
మారిన ఓటిటి రూల్స్,నిర్మాత నెత్తిన ఇంక చెంగే!?
డేటా డిక్టేటర్‌షిప్ మొదలైంది
కరోనా ముందు వరకు తెలుగు సినీ పరిశ్రమలో ఓటీటీ సంస్థలు పెద్దగా యాక్టివేట్ గా లేవు. నిర్మాతలకు థియేటర్లే ప్రధాన ఆదాయ వనరులు. ఎవరైనా సినిమా చేయడం అంటే థియేట్రికల్ బిజినెస్ మీదే ఆధారపడేవారు. సాటిలైట్, ఆడియో రైట్స్ అనేవి సెకండరీ. కానీ 2020లో ప్రపంచం మూతబడినప్పుడు — ప్రేక్షకులు ఇళ్లలో బందీ అయ్యారు, థియేటర్లు మూతపడ్డాయి, ఆ సమయంలో ఓటీటీలు ప్రధాన వినోద వనరులుగా మారాయి. వాటికి డిమాండ్ విపరీతంగా పెరిగింది.
ఈ క్రమంలో Netflix, Amazon Prime, Disney+ Hotstar లాంటి సంస్థలకు ఒక్కసారిగా లోకల్ కంటెంట్ అవసరం పెరిగింది. అక్కడ నుంచి నిర్మాతలు దశ తిరిగింది అనుకున్నారు. “కాంబినేషన్” చూసి అడ్వాన్స్‌లు, అసలు షూట్ మొదలుపెట్టకముందే డీల్స్, కోట్లలో ఇన్వెస్ట్‌మెంట్లు ప్రారంభమయ్యాయి.
ఇది నిర్మాతలకు మొదట కలలా అనిపించింది . “థియేటర్‌లో నడవకపోయినా ఓటీటీ ఉంటే నష్టం ఉండదు.” కానీ ఆ కల చాలా త్వరగా కార్పొరేట్ కంట్రోల్‌గా మారిపోయింది. అసలు కథ ఇప్పుడే మొదలైంది.
నిర్మాతలపై కొత్త డిజిటల్ దోపిడీ
కరోనా తర్వాత విడుదలైన పెద్ద సినిమాల ఫలితాలు ఊహించినంత రాబడిని ఇవ్వలేదు. ఓటీటీ సంస్థలు బాగా ఖర్చు పెట్టినా, ఆ సినిమాలు వారికి కావాల్సిన వ్యూయర్‌షిప్ తెచ్చుకోలేదు. దాంతో ఇప్పుడు వారు లెక్కలు మార్చేశారు. ముందు పెట్టుబడులు పెట్టినవారు — ఇప్పుడు రూల్స్ పెడుతున్నారు.
మారిన ఓటీటీ రూల్స్
థియేటర్‌లో సినిమా సక్సెస్ అయ్యితేనే పూర్తి పేమెంట్. ఫ్లాప్ అయితే 30% నుండి 50% వరకు కట్. ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వాళ్ల చేతిలోనే. సినిమా ఎప్పుడు థియేటర్‌లోకి వెళ్లాలి, ఎప్పుడు ఓటీటీలోకి రావాలి — నిర్ణయాధికారం వాళ్లదే. పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు”, నాగార్జున “కుబేర”, రజనీకాంత్ కూలి వంటి భారీ సినిమాల రిలీజ్ డేట్స్ కూడా ఓటీటీ సంస్థల అప్రూవల్ లేకుండా ప్రకటించలేని స్థితి వచ్చింది. ఇది కేవలం డిస్ట్రిబ్యూషన్ కంట్రోల్ కాదు. ఇది నిర్మాతల సృజనాత్మక స్వేచ్ఛపై పట్టు. “ఎందుకు నిర్మాతలు ఇంతగా ఇరుక్కుపోయారు?”
ఆధారపు సంస్కృతి
ఓటీటీ లభించే సేఫ్ మనీ మీద ఆధారపడటం మొదలైనప్పుడు నిర్మాతలు థియేటర్ రిస్క్ తీసుకోవడం తగ్గించారు. దాంతో వారి బార్గెయినింగ్ పవర్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు పరిస్థితి: “డబ్బు వాళ్లు ఇస్తున్నారు కాబట్టి, నిర్ణయాలు కూడా వాళ్లవే.” అని నమ్మి ఆచరించే స్దితి వచ్చేసింది.
మార్కెట్ లాజిక్ కంటే డేటా లాజిక్
ఓటీటీ సంస్థలు సినిమాలను ‘కళ’గా కాకుండా ‘డేటా పాయింట్స్’గా చూస్తున్నాయి. వీక్షణ సమయం, రిటెన్షన్ రేట్, క్లిక్ ప్యాటర్న్ ఇవే నిర్ణయాల బేస్. నిర్మాతలు ఈ లాజిక్ అర్థం చేసుకోకపోవడం వల్ల వాళ్లు అల్గోరిథమ్ దయ మీదే ఆధారపడుతున్నారు.
ఓవర్‌సప్లై ఆఫ్ కంటెంట్
ప్రతి నెల చాలా సినిమాలు ఓటీటీకి వస్తున్నాయి.డిమాండ్ కన్నా ఎక్కువ సినిమాలు , సీరిస్ లు తమ దగ్గరకు వస్తున్నాయి. దాంతో మార్కెట్‌లో ఉన్న ఓటిటి సంస్థలు సెలెక్టివ్‌గా మారి, “మాకు థియేటర్ టెస్టెడ్ సినిమాలు కావాలి” అంటున్నాయి. వీటి దెబ్బ ముందుగా చిన్న, మధ్యస్థ బడ్జెట్ సినిమాలు మీద పడుతోంది. వాటిని కొనే వాళ్లు కనపడటం లేదు. అటు థియేటర్ లోనూ జనం రావటం లేదు. ఇటు ఓటిటిలు సినిమాలు కొనటం లేదు.
పెద్ద నిర్మాతల సైలెంట్ కాంప్రమైజ్
స్టార్ హీరోలతో సినిమాలు చేసే నిర్మాతలు ఇప్పటికే భారీ ఒప్పందాల్లో ఉన్నారు. ఓటీటీ సంస్థలు పెట్టుబడులు పెట్టినందున వాళ్లు స్పష్టంగా వ్యతిరేకించలేరు. ఇది సైలెంట్ సబ్మిషన్ — వాస్తవానికి ఇది ‘వలస’ రూపం.
“ఓటీటీ అప్రూవల్ లేకుండా సినిమా కదలదు”
ఇప్పటికి తెలుగు సినిమా ఫైనాన్సింగ్ మోడల్‌లో ఓటీటీ భాగం సగం దాటిపోయింది. థియేటర్‌లను సర్వైవ్ చేయించే సినిమా కూడా ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ అనుమతితోనే రిలీజ్ అవుతుంది.
నిర్మాతలకు ఉన్న ఆప్షన్ ఒక్కటే
“మా సినిమా ఓటీటి సంస్దలు కొనకపోతే, మొత్తం నష్టపోతాం. ఇది ఒక బిజినెస్ మోడల్ కాదు — ఓటిటి ఆధిపత్య వ్యవస్థ.
ఇలాగే కొనసాగితే..
హిందీలో ప్రస్తుతం 8 వారాల థియేట్రికల్ విండో రూల్ ఉంది — సినిమా థియేటర్‌లో రిలీజ్ అయిన తర్వాత ఎనిమిది వారాలకే ఓటీటీ రిలీజ్.
కానీ తెలుగులో అలాంటిది లేదు. ఓటీటీ సంస్థలు డేటా, మార్కెటింగ్ ఆధారంగా తమకు అనుకూలమైన తేదీ నిర్ణయిస్తాయి. దీని ఫలితంగా థియేటర్లు బలహీనపడతాయి. ప్రేక్షకులు “ఓటీటీ లో వస్తుంది కదా” అని వదిలేస్తారు. ఇది థియేటర్ కల్చర్‌ను నశింపజేస్తున్న నిశ్శబ్ద సంక్రమణ.
ఒకప్పుడు ప్రేక్షకుడే రాజు — ఇప్పుడు డేటాబేస్ రాజ్యం!
మనం ఒకప్పుడు టికెట్ కొన్న ప్రేక్షకుడి తీర్పే చివరి నిర్ణయం. సినిమా నడవాలా? పడిపోవాలా? — అది థియేటర్‌లోని హర్షధ్వనులకే ఆధీనంగా ఉండేది. కానీ ఇప్పుడు సైలెంట్‌గా, ఎవరూ గమనించకుండానే, సినిమా తీర్పు ప్రేక్షకుడి చేతులనుంచి డేటా సర్వర్‌లకు మారిపోయింది. Netflix, Amazon Prime, Hotstar — ఇప్పుడు ఇవే నిర్ణయిస్తున్నాయి, ఏ సినిమా వస్తుంది, ఎవరి సినిమా చూడాలి, ఏ కంటెంట్ "ట్రెండింగ్" అని పిలవాలి అనేది.
“Algorithm” — కొత్త నిర్మాత, కొత్త సెన్సార్, కొత్త ప్రేక్షకుడు!
ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లకు ప్రేక్షకుడు అంటే వ్యక్తి కాదు — డేటా పాయింట్. మీరు ఏ సినిమా ఎప్పుడు ఆపారు, ఏ సన్నివేశం దగ్గర స్కిప్ చేశారు. ఏ జానర్‌ను ఎన్ని సార్లు చూశారు — ఇవన్నీ ఒక అల్గోరిథమ్ సేకరిస్తుంది. ఆ డేటా ఆధారంగా అది నిర్ణయిస్తుంది: ఎవరి సినిమాకు ప్రాధాన్యం ఇవ్వాలి, ఏ జానర్‌కు ఫండింగ్ ఇవ్వాలి, ఏ నటుడికి స్పాట్‌లైట్ కల్పించాలి.
సినిమా క్రియేటర్స్ ఏ స్థితిలో ఉన్నాడు?
“ఇప్పుడు మేము ప్రేక్షకుల కోసం కాదు, ఓటీటీ సిఫార్సుల కోసం రాస్తున్నాం.” అని స్క్రీన్‌రైటర్ చెప్పే పరిస్దితి. ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక కొత్త పదం ప్రాచుర్యం పొందుతోంది అదే “డిజిటల్ ప్రొడ్యూసర్.” ఇది ఒక వ్యక్తి కాదు, ఓటీటీ కంపెనీ లోపల ఉన్న కంటెంట్ హెడ్ లేదా అనలిటిక్స్ టీమ్. వాళ్లు కథ చదవడం లేదు — డేటా చదువుతున్నారు. “ప్రేక్షకులు గత సంవత్సరం రొమాంటిక్ థ్రిల్లర్ ఎక్కువగా చూశారు” అంటే, తర్వాత వచ్చే ప్రాజెక్ట్‌లో కూడా అదే టెంప్లేట్ పెట్టమని ఒత్తిడి ఉంటుంది.
ఫలితం?
కథలు కొత్తగా కనిపించినా, వాటి సోల్ మాత్రం ఒకే లూప్‌లో. బాలీవుడ్ లో ఒక దర్శకుడు చెప్పిన మాట భయంకరంగా వాస్తవం: “ఇప్పుడు మేము స్క్రిప్ట్ రాస్తే, ఆల్గోరిథమ్ ఎప్రూవ్ అవుతుందా లేదా అనే టెన్షన్ ముందుంటుంది.”
ప్రేక్షకుడి స్వేచ్ఛ సైలెంట్‌గా కుదించబడుతోంది
ఓటీటీలు మీకేమీ బలవంతం చేయవు. కానీ వారు “సజెస్ట్” చేస్తారు — అది చాలు. ఎందుకంటే వారి “సజెస్టెడ్ కంటెంట్”లో ఉన్న సినిమా మాత్రమే మీరు ఎక్కువగా చూస్తారు. అలా చూస్తూ చూస్తూ, మనం గ్రహించకుండానే, మన అభిరుచి కూడా వారి ఆల్గోరిథమ్ మోడల్‌కి సరిపోయేలా మారిపోయింది.
నిర్మాతల దయనీయ స్థితి — సృజనాత్మకత నుంచి అనుకూలత వైపు
ఇప్పుడు నిర్మాతలు కథ ఎంచుకునేటప్పుడు స్క్రిప్ట్ రైటర్‌ను కాదు, ఓటీటీ కంటెంట్ హెడ్‌ను కలుస్తున్నారు. “మీరు సజెస్ట్ చేసే జానర్ లైన్‌కి ఇది సరిపోతుందా?” అనే ప్రశ్న “ఇది మంచి సినిమా అవుతుందా?” అన్న ప్రశ్న కంటే ప్రాధాన్యంగా మారింది.
క్రియేటివిటీ vs క్యాల్కులేషన్
ఇంకా కొన్నేళ్లలో, స్క్రిప్ట్ రైటర్‌లకు కూడా AI టూల్స్ “అల్గోరిథమ్ స్కోర్” ఇస్తాయి. “ఇతను Netflix పాప్యులారిటీకి సరిపోతాడు”, “ఆ రైటర్ ప్రైమ్ యూజర్ల రిటెన్షన్ రేట్ తగ్గిస్తున్నాడు” — అన్న రివ్యూలు క్రిటిక్స్ కంటే ముందే వస్తాయి. ఆ రోజు దూరం లేదు.
ఫైనల్ గా..
ఓటీటీ సంస్దలది అసలు తప్పే కాదు. వాటి బిజినెస్ అవి చేసుకుంటున్నాయి. కానీ నిర్మాతలు వాటిపై పూర్తి డిపెండ్ కాకుండా భాగస్వామ్యంగా చూడాలి. లేకపోతే — రేపు తెలుగు సినిమా నిర్మాత క్రియేటర్ కాదు, కాంట్రాక్ట్‌లోని కండీషన్ గా మాత్రమే మిగిలిపోతాడు. ఆధారపడి ఉన్నవాడు ఎప్పుడూ అధీనంలో ఉంటాడు. తెలుగు నిర్మాతలు ఇప్పుడు ఒక మలుపు వద్ద ఉన్నారు. తమ సినిమా ఎవరి కోసం చేయాలో తిరిగి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఓటీటీ సేఫ్ డబ్బు ఆకర్షణీయమే, కానీ దానికి వెనుక ఉన్న బంధనాలు అర్థం చేసుకోకపోతే సినిమా స్వేచ్ఛ — కార్పొరేట్ సర్వర్‌లో లాగిన్ అయిపోతుంది. “థియేటర్‌లో కేకలు కాదు – సర్వర్‌లో క్లిక్స్‌నే కొలుస్తున్నారు!” అనేది మర్చిపోకండి.

