బెనిఫిట్ షోలు రద్దు: 'గేమ్ ఛేంజ్' అయ్యినట్లేనా ?
ఇంకా ఈ బెనిఫిట్ షోలు రద్దు అనే విషయం జనాలకు అంతలా నచ్చడానికి కారణం ఏమిటి..
ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోను, సామాన్యులలోనూ అల్లు అర్జున్ టాపిక్కే. ఈ అంశంతో పాటు మరోటి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఇంక ఉండవని మంత్రి ప్రకటించిన విషయం . తాజాగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటనతో ... తెలంగాణలో ఇకపై సినిమా విడుదలకు ముందు రోజు ఎలాంటి బెనిఫిట్ షోలు అనుమతి ఇవ్వమని, టిక్కెట్ల రేట్లు పెంపుకి కూడా అనుమతి ఇవ్వడం జరగదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేయటం చాలా మందికి నచ్చింది.
బెనిఫిట్ షోల వల్ల బెనిఫిట్ కేవలం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కే తప్పించి మామూలు వాళ్లకు కాదు కదా, అదేదో గొప్ప విషయం అయినట్లు ప్రభుత్వాలు ప్రతి పెద్ద సినిమా రిలీజ్ ముందు జీవోలు ఇస్తూంటాయనేది వారి కంప్లైంట్. దాంతో ఈ మంత్రిగారికి సోషల్ మీడియాలో చాలా మంది సామాన్యులు మద్దతు ఇవ్వడం గమనార్హం. అదే సమయంలో ఇండస్ట్రీలో పెద్దలు మాత్రం అప్ కమింగ్ బడా చిత్రాల పరిస్థితేంటని మాట్లాడుకుంటున్నారు. అది వేరే టాపిక్ కు. ఇంకా ఈ బెనిఫిట్ షోలు రద్దు విషయం జనాలకు అంతలా నచ్చడానికి కారణం ఏమిటి..
ఓ పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అంటే బెనిఫిట్ షోలు ఎన్నింటికి మొదలు అనే ఆర్టికల్స్ మీడియాలో మొదలు అవుతున్నాయి. అంతలా ఇవి ప్రభావం చూపెడుతున్నాయి. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే స్టార్ హీరోలతో చిత్రాలు తీయడం, సినిమా టాక్ ఎలా ఉన్నా ఆ చిత్రంపై ఉన్న క్రేజ్‌ను, అభిమానుల బలహీనతలను క్యాష్ చేసుకోవటం. టిక్కెట్లను ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఓకే చేయించుకోవడం జరుగుతోంది. ఈ పరిణామాలు సామాన్య ప్రేక్షకుడు గమనిస్తూనే ఉన్నాడు. అతనికి బాధతో పాటు ఇదో మాఫియాలాగా తయారైందని భయం వేస్తోంది. అయితే స్వయంగా ప్రభుత్వాలు బెనిపిట్ షోలకు, టిక్కెట్ రేట్ల పెంపుకు సై అంటున్నాయి కాబట్టి ఎవరూ పల్లెత్తి మాట మాట్లాడటం లేదు.
అయితే పెరుగుట విరుగుట కొరకే... ఏదో రోజున పరిస్థితులు చక్కబడతాయి అని ఎదురు చూస్తున్నాడు మిడిల్ క్లాస్ జనం. ఆ పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి అనిపిస్తుంది. ఫలానాహీరో చిత్రం మొదటి షో కి ఇంత రేటుకు టిక్కెట్లు అమ్మారు కాబట్టి...దానికి రెట్టింపు రేట్లకు తమ హీరో చిత్రాల రేట్లను నిర్ణయించాలని చాలా మంది స్టార్స్ భావిస్తున్నారు. ఇందులో కూడా పెద్ద పోటీ. బెనిఫిట్ షో లకు కూడా టిక్కెట్లు ఆన్ లైన్ లో చాలా ఎక్కువ రేటుకు అమ్ముతూ అఫీషియల్ దోపిడికి కి తెర తీస్తున్నారు. నిర్మాతలు తాము భారీ బడ్జెట్ తో సినిమా చేస్తున్నామనే ఏకైక కారణంతో, టిక్కెట్ రేట్లు పెంపు, బెనిఫిట్ షోల రూపంలో కోట్లు కొల్లగొడుతున్నారు.
గత కొద్ది కాలంగా చిన్నా, పెద్ద సినిమా వాళ్లంతా ప్రీమియర్ షోలంటూ కొత్త కొత్తదారులు వెతుక్కుంటున్నారు. తమ పెట్టుబడి అంతా మొదటి వారంలోనే అవకాశం ఉంటే ఫస్ట్ వీకెండ్ లోనే లాగేసుకోవాలనే ఆలోచనలే ఇందుకు కారణం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు క్రేజ్, మోజు ఉండి టాక్ బయటకు వచ్చేలోగా మొత్తం లాగేయాలనే దారుణమైన ప్లాన్ లు సినిమాలపై సామాన్యుడికి ఉండే అభిమానాన్ని చంపేస్తున్నాయి. హీరోలను విపరీతంగా అభిమానించే అభిమానులను కూడా ఈ క్రమంలో దెబ్బ తీస్తున్నారు.
అసలు బెనిఫిట్ షోలు గతంలో ఉండేవి కాదు. టికెట్ రేట్లు పెంపు వంటివి అసలు ఉండేవి కాదు. అప్పట్లో బాగానే సినిమాలు ఆడాయి. రిక్షావాలా మొదలు కుని చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ థియేటర్ లో లైన్ లో నుంచుని సినిమా చేసేవారు. అప్పుడు బ్లాక్ లో టిక్కెట్లు అమ్మడం పెద్ద సమస్య. కానీ ఇప్పుడు బెనిఫిట్ షోలు, టికెట్ పెంపు పేరుతో నిర్మాతలు స్వయంగా అఫీషియల్ బ్లాక్ మార్కెట్ కు తెర తీశారు. పెద్ద తేడా లేదు. అప్పుడు అఫీషియల్. ఇప్పుడు అఫీషియల్. రెండూ ప్రేక్షకులను టిక్కెట్ పేరుతో చావగొట్టడమే.
ఇక ఒకప్పుడు ఎంత పెద్ద హీరో చిత్రం విడుదలైన కూడా మొదటి రోజు మొదటి షో నుంచే మహిళా ప్రేక్షకులతో పాటు అందరూ థియేటర్లకు వచ్చేవారు. వారి ద్వారా సినిమా బాగుంటే మౌత్‌టాక్ వచ్చి అది సినిమా లాంగ్‌రన్‌కి ఉపయోగపడేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్య ప్రేక్షకులు ఓ పెద్దస్టార్ చిత్రం విడుదలైన వారం తర్వాత గానీ, టాక్ బాగుంటే కానీ తమ ఫ్యామిలీలతో వచ్చి చూసే పరిస్థితులు లేవు. పోలీసులు, కలెక్టర్.. ఇతర అధికారులు కూడా మాట్లాడటం లేదు కారణం ప్రభుత్వాలే ఫర్మిషన్స్ ఇవ్వటమే.
అలాగని ఎవరు కూడా ఇంత రేటు ఏమిటి? అని ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే ఓ నెల ఆగి చూడు.. నిన్నెవ్వరు మొదటిరోజే రమ్మన్నారనే చీదరింపులు. ఇక ఇంత రేటు ఎందువల్ల అని ప్రశ్నిస్తే అభిమానులు చెప్పేది ఏమిటంటే.. భారీ బడ్జెట్ అనేది ఒకటే మాట. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లను అడిగితే మేము ఎంత పెట్టి కొన్నామో మీకు తెలుసా? అనే రిప్లై వస్తుంది. బెనిఫిట్ షోలు ఏర్పడిందే చారిటీ కు ఆ డబ్బు ఇస్తామనే పేరుతో. అయితే అలా చెప్పి దోచుకోవడానికి ఫుల్‌స్టాప్ పెట్టాల్సిందే అని చాలా కాలంగా అడుగుతున్నా అది జరగడం లేదు. దాంతో 'నో ఎంట్రీ ఫర్ కామన్ ఆడియన్స్' అనే బోర్డులు ప్రభుత్వం థియేటర్ దగ్గర పెట్టించినట్లే ఉంటుంది. కాకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. రాష్ట్రంలో ఎలాంటి బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపునకు అనుమతివ్వబోమని తేల్చి చెప్పేసిన నేపథ్యంలో ఇంకా అవి ఉండవనే నమ్మవచ్చు.
అయితే ఈ మార్పు ఎఫెక్ట్ ఎవరిమీద పడబోతోంది అంటే దిల్ రాజు సినిమా మీద. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తమిళ ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో దిల్ రాజు రూపొందించిన ఆ సినిమా జనవరి 10వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తూ ఆడియన్స్ లో మూవీ పై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.పుష్ప-2 సినిమాకు అందినట్లే తెలంగాణలో అన్ని అనుమతులు గేమ్ ఛేంజర్ కు దక్కుతాయని అంతా లెక్కలు వేశారు. స్పెషల్,బెనిఫిట్ షోస్ పడతాయని కూడా ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు మంత్రి ప్రకటనతో ఏం జరగనుందోనని అర్థం కావడం లేదు. ఇంతకీ గేమ్ ఛేంజ్ అయినట్లేనా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాలి.