సింగిల్ స్క్రీన్స్ గట్టెక్కాలంటే మరో బాహుబలి రావాల్సిందేనా?
x

సింగిల్ స్క్రీన్స్ గట్టెక్కాలంటే మరో బాహుబలి రావాల్సిందేనా?

కోవిడ్ టైమ్ లో థియేటర్స్ క్లోజ్ చేసారంటే అర్దం చేసుకోగలం. ఇప్పుడు సినిమాలకు సీజన్ అనుకునే వేసవిలో సినిమా థియేటర్స్ క్లోజ్ చేయటం ఏమిటి..?

నిన్న ఈ వార్త వచ్చినప్పటి నుంచి సినీ ప్రియుల్లో ఆందోళన.. ఆవేదన. ఇలా ఎందుకు జరుగుతోంది. కోవిడ్ టైమ్ లో థియేటర్స్ క్లోజ్ చేసారంటే అర్దం చేసుకోగలం. ఇప్పుడు సినిమాలకు సీజన్ అనుకునే వేసవిలో సినిమా థియేటర్స్ క్లోజ్ చేయటం ఏమిటి..? మీడియాలో చెప్తున్నట్లుగా థియేటర్స్ లో సినిమాలకు నిజంగానే జనం రావటం లేదా? లేక వేరే కారణాలు ఉన్నాయా? సినిమా బిజినెస్ లో పాతుకుపోయిన సినిమా ప్రముఖులు ఎవరూ ఈ ఇష్యూ పైన స్పందించి చర్యలు తీసుకోరేంటి అనేది వారికి మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మారింది.

గమనిస్తే మొన్న సంక్రాంతి నుంచి పరిస్థితి మెల్లిమెల్లిగా చేజారుతూ వస్తోంది. అంతకు ముందు ఇలాంటి చీకటి రోజులను తెలుగు సినిమా చూసింది కానీ ఇంత గడ్డు రోజులను అయితే మాత్రం కాదు. సంక్రాంతికి మేజర్ గా హనుమాన్, గుంటూరు కారం ఈ రెండు సినిమాలు పోటీ పడ్డాయి. హనుమాన్ సూపర్ హిట్ అయ్యి డబ్బులు తెచ్చిపెట్టింది. గుంటూరు కారం జస్ట్ ఓకే రిజల్ట్ వచ్చింది. దాంతో మహేష్ అభిమానులు కానివారు చాలా మంది థియేటర్ కు వెళ్లి ఏం చూస్తాము, ఓటిటిలో చూద్దామనే ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత నుంచి అడపాదడపా ఒకటీ అరా చెప్పుకోదగ్గ ఆడిన సినిమాలు వస్తున్నా... ఖచ్చితంగా థియేటర్ కు వెళ్ళి ఈ సినిమా చూసెయ్యాలి అనే సినిమా కనపడలేదు. పెద్ద హీరోల సినిమాలు ఏమీ రిలీజ్ అవటం లేదు.

వాస్తవానికి సమ్మర్ లో పెద్ద సినిమాలు క్యూలు కడతాయి. ఈ సారి ఎలక్షన్స్ దెబ్బ కొట్టాయి. అలాగే ఐపీఎల్ ఇంపాక్ట్ కూడా ఉంటోంది అంటున్నారు. దాదాపు 400 సినిమాలు దాకా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉన్నాయి కానీ రిలీజ్ టైమ్ సరైంది దొరక్క వెయిట్ చేస్తున్నాయని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ రెడ్డి అంటున్నారు.

ఎంటర్ట్నైన్మెంట్ అనేది మన తెలుగువారి నిత్య జీవితాల్లో ఓ భాగమనేది నిజమే కానీ ఇప్పుడు మనందరి దృష్టీ జూన్ 4న వచ్చే ఎలక్షన్ రిజల్ట్ పై ఉంది. ఆ రిజల్ట్ చూసి ముఖ్యమంత్రి ఎవరో తెలిసాక తమ నార్మల్ లైఫ్ లోకి వెళ్తారు. అప్పటిదాకా థియేటర్స్ వాళ్లు ఏం చేయాలి. మల్టిప్లెక్స్ లకు ఈ సమస్య ఉన్నా వారిది పెద్ద చైన్ కాబట్టి ఎడ్జెస్ట్ చేసుకుంటారు. అదే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ వారు అయితే తట్టుకోలేరు. షో వేస్తే ఆరు వేలు నష్టం.. వెయ్యకపోతే నాలుగు వేలే నష్టం. సినిమా వేసినా వెయ్యకపోయినా మెయింటినెన్స్ లు, జీతాలు ఏవీ తప్పవు కదా అంటున్నారు నిట్టూరుస్తూ. జూన్ లో పెద్ద సినిమాలు పడే దాకా థియేటర్స్ పరిస్థితుల్లో పెద్దగా మార్పులు లేవు.. రావు అనేది వారి మాట. అదే నిజం కూడా.

సీనియర్ జర్నలిస్ట్ బుద్దా మురళి మాట్లాడుతూ... థియేటర్స్ నడిపేది వ్యాపారం కోసం... వాళ్లకు లాభం ముఖ్యం... వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళ కోణంలో తప్పు పట్టలేం... ప్రేక్షకుడిగా మనకు బాధగా ఉంటుంది... గతంలో వారానికి రెండు సార్లు థియేటర్ కు వెళ్లి సినిమా చూసే వాడిని ఇప్పుడు ఏడాది రెండేళ్లకోసారి వెళితే గొప్ప... కానీ సినిమా థియేటర్ అంటే మన జీవితంలో విడదీయరాని అనుబంధం ఉంటుంది... థియేటర్ అంటే మన సొంతం అనిపిస్తుంది... మూసేస్తున్నారు అంటే బాధగా ఉంటుంది అంటున్నారు.

మూగ బోయిన మూకీల కాలం నాటి రాజేశ్వర్ టాకీస్

ఘనా ఘన సుందరా కరుణా రస మందిరా

ఘనా ఘన సుందరా కరుణా రస మందిరా

అది పిలుపో మేలు కొలుపో, నీ పిలుపో మేలుకొలుపో

అది మధుర మధుర మధురమౌ ఓంకారమో

ఈ పాట ఒకప్పడు తెలుగునాట భక్తి ఉద్యమంలా వినిపించింది. 1973లో వచ్చిన భక్తతుకారాం సినిమా తెలుగు నాట సంచలనం. రాజేశ్వర్‌లో ఈ సినిమా ప్రదర్శించిన సమయంలో సినిమా హాలులా కాకుండా అదో దేవాలయంలా కనిపించేది. సినిమా హాలు ఆవరణలోనే విఠలేశ్వరుని ప్రతిమను ఏర్పాటు చేశారు. ఆ సినిమా నడిచినన్ని రోజులు టాకీసును దేవాలయంగా చూశారు. రాజన్నగౌడ్ రాజేశ్వర్ టాకీసును 1926లో ఏర్పాటుచేస్తే అక్కడ పనిచేసిన సిబ్బంది ఇప్పటికీ ఆయన పేరు వినగానే దేవుడు సార్ చాలా మంచివారు. టికెట్ దొరక్క చిన్న కుర్రాళ్లు ఏడిస్తే వెళ్లి కూర్చోరా అని పంపేవారు అని టాకీసులో 36 ఏండ్లు పనిచేసిన విజయ్‌కుమార్ అనే ఉద్యోగి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రాజన్న గౌడ్ తర్వాత ఆయన కుమారుడు టాకీసును నడిపారు. తర్వాత యాజమాన్యం చేతులు మారింది. మూతపడింది. తొలుత ముందువరుసలో బెంచీలుండేవి. టికెట్ ధర కూడా మోండా మార్కెట్లో కూరగాయల ధరలా చాలా తక్కువ ఉండేది. ఇక సింగిల్ తెర టాకీసులు కావు, మల్టీప్లెక్స్‌లు కూడా నడవవు అని ఏమీ చదువుకోని విజయకుమార్ సినిమా టాకీసుల జోస్యం చెప్పారు.

- బుద్దా మురళి (జ్ఞాపకాలు 21-1-2018)

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 450 సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉన్నాయి. అవన్నీ పది రోజుల పాటు క్లోజ్. ఇక్కడే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఈపాటికే చాలా థియేటర్స్ మూసేసి ఉంచారని, మంచి సినిమాలు లేకపోవటం, ప్రేక్షకులు సినిమాకి రాకపోవటంతో సినిమా థియేటర్స్ బోసిపోతున్నాయి. ఐపీఎల్, ఎన్నికలు, ఎండలు, పెద్ద సినిమాలు లేకపోవటం ఇలా అన్నీ ఒకేసారి రావటంతో ప్రేక్షకులు థియేటర్స్ కి రావటం లేదు కరెంట్ బిల్లులు చాలా ఎక్కువ వస్తూ ఉండటంతో, అవి కట్టుకోలేకపోతున్నామంటున్నారు.

గతంలో ఇలాంటి సిట్యువేషన్ క్రియేట్ అయ్యినప్పుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రం ఆదుకుంది. ఒక్కసారిగా క్రౌడ్స్ ని థియేటర్ కు లాక్కొచ్చింది. థియేటర్స్ లో మాత్రమే చూడగలిగే సినిమాలు కావాలి ఇప్పుడు. టీవీల్లోనో.. ఓటీటిల్లోనో చూసే సినిమాలు అక్కడే చూస్తారు. థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వగలిగే సినిమాలను ఇవ్వగలిగేలా ఇండస్ట్రీ తనను తాను కాన్సెప్ట్ పరంగా మారినప్పుడు మళ్లీ థియేటర్స్ కళకళ్లాడతాయి. ఆ బాహుబలి... పుష్ప 2 కావచ్చు, ప్రభాస్ కల్కి కావచ్చు, ఎన్టీఆర్ దేవర కావచ్చు... పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ కావచ్చు, లేదా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కావచ్చు... ఇలా ఏదైనా కావచ్చు. వెయిట్ అండ్ సీ.

Read More
Next Story