ఓదెల 2 మూవీ రివ్యూ
x

'ఓదెల 2' మూవీ రివ్యూ

ఈ రోజు థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం ఎలా ఉంది? అసలైన థ్రిల్ ఇచ్చిందా? చూద్దాం!

సీక్వెల్స్ తీయటం ఎప్పుడూ కత్తి మీద సామే. అయినా సంపత్ నంది ధైర్యం చేసారు. తమన్నాను తోడు తెచ్చుకున్నాడు. 2022లో ఓటీటీలో వచ్చి హిట్ గా నిలిచిన *‘ఓదెల రైల్వే స్టేషన్ కి ఇది అఫీషియల్ సీక్వెల్. ఈసారి కథలో మరింత మిస్టరీ, మరింత విజువల్ గ్రాండియర్, అంతకన్నా పవర్‌ఫుల్ ఎలిమెంట్స్ నింపామన్నారు. ఇవన్నీ కలసి ‘ఓదెల 2’ ని ఓ థ్రిల్లింగ్ ట్రిప్‌గా మార్చాయా లేదా, ఈ రోజు థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం ఎలా ఉంది? అసలైన థ్రిల్ ఇచ్చిందా? చూద్దాం!

స్టోరీ లైన్

ఓదెల – ఓ సాధారణ గ్రామం కాదు… ఆ ఊరిలో కొత్తగా పెళ్లయితే చాలు – ప్రాణమే ముప్పు! ఎందుకంటే అక్కడ తిరుపతి అనే రాక్షసుడు చనిపోయిన తరువాత కూడా... పీడగా మారి తిరిగి వచ్చాడు!

తిరుపతి (వశిష్ఠ ఎన్. సింహ) – వాడివరకు ఆడదాన్ని హింసించి చంపడమే లైఫ్‌గా పెట్టుకున్నక్రూరుడు! అతడి భార్య రాధ (హెబ్బా పటేల్) సహనం కోల్పోయి తానే నరికి చంపేసింది. ఊరు ఊపిరి పీల్చింది. కానీ... అసలు హారర్ అప్పుడే మొదలైంది!

తిరుపతి ప్రేతాత్మగా తిరిగి వచ్చి… ఊరిలో పెళ్లైన వధువులను వేటాడడం మొదలుపెట్టాడు. దుష్టశక్తిగా మారిన అతడి వింత పగ... ఊరి మొత్తాన్ని వణికిస్తోంది. ఇలాంటి టైమ్‌లో ఎంట్రీ ఇచ్చింది నాగ సాధువు భైరవి (తమన్నా). మిస్టిక్ ఫిగర్ – నాగ సాధువు భైరవి (తమన్నా) వచ్చి ఏం చేసింది... ఊరిని ఆ దుర్మార్గుడు నుంచి కాపాడిందా? ఓదెలలో అసలు జరిగిందేమిటి? తిరుపతి ఆత్మకి స్వస్తి చెప్పగలిగిందా భైరవి? లేక మళ్లీ రక్తపాతం జరగిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

మొదటి పార్ట్ 'ఓదెల రైల్వేస్టేషన్' ఎక్కడ ఆగిందో... అక్కడి నుంచే ‘ఓదెల 2’ మొదలైంది. కానీ ఈసారి కథలో క్రైమ్ కంటే కిక్కిచ్చే హారర్, రక్తపాతం ఎక్కువ. గతం కథను నెమ్మదిగా వెనక్కి లాగుతూ, ఈ సినిమా నేరుగా తీసుకెళ్లింది – ప్రేతాత్మకు vs పరమశక్తికి మధ్యే ఓ ఢీ షో జరుగుతున్నట్లు స్క్రీన్ ప్లే రెడీ చేసారు చేసినట్టు!

సినిమాలో విలన్ తిరుపతిని ఖననం చేస్తారు – కానీ అతని కదలికలు ఆగవు! సమాధిలోంచే బయటికి వచ్చి, వధువుల్ని చంపే సన్నివేశాలు మొదట్లో థ్రిల్లింగ్‌గా ఉన్నా, కొన్నాళ్లకే రిపీట్ మోడ్‌లోకి వెళ్లిపోతాయి. ఇంటర్వల్ ముందు తమన్నా ఎంట్రీ – అదిరిపోయే ఎలివేషన్! ఆవులను కాపాడే యాక్షన్ సీన్‌తో మాస్ టచ్‌తో భైరవి పాత్రకు పవర్‌ను నింపాడు దర్శకుడు. అయితే ఆమె వచ్చి చేసిందేమీ లేదు ప్రేతాత్మతో ఫైటింగ్ చేయటం తప్పించి.

ఓవరాల్ గా చూస్తుంటే... ‘అరుంధతి’ స్టైల్ మిస్టికల్ హారర్, ‘అఖండ’ తరహా శక్తి పాత్రలో తమన్నా… అన్నీ మిక్సీలో వేసి తెరపైకి తెచ్చినట్టు అనిపించింది. కానీ కథకు కావలసిన స్పీడ్, స్పార్క్ కొద్దిగా మిస్సయ్యింది. క్లైమాక్స్ ముందు కొన్ని విజువల్స్‌ ‘అరుంధతి’ స్టైల్‌లో కనిపిస్తాయి – ముఖ్యంగా బ్యాక్‌డ్రాప్స్. కానీ ఆ ఎఫెక్ట్ అంత బలంగా పండినట్లు అనిపించదు. అలాగే చివర్లో ఇచ్చిన ట్విస్ట్‌తో 'ఓదెల 3' కోసం లీడ్ తీసుకున్నారు!

టెక్నికల్ గా

సంపత్‌ నంది రాసిన కథకు బలమైన ఎమోషన్ లేదా టర్నింగ్ పాయింట్ లేదు. దర్శకుడు అశోక్‌ తేజ తనవంతు ప్రయత్నం చేశాడు, కాని కంటెంట్ లోపం వల్ల ఇంపాక్ట్ సడలిపోయింది.

గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి. అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఓ మిస్టిక్ టచ్ ఇస్తుంది. సౌందర్ రాజన్ ఛాయాగ్రహణం విజువల్స్‌ను మెరుగ్గా ప్రెజెంట్ చేసింది. నిర్మాణ విలువలు కథకు తగ్గ రేంజ్‌లో ఉన్నాయి. మొత్తంగా చూస్తే, టెక్నికల్ టీమ్ పర్ఫెక్ట్‌గా పనిచేసినా... కథలో కరువు వల్ల సినిమా ఓ మిస్‌డ్ అప్పొర్చునిటీలా మారిపోయింది.

‘ఓదెల 2’ లో తమన్నా భైరవిగా గెటప్ ఆకట్టుకున్నా, ఆమె నటనలో పాత్రోచితంగా లేదు . వశిష్ట తిరుపతి పాత్రలో మంచి ఇంపాక్ట్ చూపించారు. హెబ్బా పటేల్ కు పెద్ద పాత్ర లేదు.

చూడచ్చా

ఓదెల-2 కేవలం తమన్నా కోసం వెళ్లాలి. ఆమె అభిమానులకు బాగా నచ్చుతుంది.

Read More
Next Story