
అసలు ఎవరీ పండుగ సాయన్న?
హరిహర వీరమల్లు గొడవేంటి..
పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఐదేళ్ల క్రితం మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ముందుగా ఈ సినిమాకు అనుకున్న డైరెక్టర్ క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ). ఈయన కొంత భాగానికి దర్శకత్వం వహించాక జ్యోతికృష్ణ దర్శకుడిగా ముందుకొచ్చాడు. ఇప్పటికే పలు కారణాలతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా జూలై 24న విడుదలకు సిద్ధమైంది. అయితే ఇంతలో మరో గొడవ ఈ సినిమాను చుట్టుకుంది. తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్వాతంత్య్ర సమరయోధుడు పండుగ సాయన్న జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని.. ఈ క్రమంలో చరిత్రను వక్రీకరిస్తున్నారని తెలంగాణలో బీసీ సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాను విడుదల చేయకుండా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసి అడ్డుకుంటామని హెచ్చరించడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు హరిహర వీరమల్లుపైన పొలిటికల్ కోణంలో కుట్ర జరుగుతుందని జనసేన వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరో సినిమా చేయలేదు. ఆ సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు తమ హీరోను తెరమీద చూసుకుందామనుకుంటున్న పవర్ స్టార్ అభిమానులకు తాజా పరిణామాలు రుచించడం లేదు.
ఆదిలోనే కష్టాలు
హరిహర వీరమల్లు ఒక చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా. ప్రధానంగా మొగల్ సామ్రాజ్య కాలంలో నడిచే కథ అని ముందుగానే చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చారిత్రక సినిమాకు ముందుగా అనుకున్న దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ), నందమూరి బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణిలాంటి సినిమాతో అలరించిన క్రిష్ ను హరిహర వీరమల్లుకు దర్శకుడిగా నిర్మాత ఏఎం రత్నం ఎంపిక చేసుకున్నాడు. గతంలో పవన్ కళ్యాణ్ తో ఖుషీ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన ఏఎం రత్నం మరోసారి హరిహర వీరమల్లుతో అలాంటి రికార్డు హిట్ కొట్టాలని ఆశతో ఉన్నారు. అయితే హరిహర వీరమల్లులో కొంత భాగం చిత్రీకరించాక దర్శకుడు క్రిష్ అర్థాంతరంగా ఈ సినిమా నుంచి వైదొలిగాడు. నిర్మాత ఏఎం రత్నం వచ్చిన సృజనాత్మక విభేదాలే ఇందుకు కారణమని చర్చ నడిచింది. ఇంకోవైపు క్రిష్ బాలీవుడ్ లో ఒక భారీ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడని.. పవన్ కళ్యాణ్ వల్ల సినిమాకు ఆలస్యం అవుతుండటంతో వేరే దారి లేక హరిహర వీరమల్లుకు చెయ్యిచ్చాడని టాక్ నడిచింది. ఏది ఏమైతేనే సినిమా పూర్తి కాకుండానే క్రిష్ దర్శకత్వం నుంచి తప్పుకున్నాడు. దీంతో ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. అంతేకాకుండా సినిమా రెండు భాగాలుగా వస్తుందని వెల్లడించారు. మొదటి భాగం హరిహర వీరమల్లు (ధర్మం కోసం యుద్ధం) పేరుతో వస్తుందన్నారు.
పవన్ కళ్యాణ్ వల్ల మరింత ఆలస్యం
ఈ సినిమాను 2020లో ప్రకటించారు. 2020 సెప్టెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించారు. అయితే ఆ తర్వాత కోవిడ్ విజృంభించడం, పవన్ కళ్యాణ్ ఎన్నికలతో బిజీ కావడం, జనసేన పార్టీ కార్యకలాపాలు తదితర వ్యవహారాలతో ఈ సినిమా బాగా ఆలస్యమైంది. అసలు ఈ సినిమా తెరకెక్కదని.. ఆగిపోవచ్చనే ప్రచారం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమానులే ఈ సినిమాను లైట్ తీసుకుంటున్నారని.. వారి దృష్టంతా ప్రముఖ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీపైన, హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న భవదీయుడు భగత్ సింగ్ పైన ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు తేదీలు కేటాయించి, రూ.11 కోట్ల రెమ్యూనరేషన్ ను కూడా నిర్మాతకు తిరిగిచ్చి సినిమాను పూర్తి చేశారు.
జూన్ 12న విడుదలకు ముందు థియేటర్ల బంద్ తో రచ్చ
అన్ని అవాంతరాలు పూర్తి చేసుకుని హరిహర వీరమల్లు జూన్ 12న విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు చిత్ర యూనిట్ విడుదల తేదీని కూడా ప్రకటించింది. ఇంతలోనే జూన్ 12న విడుదలకు నాలుగైదు రోజుల ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లను బంద్ చేస్తున్నామని ప్రకటించారు. థియేటర్ల యజమానులు కష్టాల్లో ఉన్నారని, వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ థియేటర్ల బంద్ చేపడుతున్నామన్నారు. దీంతో జనసేన పార్టీ నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లపాటు ఖాళీగా ఉండి.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు ముందు మీకు థియేటర్ల బంద్ గుర్తు వచ్చిందా అంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకోవడానికి కుట్ర జరుగుతుందనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఒళ్లు మండిన పవన్ కళ్యాణ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో ఆయన పోస్టు చేశారు. తనకు చిత్ర పరిశ్రమ రిటర్న్ గిఫ్టు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు అని, ఇక నుంచి సినీ పరిశ్రమ నుంచి వ్యక్తిగతంగా ఎవరైనా వస్తే తమ ప్రభుత్వం ఏమీ చేసిపెట్టదని తేల్చిచెప్పారు. సినీ పరిశ్రమకు సంబంధించి ఆయా ఫెడరేషన్లు రావాల్సిందేనని స్పష్టం చేశారు. అంతేకాకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సినీ పరిశ్రమ నుంచి ఎవరూ వచ్చి కలవలేదని అక్షింతలు వేశారు.
ఆ నలుగురు.. ఒకరి తర్వాత ఒకరు
ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మీడియా ముందుకొచ్చి థియేటర్ల బంద్ కు తాను పిలుపు ఇవ్వలేదని, పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదని స్పష్టం చేశారు. తన చేతిలో థియేటర్లు ఉన్నా చాలా స్వల్పమని చెప్పారు. ఆంధ్రాలో కేవలం నాలుగైదు థియేటర్లు మాత్రమే తన చేతిలో ఉన్నాయని.. వాటిని కూడా వదుల్చుకుంటానన్నారు. ఆ నలుగురు మాత్రమే కాదని ఇప్పుడు ఆ నలుగురికి ఇంకా చాలామంది యాడ్ అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. థియేటర్ల బంద్ తో తనకెలాంటి సంబంధం లేదన్నారు.
అల్లు అరవింద్ బాటలోనే మరో ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సైతం మీడియా ముందుకొచ్చారు. థియేటర్ల బంద్ పిలుపు తాము ఇచ్చింది కాదన్నారు. ఈ అంశంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. హరిహర వీరమల్లు కోసం తాను కూడా చూస్తున్నానన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాలు అక్షర సత్యాలని.. ఆయన చెప్పిన అంశాలను పాటిస్తామని వెల్లడించారు.
అల్లు అరవింద్, దిల్ రాజు కోవలో ఏసియన్ ఫిల్మ్స్ అధినేత సునీల్ నారంగ్ కూడా థియేటర్ల బంద్ తో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. హరిహర వీరమల్లును అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక డిస్ట్రిబ్యూటరే థియేటర్ల బంద్ కు పిలుపు ఇచ్చాడనే వార్తలు వచ్చాయి. అందులోనూ అతడు జనసేన నాయకుడు కూడా కావడంతో అతడిని పార్టీ నుంచి బహిష్కరించారు.
ముందుగా అనుకున్న జూన్ 12న కాకుండా..
ఈ పరిణామాలతో హరిహర వీరమల్లు సినిమాను ముందుగా అనుకున్న జూన్ 12న విడుదల చేయలేదు. గ్రాఫిక్స్ వర్క్ మరింత నాణ్యంగా అందించడం కోసం సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టు నిర్మాత ఏఎం రత్నం ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలను జూలై 24న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ తేదీ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇంతలో పండుగ సాయన్న పేరుతో గొడవ
జూలై 24న హరిహర వీరమల్లు ఇక విడుదలవుతుందని అని అనుకుంటున్న సమయంలో మరో వివాదం చుట్టుముట్టింది. తెలంగాణ రాబిన్ హుడ్ గా, నిజాం నవాబుల అకృత్యాలను ఎదిరించిన పండుగ సాయన్న జీవితకథ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారని, ఈ క్రమంలో చరిత్రను వక్రీకరిస్తున్నారని బీసీ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పండుగ సాయన్న 1860 నుంచి 1900 వరకు జీవించారు. 40 ఏళ్లు మాత్రమే జీవించిన పండుగ సాయన్న తెలంగాణలో నాటి నిజాం నవాబుల అకృత్యాలను, అరాచకాలను ఎదిరించి ప్రజలకు అండగా నిలిచారని తెలుస్తోంది. అంతేకాకుండా దేశ్ ముఖ్లు, పటేళ్లు, కరణాలు, నవాబుల సంస్థానాలను కొల్లగొట్టి ఆ ధనాన్ని పేదలకు పంచేవారని సమాచారం. అంతేకాకుండా దేశ స్వాతంత్య్రం కోసం కూడా పండుగ సాయన్న పోరాడారని తెలుస్తోంది. ఈ క్రమంలో దేశ్ ముఖ్లు, పటేళ్లు, నిజాంలు కలిసి సాయన్నను అంతం చేశారని సమాచారం.
హరిహర వీరమల్లుపై అభ్యంతరం ఇదే
ఈ నేపథ్యంలో పండుగ సాయన్న జీవిత కథను వక్రీకరించి.. మొగల్ చక్రవర్తుల కాలానికి ముడిపెట్టి హరిహర వీరమల్లు సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలంగాణలో బీసీ సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లును అడ్డుకుంటామని, ఈ సినిమాను విడుదల చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని బీసీ సంఘం హెచ్చరించడంతో ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా జూలై 24న అయినా విడుదల అవుతుందా అనేది వేచిచూడాల్సిందే. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నేతలు, పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారనేది హాట్ టాపిక్ గా మారింది.