అనే రక్త నాళాల వ్యాధులలో ,కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నప్పుడు,వేరికోసిల్,హైడ్రో సీల్ వ్యాధులలో,మూర్ఛ రోగంలో,పక్షవాతం లాంటి నాడీ సంబంధిత వ్యాధులలో అలాగే తీవ్రమైన మానసిక వ్యాధుల వల్ల అంగస్తంభన లోపం,శీఘ్ర స్ఖలనం,సెక్స్ కోరిక తగ్గడం లాంటి సెక్స్ సమస్యలు వస్తాయి.
అలాగే ఈ వ్యాధులు తగ్గడానికి వాడే మందుల వల్ల కూడా అంగ స్తంభన లోపం వస్తుంది.ఈ రకమైన మెడికల్ కారణాల వల్ల వచ్చే అంగస్తంభన లోపాలకి వయాగ్రా చాలా జాగ్రత్తగా డాక్టర్ల పర్యవేక్షణలో అదీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలి. బీపీ , గుండె జబ్బుల్లో, గుండె పోటు వచ్చిన వాళ్ళు, గుండెలో స్టెంట్ వేసుకున్న వాళ్ళు అయితే వయాగ్రా అసలు వాడకూడదు.అసలు వయాగ్రా లైంగిక సామర్థ్యాన్ని పెంచదు. కానీ లైంగిక సామర్థ్యాన్ని పురుష సెక్స్ హార్మోన్ టెస్స్టోస్టీరాన్ న్ను పెంచే చాలా మందులు ఉంటాయి. అవి కొ న్ని ప్రత్యామ్నాయ మెడికల్ సిస్టమ్స్లో కావచ్చు ఆయుర్వేదంలో, యునానిలో ఉండొచ్చు హోమియోపతిలో ఉండొచ్చు. అయితే ఇవన్నీ మెల్లిగా ఫలితాన్ని చూపిస్తాయి. అలాగే అలోపతిలో కొద్ది స్థాయిలో మాత్రమే పురుష సెక్స్ హార్మోన్ అయిన టెస్టో స్టీరాన్ పని చేస్తుంది. అదీ ఆ లోపాన్ని ED ప్రొఫైల్ చేయించి హర్మోన్ల స్థాయిని తెలుసుకుని యాండ్రాలజిస్టులు నిర్ణయిస్తారు. అయితే, అల్లోపతీ లో నిమిషాల్లో ఫలితం చూపించే వయాగ్రా లాంటి మందులు ఉంటాయి. అలోపతిలో ఉన్న కానీ లేదా అంగస్తంభనని పెంచే మందులు Sildenafil citrate ,Tadalafil (Cialis) అని ఉంటాయి. అయితే ఇవి సెక్స్ హార్మోన్లను కానీ ,కోరికను కానీ పెంచవు . కేవలం గుండెకి రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలని వ్యాకోచింప చేసి,గుండెకే కాక అన్నీ అవయవాల్లోకి రక్తాన్ని పంపు చేస్తాయి. అది వాడినప్పుడు అంగంలో రక్తం పంపు అయ్యి అంగస్తంభన వస్తుంది. Sildenfil citrate ని Pulmonary Hypertension కి అంటే ఊపిరితిత్తులలో వచ్చే బీపీ తగ్గడానికి కూడా వాడతారు. వయాగ్రా వల్ల ఉన్నట్లుండి రక్త సరఫరా పెరగడం వల్ల ఆకస్మిక గుండెపోటు వచ్చి చాలామంది చనిపోతున్నారు.(Sudden Cardiac Arrest) కానీ ఆ మరణాన్ని సహజంగా వచ్చే గుండెపోటు గా భావిస్తారు తప్ప ఆ వ్యక్తి రహస్యంగా పెరుసు సినిమాలో హలాశ్యామ్ లాగా ఎక్కువ డోస్ లో వేసుకున్న వయాగ్రా వల్ల అని మాత్రం అనుకోరు.కనీసం వాళ్ళ భార్యకి కూడా చెప్పరు . బలానికి విటమిన్స్ వేసుకుంటున్నా అని అబద్ధాలు చెప్తారు అది నిర్ధారించ బడదు కూడా..నేను Male Andropause/Menopause వల్ల అంగ స్థంభన లోపం పాలయ్యే పురుషుడు భార్యకి విటమిన్స్ వేసుకుంటున్నా అని అబద్ధాలు చెప్పి వయగ్రాని వేసుకుంటూ నిశబ్దంగా సైడ్ ఎఫెక్ట్స్ భరిస్తూ ..అదే సమయంలో మెనోపాజ్ కి చేరిన భార్యని వెక్కిరించే ,బాడీ షేమింగ్ చేసే భర్త కథని.."The Fall Of The Man" కథ లో రాశాను.ఇది నా హస్బెండ్ స్టిచ్ పార్ట్ 2- స్టోమా లో ఉంది.నిజానికి వయాగ్రా ఒక భయాగ్రా గా ఎంత ప్రమాదకరమైన పాత్ర పోషించి పురుషుల అర్థాంతర మరణాలకు దారితీస్తుందో చూస్తుంటే బాధ కలుగుతుంది.వయాగ్రా వల్ల వచ్చే ఇలాంటి కనిపించని,మెడికల్ రికార్డ్స్ కి ఎక్కని ఆకస్మిక గుండెపోటు మరణాలు ఎన్నో.
అలాగే నైట్రో గ్లిసరిన్స్ Nitroprusides ,Amylenitrates మందులు వాడుతున్న వాళ్ళు వయాగ్రా వాడకూడదు.కంటిలో రెటీనా సమస్యలున్నవాళ్ళు,ఎముక మజ్జలో గడ్డలున్నవాళ్ళు, లో బీపీ ఉన్నవాళ్లు,హెచ్,ఐ.వి పేషంట్స్, రక్తస్రావ వ్యాధులున్న వాళ్ళు,లుకేమియా ,కడుపులో అల్సర్లు ఉన్నవాళ్లు వయాగ్రా వాడ కూడదు .అలాగే పురుషాంగం వంకరగా ఉన్నవాళ్లు (Curved Penis)కూడా వాడకూడదు. యువకుల్లో సెక్స్ పట్ల ఆందోళన భయం వొత్తిడి అనుమానాలు తప్ప ఈ వ్యాధులు 90% ఉండవు కాబట్టి వాళ్ళకి వయాగ్రా వాడే అవసరం లేదు. విపరీతమైన భయాందోళనలు Normal Sex Response Cycle ను డిస్టర్బ్ చేసి అంగస్తంభనకు కావలసిన నాడీ,రసాయన, హర్మోన్ల కారకాలని నిరోధించి అంగస్తంభనని సహజంగా రావడాన్ని అడ్డుకుంటాయి.దీన్ని Psychogenic Erectile Dysfunction (PED) అని అంటారు.చాలామందికి ముఖ్యంగా యూత్ కి ఇదే ఉంటుంది.దీనికి వయాగ్రా అవసరం లేదు. Sexual counseling,sex &psycho therapy సరిపోతుంది.కానీ చాలా మంది డాక్టర్ లకి ఇంత సమయం ఉండదు.వయాగ్రా రాయడం 10సెకండ్ల పని.ఇంకేం వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు జనం అలవాటు పడిపోతారు.
యువకులే ఎక్కువగా వయాగ్రాని విచ్చలవిడిగా ఎక్కువడోసులో వాడుతున్నారని,అలాగే హలాశ్యామ్ లాంటి,అంతే వయసులో ఉన్న అతని స్నేహితుల లాంటి ఎంతోమంది ముసలి వారు కూడా నాన్ ప్రిస్క్రిప్ట న్ మెడిసిన్ లా వాడుతున్నారని సర్వేలలో తేలింది. 100 mg డోసులో అనేక సార్లు వాడిన యువకుడు నా దగ్గరికి కంటి చూపు దెబ్బ తిని వచ్చాడు.అన్నీ నీలింరంగు లో కనపడసాగాయి అతనికి. ఇంకొంత మందికి ఈసిజి {ecg}రిపోర్ట్ abnormal గా వచ్చింది. కొత్తగా పెళ్లి అయిన భర్త సెక్స్ బాగా చేసి భార్యని ఇంప్రెస్ చేద్దామన్న ఉద్దేశ్యం తో వయాగ్రా ఎక్కువ డోసేజీలో {100 mg} పలుమార్లు వేసుకుని,. పెరుసు సినిమాలో హలాశ్యాంకి వచ్చిన అంగం ఎక్కువ సేపు గంటల కొద్దీ గట్టిపడే నొప్పితో కూడిన ప్రియాప్రిజం స్థితిని తెచ్చుకుని,తీవ్రమైన భయాందోళనలకి లోనై సర్జరీ చేయించుకున్నాక కూడా అప్పటికీ ఆలస్యమయిపోయి శాశ్వత అంగస్తంబన లోపం తెచ్చుకున్నాడు.
ప్రియాప్రిసమ్ అంటే...
ఇప్పుడు ఆ దంపతుల పరిస్థితి ఏంటి?అసలు డాక్టర్ చెప్పిన డోస్ లో కాకుండా ఎక్కువ డోస్ లో వాడితే అత్యంత ప్రాణాంతకమైన దుష్ప్రభావాలున్న వయాగ్రాకి., ఒక సాధారణ జ్వరానికి వేసుకునే Dolo 650mg టాబ్లెట్ ki .. లేదా జిందా తిలిస్మాత్ లాంటి మందులకు దొరికిన విపరీత ప్రచారం ఎలా సాధ్యం అయింది?వీటి వెనకాల ఉన్న కార్పొరేట్ ఫార్మా కంపెనీల., వాటితో మిలాఖాత్ అయిన ప్రభుత్వాల రాజకీయ ఆర్థిక ప్రయోజనాల గుట్టు ఎవరు విప్పాలి? ఇలాంటివి కొన్ని వందల కేసులు ఉన్నాయి. ఇక ఈ మందులకి ఉండే తీవ్రమైన దుష్ఫలితాలు. ఒక్క ఆకస్మిక గుండెపోటే కాదు.. తలనొప్పి, అంధత్వం, చెవుడు, పక్షపాతం, ప్రతీదీ రెండుగా కనపడ్డం, Anterior Ischemi Optic Neuropathi , అన్నిటికీ మించి వయాగ్రా వాడిన వాళ్ళల్లో అంగం రాయిలా గట్టిపడి అంగ స్తంభన 2 నుంచి 6 గంటల వరకు కొన్నిసార్లు మూడు రోజుల వరకు ఉండిపోయి నొప్పితో కూడిన Priyaprism అనే స్తితి ఏర్పడుతుంది. సరైన సమయంలో సర్జరీ చేయించుకొకపోతే ఆ స్థితి అలానే ఉండిపోయి తీవ్రమైన నష్టం ఏర్పడి శాశ్వతమైన అంగ స్తంభన లోపానికి దారితీస్తుంది. వైద్య పరిభాషలో దీన్నీ సరిగ్గా “ప్రియాప్రిసమ్” అంటారు.
ఇవి ఈ మందులు ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా మెడికల్ షాపులకి వెళ్ళి హై డోసులలో వాడే వాళ్ళకి ఎలా తెలుస్తాయి? ఎవరు చెప్పాలి వీళ్ళకి? ఇవి దాదాపు వియత్నాం, జాంబియా లాంటి దేశాలలో బ్యాన్ చేయబడ్డాయి. ఎందుకంటే వీటికి ఉన్న తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్, అంటే దుష్ఫలితాలు చూసి అక్కడి బాధ్యతా యుతమైన గవర్నమెంట్ వీటిని బ్యాన్ చేసేసింది. భారతదేశంలో అమెరికాలో ఇతర దేశాల్లో విచ్చలవిడిగావాడుతున్నట్లు వియత్నామ్ , జాంబియా దేశాల్లో వాడరు డాక్టర్స్ కూడా రాయరు. ఈ సినిమా సమీక్ష చదువుతున్న పాఠకులకి ఏంటి ఈమె ఇక్కడ పెరుసు సినిమా కథను చెప్పకుండా మెడికల్ సమస్యను అదీ సెక్స్ సమస్యను వివరిస్తున్నది అన్న అనుమానం రావచ్చు అక్కడికే వస్తున్నాను.
సరిగ్గా పెరుసు సినిమాలో వృద్ధుడైన హాలశ్యాం పరిస్థితి ఈ వయాగ్రా వాడిన అనంతరం వచ్చే. ఆకస్మిక గుండెపోటు దాన్ని అనుసరించి వచ్చిన ప్రియా ప్రిసమ్ తప్ప మరేదీ కాదు.
చాలా సార్లు Erectile Dysfunction సమస్య మొదలైన వారికి ecg abnormal గా వస్తుంది. అంగ స్థంభన లోపం గుండె జబ్బులు మొదలయ్యాన దానికి సంకేతంగా కూడా అనుకోవచ్చు.వెంటనే cardiologist దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక సినిమా మధ్యలో .. చివరలో శవం అంత్యక్రియలకు వెళ్ళాక అతని స్నేహితులిద్దరూ హలాశ్యాం మరణానికి ముందు రాత్రి వాడిన వయాగ్రా టాబ్లెట్ల కోసం అదీ రెండు మాత్రలు మాత్రమే ఉండే ప్రిస్క్రిప్షన్ కోసం వెతికితే వాళ్ళకి అందులో ఒక మాత్ర లేని స్ట్రిప్ దొరికి,ఓహో వీడు రాత్రి ఒక మాత్ర వేసుకున్నాడన్న మాట అని నిర్ధారించుకుంటారు.బహుశా వాళ్ళు కూడా వాడుదామనేమో..లేదా మిత్రుడికి ఆ స్థితికి కారణం ఆ వయాగ్రా టాబ్లెట్ అని అర్థం చేసుకోవదానికేమో?
మొత్తానికి డైరెక్టర్ రామ్ కావాలని ఈ విషయాన్ని ఆ స్నేహితులతో చెప్పిస్తాడు . సింహళం లో తీసిన సినిమాలో ఇది ఉన్నదో లేదో తెలియదు. పైగా సినిమా చివరిదశలో వచ్చిన హలయశ్యాం ప్రియురాలుతో ఆయన ఆ రాత్రి మాట్లాడినట్లు,తన దగ్గరికి వస్తానన్నట్లు చెప్పాడని దర్శకుడు చెప్పిస్తాడు.
ఈ డాట్స్ ని కనెక్ట్ చేసుకుంటూ వెళితే రాత్రి వేసుకున్న మాత్ర తరువాతే హలాశ్యాం కి డెత్ ఎరెక్షన్ ,లేదా ప్రియాప్రిసమ్ వచ్చిందన్నది తెలుస్తుంది. అసలు వయాగ్రా కాకుండా డెత్ ఎరెక్షన్ న్ని కలగ చేసే ఇతర వైద్య కారణాలు ఒకటి ఉరివేసుకోవడం వల్లా వెన్నుపూస తీవ్రంగా దెబ్బ తినడం. దానివల్ల అంగాన్ని స్తంభించేలా చేసే నర్వ్ ఇంపల్స్ స్ ని ప్రేరేపించే మెదడులోని సెరిబెల్లం కూడా దెబ్బతినడం కారణాలు కావచ్చును.
ఈ స్థితిని “టెర్మినల్ ఎరెక్షన్”{Terminal Erection} అని కూడా అంటారు. అలాగే చనిపోయిన కొన్ని గంటల వరకు కండరాలు బిగుసుకుపోయే స్థితిని “రిగర్ మార్టస్” అంటారు. ఇలా అంగం లోని కండరాలు బిగుసుకుపోతే దాన్ని “రిగర్ ఎరెక్టస్” (Rigor Erectus)అని అంటారు. కానీ హలాస్యాం కి మాత్రం వయాగ్రా వాడిన తరువాతే డెత్ ఎరెక్షన్ వచ్చింది అని దర్శకుడు చెప్పకనే చెబుతాడు.
ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఏమిటంటే అసలు సినిమా చూసిన వాళ్ళు ఈ విషయం గ్రహించారా లేదా అన్నది. ప్రేక్షకులకి విచ్చల విడిగా నాన్ ప్రిస్క్రిప్షన్ వయాగ్రా వాడితే హలాశ్యామ్ కి పట్టిన గతే పడుతుంది అన్నది అర్థం అయిందా .. ఈ వయాగ్రా మందు వెనకాలి మల్టీ నేషనల్ ఫార్మా కంపెనీల ., వాటితో కుమ్మక్కు అయిన ప్రభుత్వాల కుట్ర అర్థం అయిందా? లేక దీన్నివాళ్ళు కూడా బూతు/అశ్లీల హాస్యం గా మాత్రమే చూశారా అన్న అనుమానం వస్తున్నది. శ్రీలంకలో మూల సినిమాగా “టెంటిగో” అనే పేరుతో వచ్చిన ఈ సింహళ సినిమాని అక్కడి ప్రజలు ఎట్లా విశ్లేషించుకున్నారు. కనీసం సినిమా తీసిన సింహళ దర్శకుడు,తమిళ భాషలో "పెరుసు" గా తీసిన దర్శకుడు ఇలాంగో రామ్ కి తాము ఎందుకీ సినిమా తీశామో అన్నవిషయంలో స్పష్టత ఉందా?
వయాగ్రా ప్రమాదకరమైన దుష్ఫలితాలను పురుష సమాజానికి ఇవ్వడానికి ఒక సామాజిక బాధ్యతని నెత్తిన వేసుకుని తీశారా? లేదా సమాజంలో అన్నీ సమయాల్లో,అన్నీ వర్గాల్లో,అన్నీ ప్రాంతాల్లో..అన్నీ జెండర్స్ లో ఎప్పుడూ ఆసక్తిని కలిగించే శృంగార అంశాన్ని హాస్యం తో జోడించి సినిమాని సక్సెస్ చేసుకుని డబ్బులు సంపాదించాలన్న వ్యాపార దృక్పథం తో తీశారా? లేక ఒక “అనటామికల్ జోక్” గా (Aanatomical Joke) శరీర నిర్మాణానికి సంబంధించిన జోక్ } భావించి తీశారా. సందేహమే.
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దశాబ్దాలుగా ఒక ఎక్స్పెరిమెంటల్ డ్రగ్ లాగా మనుషుల మీద ప్రయోగిస్తున్న వయాగ్రా చాప కింద నీరులాగా పాకుతున్న వయాగ్రా విష ప్రభావం గురుంచి సింహళ సమాజం అప్రమత్త మైందా లేదా వాళ్ళు కూడా భారత దేశం లోని ప్రజల లాగే దీనిని ఒక బూతు హాస్యం గా స్వీకరించి ఎంజాయ్ చేసి వెళ్లిపోయారా అన్నది సందేహమే.
హిందీలో ఈ సినిమా హంసల్ మెహెతా ,ముకేష్ చాబ్రా తీయబోతున్నారు. ఇక తెలుగులో ఆ సాహసం ఎవరు చేస్తారో చూడాలి. ఇక సినిమా చివరలో తండ్రికి అంత్యక్రియలు చేసిన తరువాత శవం ఇంకా కాలుతుండగానే అందరూ శ్మశానం నుంచి వెళ్లిపోయాక తండ్రితో కలిసి తాగే అలవాటున్న దొరై, అన్న సునీల్ ని పంపించేసి తన దగ్గర జేబులో ఎప్పుడూ ఉంచుకునే విస్కీ సీసాని తీసి తండ్రి చితి మీద చివరిసారిగా తాగమన్నట్లు పోసి,తనూ తాగుతూ రుద్దమవుతున్న గొంతుతో “నాన్నా నీలాగా నేనూ చాలా గొప్పవాడిగా బతుకుతాను” అంటూ ఏడుస్తాడు.
ఆ డైలాగు ఒకసారి కాదు రెండుసార్లు చెప్పిస్తాడు డైరెక్టర్. ఇక్కడ కొన్ని ప్రశ్నలు వస్తాయి. హలాశ్యాం జీవితం ఏ విధంగా గొప్పది ఇక్కడ? మనవరాళ్ల వయసులో ఉన్న అమ్మాయిలు చెరువులో స్నానం చేస్తుంటే తన ఇద్దరు స్నేహితులతో పాటు చొంగ కార్చుకుంటూ దొంగతనంగా చూసినందుకు గొప్పవాడా తండ్రి?
అదే పని చేసిన టీనేజి యువకుడిని అలా స్త్రీలని పీపింగ్ టామ్ లాగా చూడ్డం తప్పని చెంప పగలగొట్టిన ద్వంద ప్రమాణాలున్న హలాశ్యామ్ గొప్పవాడా ?
అలాగే తనలో అంగస్తంభన లోపం పెట్టుకుని .. భార్య దగ్గర ఫెయిల్ అవుతూ కొత్త మోహంలో, కొత్త స్త్రీతో అక్రమ సంబంధంలోకి అదీ తనకంటే చిన్న వయసున్న స్త్రీతో శృంగార జీవితాన్ని ప్రారంభించి.. భార్య దగ్గర ఫెయిల్ అయినట్లు ఆమె దగ్గరా ఎక్కడ ఫెయిల్ అవుతానో అన్న భయంతో వాడకూడని,ప్రాణాంతకమైన వయాగ్రా వాడుతూ ఆఖరికి ప్రాణాలు కోల్పోయిన తండ్రి. దొరై కననూరికి అంటే హలాశ్యా మ్ చిన్నకొడుక్కి ఏ విధంగా ఆదర్శ మైనాడు?
ఈ మాటలు ఆ పాత్ర తో చెప్పించిన దర్శకుడు ఇలాంగో రామ్ ఉద్దేశ్యం ఏమై ఉండవచ్చు? కొడుకు ఆదర్శంగా తీసుకున్న సచ్చిన హలశ్యామ్ జీవితాన్ని పురుషులంతా కూడా ఆదర్శంగా తీసుకుని ., తమ లైంగిక సామర్థ్యం నిరూపించుకోవడానికి అక్రమ సంబంధాల్లోకి..చాలా సార్లు ప్రాణాంతకమైన AIDS లాంటి లైంగిక వ్యాధులున్న వేశ్యల దగ్గరికీ వెళుతూ..ఆ రోగాలు అంటించుకుని.. మళ్ళీ మళ్లీ అవే వయాగ్రాలు వాడుతూ అర్ధాంతరంగా చావాలనా?
ఇంకో దిగ్భ్రాంతి కలిగించే వాస్తవ విషయం ఏంటంటే వయాగ్రా వాడితే ఎయిడ్స్ రాదన్న మూఢ నమ్మకాలతో వేశ్యల దగ్గరికి కండోమ్ లేకుండాన్వేలతారు చాలామంది యువకులు. మళ్ళీ ఇంట్లో భార్యలతో సెక్స్ లో పాల్గొని ఆ అమాయకురాళ్ల కు లైంగిక వ్యాధులు అంటిస్తారు.జీవితాంతం వేధించే సుఖ రోగాలకు మందులు తీసుకుంటూ చాలా సార్లు ఎయిడ్స్ తో మరణిస్తున్నారు ఆ స్త్రీలు.
ఇవన్నీ బయటకి తెచ్చే నిజాయితీ గల వ్యవస్థలు అటు వైద్య రంగంలో ఇటు సామాజిక రంగాల్లో ఉన్నాయా...ఏమో?
మానవ జీవితంలో కళలు సినిమాలు, నాటకాలు,సాహిత్యం చాలా ప్రభావాన్ని చూపిస్తాయి.ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.అయోమయంగా ఉన్న మనుషులకి సమాజాన్ని. జీవితాన్ని సరైన పద్దతిలో అర్థం చేయిస్తాయి లేదా మారుస్తాయి.కళలకు అంత శక్తి కళకు ఉంది. మంచి వస్తువు.. సమాజానికి అవసరమయిన వస్తువుతో తీసిన సినిమాలు చూసి మంచిగా మారిన వాళ్ళు ఉన్నారు.అలానే చెడ్డ వస్తువు సమాజపు విలువల్ని మరింత దిగజార్చే వస్తువుల తో తీసిన సినిమాలు కూడా మనుషుల జీవితాల మీద అంతే చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. దురదృష్టవశాత్తు సినిమా రంగం వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా చాలా దిగజారిపోయింది. ఒక్క మలయాళ సినిమా రంగంలో కొన్ని మంచి సినిమాలు చూడగలుగుతున్నాము. మానవ జీవతాలకి సంబంధించిన అత్యంత సున్నితమైన అంశాలని చాలా గొప్పగా చూపించగలుగుతున్నది మలయాళ సినిమా ఇండస్ట్రి . అయితే తమిళ సినిమా అయిన ఈ పెరుసు లో కూడా కనిపించీ కనిపించకుండా మానవ జీవితంలో అత్యంత ప్రధానమైన లైంగిక అంశాలపైన బూతు,పోర్న్ లాగా కనిపించకుండా హాస్య రసాన్ని తీసుకుని సున్నితంగా చెప్పే ప్రయత్నంలో దర్శకుడు ఇలాంగో రామ్ విజయం సాధించారని చెప్పవచ్చు.
దర్శకుడి సినిమా తీసిన ఉద్దేశ్యం వయాగ్రా దుష్ఫలితాలను ప్రజలకు చెప్పి హెచ్చరించడం అయితే,,ప్రేక్షకులు దాన్ని అలాగే తీసుకోగలిగితే ఇలాంగో రామ్ ఉద్దేశ్యం ఫలించినట్లే. యువకులు,వృద్ద్ధులు కనీసం ఒకసారైనా వయాగ్రా మందుని తీసుకునే ముందు హాలాశ్యామ్ పరిస్థితిని తలుచుకుని భయపడి ఆ ఆలోచన మానుకుంటారేమో? మొత్తానికి పెరుసు ఒక అడల్ట్ కామెడీ డ్రామా. హాస్య రసం తో ఎన్నో సామాజిక అంశాలని సున్నితంగా సమాజానికి అందించిన దర్శకులు ఉన్నారు. ఈ సినిమా చూశాకా చేరవలసిన సందేశమే ప్రేక్షకులకి చేరితే సంతోషమే.