చిరంజీవి ‘విశ్వంభర’కి ఓటీటీ సమస్య? కారణం ఇదేనా?
పెద్ద సినిమాలు ఎక్కువ శాతం బడ్జెట్ రికవరీకు ఓటిటిని ఓ మార్గంగా చూస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఓటిటి డీల్స్ భారీగా జరుగుతున్నాయి.
పెద్ద సినిమాలు ఎక్కువ శాతం బడ్జెట్ రికవరీకు ఓటిటిని ఓ మార్గంగా చూస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఓటిటి డీల్స్ భారీగా జరుగుతున్నాయి. ఈ ఓటిటిలను దృష్టిలో పెట్టుకునే హీరోలు తమ రెమ్యునరేషన్స్, నిర్మాతలు సినిమా బడ్జెట్ లు నిర్ణయిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద హీరోల సినిమాలు చాలా వరకూ సేఫ్ జోన్ లో రిలీజ్ కు ముందే ఉంటున్నాయంటే అందుకు కారణం కేవలం ఓటిటి డీల్స్ అనే చెప్పవచ్చు. అయితే చిరంజీవి ‘విశ్వంభర’కు ఓటిటి విషయంలో అనుకున్న స్దాయిలో రేటు పలకటం లేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
చిరంజీవి (Chiranjeevi) హీరో గా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. రీసెంట్ గా చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర టీమ్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. చిరు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ఆయన త్రిశూలం చేత పట్టుకుని కన్పించారు. ‘‘చీకటి, చెడు ఈ ప్రపంచాన్ని ఆక్రమించినప్పుడు, ఒక అద్భుతమైన తార పోరాడటానికి ప్రకాశిస్తుంది’’ అని చిత్ర ప్రొడక్షన్ హౌస్ పేర్కొంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న దీనిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సినిమాకు ఇప్పటికే ఓ రేంజిలో క్రేజ్ ఉంది.
ఇప్పటివరకూ చిరంజీవి నటించిన సినిమాలతో పోలిస్తే, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు, దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘విశ్వంభర’ తీర్చిదిద్దుతున్నట్లు టాక్. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాగా ఇది నిలిచిపోనుంది. అంతేకాదు, సోషియో ఫాంటసీ మూవీ కావడంతో వీఎఫ్‌ఎక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు సమాచారం.
ఈ సినిమా కోసం 13 భారీ సెట్‌లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారు. ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త అవతారంలో చిరంజీవి కనిపించనున్నారు. త్రిష కథానాయికగా కనిపించనున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఇది రూపుదిద్దుకుంటోంది. ‘బింబిసార’తో అందరి దృష్టి ఆకర్షించిన వశిష్ఠ ఈ మూవీని ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు.
మరి ఈ రేంజి సినిమాకు ఓటిటి ఎంత పలకాలి. మినిమం తొంభై నుంచి వంద కోట్ల దాకా పలకాలి. కానీ ఈ సినిమాకు 40 కోట్లు దాకానే ఓటిటి రేటు ఇస్తామని లీడింగ్ ఓటిటి సంస్దలు కోట్ చేస్తున్నాయట. ఇంత తక్కువ రేటుకు అడగటం ఏమిటని నిర్మాణ సంస్ద యువి క్రియేషన్స్ వారు షాక్ అవుతున్నారట. అయితే ఓటిటి లెక్కలు వేరేగా ఉన్నాయంటున్నారు. ఓటిటి సంస్దలు ఓ సినిమాకు రేటు డిసైడ్ చేసేటప్పుడు రకరకాల అంచనాలు, మార్కెట్ వాల్యూ, తమ బడ్జెట్ వంటివి చూస్తాయంటున్నారు.
అంతేకానీ సినిమాకు భారీగా ఖర్చు పెట్టారు కదా అని ఇచ్చేయరు అంటున్నారు. అదే చిరంజీవి ఇప్పటికే ప్యాన్ ఇండియా సినిమా చేసి హిట్ కొట్టి ఉంటే ఆ లెక్క వేరేగా ఉండేదని, ఓటిటి రేటు భారీగా పలకేదని అంటున్నారు. దానికి తగ్గట్లు చిత్ర దర్శకుడు వశిష్ట...అంతకు ముందు ఒక చిత్రం మాత్రమే చేసారు. అది కూడా పరిగణనలోకి తీసుకుని లెక్కలు వేస్తారట. ఇలాంటి పెద్ద డీల్స్ కోసం ఓటిటి సంస్దలు హెడ్ ఆఫీస్ నుంచి ఎగ్జిక్యూటివ్ లు రంగంలోకి వస్తారంటున్నారు. వారు ఇక్కడ హీరో ఇమేజ్, సినిమాకు ఉన్న క్రేజ్ పెద్దగా తెలియదని, కేవలం తమ దగ్గర ఇన్ఫర్మేషన్ తో లెక్కలు వేసుకుని అందుకు తగినట్లే ప్రపోజల్స్ ని పెట్టడం, ఓకే చేయటం వంటివి చేస్తాయంటున్నారు.
అయినా భారీ-బడ్జెట్ హిందీ, తెలుగు సినిమా డీల్స్ ని లాక్ చేయడం పట్ల ఓటీటీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. హిందీ, తెలుగు స్టార్ హీరోల సినిమాల మీద స్ట్రీమింగ్ కంపెనీలకు ఆసక్తి తగ్గిందనే అంటున్నారు.స్టార్ హీరోల సినిమాలు కొనుగోలు చేయడానికి భారీ మొత్తాలు చెల్లించినప్పటికీ చందాదారుల్ని ఆకర్షించడంలో విఫలమవుతున్నాయి కంపెనీలు. ‘సాలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి భారీ థియేట్రికల్ విడుదలలకి ఓటీటీలలో కొత్త సబ్ స్కైబర్స్ తెచ్చుకోవటం చాలా కష్టంగా మారింది. స్ట్రీమింగ్ కంపెనీలు స్టార్ హీరోలు నటించిన సినిమాల కొనుగోలు ధరల్ని వాటి బాక్సాఫీసు పనితీరుతో ముడిపెట్టాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కలోనే చిరంజీవి విశ్వంభర కూడా ఉంది.
పెద్ద సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కి ముందు స్ట్రీమింగ్ పార్టనర్ ని పొందే పద్ధతి నుంచి తప్పుకుని, ఇప్పుడు ఓటీటీ ఒప్పందాలు లేకుండానే థియేటర్‌లలోకి సినిమాలు వస్తున్నాయి, బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎక్కువగా కన్పిస్తోంది. కొన్ని నెలలుగా అనేక హిందీ సినిమాలు ఓటీటీ లాక్ అవ్వకుండానే థియేట్రికల్ విడుదలలయ్యాయి. ఆ తర్వాత కూడా ఏ ఓటీటీల్లోనూ ఈ సినిమాలు కనిపించడం లేదు. థియేటర్లలో విడుదలైన తర్వాత నిర్దిష్ట ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించిన కొన్ని భారీ బడ్జెట్ హిందీ సినిమాలు ఆ స్ట్రీమింగ్ లోకే రావడం లేదు. బాక్సాఫీసు ఫెయిల్యూర్స్ చూసి ఓటీటీ కంపెనీలు ఈ ఎగ్రిమెంట్స్ నుంచి వెనక్కి తగ్గుతున్నాయి. టైగర్ ష్రాఫ్ నటించిన ‘గణపత్’, ‘ది లేడీ కిల్లర్’ రెండూ నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ అవ్వాల్సింది ఇంతవరకూ ఏ అప్డేట్ లేదు.
నెట్ ప్లిక్స్, అమేజాన్ ప్రైమ్ వంటి స్ట్రీమింగ్ కంపెనీలు ఇప్పుడు మార్చుకున్న వ్యూహం ఏమిటంటే, ఒక స్టార్ మునుపటి సినిమా బాక్సాఫీసు పనితీరు ఆధారంగా కొత్త సినిమా ఓటీటీ రేటుని నిర్ణయిస్తుంది. థియేట్రికల్ రిలీజ్ కి ముందు కమిట్ అయిన మొత్తంలో కొంత శాతాన్ని కంపెనీ అడ్వాన్సుగా చెల్లించినా. ఆ తర్వాత ఎగ్రిమెంట్ లోని కొన్ని క్లాజులు చూపించి ఎప్పుడైనా మొత్తం డీల్ ని రద్దు చేసే పరిస్థితి కూడా నిర్మాతల కెదురవుతోంది. విశ్వంభర విషయంలోనూ అలాంటి క్లాజ్ పెట్టి ఎగ్రిమెంట్ చేస్తారని వినపడుతోంది. ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది.