యాడ్స్‌కి మన మూడ్‌ ని అమ్మేస్తారు!!
x

యాడ్స్‌కి మన మూడ్‌ ని అమ్మేస్తారు!!

ఓటీటీలు కొత్త దోపిడీ ఫార్ములా:

రిలాక్సింగ్ మూడ్ లో, ఓటీటిలో ఓ మంచి సినిమా లీనమై చూస్తున్నప్పుడు...

హఠాత్తుగా తెరపై పెద్దగా ఓ యాడ్!

"ఇన్యూరెన్స్ తీసుకోండి! ఈ ఆఫర్ మీ కోసమే!" అంటూ అరుస్తూ –

సినిమా చూస్తున్న మూడ్ , మనసులో ఏర్పడిన ఎమోషన్‌… మిగులుతుందా? మొత్తం నాశనం.

ఇప్పుడు ఇదే జరగబోతోంది.

ఒకప్పుడు… “సబ్‌స్క్రిప్షన్ తీసుకోండి, యాడ్స్ ఉండవు” అన్న ఓటిటీలే ఇప్పుడు “యాడ్స్ లేకుండా చూడాలంటే ఇంకొంచెం పేమెంట్ పెడండి” అంటున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ – మొదట్లో యాడ్‌లెస్సుగా, uninterruptedగా చూసే అనుభవం మీదే తమ USP ని నిర్మించుకున్నాయి. కానీ ఇప్పుడు ఆ ఆలోచనలే మారిపోతున్నాయి.

హాట్‌స్టార్‌ ఆల్రెడీ ఈ రూట్ లో ప్రయాణం మొదలెట్టింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కూడా అదే దారిలోకి వస్తోంది. ప్రతి నెలా ఓటీటీలకు చెల్లించే డబ్బు — ఇప్పుడు కంటెంట్ చూడటానికోసమా? లేక యాడ్స్ తట్టుకోటానికోసమా?. ఇది కేవలం పెరిగిన ఖర్చు కాదు – ఇది ఒక మానసిక అసహనం.

అలవాటు చేసి అంతలోనే ...?

కరోనా తర్వాత ఓటీటీలు భారతీయ ఇంటికి నిత్యావసరంగా మారిపోయాయి. పెద్ద సినిమాలు థియేటర్‌కు రాలేకపోతే, ఓటీటీలో విడుదలయ్యాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది OTTలే ఇచ్చాయి. ఇంట్లో కరెంట్ బిల్లు, ఇంటి అద్దె, EMIల లిస్టులో ఓటీటీ సబ్ స్క్రిప్షన్ కూడా చేరిపోయింది.

ప్రతి ప్లాట్‌ఫామ్ కూడా:

తక్కువ ధర

యాడ్స్ లేని అనుభవం

ఇంట్లో నుంచే థియేటర్ అనుభవం

విభిన్నమైన కథలతో వినూత్న వినోదం

ప్రతి వారం ఓటీటీలో కొత్త కంటెంట్ –

వీకెండ్ స్పెషల్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు –

ఇవి ఇచ్చి వినియోగదారుడిని ఓలలాడించింది. అలవాటు చేసింది. కానీ ఇప్పుడు… అదే ఓలలాట నెమ్మదిగా ఉక్కుపాదంగా మారుతోంది.

ఒకవేళ థియేటర్లోనే చూడాల్సిన సినిమాగా అనిపిస్తే తప్ప, ఈ జనరేషన్ థియేటర్లను చూడడం లేదు. బాగున్న సినిమాల్ని అటూ థియేటర్‌లోనూ, ఇటూ ఓటీటీలోనూ చూస్తున్నారు. ఇది ఓటీటీ విజయం కాదు… థియేటర్ల ఓటమి! అదే ఓటిటిలను పెంచి పోషించింది.

అదనంగా చెల్లించాల్సిందే

కానీ ఇప్పుడు అదే ఓటీటీలు యాడ్స్ రూపంలో వినియోగదారుడి సహనాన్ని పరీక్షించే పోగ్రామ్ పెట్టడానికి సిద్దపడుతున్నాయి. ఆహా, ఈటీవీ విన్ వంటి ప్లాట్‌ఫామ్స్ ఇప్పటికే యాడ్స్‌తో ప్రయోగాలు మొదలుపెట్టాయి. ఇప్పుడు అమెజాన్ కూడా అదే బాటలో ప్రయాణం పెట్టుకుంది. హాట్‌స్టార్ ప్రారంభించిన “యాడ్-ఫ్రీ కావాలంటే అదనపు చెల్లింపు” రూల్ ని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఫాలో చేస్తోంది. జూన్ 17 నుంచి యాడ్స్ తప్పనిసరి చేస్తోంది. అవి లేకుండా చూడాలంటే ఇంకో ₹699 చెల్లించాలి.

ఓటీటీ అంటే ఏమిటి? ఓపిక టెస్ట్ టెక్నాలజీనా?

సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వినియోగదారుడికి మళ్లీ యాడ్స్ చూపించటం అంటే, అతని సహనాన్ని పరీక్షించడమే కాకుండా, అతని నమ్మకాన్ని తుడిచేయడమే. "నాకు డబ్బు ఇచ్చిన ఫీలింగ్ కంటే... మోసపోయిన అనుభూతి ఎక్కువగా ఉంది!" అని సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే కొందరు ఓటిటి వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.

ఓటీటిల ధైర్యం :

"వినియోగదారుడు కంటెంట్‌కి కాదు…మెల్లిగా ఈ కొత్త సిట్యువేషన్ కు అలవాటు పడిపోతాడు!"

పైరసీ బ్లాక్‌బస్టర్‌కి సిద్ధంగా ఉంది

ఓటీటీలు ఇప్పుడు యాడ్స్ తో రెవెన్యూ సంపాదించాలన్న వ్యూహంలో ఖచ్చితంగా వినియోగదారుడిని కోల్పోతారనేది నిజం. పైగా పక్కనే బప్ప‌మ్, మూవీ రూల్జ్ లాంటి పైరసీ సైట్లు రెడీగా ఉన్నాయి. ఓటీటీలో సినిమా విడుదలైతే – నిముషాల వ్యవధిలోనే అవే సినిమాలు హెచ్ డీ క్వాలిటీతో ఆ సైట్స్ లో దొరుకుతున్నాయి.

దాంతో ఓటిటిలలో సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారే సైతం – "అక్కడే పైరసీ సైట్లలోనే చూసేస్తాం" అంటారు.

ఎందుకంటే: అక్కడ యాడ్స్ ఉండవు, ఎగస్ట్రా డబ్బు కట్టక్కలేదు, అదే HD క్వాలిటీ వస్తుంది. ఈ ట్రెండ్ కొనసాగితే, వినియోగదారుడు పూర్తిగా పైరసీ వైపు తిరిగే ప్రమాదం ఉంది.

ప్రజలు ఎటు మొగ్గుతారు?

ఒకవేళ ఓటీటీలు ఎక్కువగా వినియోగదారులను ఇబ్బంది పెట్టే ధోరణులు మొదలు పెడితే – అదే మానసిక భారం, అదనపు ఖర్చు వారికి ఓ సినిమా టికెట్‌ కొనేందుకు కూడా కారణం కావచ్చు. థియేటర్స్ కాస్త ఖర్చయినా, నిస్సందేహంగా ఒక ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఏమాత్రం డిస్టర్బ్ చేయని రెండు గంటల ప్రపంచం. పెద్ద స్క్రీన్, పాప్‌కార్న్, జనంతో కలసి నవ్వడం, భయపడడం… అది ఓ కలెక్టివ్ ఎక్స్‌పీరియన్స్.

“Ads లేకుండా, peace తో ఒక సినిమా చూడాలంటే, థియేటర్‌కే వెళ్దాం బాస్!” అనేస్తారు.

ఒకప్పటి అలవాటు తిరిగి అలవాటవ్వడం పెద్ద విషయం కాదు.

Read More
Next Story