'నరుడి బ్రతుకు నటన' మూవీ రివ్యూ
చాలా సినిమాలు థియేటర్ లో రిలీజ్ అప్పుడు చాలా మంది పట్టించుకోవటం లేదు. ఓ నెలలోగా ఎలాగూ ఓటిటిలో వస్తుంది
చాలా సినిమాలు థియేటర్ లో రిలీజ్ అప్పుడు చాలా మంది పట్టించుకోవటం లేదు. ఓ నెలలోగా ఎలాగూ ఓటిటిలో వస్తుంది చూద్దాములే అన్న థోరణి ప్రస్తుతం నడుస్తోంది. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఈ పరిస్దితి రిపీట్ గా ఉంటోంది. ఓటిటిలో చూసి బాగుందే..అరే థియేటర్ లో మిస్సయ్యామే అనుకుంటున్నారు. అంతకు మించి చేయగలిగింది లేదు. అయితే అలాంటి సినిమాలు అరుదుగానే కనిపిస్తున్నాయి. అలా ఓటిటిలో వచ్చాక బాగుందని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా కథేంటి, చూడదగ్గ సినిమానేనా వంటి విషయాలు చూద్దాం.
స్టోరీ లైన్
సత్య (శివ రామచంద్రవరపు) కు సినిమా నటుడు కావాలన్నది జీవితాశయం. అయితే అతనికి నటనరాదు. అందుకు తగ్గ ట్రైనింగ్ తీసుకున్నట్లు కనపడదు. తండ్రి (దయానంద్‌రెడ్డి) పేరు ఉపయోగించి ట్రైల్స్ వేస్తూంటాడు. కానీ ఏదీ కలిసి రాదు. ఒక్క అవకాశం రాదు. ఆడిషన్స్‌లో వరస్ట్ యాక్టర్ అని మొహం మీదే చెప్పేస్తారు. ఇప్పుడేం చేయాలి. నటనను ప్రక్కన పెట్టి ఉద్యోగంలో చేరాలా అనే డైలమోలో ఉన్నప్పుడు అతని స్నేహితుడు నటుడు అవ్వాలంటే ముందు మనిషిగా ఎదగాలని సలహా ఇస్తాడు . ఆ సలహాను పట్టుుకుని ఎవరికీ చెప్పా పెట్టకుండా కేరళ వెళ్తాడు.
చేతిలో పైసా లేకుండా, ఉన్న సెల్ ఫోన్ కూడా మిస్సైన పరిస్దితుల్లో తిండికి కూడా ఇబ్బంది పడే సిట్యువేషన్ వస్తుంది. భాష రాదు. ఎవరూ తెలియదు. అప్పుడు అతనికి సల్మాన్. డి (నితిన్ ప్రసన్న) పరిచయం అవుతాడు. సత్య గురించి తెలుసుకున్న సల్మాన్ అతడికి ఆశ్రయం ఇస్తాడు. తన రూమ్ లోనే పెట్టుకుంటాడు. అలాగే అక్కడే సరోగసీ ద్వారా మరొకరికి బిడ్డను కనడానికి సిద్ధ పడ్డ లేఖను (శృతి జయన్) చూసి ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో సత్య జీవితంలో చాలా మార్పులు వస్తాయి. చివరకు సత్య జీవితం ఏ మలుపు తీసుకుంది. సల్మాన్ పరిచయం సత్య జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? లేఖతో సత్య ప్రేమ కథ ఏమైంది..అనుకున్నట్లుగానే మంచి నటుడుగా సత్య మారగలిగాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
మళయాళ సినిమాలు మంచి ఫీల్ తో కంటెంట్ డ్రైవన్ స్టోరీలుగా నడుస్తూంటాయి. అదే తోవలో ఈ సినిమా కూడా ప్రయాణం పెట్టుకుంది. రెగ్యులర్ మాస్ మసాలా సినిమాగా చూస్తే ఈ సినిమా ఎక్కదు. ఓ విభిన్నమైన సినిమా చూస్తున్నామనే ఆలోచన పెట్టుకుని చూస్తే నచ్చుతుంది. తనని తాను అన్వేషించుకునేందుకు ప్రయాణం మొదలు పెట్టిన హీరో ప్రయాణం సక్సెస్ అవటం మనకు ఆనందం కలిగిస్తుంది. ఇలాంటి సెల్ఫ్ డిస్కవరీ స్టోరీలు ఎక్కువగా హాలీవుడ్ లో వస్తూంటాయి. మనకు తక్కువే. అయినా సినిమా ఎక్కడా విసిగించదు. ఓ ఫీల్ తో నడిచిపోతుంది. కాకపోతే కాస్త స్లో గా ఉండటం ఇబ్బంది పెడుతుంది. అక్కడ గర్వం, నిజమైన సంతోషం, ఆనందం అనే ఎమోషన్స్‌ను చూపించే ప్రయత్నం ఈ కథ ద్వారా డైరక్టర్ చేసారు. అలాగే సెకండాఫ్ ఇంకాస్త ఎంగేజింగ్ గా రాసుకుంటే బాగుండేది. ఇలాంటి సినిమాలకు టైట్ స్క్రీన్ ప్లేనే వర్కవుట్ అవుతుంది. అయితే కథలో విషయం ఉండటం వల్ల చాలా భాగం లాగేసారు. కొద్దిపాటి మెలికలు, ప్లాట్ ట్విస్ట్ లు పెట్టుకుని వర్కవుట్ చేస్తే మంచి ఎమోషనల్ రైడ్‌గా పేరు వచ్చేది. ఓవరాల్ గా తెలుగు సినిమా ..మళయాళి ట్రీట్మెంట్
టెక్నికల్ గా చూస్తే...
అయితే మేకింగ్ పరంగా దర్శకుడు రిషికేశ్వర్ ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అయితే తొలి సినిమాకే ఇలాంటి భావోద్వేగభరితమైన కథను ఎంచుకోవటం మాత్రం గ్రేటే. విజువల్స్ పరంగా కేరళ అందాల్ని అందంగా చూపించారు. అలాగే పాటలు వినసొంపుగా ఉంటాయి. ఆర్ఆర్ ఎమోషనల్‌గా టచ్ అయ్యేలా డిజైన్ చేసారు. . మాటలు డెప్త్ గా అనిపిస్తాయి. ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. నటీనటుల్లో శివ కుమార్, నితిన్ ప్రసన్నలు తమ పాత్రలకు న్యాయం చేశారు. సత్య, సల్మాన్ పాత్రలతో ఆడియెన్స్ కనెక్ట్ చేయగలిగారు. శివ ఎమోషనల్‌గా నటించి మెప్పిస్తాడు. ఇక నితిన్ ప్రసన్న కూడా చాలా బాగా చేసారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాకు సరపడ ఖర్చు పెట్టారు.
చూడచ్చా
ఓటీటీలలో వచ్చే చాలా సినిమాలకన్నా ఇది బెస్ట్. ఎక్కడా అసభ్యత, అశ్లీలత లేకుండా హాయిగా సాగే జర్నీలా ప్లాన్ చేసిన ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడచ్చు.
ఎక్కడ చూడచ్చు
ఆహా, అమేజాన్ ప్రైమ్ రెండు ఓటిటిలలో తెలుగులో ఉంది.