ఇకపై అలా రాయొద్దు..పోలీసు కమిషనర్‌కు కన్నడ నటుడు దర్శన్ భార్య లేఖ
x

ఇకపై అలా రాయొద్దు..పోలీసు కమిషనర్‌కు కన్నడ నటుడు దర్శన్ భార్య లేఖ

దర్శన్, పవిత్రల మధ్య సంబంధాన్ని అలా రాయొద్దని కన్నడ నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి మీడియా ప్రతినిధులను కోరారు. పోలీసు కమిషనర్‌కు ఆమె లేఖ కూడా రాశారు.


కన్నడ నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి పోలీసు కమిషనర్‌ బి దయానందకు లేఖ రాశారు. కన్నడ చిత్ర పరిశ్రమను షేక్ చేసిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌, పవిత్ర ప్రధాన నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.

‘‘పవిత్ర గౌడ దర్శన్ భార్య కాదు. స్నేహితురాలు మాత్రమే. జైలులో ఉన్న సూపర్‌స్టార్‌కు చట్టబద్ధంగా వివాహం చేసుకున్న ఏకైక జీవిత భాగస్వామి నేనే’’ అని విజయలక్ష్మి బెంగళూరు పోలీసు కమిషనర్ బి దయానందకు లేఖ రాశారు.

భవిష్యత్తులో తనకు, తన కుమారుడు వినీష్‌కు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున, పోలీసు, ఇతర రికార్డుల్లో భార్యగా తన పేరును ఎంట్రీ చేయాలని లేఖలో కోరారు.

ఇకపై అలా రాయొద్దు..

విలేకరుల సమావేశంలోనూ ఇదే విషయాన్ని చెప్పారు విజయలక్ష్మి. పవిత్ర గౌడ దర్శన్ భార్య అని తప్పుగా రాస్తున్నారని, రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ దంపతులను అరెస్టు చేసినట్లు కర్ణాటక హోం మంత్రి, జాతీయ మీడియా రిపోర్టు చేసిందని ఆమె గుర్తుచేశారు. ఈ తప్పు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

పవిత్రకు ఇదివరకే పెళైంది..

‘‘పవిత్రకు సంజయ్‌సింగ్‌ అనే వ్యక్తితో పెళైంది. ఆమెకు కుమార్తె కూడా ఉంది. పవిత్ర గౌడ నా భర్తకు స్నేహితురాలు మాత్రమే. ఆమె భార్య కాదు. నేను దర్శన్‌ను చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నా. మా వివాహం మే 19, 2003న ధర్మస్థల (హిందూ పుణ్యక్షేత్రం)లో జరిగింది. నేను ఆయన ఏకైక భార్యను.” ఈ వాస్తవాలను పోలీసులను గమనించి నమోదు చేయాలని విజయలక్ష్మి పోలీసులను కోరారు.

‘న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది’

న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, చట్టం తన పని తాను చేసుకుంటుందని నమ్ముతున్నానని లేఖలో పేర్కొన్నారు.

దర్శన్‌పై కేసేమిటి?

దర్శన్ ప్రస్తుతం బెంగళూరు జైలులో ఉన్నాడు. ఆయన జ్యుడీషియల్ కస్టడీ జూలై 4న ముగుస్తుంది. నటుడి అభిమాని అయిన 33 ఏళ్ల రేణుకస్వామిని హత్య చేసిన ఆరోపణలపై దర్శన్, పవిత్రతో పాటు మరో 15 మందిని అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో పవిత్రకు అవమానకర పోస్టింగులు పంపినందుకు చిత్రదుర్గ నివాసి రేణుకస్వామిని కిడ్నాప్ చేసి, బెంగళూరుకు తీసుకువచ్చి, షెడ్‌లో చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు దర్శన్‌పై ఆరోపణలున్నాయి.

Read More
Next Story