
ఆర్ నారాయణమూర్తి 'యూనివర్సిటీ పేపర్ లీక్' రివ్యూ
పోరాటమా? లేక ఉపన్యాసమా?
రామయ్య (ఆర్.నారాయణమూర్తి) – ఒక చిన్న పల్లెటూరి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. సాధారణ టీచర్ అయినా, ఆయనలోని నిజాయితీ, విద్యాసేవ, సామాజిక స్పూర్తి ఆయన జీవితాన్ని అసాధారణంగా మలుస్తాయి. తండ్రి చూపిన మార్గంలో ఆయన కుమారుడు అర్జున్ (మళ్లీ ఆర్.నారాయణమూర్తి ద్విపాత్రాభినయం) కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని, కష్టపడి పోలీస్ ఉద్యోగం సాధిస్తాడు.
ఇది ఒక తరాల వారసత్వంలా – ప్రభుత్వ విద్యపై విశ్వాసం, విలువలపై నమ్మకం. ఈ క్రమంలో తన పిల్లలు ప్రైవేట్ స్కూల్‌లో చదవాలన్న కోడలి అభిప్రాయానికి, రామయ్య "నిజమైన విద్య ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటుంది" అన్న నమ్మకంతో ఎదురు నిలుస్తాడు. కుటుంబంలో గొడవ మొదలవుతుంది. అయితే పిల్లలు .. తాత మాట విని ప్రభుత్వ బడిలో చేరతారు. కథలో మలుపు అక్కడే వస్తుంది.
అర్జున్ కుమార్తె తన చివరి పరీక్షల్లో ఫెయిల్ అవుతుంది. అంతేకాదు ఆ బాథలో ఆత్మహత్య చేసుకుంటుంది. మంచి విద్యార్థిని, ఆత్మవిశ్వాసంతో ఉన్న అమ్మాయి ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవడం కుటుంబాన్నే కాదు, మొత్తం సమాజాన్ని కుదిపేస్తుంది. దాని వెనక కారణం – ఒక ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన అవినీతి: ప్రశ్నాపత్రాల లీక్, డబ్బు కోసం ర్యాంకుల వ్యాపారం. ఆ యూనివర్సిటీ వెనుక ఉన్న శక్తివంతుడు నాగభూషణం.
ఇక్కడి నుంచి సినిమా ఒక వ్యక్తిగత దుఃఖాన్ని, సామూహిక ఆగ్రహంగా మార్చుతుంది. రామయ్య, తన మనవరాలి మరణాన్ని వ్యక్తిగత విషాదంగా కాకుండా ప్రజల పోరాటానికి ఆరంభం గా మలుస్తాడు. అతనితో పాటు నిలబడతారు – విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులు.
ఈ పోరాటం ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది: విద్య – హక్కా? లేక వ్యాపారా? కథ క్రమంగా వ్యక్తిగత ప్రతీకారం నుంచి, వ్యవస్థపై తిరుగుబాటుగా ఎదుగుతుంది. రామయ్యకి నాగభూషణంతో ఉన్న ఢీ కేవలం పేపర్ లీక్‌పై కాదు, అది నిజమైన విద్యను చంపేస్తున్న కాపిటలిస్టిక్ ఎడ్యుకేషన్ మాఫియాపై యుద్ధం. ఈ యుద్దంలో ఎవరు గెలుస్తారు అనే ప్రశ్న కన్నా ఎలా గెలుస్తారు అనే ప్రశ్నే ఆసక్తికరమైనది.
ఎనాలసిస్ ..
ఈ కథ స్థానిక సమస్యలా కనిపించినా, అది ప్రపంచవ్యాప్త చర్చ – ప్రైవేటైజేషన్, విద్యను వస్తువుగా మార్చిన కాపిటలిజం పై ఒక పంచ్ గా నారారయణమూర్తి రూపొందే ప్రయత్నం అని అర్దం అవుతుంది..అలాగే టైటిల్‌లో కనిపించే “పేపర్ లీక్” అన్న అంశం, కేవలం కథా హుక్ మాత్రమే. వాస్తవానికి ఈ చిత్రం, ప్రాథమిక విద్య, భాషా రాజకీయాలు, ప్రైవేట్ విద్యా వ్యాపారం వంటి సమాజపు సమస్యలపై తీయబడిన డ్రామా. అయితే, సినిమా మొత్తం సమస్యలమయంగా కనిపిస్తుంది.అంతేకానీ వాటి పరిష్కారానికి ప్రధాన పాత్ర చేసే ప్రయాణం, అంతగా ఎంగేజింగ్ గా ఉండదు.
సినిమా ఓ బలమైన పాయింట్‌తో మొదలవుతుంది – అది పేపర్ లీక్, ప్రైవేట్ ఎడ్యుకేషన్ మాఫియా. కానీ స్క్రీన్‌ప్లేలో ఎక్కువ భాగం మనం పత్రికల్లో, న్యూస్ ఛానళ్లలో విన్న వార్తలే – “ప్రశ్నా పత్రాలు లీక్ అయ్యాయి, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ప్రభుత్వ బడులు నిర్లక్ష్యం, ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ” అనే రిపిటేషన్. ఇది ప్రేక్షకుడిని “ఇది నేను ఇప్పటికే తెలుసుకున్న విషయం” మళ్లీ మళ్లీ చెప్తున్నారే అనిపించేలా చేస్తుంది. డ్రామాటిక్ డిస్కవరీ లేకపోవడం పెద్ద లోపం.
అలాగే ప్రధాన పాత్ర రామయ్య (నారాయణ మూర్తి) మొదటి నుండి చివరి వరకు ఒకే ట్రాక్‌లో ఉంటాడు – “ప్రభుత్వ విద్యే ముద్దు.” ఆయన నమ్మకాలలో conflict లేదు. ఆ నమ్మకాల్ని పరీక్షించే internal struggle లేదు. ప్రతినాయకుడితో పోరాటం కూడా బాహ్యంగా మాత్రమే ఉంది – internal stakes లేవు. దాంతో స్క్రీన్‌ప్లేలో టెన్షన్ బిల్డప్ – ఎమోషనల్ రెలీస్ లాంటి ఆర్క్‌లు రావాల్సిన చోట, నేరుగా స్టేట్మెంట్‌లా అనిపించే సన్నివేశాలు ఎటుచూసినా కనిపిస్తాయి. క్లైమాక్స్‌లో కూడా పోరాటం ఒక స్ట్రైట్‌ఫార్వర్డ్ స్టేట్మెంట్ అయిపోయింది.
దాంతో సినిమాలో ఇచ్చిన మెసేజ్ పవర్ ఫుల్ గా ఉన్నా, న్యారేటివ్ సర్ప్రైజెస్, విజువల్ పొయట్రీ, సబ్టెక్స్ట్ లేయర్స్ లాంటి అంశాలు లోపించటంతో ఇప్పటి సినిమా చూసినట్లు అనిపించదు. ఓ ఇరవై పాతికేళ్ల సినిమా చూసినట్లు అనిపిస్తుంది
టెక్నికల్ గా ..
తండ్రీ కొడుకుగా నారాయణమూర్తి చేసారు. ఇద్దరు ఒకేలా ఉంటారు. రెండు పాత్రల మధ్య లుక్స్, ఎక్సప్రెషన్స్ మధ్య వ్యత్యాసం కనిపించదు. మిగతా పాత్రలు సోసోగా నడిచిపోతాయి. టెక్నికల్ గా ప్రత్యేకంగా చెప్పుకోవటానికి ఏమీ లేదు. నారాయణ మూర్తి చిత్రాల్లో పాటలు బాగుంటాయి. అవి ఈ సినిమాల్లో మిస్సయ్యాయి. అంతే.
ఫైనల్ థాట్
ఇది ఒక ప్రశ్నలు లేపే సినిమా, కానీ జవాబులు ఇవ్వని సినిమా. ఆర్.నారాయణమూర్తి తన సిగ్నేచర్ స్టైల్లో, “ప్రైవేట్ విద్యా వ్యవస్థ” అనే మృగాన్ని బహిర్గతం చేస్తారు. కానీ ఆయన ఆగ్రహం, ఆయన నినాదాలు – ఇవన్నీ ఎక్కువగా స్పీచ్-డ్రైవన్. ప్రేక్షకుడు ఆలోచించాల్సిన చోట, దర్శకుడు ముందుగానే చెప్పేస్తూంటాడు.
ఒక ఆర్ట్ ఫామ్‌గా చూస్తే – యూనివర్సిటీ పేపర్ లీక్ ఒక లెక్చర్-సినిమా. అది మనల్ని కదిలిస్తుంది, కోపం తెప్పిస్తుంది, కానీ కథనంగా, సినిమాటిక్ అనుభూతి మాత్రం ఇవ్వదు.