
'నారీ నారీ నడుమ మురారీ' - మూవీ రివ్యూ!
‘సామజవరగమన’ మ్యాజిక్ రిపీట్ అయిందా?
గౌతమ్ (శర్వానంద్) ఓ పేరున్న ఆర్కిటెక్ . అతను తన తండ్రి కార్తీక్ (నరేశ్)తో కలిసి ఉంటూంటాడు. అంతేకాదు ఆ తండ్రి లేటు వయస్సులో, తన వయస్సు కన్నా సగం ఉన్న అమ్మాయి పల్లవి(సిరి హనుమంతు)ని పెళ్లి చేసుకుంటానంటే ఫుల్ సపోర్ట్ ఇస్తాడు. అందుకోసం ఛేజింగ్ లు,గట్రా చేసి ఆమెను పెళ్లి పీటల మీద నుంచి తీసుకొచ్చి మరీ ఆ పెళ్లి చేస్తాడు. ఆ తండ్రి ఫుల్ హ్యాపీ. దాంతో తన పెళ్లి ఇంత గ్రాండ్ గా చేసిన కొడుకుని కూడా ఓ ఇంటివాడు చెయ్యాలనకుంటాడు.
ఈ లోగా గౌతమ్..తనకు కేరళలో పరిచయం అయిన నిత్య (సాక్షి వైద్య) తో ఛాటింగ్ లు, డేటింగ్ లు చేసి లైన్ లో పెడతాడు. అయితే నిత్య తండ్రి సిటీలో పెద్ద పేరున్న లాయర్ రామలింగం (సంపత్ రాజ్). మొదట పెద్ద ఆసక్తి చూపకపోయినా కూతురు మాట తీసేయలేక గౌతమ్ ఇంటికి వస్తాడు. అక్కడ అతని తండ్రి ని, ఆయన చేసుకున్న అమ్మాయిని చూసి ఈ పెళ్లికి పెద్ద నో చెప్తాడు. తన పరువు పోతుందని భయపడతాడు. అయితే కూతురు పట్టుదల చూసి, ఓ కండీషన్ పెడతాడు. అదేమిటంటే... . పెళ్లి రిజిస్టర్ ఆఫీసులో,సింపుల్ గా జరగాలని అడుగుతాడు. సరే అన్న గౌతమ్ కు ఓ వింత సమస్య ఎదురౌతుంది.
ఇక్కడ గౌతమ్ ప్లాష్ బ్యాక్. గతంలో గౌతమ్ ... 'దియా' ( సంయుక్త మీనన్)ని అదే రిజిస్టర్ ఆఫీస్ లో గతంలో పెళ్లి చేసుకున్నాడనే విషయం రివీల్ అవుతుంది. ఆ విషయం తెలిసిన రిజిస్టార్ సత్యమూర్తి (సునీల్) ఇంకా అక్కడే పనిచేస్తున్నాడు. దాంతో ఆ రహస్యం బయిటపడకుండా గౌతమ్ ప్రయత్నాలు మొదలెడతాడు. అయితే దియా నుంచి విడాకులు తెస్తేనే నిత్యతో అతని పెళ్లి జరుగుతుందని సత్యమూర్తి తేల్చి చెబుతాడు. అప్పుడు గౌతమ్ ఏం చేసాడు. అసలు దియా ఎవరు... ఆమెని పెళ్లి చేసుకున్న గౌతమ్ ఎందుకు గొడవ పడ్డాడు? ఆ పెళ్లి రహస్యాన్ని నిత్య దగ్గర దాచడానికి అతను పడిన పాట్లు ఎలాంటివి? అనేది మిగతా కథ.
ఎనాలసిస్ ..
“నారి నారి నడుమ మురారి” స్క్రిప్ట్ బేస్ ఫిల్మ్. డైలాగులు, స్క్రీన్ ప్లే , ఎంటర్టన్మెంట్ కలిసి సినిమాని పరుగెత్తించాయి. సినిమా బేసిక్ ఐడియా లవ్ ట్రయాంగిల్ కాకపోవటమే ఈ సినిమా స్పెషాలిటీ. టైటిల్ చూసి మనం పొరబడతాం కానీ స్టోరీ థీమ్ మాత్రం సమయం (Time) ఎలా సంబంధాలను రీడిఫైన్ చేస్తుంది అన్నదే ఈ కథ చెప్పే విషయం . ఇక్కడ ఇద్దరు మహిళలు ఒకేసారి హీరో జీవితంలోకి రారు. ఒక రిలేషన్ ముగిసిన తర్వాత, మరొకటి ప్రారంభమవుతుంది. ఈ చిన్న తేడానే స్క్రిప్ట్‌ను రెగ్యులర్ ట్రయాంగిల్ డ్రామాల నుంచి వేరుచేసి కొత్తగా అనిపించేలా చేసింది. స్క్రీన్‌ప్లేలో ఎథికల్ టెన్షన్ బాగా వర్కవుట్ అయ్యింది.
అలాగే ఈ సినిమాలో జోక్స్ కేవలం పంచ్ డైలాగ్స్ లా కాకుండా పాత్రల సహజ లక్షణాల నుంచి పుట్టుకొచ్చేలా రాయటం బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా నరేష్ ట్రాక్ – మెటా హ్యూమర్ పండించింది. నరేష్ పాత్ర అతని నిజ జీవిత ఇమేజ్‌ను డైరక్ట్ గా రిఫ్లెక్ట్ చేస్తుంది. 61 ఏళ్ల వయసులో పవిత్ర లోకేశ్‌తో పెళ్లి – అదే అంశం స్క్రీన్‌పై “నాటీ అట్ సిక్స్టీ”గా మారుతుంది. ఇది కేవలం కామెడీ కాదు. ఇది మెటా-నారేటివ్. నటుడి రియల్ లైఫ్ ఓ పాత్రలోకి ట్రాన్సఫర్ అవటం..అలాగే ప్రేక్షకుడి అవగాహనతో అది జోక్ గా తెరపై నవ్వించటం. ఇది సాధారణ కామెడీ కాదు; ఇది పబ్లిక్ పర్సెప్షన్ ఆధారంగా రెడీ అయ్యిన హ్యూమర్.
వెన్నెల కిశోర్ – “గురూజీ” సటైర్ కూడా బాగా వర్కవుట్ అయ్యింది. వెన్నెల కిశోర్ పాత్ర సమాజంలో ఉన్న “నామమాత్ర గౌరవం” సంస్కృతిపై వ్యంగ్యం గా పేలింది. అతిగా వినయంగా ఉండటం, అర్థం లేకుండా ఆరాధించడం – ఇవన్నీ కామెడీగా చూపిస్తూనే, సోషల్ బిహేవియర్‌పై విమర్శగా కూడా పనిచేస్తాయి ఇలా చాలా ఎలిమెంట్స్ తెరపై బాగా పండాయి. కాబట్టే ఇది స్క్రిప్టు ని బేసుకున్న సినిమా అన్నది.
అయితే ఎంత ఫన్ తో ఫస్టాఫ్ పరుగెత్తినా , నవ్వించినా... , సెకండాఫ్ లో పేసింగ్ సమస్య & నారేటివ్ స్టాగ్నేషన్ వచ్చేసింది. అంటే ఫస్టాఫ్ లో సెటప్, పాత్రల పరిచయం, హ్యూమర్ డిజైన్ – అన్నీ ఫ్రెష్‌గా ఉంటాయి. సెకండాఫ్ లో కథ ముందుకు వెళ్లకుండా కామెడీ ఎపిసోడ్స్‌లోనే తిరుగుతుంది. ఇక్కడే స్క్రీన్‌ప్లే పరంగా ప్రధాన బలహీనత కనిపిస్తుంది.
ఎవరెలా చేసారు
శర్వానంద్ ‘కమ్ బ్యాక్’ అదిరింది: గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న శర్వానంద్‌కు ‘నారి నారి నడుమ మురారి’ పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో శర్వానంద్ చాలా ఈజ్‌తో, తనదైన మార్కు కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన లుక్స్ పరంగానే కాకుండా, పెర్ఫార్మెన్స్ పరంగానూ చాలా కంఫర్టబుల్‌గా కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు.
హీరోయిన్ ఓకే.. కానీ నరేష్ రచ్చ మామూలుగా లేదు. శర్వానంద్ సరసన సాక్షి వైద్య జోడీ చూడముచ్చటగా ఉంది. తన పాత్ర పరిధి మేరకు ఆమె చక్కని నటనను కనబరిచింది. అలాగే ఈ సినిమాకు అసలైన హైలైట్ ఎవరైనా ఉన్నారంటే అది సీనియర్ నటుడు నరేష్ మాత్రమే. ఆయన కనిపించే ప్రతి సీన్ థియేటర్లో నవ్వుల పూయించింది. సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని నడిపించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
వెన్నెల కిషోర్ & సంపత్: లాయర్ పాత్రలో వెన్నెల కిషోర్ తన మార్కు కామెడీని పండించగా, హీరోయిన్ తండ్రిగా సంపత్ రాజ్ నటన హుందాగా ఉంది.
శ్రీవిష్ణు సర్ప్రైజ్.. సంయుక్త మిస్ ఫైర్?
సినిమాలో ఊహించని విధంగా శ్రీవిష్ణు గెస్ట్ రోల్‌లో మెరిసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. ఇక మరో హీరోయిన్ సంయుక్త విషయానికి వస్తే, ఆమె పాత్ర చివరి వరకు పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. క్లైమాక్స్ లో తప్ప మిగతా సన్నివేశాల్లో ఆమె పాత్ర డల్ గానే అనిపిస్తుంది. సాంకేతికంగా చూస్తే సినిమా క్వాలిటీ బాగుంది, విజువల్స్ మరియు మ్యూజిక్ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్ థాట్
“ప్రేమకు వయస్సు లేదు, కానీ సమాజానికి జడ్జ్‌మెంట్ ఉంటుంది.” అనే విషయం చెప్పటానికి ప్రయత్నించిన ఈ సినిమా సరదాగా నవ్వుకోవటానికి బాగానే పనికొస్తుంది. నరేష్ ఒంటి చేత్తో మోసిన మరో సామజవరగమన లాంటి సినిమా. ముఖ్యంగా రైటింగ్ బలంతో గెలిచిన సినిమా ఇది.

