అగ్రతారల విపరీత ధోరణికి అడ్డుకట్ట వేయాలి
సినిమా ప్రమోషన్ కోసం హీరోలు ఎంత ప్రాకులాడాతున్నారో చూస్తే రోతపుడుతుంది
ఈ మధ్య సినిమా రంగంలో అగ్ర తారల విపరీత ధోరణి అసహ్యం పుట్టిస్తోంది. ఇలాంటి పెడ ధోరణి పౌర సమాజం అసహ్యించుకునే వరకు తారలు రెచ్చిపోతూనే ఉంటారు. డిమాండ్ లేని ప్రతి ఒక్కరూ బౌన్సర్లను పెట్టుకొని ఒకరిపై మరొకరు ముష్టి యుద్దాలు చేసుకుంటూ మరికొందరు సామాన్య ప్రజలను తొక్కుకుంటూ ప్రాణాలు తీస్తూ దగ్గరకు వచ్చిన విలేఖరులను గూబ గుయ్యి మనిపిస్తున్నారు. ఒకరేమో గేట్లు బద్దలు కొడుతుంటే మరియొకరు గూబ గుయ్యి మనిపిస్తున్నారు. అసభ్య పదజాలంతో లకరాలు మకారాలు మాట్లాడుతూ విలేఖరులను పోలీసులను వెంటపడి పరిగెత్తుతున్నారు. ప్రతి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో లైంగిక వేధింపులు, పరువు హత్యలు, అత్యాచారాలు మితిమీరి పోయాయి. మరోవైపు నైతికత నైపుణ్యతకు పెద్దపీట వేసి సిలబస్ లో విద్యార్థులలో పరివర్తన మార్పు కోసం చాగంటి కోటేశ్వరరావు లాంటి ఘనాపాటీలు క్యాబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు. దేశ హోంమంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ని అవమాన పరుస్తాడు. లడ్డు కల్తీ పై స్పందించిన సనాతన వాదులు మహిళలపై చిన్నారులపై జరుగుతున్న లైంగిక హింసలు అరికట్టలేక పోతున్నారు. హిందువుల గురించి మాట్లాడే మతవాదులు ఇక్కడ దళిత బహుజనుల ఆరాధ్య దైవం అయిన అంబేద్కర్ ని అగౌరవ పరుస్తుంటే అందలమెక్కిన బహుజన నాయకులు మౌనం దాల్చారు. మరో వైపు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న ఒక గజదొంగ కథ ప్రేరణగా తీసిన సినిమాకు 1300 టికెట్టు పెట్టి ప్రేక్షకుల నుంచి డబ్బు వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తున్నారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారిని పరామర్శిద్దాం అన్న ఇంకిత జ్ఞానం లేదు. పోలీసులు తన బెడ్ రూం లోకి చొరబడ్డారని చెబుతున్న హీరో అరెస్టు సమయంలో సినిమా ప్రమోషన్ కోసం ఎంత ప్రాకులాడాడో పౌరసమాజనికి కనబడుతుంది. అరెస్టు చేసిన సమయంలో ఆయన ఒక కాపీ మగ్ తో ట్రాక్ సూట్ ధరించి కాపీ తాగుతూ వచ్చిన వారికి అభివాదం చేస్తూ భార్యను కౌగలించుకుని ముద్దు పెడుతూ ఆమె కూడా తీవ్ర భావోద్వేగానికి గురైన చెమర్చిన కళ్ళతో భర్తను ఘనకార్యానికి సాగనంపుతూ, ఒకవైపు తండ్రి మరోవైపు పేరొందిన లాయర్ నడుమ అగ్రతారను స్టేషన్ కు తరలించే సన్నివేశం తెలుగు ప్రజలకు చూపించకపోతే మేమెక్కడ వెనుకబడతామేమో అని నిమిష నిమిషానికి కొత్తగా చెత్త వార్తలు చూపించిన ఘనత మన తెలుగు మీడియాకు దక్కుతుంది. కథానాయకుడు ఇంటి దగ్గర పరామర్శ కి తక్కువ లేదు, ప్రభుత్వం ముఖ్యమంత్రిపై విమర్శలు చెప్పనక్కర్లేదు. పనిలో పనిగా బీజేపీ నాయకులు పురందేశ్వరి, బండి సంజయ్ లాంటి వారు ముఖ్యమంత్రిని విమర్శించడం చూస్తుంటే ఇంతకంటే చవకబారు ఆలోచన ఇంకొకటి ఉండదు. పోలీసు ఉల్లంఘనలు అతిక్రమించి తన మామ, భార్య పిల్లలు, కుటుంబ సభ్యులు, ముప్పై మంది బౌన్సర్లు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది, సహాయకులు వచ్చి వేల మందితో ర్యాలీ గా వచ్చి తొక్కిసలాటలో అభం శుభం తెలియని అభిమాని చనిపోతే ఆమె కుమారుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే నా సినిమా ప్రమోషన్ నాకు ముఖ్యం అని విచిత్రమైన మేనరిజం హావభావాలతో ఎమోషన్స్ తో సినిమా వీక్షించిన తారను ఏమనాలి? ఇక సినిమాలో ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పి.. మొగుడు వద్దంటున్న మేడ పైకి లాక్కుని వెళ్లిపోయి వంటగదిలోనే పనికానిచ్చే మోటు పెళ్లంగా శ్రీవల్లిని చాలా వైల్డ్ వైఫ్‌గా చూపించిన ఘనత దర్శకుడిది. ఇంట్లో కూతురు, కొడుకు చెల్లె, అక్కతో కలసి ఎవడూ ఈ పాటను చూడడానికి సాహసించరు. పాట మొత్తం హీరోయిన్ వస్త్రధారణ బ్లూ ఫిలిం కు తక్కువ ఏ సర్టిఫికెట్ సినిమాకు ఎక్కువగా ఉంది. అసలే బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్, జూదం, మోసం అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతున్న తరుణంలో ఏమాత్రం సెన్సార్ కాకుండా విశృంకలకత్వాన్ని, హింస ఎక్కడ తగ్గకుండా "తగ్గేదెేలా" అంటూ తాగుడు, ధూమపానం, గంజాయి జుగుప్సాకరమైన సన్నివేశాలను ప్రేరేపించే సినిమాలను సెన్సార్ బోర్డు కళ్ళు మూసుకొని సర్టిఫై చేస్తున్నారు, మరోవైపు హిందూ మనోభావాలు లవ్ జిహాద్ అంటూ గగ్గోలు పెట్టే మతతత్వవాదులకు అస్లీలత కనిపించకపోవడం సిగ్గుచేటు. పత్రికలు కూడా సినిమా రివ్యూలలో అస్లీలతను రాయకుండా దర్శకుడిని పొగుడుతూ, సెకండాఫ్‌లోని జాతర ఎపిసోడ్‌లో ఇదిరా పెళ్లం అంటే అనేట్టు చూపించాడని రోత పుట్టిస్తున్నాయి. ఒకవైపు స్త్రీ దేవత అనే సంస్కృతికి పరిరక్షకులం అని చెప్పుకుంటూ , మరో వైపు స్త్రీని అవమానించడం విరుద్ధ విలువలను ప్రతిబింబిస్తుంది. ఏడాది వయసున్న చిన్నారి నుంచి ముసలి అవ్వ కూడా అత్యాచారం నుంచి తప్పించుకోలేని పరిస్థితి. సినిమాలల్లో సీరియళ్లలో పెడధోరణలు ఎక్కువైపోయాయి. బూతు కంటెంట్ ఉన్న సినిమాలు కాసుల వర్షం కురిపించడం ఎలా ఉన్నా సమాజంపై ప్రభావం చూపుతున్నాయి. మన భాష మన వ్యవహారం చూస్తే కేవలం అనుకరణ తప్ప సంస్కారానికి విలువలకు ఎప్పుడో మడత పెట్టాము. చట్ట సభలు వ్యవస్థల్ని దిశా నిర్దేశం చేస్తాయి, ప్రజా ప్రతినిధులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ సభ్యులు నీలి చిత్రాలు తిలకించడం, గౌరవ ఎంపీ వివస్త్రుడై సంభాషిస్తున్న విషయాన్ని పదే పదే చూపించడం. కుర్చీలు మడత పెట్టమని ఒక పెద్దాయన మాట్లాడడం, నాల్గవ పెళ్లానిగా రా అని పిలవడం చూస్తుంటే విలువలు నశించిపోతున్నాయి. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను కనీసం ఖండించని నాయకులను ఏమనాలి ? చట్ట సభల్లో కి వెళ్తున్న వారి ఆలోచనలు మారాలి. ఒక మహిళ చెప్పే అభిప్రాయాన్ని ఖండించేందుకు ఆమె లైంగికత, లైంగిక సంబంధాలను చర్చలోకి తెస్తున్నారు. స్త్రీల పక్షాన మాట్లాడే మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్నారు. మీకు కుటుంబాలు లేవు, సంసార స్త్రీలు కారు. కుటుంబాలు కూల్చుతారు. విలువలు లేవు అని అంటూ దూషిస్తున్నారు. ట్రోలర్స్ దృష్టిలో విలువలంటే దూషించడం, అవమానించడమా? టెక్ ఫాగ్ అనే యాప్ ద్వారా అధికారంలో ఉన్న పార్టీ కొంతమంది ప్రముఖులు, మహిళా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తోందని ఇటీవల వైర్ పత్రిక ప్రచురించిన కథనంలో పేర్కొంది. ముఖ్యంగా పాలక పక్షానికి అనుకూలంగా లేని మహిళా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుంటోందని, దీని ద్వారా వారిని అవమానపరిచే, వేధించడమే లక్ష్యమని వైర్ కథనం చెబుతోంది. ఈ దాడులను చాలా వరకు ధ్రువీకరణ కానీ అకౌంట్ల ద్వారా చేస్తున్నట్లు తేల్చింది.