ఒక మంచి ప్రేమ కథ ( Telugu OTT Movie Review)
x

ఒక మంచి ప్రేమ కథ ( Telugu OTT Movie Review)

ఈ మధ్య చూసిన మంచి సినిమా అంటున్నారు డాక్టర్ సూర్యదేవర జతిన్ కుమార్

ఒక మంచి సినిమా చూడాలంటే చాలామంది కొన్ని మలయాళ అనువాద సినిమాల పేర్లు చెబుతున్నారు ఈ మధ్య. OTT లో చూడమంటున్నారు. ఇప్పుడు వస్తున్న తెలుగు సినిమాల గురించి చాలా మంది మిత్రులు (ఒకటో అరో తప్ప) ప్రస్తావించటం లేదుకూడా. ఈ పరిస్థితిలో నేను కొత్తగా విడుదలైన ఒక తెలుగు సినిమా సూచిస్తున్నాను.

ఇది నడి వయసుకు దగ్గరవుతున్న ఒక సుజాత (యం. రోహిణి ) కథ. కాదు, ఆమె తల్లి దాదాపు 80 ఏళ్ల రంగ మణి (రోహిణి హట్టoగడి) కథ అని భావించినా అభ్యంతరం లేదు. నిజానికి ఈ రెండు పాత్రలను తీసుకుని ఒక విషాదకరమైన సామాజిక జీవన విధ్వంసాన్నిచిత్రించారు ప్రముఖ రచయిత్రి ఓల్గా. అక్కినేని కుటుంబరావ్ దర్శకత్వంలో ఆ కథ సినిమా రూపం తీసుకుంది.

మనం ఎందుకు జీవిస్తున్నాము? ఎలా జీవిస్తున్నాము ? ఏ గమ్యాల కోసం పరుగులు తీస్తున్నాము? నంబర్ వన్ అనే స్థానం కోసం ఎంత వెంపరలాడుతున్నాము! ఎంత పోటీని ఎదుర్కొంటున్నాము? ఎంత రంధి పడు తున్నా ము ? ఎంత సమయాన్ని, ఎంత మేధస్సును కరిగించి పోస్తున్నాము? ఎంత తపన? ఎంత తాపత్రయం ? ఎంత యుక్తి? ఒకోపరి కుయుక్తి? ఎంత అలసట? ఎంత వేసట? ఎంత శ్రమ? ఎందుకిదంతా అనే ఆలోచనే లేని పరుగు పందెం. వోడిపోయినవాడు నిరాశా, నిస్పృహ లో కూరుకుపోవటం, మానసిక కుంగుబాటులో మునిగిపోవటం; గెలి చిన వాడు ఆ స్థానాన్ని నిలబెట్టుకోవటానికి తిరిగి అదే తపన. అదే పరుగు. నురగలు కక్కుతూ ఉరికి, ఉరికి ఆ వూబిలోనే మునిగి పోవడం. ఇదంతా దేనికోసం? ఎవరికోసం? తన భార్యా పిల్లల కోసమని, తన కుటుంబం కోస మని, వారి బంగారు భవిష్యత్తుకోసమని, వృద్ధాప్యంలో తన భద్రమైన జీవితం కోసమని, ఎవరికి వారు భ్రమ పడటం, కుటుంబాలను మభ్య పెట్టటం చూస్తున్నాము.

ఈ వింత గమనం లో మనం ఏమి కోల్పోతున్నాము? ఏ బంధాలు, ఏ సంబంధాలు, ఏ బాంధవ్యాలు, ఏ ఆనందాలు, ఏ విలువలు, ఏ మానవ భావోద్వేగాలు, ఏ మానవీయ జీవన రాగాలు, ఏ చెలిమి మధురిమలు, ఏ ఆప్యాయతల రసజ్ఞతలు కోల్పోతున్నాము. ఏవేవో కోల్పోయి, కోల్పోయి గానుగ నుంచి బయటపడ్డ పిప్పిలా, చెత్తలా బయటికి విసిరి వేయబడటం ఎంత విషాదకరం? మనమేమిటో మనకు తెలియక, తనకు తానే పరాయిగా మారి, మన ఇష్టాలు అయిష్టాలు, అభిరుచులు అన్ని మరిచిపోయి, మన అనుభూతుల సౌందర్యాన్ని, మన కవితా భావ సౌకుమార్యాన్ని మన జీవితాల నుంచి తరిమివేసి, ఆఫీసు పనివేళల రాటకు కట్టివేసుకుని, రాబోయే పదోన్నతి కోసం మొత్తం జీవన మకరందాన్ని తాకట్టు పెట్టి పొందుతున్నదేమిటి? అనే ప్రశ్నలు రేపెట్టి దానికో చక్కని సమాధానం కూడా చెప్పిన మంచి చిత్రం “ఒక మంచి ప్రేమకథ”

సుజాత అనే మహిళ తాను పనిచేస్తున్న ఒక పెద్ద కంపెనీకి సి.యి.ఒ గా ఉన్నత స్థానం పొందాలని, ఏకైక లక్ష్యం తో ఎంతగా కృషి చేస్తుందో, ఏన్ని ప్రొజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తుందో! తన అవసరం ఎంతగా వున్నా తన ముసలి తల్లిని, “నేను ఒంటరీగా ఫీల్ అవుతున్నానీతో మాట్లాడాలి” అని ఫోనులు చేసే తన పదహారేళ్ల బిడ్డని “చాలా బిజీ గా వున్నా! ఇప్పుడు డిస్టర్బు చేయవద్దు” అంటూ టైమంతా వర్క్ కె అంకితం చేసినప్పటికీ , ఈ ‘మగ ప్రపంచం’ లో ఆమె కృషి గుర్తింపుకు నోచుకోదు. సమర్ధతలు కాక, ‘వీక్ ఎండ్ డ్రింక్ పార్టీలు’ ప్రమోషన్లను నిర్ధారిస్తున్నాయని భావించి ఆమె తీవ్రమైన కుంగుబాటుకు లోనవుతుంది. ఆమె భర్త, భావుకుడు ఈశ్వర్ [సముద్ర ఖని ] మరో కంపెనీ సి. యి. ఒ. గా బాధ్యతలునిర్వర్తిస్తూ భార్య లో జరుగుతున్న భావ సంఘర్షణను గుర్తించీ గుర్తించని డోలాయమానంలో అంతగా పట్టించుకొడు. “నీలో కాంప్లెక్స్ ను తగ్గించుకొకపోతే బాగుపడవు “ అని ఆమెకే సుద్దులు చెబుతుంటాడు. ఒకే కప్పు కింద జీవిస్తున్న ఇద్దరు ఒంటరీవాళ్ళు వాళ్ళు. “ఇగో -జెలసీ” ల మధ్య వారి సంసార నౌక ఒక ప్రేమ రాహిత్య స్థితిలో ఊగిసలాడుతూ వుంటుంది ఒకరి మీద ఒకరికి ఎంత అపార మైన ప్రేమ వున్నప్పటికీ. ఈ స్థితికి వారి ఉద్యోగ స్థితి గతులు ఒక నేపధ్యమే గాని అసలు కారణం మానవ నైజమా? మగ నైజమా? అన్నచర్చ జరుగుతూ వుంటుంది. “డి. విటమిన్ లోపం వుంటేనొ, బి కాంప్లెక్స్ లోపం వుంటేనో దాన్ని సరి చేయటానికి విటమిన్ టాబ్లెట్ లు వాడుతాము. అలాగే మీరు లవ్ డె ఫిషియన్సీ [ప్రేమ కొరత ] వల్ల బాధపడుతున్నారు. మీకూ ప్రేమ మాత్రలు బజారులో దొరకవు, కనుక మానవ బంధాలను పెంచుకోండి, లేకపోతే కనీసం కుక్కను పెంచుకోండి” అని సుజాతకు స్పష్టంగా చెబుతుంది ఒక మానసిక వైద్యురాలు.

ఈ లోగా తల్లి ఆరోగ్యం క్షీణిస్తూ వుండటం తో, ఎలాగూ ఆఫీసుకు సెలవు పెట్టానుకదా! ఒక వారం వుండి అమ్మను ఒక మంచి సీనియర్ సిటిజెన్ హోము లో చేర్పించి వద్దామని తమ వూరికి వస్తుంది సుజాత. అక్కడ అమ్మ తన శారీరక సహాయ నిరాకరణలో అంతంత గా వున్న ఆరోగ్యం తోకూడా, ఓపిక వున్న మేరకు వూరిలో అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తూ, వూరి స్కూల్, మంచినీటి సదుపాయం, హాస్పిటలు లాంటి సౌకర్యాలు చక్క దిద్దు తుంటుంది. ఇరుగు పొరుగు వారికి అమ్మమ్మ, పిన్ని, అక్కాయ్, వదిన లాగా వ్యవహరిస్తూ వారికి సమస్యలలో పెద్దదిక్కులా వుంటుంది. ఆమెకు ఎక్కడా నిర్వేదం. నిరాసక్తి లేవు. ఆ తల్లి తన కూతురి మానసిక స్థితిని గుర్తించి డానికి చికిత్స తనదైన పద్దతిలో మొదలు పెడుతుంది.[ ఆ చికిత్స ప్రస్తుతం మనలో చాలమంది కి అవసరం.] క్రమంగా సుజాత వారం గడువు ఆరునెలలకు సాగిపోతుంది. ఈలోగా మనసుకు ఆహ్లాదం కలిగించే పనులు చేస్తూ—చిన్నతనపు చిలిపితనాలు, చందమామ కథలు, మరిచిపోయిన సంగీతాలు, సాంగత్యాలు, పునరుద్దరించుకుంటూ జీవిత స్వారస్యం అనుభవిస్తూ క్రమంగా మానసిక స్వస్థత ను పుంజుకుంటుంది సుజాత.“ఇక్కడ నేను వుంటున్నది అమ్మకోసం కాదు నాకోసమే. ఈ జీవితాన్ని, ఈ జీవితం లోకి తిరిగి నవ్వులు తెచ్చిన ఈ వూరును, అమ్మను విడిచి పోలేను” అని భావిస్తుంది.
“నువ్వు నిజంగా వంటరిని అని భావిస్తూ వుంటే ఇక్కడికి రా. జీవితాన్ని తిరిగి పొందుతావు” అని బెంగళూరులో భర్తకు నచ్చ చెబుతుంది. ఈ ఆరు నెలల ఎడబాటులో కలిగిన తొలి అహాలు, పట్టుదలలు, మగ వీరాలాపాలు అణిగిపోయి అతని మానసం లో సహజంగా తిష్ట వేసుకున్న కీట్స్, షెల్లీలు ప్రతిధ్వనిస్తూ ఈశ్వర్ సుజాతను చేరుకుంటాడు. స్థూలంగా ఇదీ కథ .

కానీ దీనికి తోడు ఈ ప్రధాన వాహికలో ఎన్నో ఉప పాత్రలు, ఉపాఖ్యానాలు కనిపిస్తూ చిత్రాన్ని రసప్లావితం చేస్తుంటాయి. జీవన సౌరభాన్ని క్షణ క్షణం గుర్తు చేస్తుంటాయి. అరమరికలు లేని అప్యాయతానురాగాలకు అద్దo పడుతుంటాయి. “పిల్లలని పెంచడానికి తల్లి దండ్రులకు దొరికే శెలవులు, తల్లి దండ్రులను చూసుకోవడానికి పిల్లల కెందుకు దొరకవు?” లాంటి జీవితాన్ని మరింత అర్ధవంతం చేసుకునే ఆలోచనలను ప్రవేశ పెడుతుంటాయి. “వికసించడం లోనే కాదు, పండు బారటం లోని అందాలను, పరిణిత స్వరంలోని విజ్ఞతను మనకు పరిచయం చేస్తాయి.

అక్కినేని కుటుంబరావు గారి దర్శకత్వ ప్రతిభా సామర్ధ్యాలు,చిత్రీకరణ రీతులు ఎక్కడా హడావుడి, ఆడంబరం లేకుండా, ముఖ్యంగా నాటకీయత లేకుండా కథను సూటిగా ప్రేక్షకునికి మదిలో ముద్ర వేస్తాయి. ప్రఖ్యాతుడైన మధు అంబట్ ఛాయాగ్రహణం లో అందాలే కాదు, కథనంలోని అంతరార్ధాలు, నటీనటుల భావ ప్రకటన లోని సున్నితత్వా లు అద్భుతంగా వెండితెరకు చేరుకున్నాయి. సన్నివేశానుకూలమైన నేపధ్య సంగీతం రసానుభూతిని ద్విగుణం చేసింది. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో వుంటూనే అన్నిఒకదానితో ఒకటి వొదిగిపోయాయి. అయితే టి. వి. లో చూస్తున్నప్పుడు కొన్ని చోట్ల సంభాషణల రికార్డింగ్ లో హెచ్చు తగ్గులు ఇబ్బందికరంగా అనిపించాయి. ఇక రోహిణి హట్టoగడి ఆ పాత్రను నిర్వహించిన తీరువల్ల పాత్రతో మనమూ కరిగి పోతాము. మహానటిగా పాత్రతో అద్వితీయ మైన అభేదం ప్రదర్శించింది. సరిదీటుగా ఆమె కూతురిగా చిన్నరోహిణి వాచికాభినయంతొ పాత్ర మనో స్థితిని అద్భుతంగా ఆవిష్కరించింది. సహాయ పాత్రలు కూడా పరిధి మించకుండా సహజంగా వున్నాయి.

“చెలిమి పడవ సాగుతోంది చిరునవ్వుల కడలిలో.” ఈ టివి. విన్ చానల్ లో వున్న ఈ ‘ఒక మంచి ప్రేమ కథ’ ను దీపావళి పండుగ సందర్భంలో చూసి ఒక మంచి సినిమా చూసిన ఆనందం పొందండి. జీవితం మీద మరింత శ్రద్ధ పెరుగుతుంది. మనం ఏ విలువలతో జీవించాలో అర్ధమవుతుంది. చిత్ర నిర్మాణ బృందానికి అభినందనలు చెబుతాం. ఇది మా తెలుగు సినిమా అని కొందరికైనా చెప్పుకుంటాం.



Read More
Next Story