సరిపోదా శనివారం సినిమా రివ్యూ
x

"సరిపోదా శనివారం" సినిమా రివ్యూ

ఈ ఆగస్టు చివరి వారం విడుదలైన పెద్ద సినిమా నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన "సరిపోదా శనివారం". ఇదివరకు నాని "హాయ్ నాన్న" సినిమా ఓ మాదిరిగా సక్సెస్ అయింది.


ఈ ఆగస్టు చివరి వారం విడుదలైన పెద్ద సినిమా నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన "సరిపోదా శనివారం". ఇదివరకు నాని "హాయ్ నాన్న" సినిమా ఓ మాదిరిగా సక్సెస్ అయింది. అది ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా. ఇప్పుడు విడుదలైన సరిపోదా శనివారం కుటుంబ కథ యాక్షన్ థ్రిల్లర్. గతంలో నానితో "అంటే సుందరానికి" అనే ఒక విజయవంతం కానీ సినిమా తీసిన వివేక్ ఆత్రేయ మళ్లీ నానినే హీరోగా పెట్టి ఈ సినిమా తీయడం విశేషం. నాని సినిమాలు పెద్ద బడ్జెట్ తో ఉండవు. కానీ ఈ సినిమా మాత్రం కాసింత భారీ బడ్జెట్‌తోనే తీసినట్లు అనిపిస్తుంది. విడుదలకు ముందు, టీజర్లు, ట్రైలర్లతో ప్రేక్షకులలో కొంత ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా కథ ఏంటో చూద్దాం..

కథ కొంచెం కొత్తది- కథనం వినూత్నమైనది

కథాపరంగా చూస్తే కొంత వైవిధ్యమైన కథని ఎన్నుకున్నాడు దర్శకుడు. సినిమా మొదట్లోనే, ఇది తల్లి సెంటిమెంట్ చుట్టూ అల్లుకున్న కథ అని దర్శకుడు తెలియపరుస్తాడు. సూర్య(నాని) తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటాడు. అలా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి తల్లి ఛాయాదేవి(అభిరామి) చనిపోయే ముందు, కోపాన్ని వారంలో ఒకరోజు మాత్రమే ప్రదర్శించు, అని సూర్యతో ఒట్టేయించుకుంటుంది. ఆ ఒక్కరోజు శనివారం కావడమే ఈ సినిమా కథ. ఆ తర్వాత సూర్యకు అత్యంత శాడిస్ట్ అయినా సీఐ దయానంద్(తమిళ నటుడు ఎస్ జె సూర్య) తో గొడవ మొదలవుతుంది. మధ్యలో సోకులపాలెం అనే ఒక ప్రాంతం ప్రజల మీద సిఐ దయానందుకు మధ్య ఉన్న కోపం, సూర్య మేనత్త కూతురు కల్లు అనబడే కళ్యాణి(ప్రియాంక అరుల్ మోహన్) మధ్య ఉన్న ఒక ప్రేమ కథ, ఇంకా సిఐ దయానంద్, అన్న కుర్మానందం(మురళీ శర్మ) ల మధ్య ఉన్న పగ వంటివి ఈ సినిమాను నడిపించే అంశాలు.

దర్శకత్వ ప్రతిభను చూపిన వివేక్ ఆత్రేయ

గతంలో ఒక ఫ్లాప్ సినిమా తీసిన దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాను కథను, స్క్రీన్ ప్లేను కొంత జాగ్రత్తగా, మరికొంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. దాన్ని చాలావరకు అంతే పకడ్బందీగా కూడా తీశాడని చెప్పొచ్చు. దర్శకుడిగా ఈ సినిమాను విజయవంతం చేయడంలో వివేక్ ఆత్రేయ దాదాపు సఫలమైనట్లే. భిన్నమైన కథను ఎన్నుకోవడంలో ప్రదర్శించిన ప్రతిభను, దాన్ని తీయడంలో ప్రదర్శించలేకపోయినప్పటికీ, ఒక రకంగా చెప్పాలంటే బిగువైన స్క్రీన్ ప్లే తో, సినిమాను నడిపించడం, అది ప్రేక్షకులకు(ముఖ్యంగా యువ ప్రేక్షకులకు) చాలా వరకు నచ్చేటట్టు తీయడం లో వివేక్ ఆత్రేయ సఫలం అయ్యాడు . మొదటి సగం లో ఉన్న స్క్రీన్ ప్లే లోపాలను, రెండవ సగంలో చాలా వరకు సరిదిద్దడం వల్ల, ఆ లోటు తీర్చుకున్నాడు, ప్రేక్షకులు ఎంజాయ్ చేయగలిగే ఒక వినోదభరిత థ్రిల్లర్ ను తీయడంలో విజయం సాధించాడు. మొత్తం మీద సినిమా చూస్తే దర్శకుడు ప్రతిభ ఉన్నవాడని స్పష్టమవుతుంది. సినిమాను మొత్తం కొత్త టెక్నిక్ తో, మొదలు, మలుపు, పీటముడి,మధ్యభాగం, దాగుడుమూతలు, ముగింపు అనే ఆరు భాగాలుగా విభజించుకొని, ఒకదానిలో ఉన్న లోపాలను, మరోదానిలో సరి చేస్తూ సినిమా మొత్తం చాలావరకు థ్రిల్లింగానే నడిపాడు.

అలరించిన నాని, అదరగొట్టిన ఎస్ జె సూర్య

దర్శకుడికి సహకరించిన, సాయం చేసిన బలమైన అంశాలు ఈ సినిమా లో కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది నాని, తమిళ నటుడు ఎస్ జె సూర్య. ఈ సినిమాకి వీళ్లే మూల స్తంభాలు. పక్కింటి అబ్బాయి లాగా కనిపిస్తూ, ఫీల్ గుడ్ సినిమాలు తీసే నాని(అంతకు ముందు దసరా ఉంది) ఈ సినిమాలో మెరిశాడు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ను చాలా బాగా చేశాడు అని చెప్పవచ్చు. నానికి తోడుగా ఈ మధ్యకాలంలో సినిమాల్లో నెగిటివ్ పాత్రలో ఒక విభిన్నమైన శైలిలో విలన్ పాత్రలు చేస్తున్న ఎస్ జె సూర్య ఈ సినిమాకు మరో ప్రధానమైన బలం. ఒక శాడిస్టు ఇన్స్పెక్టర్ పాత్రలో అదరగొట్టాడు. అలా చేయడం వల్లే హీరో నాని పాత్ర ఎలివేట్ కావడం విశేషం. మిగతా నటీనటుల్లో చెప్పుకోదగ్గది తల్లి పాత్రలో వేసిన తమిళ నటి అభిరామి. సినిమా మొదట్లో లాంచింగ్ కి తగ్గ స్థాయిలో నటించింది. ఇతర పాత్రల్లో మురళి శర్మకు ఇది కొట్టినపిండి. కానీ దీన్ని ఇంకా బాగా డెవలప్ చేసి ఉండే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు ఎందుకనో పట్టించుకోలేదు. మొదటిసారి ఒక విభిన్నమైన తండ్రి పాత్రలో సాయికుమార్ కొత్తగా ఉన్నాడు. . కొంతవరకు బాగానే చేశాడు. ప్రస్తావించదగ్గ మరో నటి చారులత పాత్ర చేసిన ప్రియాంక అరుణ్ మోహన్. ఫ్రెష్ గా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. నానీకు అక్కగా నటించిన అతిథి బాలన్ పర్వాలేదు.

సినిమాలో జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం సినిమాకు తగినట్లే ఉంది. పాటలు ఓకే. మురళి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా అందంగా గా తీయగలిగాడు. ఇక ఎడిటింగ్ సాధారణంగా ఉంది గా ఉంది. నిడివి అనేది ఈ మధ్యకాలంలో ఒక సమస్యగా ఉంది. చాలామంది దర్శకులు అది గమనించలేకపోతున్నారు. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. 174 నిమిషాల సినిమాలో కనీసం ఒక 30 నిమిషాలు తగ్గి ఉంటే. సినిమా మరింత బాగుండేది.

విరిసిన మాటల పువ్వులు

ఈ సినిమాలో డైలాగులు కూడా తమ వంతు పాత్ర పోషించాయి. " వంట వచ్చినంత మాత్రాన వంటింట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇది కూడా నీకు స్కూల్లో ఒక సబ్జెక్టు లాంటిది" అని తల్లి తన కూతురితో చెప్పడం లాంటి డైలాగులు కొన్ని ఈ సినిమాలో ఉన్నాయి, అవి చాలా చోట్ల ప్రేక్షకుల స్పందనకు నోచుకున్నాయి. కొన్నిచోట్ల విజిల్స్ కూడా వేయించాయి. ముఖ్యంగా సూర్య తల్లి గా వేసి నా అభిరామి పలికిన డైలాగులు, అక్కడక్కడ నాని పేల్చిన తూటాలు, చివర్లో సాయికుమార్ మాట్లాడిన మాటలు బాగానే రాసుకున్నాడు దర్శకుడు, అవి కూడా సినిమాను చాలావరకు ఎలివేట్ చేశాయి

శనివారం సరిపోయింది

సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ వివేక్ ఆత్రేయ దర్శకత్వ ప్రతిభతో వాటిని ప్రేక్షకులు మరిచిపోయేలా సినిమా తీయడం, నానీ సూర్యల నటన వంటి వాటి వల్ల ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. సరిపోదా శనివారం అనే ఈ సినిమా ను ఇంటిల్లిపాది కలిసి ఏ వారం అయినా చూడొచ్చు. మొత్తం మీద నాని కి ఇది ఒక మోస్తారు విజయవంతమయ్యే సినిమా అని కచ్చితంగా చెప్పవచ్చు.

నటీనటులు: నాని, ప్రియాంక అరుళ్మోహన్, ఎస్.జె. సూర్య, మురళీ శర్మ, అదితి బాలన్,అజయ్ ఘోష్, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్

కథ,మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ

సంగీతం: జేక్స్ బిజోయ్

సినిమాటోగ్రఫీ:మురళి.జి

ఎడిటర్:కార్తీక శ్రీనివాస్

నిర్మాత:డివివి దానయ్య

నిర్మాణ సంస్థ:డివివి ఎంటర్టైన్మెంట్

విడుదల: 29 ఆగస్టు 2024

Read More
Next Story