
శ్రీవిష్ణు కొత్త ప్రయోగం.. "మృత్యుంజయ్" రివ్యూ
క్యాట్ అండ్ మౌస్ థ్రిల్లర్ కానీ…
ఓ పేరున్న న్యూస్ పేపర్ లో యాడ్ ఎగ్జిక్యూటివ్ జై (శ్రీ విష్ణు). అతని పని చనిపోయిన వారి సంస్మరణ,శ్రద్దాంజలి యాడ్స్ తెస్తూంటాడు. దాంతో అతను అంటే అందరికీ ఒక లోకువ. కానీ విష్ణు జీవితాశయం మాత్రం ఒక పవర్ ఫుల్ క్రైమ్ రిపోర్టర్ అవ్వడం. అలాంటి అవకాసం కోసం ఎదురూచూస్తూంటాడు. అ క్రమంలో జై కంట పడిన ఒక చిన్న కేసు, ఊహించని మలుపులు తిరిగి ఒక భారీ మర్డర్ మిస్టరీగా మారితే? అది కూడా ఒక పవిత్రమైన దేవాలయం సాక్షిగా వరుస మరణాలు సంభవిస్తుంటే?
అచ్యుత్ శర్మ (బాలాదిత్య) అనే ఒక మంచి వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆయన చనిపోయిన తీరు చూసి జై మనసులో ఏదో అనుమానం మొదలవుతుంది. ఇన్వెస్టిగేషన్ లో దిగిన జైకి మైండ్ బ్లాక్ అయ్యే నిజం ఒకటి తెలుస్తుంది. సరిగ్గా అదే గుడిలో గతంలో కూడా ఇలాగే ఇద్దరు వ్యక్తులు వింతగా ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు వీటిని కేవలం యాక్సిడెంట్స్ అని కొట్టిపారేసినా, జై మాత్రం ఇది పక్కా మర్డర్ అని ఫిక్స్ అవుతాడు. అనాథగా మిగిలిన అచ్యుత్ శర్మ కూతురికి.. "మీ నాన్న చావుకు కారణమైన వాడిని పట్టుకుంటాను" అని మాట ఇస్తాడు. అక్కడి నుండే అసలు వేట మొదలవుతుంది!
ఇదిలా ఉండగా ఏసీపీ సీత (రెబా మోనికా జాన్) పై అధికారుల ఒత్తిడి వల్ల ఈ కేసును క్లోజ్ చేయాలని చూస్తుంది. కానీ జై మాత్రం తగ్గకుండా క్లూస్ కోసం వెతుకుతూ వెళ్తాడు. ఈ క్రమంలో ఒక మిస్టీరియస్ పర్సన్ నీడ అతనికి తగులుతుంది. ఆ నీడ వెనుక ఉన్నది సైకో కిల్లరా? లేక ఇంకేదైనా పెద్ద కుట్ర ఉందా? ఒక సామాన్యమైన వ్యక్తి, వ్యవస్థను ఎదిరించి ఆ కిల్లర్‌ను ఎలా పట్టుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
తెలుగు సినిమాల్లో థ్రిల్లర్ జానర్‌ను నిజమైన జానర్ డిసిప్లిన్‌తో తీసుకురావడం చాలా అరుదు. చాలా సినిమాలు మధ్యలో కామెడీ ట్రాక్, లవ్ ట్రాక్, సాంగ్స్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో థ్రిల్లర్ టెన్షన్‌ను బలహీనపరుస్తాయి. అయితే దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన ‘Mrithyunjay’ మాత్రం ఈ విషయంలో కొంచెం భిన్నంగా కనిపిస్తుంది.
2016లో వచ్చిన “Meeku Meere Maaku Meme” తర్వాత ఆయన చేసిన ఈ కొత్త ప్రయత్నం పూర్తిగా జానర్ షిఫ్ట్. ఈసారి ఆయన క్లీన్ థ్రిల్లర్ ఫార్మాట్‌ను ఎంచుకుని దానికే కట్టుబడి కథను నడిపించే ప్రయత్నం చేశాడు. సాధారణంగా శ్రీ విష్ణు సినిమాల్లో కనిపించే కామెడీ ట్రాక్‌లు, సరదా డైలాగ్‌లు ఈ సినిమాలో కనిపించవు. అంతేకాదు, హీరోయిన్ పాత్రలో రేబా మోనికా జాన్ ఉన్నప్పటికీ కథలో ఎక్కడా రొమాంటిక్ ట్రాక్‌ను చేర్చలేదు.
ఈ నిర్ణయం స్క్రీన్‌ప్లే పరంగా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే థ్రిల్లర్ సినిమాల్లో కథను ఆపేసే ఎలాంటి సబ్‌ప్లాట్లు లేకపోతేనే టెన్షన్ కొనసాగుతుంది. అలాగే అల్ఫ్రెడ్ హిచ్‌కాక్ చెప్పిన థీరి “There is no terror in the bang, only in the anticipation of it.” (అంటే థ్రిల్లర్‌లో అసలు మజా పేలుడు కాదు, పేలుడు జరగబోతుందన్న ఎదురు చూపే.)ని ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తుంది.
అలాగే తక్కువ రన్ టైమ్ ...సుమారు 120 నిమిషాల రన్‌టైమ్ ఈ సినిమాకు మరో ప్లస్. ఇది సాధారణ తెలుగు సినిమాల 150 నిమిషాల ఫార్మాట్‌కు భిన్నం. హాలీవుడ్ థ్రిల్లర్స్‌లా కథను కాంపాక్ట్‌గా ఉంచే ప్రయత్నం కనిపిస్తుంది. ఈ సినిమాలో దర్శకుడు కథ నిర్మాణాన్ని టైట్ స్ట్రక్చర్‌లో ఉంచేందుకు ప్రయత్నించాడు. సినిమా ప్రారంభంలో కథలోకి నేరుగా వెళ్లడం వల్ల ప్రేక్షకుడు త్వరగా నేరేటివ్‌లోకి ఎంటర్ అవుతాడు.
‘Obituary’ – ‘Accident’ షేడ్స్
సినిమా ప్రారంభ భాగాల్లో “Obituary” అనే టీవీ సిరీస్‌ను గుర్తు చేసే కొన్ని అంశాలు కనిపిస్తాయి. అలాగే కథ కాన్సెప్ట్‌లో హాంకాంగ్ చిత్రం “Accident” ప్రభావం కూడా కొంత మేర కనిపిస్తుంది. అయితే దర్శకుడు వాటిని కాపీగా కాకుండా తనదైన శైలిలో నేరేట్ చేయడానికి ప్రయత్నించాడు. అదే విధంగా ఈ సినిమాలో మరిన్ని ప్రేరణలు కనిపించినా, కథనం మాత్రం దర్శకుడి స్టైల్‌లో సాగుతుంది.
ముందుగానే కిల్లర్ రివీల్: టెన్షన్ నిర్మాణంలో కీలక నిర్ణయం
సినిమాలో అత్యంత ఆసక్తికరమైన అంశం మొదట్లోనే కిల్లర్ రివీల్ చేయడం. సాధారణంగా థ్రిల్లర్ సినిమాల్లో చివర్లో ట్విస్ట్‌గా కిల్లర్‌ను చూపిస్తారు. దాంతో “ఎవరు చేశారు?” అన్న ప్రశ్న కంటే “ఎలా పట్టుకుంటారు?” అన్న ఆసక్తిని పెరిగింది. దీంతో సినిమా రెండో భాగంలో క్యాట్ అండ్ మౌస్ గేమ్ గా మారింది. ఇలా అంతా బాగానే ఉన్నట్లు అనిపించినా కొన్ని సన్నివేశాల్లో దర్శకుడు సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నట్లు కనిపిస్తుంది.
కొన్ని సంఘటనలు లాజిక్‌కు విరుద్ధంగా అనిపించడం వల్ల కథ నమ్మకాన్ని కొంత మేర తగ్గిస్తాయి. థ్రిల్లర్ జానర్‌లో ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే ప్రేక్షకుడు కథను నమ్మకపోతే టెన్షన్ కూడా పనిచేయదు.
అలాగే సినిమా మొదటి గంటలో పేసింగ్ సమస్యలుతో ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే ఈ సినిమా ఎంచుకున్న పాయింట్ అంత కొత్తదేమీ కాదు. కాబట్టి, ఏదో వైవిధ్యమైన కథను ఆశించి థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకులకు కొంత నిరాశ తప్పదు.
టెక్నికల్ గా ..
కాలభైరవ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని సస్పెన్స్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. రెండు గంటల నిడివితో కథ ఎక్కడా సాగదీయకుండా చాలా వేగంగా, పక్కా టెక్నికల్ స్టాండర్డ్స్‌తో సాగుతుంది. విజువల్స్ కూడా బాగున్నాయి.
ఎవరెలా చేసారు
నటుడిగా శ్రీవిష్ణు మరో మెట్టు ఎక్కేలా ఈ సినిమాలో తనలోని కొత్త వేరియేషన్‌ను అద్భుతంగా చూపించాడు. రెబా మోనికా జాన్ సీరియస్ పోలీస్ రోల్‌లో, చిన్నారి ఊహారెడ్డి ఎమోషనల్ పర్ఫార్మెన్స్‌తో సినిమాను నిలబెట్టారు.
ఫైనల్ థాట్
మొత్తం మీద లాజిక్ లోపాలు ఉన్నప్పటికీ ‘Mrithyunjay’ సినిమా ప్రేక్షకుడిని ఎక్కువ భాగం ఎంగేజ్ చేస్తుంది. దర్శకుడి కథనం, ముఖ్యంగా రెండో భాగంలో వచ్చే మైండ్ గేమ్ ఎలిమెంట్స్, అలాగే శ్రీ విష్ణు పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుడిని కథలో ఇన్వాల్వ్ చేస్తాయి. కమర్షియల్ ఎలిమెంట్స్‌కు దూరంగా ఉండి, ఒక ప్యూర్ థ్రిల్లర్గా కథను చెప్పాలన్న దర్శకుడి ప్రయత్నం ఈ సినిమాను ఇతర సాధారణ థ్రిల్లర్స్ నుంచి కొంత భిన్నంగా నిలబెడుతుంది.

