నోలన్ కొత్త సినిమాలో ఏముంది?
x

నోలన్ కొత్త సినిమాలో ఏముంది?

ఏడాది ముందే టిక్కెట్లు అమ్ముడు పోవటమేంటి?

ఒక టీజర్ కానీ, ట్రైలర్ కానీ, పోస్టర్ కానీ రిలీజ్ కాకముందే, కేవలం ఓ సినిమా దర్శకుడి పేరు మాత్రమే బేస్ చేసుకుని టికెట్లు ఒక సంవత్సరం ముందే అమ్ముడుపోయాయంటే, అది సాధారణ విషయం అయితే కాదు. అయితే ఇది నోలన్ సినిమా కాబట్టే సాధ్యం.

హాలీవుడ్ అంటే సాధారణంగా సూపర్‌హీరోలు, సీక్వెల్స్, యాక్షన్ మాస్ సినిమాలు గుర్తొస్తాయి. కానీ క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు మాత్రం విభిన్నతకి, మేథస్సుకి ప్రతీక. ఆయన సినిమాలు... సినిమా ప్రామాణికాలను మళ్లీ నిర్వచిస్తాయి. ఆయన సినిమా కలెక్షన్స్ భాక్సాఫీస్ వద్ద రికార్డ్ లు తిరగ రాస్తాయి.

ఈ ఏడాది ఓపెన్‌హైమర్‌కు ఏకంగా ఏడు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఇప్పుడాయన తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది ఒడిస్సీ’. హోమర్ రాసిన ప్రాచీన ఇతిహాసం ఒడిస్సీ ఆధారంగా ఈ ఎపిక్ యాక్షన్ ఫాంటసీ తీర్చిదిద్దబడుతోంది. ఈ సినిమాలో టామ్ హాలండ్, అన్నే హాత్‌వే, జెండ్యా, లుపిటా న్యాంగోస్, రాబర్ట్ పాటిన్సన్, ఛార్లైజ్ థియోరాన్, జాన్ బెర్నథాల్ తదితరులు నటించారు. ఇథాకా గ్రీక్ కింగ్‌ ఒడిస్సీగా మాట్స్ డామన్ నటిస్తున్నారు.

ఈ సినిమాను తన సొంత సినీ నిర్మాణ సంస్థ సింకాపీ ద్వారా నిర్మించారు. యూనివర్సల్ పిక్చర్స్ ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నది. ఈ సినిమా జూలై 17, 2026 సంవత్సరలో రిలీజ్ కానున్నది. ఏడాది తర్వాత విడుదలయ్యే ఈ సినిమా ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది.

ఐమ్యాక్స్ టికెట్లు మినిట్లలో ‘సోల్డ్‌అవుట్’

ఈ సినిమా విడుదలకు ఇంకా సంవత్సరం ఉన్నా, అమెరికాలోని ఐమ్యాక్స్ 70mm స్క్రీన్స్‌కి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, కొన్ని నిమిషాల్లోనే టికెట్లు మొత్తం అమ్ముడైపోయాయి. దాదాపు ఒకే రోజులో నార్త్ అమెరికాలో 25 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది నార్త్ అమెరికా బాక్సాఫీస్ చరిత్రలో ఓ రికార్డు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఆడియెన్స్‌కి ఇది సినిమా కంటే ఎక్కువ – ఒక ‘ఈవెంట్’ గా ఫీలవుతున్నారు. నోలన్ పేరు ఉంటే చాలు – థియేటర్లు ఫుల్ అవుతాయి అనే విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది.

నోలన్‌ సినిమాకు ఆడియెన్స్ ఎందుకు ఆసక్తిచూపెడతారు?

నోలన్ బ్రాండ్: "బ్రెయిన్ + బ్లాక్‌బస్టర్" కాంబినేషన్. ప్రతి సినిమా ఓ intellectual puzzle లా ఉంటుంది. నోలన్ సినిమాలు ఒకే సమయంలో మాస్ + క్లాస్‌ను టార్గెట్ చేస్తాయి. సాధారణంగా విజువల్ గ్రాండియర్ ఉన్న బ్లాక్‌బస్టర్స్ మాస్‌కు మాత్రమే పనిచేస్తాయి. కాని నోలన్ కథలు సైన్స్, టైమ్, ఫిలాసఫీ, మానవతా సంక్లిష్టతలతో నిండి ఉంటాయి. అయినా సరే థియేటర్లో మాస్ ఓపెనింగ్స్ సాధిస్తాయి. నోలన్ సినిమాలు మెకానికల్‌గా కాకుండా ఎమోషనల్‌గా ఛార్జ్ అయ్యేలా ఉంటాయి.

ఫ్రెష్ & ఒరిజినల్ కాన్సెప్ట్స్: బ్రాండ్ ఆధారంగా కాకుండా ఐడియాల ఆధారంగా సినిమాలు.

థియేటర్లోనే చూడాల్సిన సినిమా

నోలన్ సినిమాలు సినిమాను స్క్రీన్ మీద చూసే అవసరాన్ని తిరిగి గుర్తు చేస్తూంటాయి. ఆయన IMAX 70mm ఫిల్మ్ స్టాక్ ఉపయోగిస్తారు. ఇది అద్బుతమైన క్లారిటీ, స్ప్రెడ్, ఆడియో-విజువల్ పర్‌ఫెక్షన్ అందిస్తుంది. ముఖ్యంగా ఆయన సినిమాల్లో CGI కన్నా సౌండ్ డిజైన్, సింక్రనైజ్డ్ విజువల్స్ పైన ఎక్కువ ఆధారపడతాడు. ఇది థియేటర్లో చూస్తేనే అద్బుతం ఆవిష్కారమవుతుంది. దానికి తోడు నోలన్ సినిమాలు ఒకసారి చూస్తే సరిపోదు. కథ మొత్తం అర్థం కావడానికి రెండో సారి చూడాల్సిందే.

భారతదేశంలో నోలన్ ఫీవర్ ఎలా ఉంది?

ఇండియాలో నోలన్ సినిమాల పట్ల ఉన్న ఫ్యానిజం గత 10 ఏళ్లలో విపరీతంగా పెరిగింది. టెనెట్ వంటి థియేటర్లకు తిరిగి వస్తున్న సమయంలో విడుదలైన సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇన్సెప్షన్, ఇంటర్‌స్టెల్లార్ సినిమాలు రీ-రన్ షోలు పెట్టినా ఆడియెన్స్ పోటెత్తారు.

2023లో వచ్చిన ఓపెన్‌హైమర్ IMAX షోలు — హైదరాబాద్, ముంబయి, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో వారంల తరబడి హౌస్‌ఫుల్. ప్రీమియర్ లొకేషన్లలో నోలన్ సినిమాలు ప్రత్యేక క్రేజ్ కలిగి ఉంటాయి.

బిజినెస్ పరంగా నోలన్ ఎంత భారీ బ్రాండ్ అంటే...

నోలన్ సినిమాలు ఫ్రాంచైజీలు లేకుండానే వందల మిలియన్ల డాలర్లు రాబడతాయి. ఇన్సెప్షన్, ఇంటర్‌స్టెల్లార్, డంకిర్క్ అన్ని కలిపి $3 బిలియన్ కి పైగా వసూలు చేశాయి. ఇండియా మార్కెట్‌ నుంచే నోలన్ సినిమాలకు ప్రపంచ బాక్సాఫీస్‌లో సుమారు 6–8% వసూళ్లు వస్తాయి. తాజా మూవీ ది ఒడెస్సీ కోసం ఈ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది, ముఖ్యంగా మైథలాజికల్ కనెక్షన్ వల్ల.

స్టోరీ లైన్ ఏంటి

గ్రీకు కవి హోమర్ రచించిన ప్రాచీన కావ్యం ది ఒడిస్సీ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇతిహాసకథలో, ట్రోయ్ యుద్ధం ముగిసిన తర్వాత గ్రీకు వీరుడు ఒడిసియస్, తన స్వగ్రామమైన ఇథాకా చేరుకునే దారిలో అనేక అడ్డంకులు ఎదుర్కొంటాడు. దేవతల శాపాలు, సముద్ర ముంపులు, రాక్షస జీవులు, మానవుల మోసాలు – ఇలా పది సంవత్సరాల పాటు సాగిన ఆ యాత్ర చివరికి అతడి కుటుంబాన్ని చేరుకునే ఓ ఇంటెన్స్ హ్యుమన్ జర్నిగా నిలుస్తుంది. నోలన్ చేతిలో ఇది ఓ యాక్షన్, ఫాంటసీ, మానవీయత మూడు శక్తివంతంగా మిళితమై ఉండే కథనంగా మారనుంది.

ఇన్‌సెప్షన్‌లో "రియాలిటీకి తిరిగి వచ్చే కల", ఇంటర్‌స్టెల్లార్‌లో "పిల్లల కోసం గాలాక్సీల మధ్య ప్రయాణం", ఇప్పుడు ఓడెస్సీలో "ఇంటికి చేరే యుద్ధం" – నోలన్ ఎప్పటికీ ఇంటికి చేరే (తిరిగి వెనక్కి వచ్చే) కథ చెబుతూనే ఉన్నాడు. సక్సెస్ అవుతూనే ఉన్నాడు. తిరిగి విజయవంతంగా వెనక్కి రావటం ఎప్పుడూ మానసిక ఆనందమే కదా.

‘ది ఒడెస్సీ’ అంటే ఒక సినిమా మాత్రమే కాదు – అది మార్కెటింగ్ మాస్టర్‌స్ట్రోక్, సినిమాటిక్ కల్ట్, ఇంటర్నేషనల్ ఫెనామినన్. ఇది ఆధునిక ప్రేక్షకులకు కథనంలో మహాకావ్యాన్ని చూపించే ప్రయత్నం. ఇక ఇండియాలోనూ ఫ్యాన్స్ కోసం లెక్కలేనన్ని ఫోరమ్స్, థియేటర్లు, రీల్ పేజ్‌లు ఇప్పటికే యాక్టివ్ అవుతున్నాయి. 2026 జూలై 17 – ఫిలిం లవర్స్ కాలెండర్‌లో గుర్తుండిపోయే తేదీ.

Read More
Next Story