హీరో నితిన్ ‘తమ్ముడు’ Movie Review
x

హీరో నితిన్ ‘తమ్ముడు’ Movie Review

ఈసారి నితిన్‌ గోల్ కొట్టాడా? తమ్ముడు అనే టైటిల్ కు న్యాయం చేసాడా? వ్యూయర్ ఎమోషన్స్‌కు ఫలితం దొరికిందా… లేక మళ్లీ ఓ మిస్ ఫైర్? చూద్దాం

“సినిమా అనేది ఒక్కొక్కసారి ఓ కథ కాదు... చాలా మంది కళ్లలోని ఎదురు చూపు. ఒక్కో హీరోకి అది కేవలం సినిమా కాదు – తన గౌరవానికి సంభందించిన పోరాటం!” ఇలాంటి గౌరవ పోరాటం లోకి అడుగుపెట్టాడు నితిన్‌ – ఓ సుదీర్ఘ కెరీర్‌కి ఖచ్చితంగా హిట్ కావాల్సిన సమయంలో వచ్చిన సినిమా ‘తమ్ముడు (2025)’. గత కొంతకాలంగా సక్సెస్ ని ఒడిసిపడదామని ప్రయత్నిస్తున్న ఈ హీరోకి, ‘వకీల్ సాబ్’ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు వేణు శ్రీరామ్‌, మిడాస్ టచ్ ఉన్న దిల్ రాజు వంటి నిర్మాత, లయ వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులతో కలిసే సూపర్ కాంబో కలిసింది. మరి… ఈసారి నితిన్‌ గోల్ కొట్టాడా? తమ్ముడు అనే టైటిల్ కు న్యాయం చేసాడా? వ్యూయర్ ఎమోషన్స్‌కు ఫలితం దొరికిందా… లేక మళ్లీ ఓ మిస్ ఫైర్? చూద్దాం

స్టోరీ లైన్

జై (నితిన్‌) ఒక దేశస్థాయి విలువిద్యా క్రీడాకారుడు. ఇండియాకు గోల్డ్ మెడల్ తేవాలనేది అతని జీవితాశయం. ఎన్నో పతకాలు గెలిచినా... అతడి మనసు మాత్రం అసంపూర్ణంగా ఏదో వెలితిగా ఉంటుంది. ప్రాక్టీస్ పై దృష్టి పెట్టలేకపోతాడు. అది గుండెల్లో పదే పదే తలెత్తే ఓ బాధ, ఓ జ్ఞాపకం. తరిచి చూస్తే ఆ బాధ వెనుక ఉంది అతడి అక్క స్నేహలత (లయ). చిన్ననాటి ఓ చిన్న సంఘటన... కానీ అది ఆమె,అతని జీవితాన్ని మార్చేసింది. ఇంటి నుండి దూరమై, “ఈ ఇంటిని మళ్లీ ఎప్పటికీ చూడను” అంటూ వదిలిపోయిన స్నేహలత – తండ్రి చనిపోయిన సమయంలో కూడా తిరిగిరాలేదు.

ఇన్నాళ్లకు జై తన తప్పు తెలుసుకుని ఆమెను మళ్లీ దగ్గర చేసుకోవాలని నిర్ణయిస్తాడు. ఈ ప్రయాణంలో అతడికి తోడు స్నేహితురాలు, చిత్ర (వర్ష బొల్లమ్మ). అయితే అన్ని అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. తన అక్క ఆత్మీయత కోసం బయల్దేరిన జైకి పెద్ద షాక్‌ – ఆమె ఇప్పుడు ఝాన్సీ అనే పేరుతో జీవిస్తోంది. ఆమె ఇప్పుడు తన కుటుంబంతో కలిసి అంబర గొడుగు అనే అడవీ ప్రాంతంలో జరిగే ఓ అమ్మవారి జాతరకు వెళ్లిందని తెలుస్తుంది.

జై కూడా ఆ అడవిలోకి అడుగుపెడతాడు. కానీ అక్కడ ఒక్కటి కాదు, ఎన్నో అనుకోని మలుపులు ఎదురవుతాయి – ఝాన్సీ కుటుంబాన్ని మట్టుపెట్టాలని లక్ష్యంగా పెట్టిన అజార్వాల్ ముఠా (సౌరభ్ సచ్‌దేవా) కూడా అక్కడికే వెళ్లిందని తెలుస్తుంది. అసలు అజార్వాల్ ఎవరు..ఎందుకు అతను ఆమెను మట్టుపెట్టాలనుకున్నాడు.. దాని వెనకున్న అసలు కారణం ఏంటి? జై కి గిరిజన యువతి రత్నం (సప్తమి గౌడ) ఎలాంటి సహాయం చేసింది?

జై తన అక్కను తిరిగి కలిశాడా? అసలు అక్క,తమ్ముడు విడిపోవటానికి గల కారణం ఏమటి

ఆ బంధం మళ్లీ కట్టుబడిందా? అజర్వాల్ నుంచి ఆమెను రక్షించుకున్నాడా... ఆ అడవిలో జరిగిన సంఘటనలు వారి జీవితాలనే ఏ విధంగా మార్చాయి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

తమ్ముడు ఓ కథగా చూస్తే – ఓ ఎమోషనల్ జర్నీ, ఓ ఫ్యామిలీ రికనెక్ట్ డ్రామా… యాక్షన్, అనుబంధం, అపరాధబాధల మేళవింపు.ఇవన్నీ ఖచ్చితంగా సూపర్ హిట్ సినిమా ఫార్ములానే. అయితే అవన్నీ ఫెరఫెక్ట్ గా పండినప్పుడే కదా. దానికి తోడు స్టోరీ లైన్ అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు చేసిన కాస్త ఓల్డ్ గా అనిపిస్తుంది. ఇది వినగానే మనకు 90s ఫ్యామిలీ డ్రామాలు జ్ఞాపకం వస్తాయి. ఈ విషయం దర్శకుడుకు, నిర్మాతకు తెలియంది కాదు. కానీ ఈ కథలో డైరెక్టర్ — ఏమి చెబుతున్నానన్నది కాదు, ఎలా చెబుతున్నానన్నదే కీలకం అనే ధైర్యంతో కథ తయారు చేసుకున్నట్లున్నారు.

ప్రారంభంలో వచ్చే ఫ్యాక్టరీ ప్రమాదం సీన్ ఓ శక్తివంతమైన ఎమోషనల్ బేస్ అయితే, దాన్ని స్టోరీలో కంటిన్యూ చేయడంలో ఎమోషనల్ గ్రావిటీ మిస్సైంది. అలాగే జై గిల్ట్‌ను ఫీలవుతున్నట్టు చూపించినా, అందుకే అతడు అర్చరీ వదిలిపెట్టి అక్క కోసం వెళతాడన్నది కన్‌విక్షన్ గా అనిపించదు.

ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్ గా చాలా ప్రెడిక్టబుల్ గా సాగుతుంది – అంటే దాదాపు అంతా మనం ఊహించినదే తెరపై జరుగుతుంది. ఇలాంటి పేసింగ్‌లో, ఒకే ఎమోషన్ మీద ఆధారపడే కథ ముందుకెళ్లడం కష్టమే.

పోనీ సెకండ్ హాఫ్‌లో అయినా అద్బుతాలు జరుగుతాయా అంటే అదీ లేదు. ఓ ప్రక్కన విలన్ అజర్వాల్ గ్యాంగ్, అడవిలో జరిగే వేట, జై రక్షణ కోసం చేసే యాక్షన్ ఇవన్నీ విజువల్ ఎంగేజ్‌మెంట్ పెంచుతాయే కానీ మనలో ఇంటెన్స్ ని పెంచవు. ప్రత్యేకించి యాక్షన్ కొరియోగ్రఫీ స్టైలిష్‌గా ఉంటుంది. కానీ యాక్షన్ అనేది పంచ్ లో కన్నా పంచ్ వెనక ఉన్న ఎమోషన్ పంచ్ లో ఉంటుంది కదా. అంతెందుకు సెకండాఫ్ లో వచ్చే విలన్ బౌంటీ హంటర్స్‌ని రంగంలోకి దింపటం చూడటానికి బాగుంది కానీ కథకు ప్రత్యేకంగా కలసి వచ్చిందేమీ లేదు.

క్యారక్టరైజేషన్స్ చూస్తే... జై పాత్రకు స్పష్టత ఉంది కానీ డెప్త్ లేదు. అతడు గిల్ట్‌తో బ్రతుకుతున్నాడని చూపించారు కానీ ఆ బాధ చూసే మన గుండెను తాకదు.ఝాన్సీ (లయ) పాత్ర సినిమాకు గుండె అవ్వాలి. అలాగే కథ ఎక్కువసేపు అడవిలో నడపటం అనేది మెటాఫోరిక్‌గా గొప్ప ఐడియా అయినా, ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయ్యింది.విలన్ అజర్వాల్ ను స్టైలిష్‌గా ఎలివేట్ చేసి, వెంటనే కథ నుండి మాయం చేయటం పెద్ద మైనస్. ఏదైమైనా విలన్ ని చూపించినంత గొప్పగా కథను తయారు చేసి ఉంటే బాగుండేది.

టెక్నికల్ గా

సినిమా టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లో ఉంది. ముఖ్యంగా Background Score కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్‌ను బలంగా తీసుకొచ్చింది. ఇక Cinematography – అడవి, జాతర, విలన్ ఇంట్రడక్షన్ మొదలైన చోట్ల విజువల్స్ హై స్టాండర్డ్స్ లో ఉన్నాయని చెప్పొచ్చు. Ambara Godugu జాతర విజువల్స్ ప్రత్యేకంగా నిలిచే అంశం. అయితే Editing – పేసింగ్ జంప్స్, కొన్ని సీన్లు వెంట వెంటనే మార్చేయడం వల్ల ఎమోషనల్ బిల్డ్ అప్ లోపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎన్ని ఉన్నా స్క్రిప్టులో విషయం తగ్గినప్పుడు మిగతావి వాటిని పూర్తి స్దాయిలో కవర్ చేయలేవు.

నటీనటుల్లో ..

ఆర్చరీ క్రీడాకారుడిగా కనిపించిన నితిన్ కొత్తగా అనిపించింది కానీ అతని లుక్, స్టైల్ మార్చలేదు. యాక్షన్ సీన్స్ తప్పించి నితిన్ చేయటానికి ప్రత్యేకంగా ఏమీ లేదు. లయ రీఎంట్రీ...ప్రాధాన్యమున్న పాత్రలోనే కనిపిస్తారు కానీ, అది ఎఫెక్టివ్ గా చూపించదు. అందరికన్నా విలన్ గా నటించిన సౌరభ్ సచ్‌దేవా గుర్తుండిపోతాడు. వర్ష బొల్లమ్మ, శ్వాసిక విజయన్ , సప్తమిగౌడ ఓకే..ఓకే.

ఫైనల్ థాట్

"భావోద్వేగం బలహీనమైన ప్లాట్‌ను భుజాలపై వేసుకుని మోసుకెళ్ళగలదు. కానీ అదే ప్లాట్ ని భావోద్వేగరహితంగా రాస్తే మాత్రం ఏదీ రక్షించదు." అనేది స్క్రీన్ ప్లే పెద్దలు చెప్పే మాట. ఈ సినిమాకి వర్తిస్తుంది. ప్లాట్ లో ఎమోషన్ ఉంది కానీ రైటింగ్ లో అది మాయమైంది.

Read More
Next Story