సెన్సార్ కొత్త రూల్ తో మేకర్స్‌కు భారీ షాక్ !!
x

సెన్సార్ కొత్త రూల్ తో మేకర్స్‌కు భారీ షాక్ !!

ఇండస్ట్రీలో మొదలైన టెన్షన్!


సినిమా తీయడం ఒకెత్తయితే.. దాన్ని సెన్సార్ బోర్డు నుంచి క్లియర్ చేయించి బయటకు తీసుకురావడం మరో ఎత్తు. ఇప్పటికే రకరకాల కటింగ్స్, టైటిల్ మార్పులతో చుక్కలు చూపిస్తున్న సెన్సార్ బోర్డు (CBFC), ఇప్పుడు మరో బాంబు పేల్చింది. మార్చి 15, 2026 నుంచి వచ్చే ప్రతి సినిమాకి ఓ కొత్త నిబంధన అమలు చేయాల్సిందే. లేదంటే సినిమా ఎలాంటిదైనా సరే.. సర్టిఫికేట్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది! ఇంతకీ ఏమిటా రూల్..దాని మంచి,చెడులు లేమిటి అనే వివరాల్లోకి వెళితే...

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి ప్రొడక్షన్ హౌస్‌ను వణికించే నిర్ణయం తీసుకుంది సెన్సార్ బోర్డు. గతంలో ఎన్నడూ లేని విధంగా, కేవలం డైలాగులు ఉంటే సరిపోదు.. ఇకపై సినిమా చూసే ప్రతి ఒక్కరికీ, వినికిడి లోపం ఉన్నవారికి, కంటి చూపు సరిగా లేని వారికి కూడా సినిమా అర్థం కావాలని కండిషన్ పెట్టింది. ఈ నిర్ణయంతో మేకర్స్‌కి అదనపు ఖర్చు, తలనొప్పి రెండూ మొదలయ్యాయి.

అసలు ఆ కొత్త రూల్ ఏంటి?

సెన్సార్ బోర్డు తాజా నిబంధన ప్రకారం.. మార్చి 15, 2026 తర్వాత సర్టిఫికేషన్ కోసం వచ్చే ప్రతి ఫీచర్ ఫిలింకి తప్పనిసరిగా రెండు ఫీచర్లు ఉండాలి:

క్లోజ్డ్ క్యాప్షన్స్ (Closed Captions - CC): డైలాగులు స్క్రీన్ మీద టెక్స్ట్ రూపంలో కనిపించాలి.

ఆడియో డిస్క్రిప్షన్స్ (Audio Descriptions - AD): విజువల్స్ లో ఏం జరుగుతుందో వివరించే అదనపు వాయిస్ ట్రాక్ ఉండాలి.

ఇప్పటి వరకు ఓటీటీ (OTT) సినిమాలకే పరిమితమైన ఈ రూల్స్, ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలకి కూడా తప్పనిసరి చేశారు. ఈ అప్‌డేట్ వింటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే, ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇక్కడితో అయిపోవని దీని అర్థం.

ఎందుకిలా..

ప్రతి సినిమా ఇప్పుడు అందరికీ చేరువవ్వాలనే ఉద్దేశంతో సెన్సార్ బోర్డు ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. వినికిడి లోపం ఉన్నవారి కోసం 'క్లోజ్డ్ క్యాప్షన్స్' (CC), కంటి చూపు లేని వారి కోసం 'ఆడియో వర్ణన' (AD) తప్పనిసరి చేసింది. అయితే, ఇది సాధారణ సినిమా అనుభూతిని దెబ్బతీస్తుందన్న భయం చాలా మందిలో ఉంది. కానీ, సాంకేతికత గురించి తెలిస్తే మీరు హమ్మయ్య అంటారు!

మీ సినిమా అనుభూతి పాడవుతుందా?

చాలా మందికి ఉన్న అతిపెద్ద అపోహ ఏంటంటే.. సినిమాలో హీరో డైలాగ్ చెప్తుంటే, వెనుక నుంచి ఎవరో సీన్ వివరిస్తూ ఉంటే మాకు డిస్టర్బెన్స్ కదా? అని. కానీ, ఆ భయం అవసరం లేదు:

స్పీకర్లలో వినిపించదు: ఈ ఆడియో డిస్క్రిప్షన్ (AD) థియేటర్ స్పీకర్ల ద్వారా అందరికీ వినిపించదు. ఇది 'VI-N' అనే ఒక ప్రత్యేక సాంకేతిక ఛానెల్ ద్వారా మౌనంగా ప్రసారమవుతుంది.

ప్రత్యేక హెడ్‌ఫోన్స్: ఎవరికైతే ఆ సీన్ వర్ణన అవసరమో, వారికి థియేటర్ యాజమాన్యం ప్రత్యేక వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ ఇస్తుంది. ఆ హెడ్‌ఫోన్స్‌లో మాత్రమే "హీరో కత్తి తీశాడు", "విలన్ కారులో పారిపోయాడు" వంటి వివరణలు వినిపిస్తాయి.

సాంకేతికత: ఇది 'Visually Impaired-Native' (VI-N) అనే ప్రత్యేక ఆడియో ఛానెల్ ద్వారా అందుతుంది. కాబట్టి పక్కన ఉన్న వారికి ఏమాత్రం డిస్టర్బెన్స్ ఉండదు.

సాధారణ ప్రేక్షకులు: మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు ఎప్పటిలాగే డాల్బీ అట్మాస్ సౌండ్ ఎంజాయ్ చేయొచ్చు. పక్కన ఉన్న వారు హెడ్‌ఫోన్స్ వాడుతున్నా మీకు ఆ శబ్దం వినిపించదు.

క్లోజ్డ్ క్యాప్షన్స్ (CC) - ఇది కేవలం సబ్‌టైటిల్స్ మాత్రమేనా?

సబ్‌టైటిల్స్ అంటే కేవలం డైలాగులు. కానీ క్లోజ్డ్ క్యాప్షన్స్ అంటే డైలాగులతో పాటు సినిమాలో వచ్చే కీలక శబ్దాలను కూడా వివరిస్తుంది. ఉదాహరణకు, "వెనుక నుంచి డోర్ చప్పుడు", "కుక్క మొరుగుతోంది", "భయంకరమైన సంగీతం" అని స్క్రీన్ మీద టెక్స్ట్ రూపంలో వస్తుంది. ఇది వినికిడి లోపం ఉన్న వారికి సినిమా మూడ్‌ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

మధ్యలో విజువల్స్ వివరించే వాయిస్ (ఉదా: "అతడు కత్తి తీశాడు", "ఆమె ఏడుస్తూ వెళ్ళిపోయింది") వినిపిస్తుంది.

రెగ్యులర్ సినిమాలకు కూడా దీన్ని వర్తింప చేస్తారా?

అవును! మార్చి 15, 2026 నుండి ప్రతి ఫీచర్ ఫిలింకి (మల్టీ లాంగ్వేజ్ అయినా, సింగిల్ లాంగ్వేజ్ అయినా) ఇది తప్పనిసరి. చిన్న సినిమాలు కూడా: కేవలం పెద్ద హీరోల సినిమాలకే కాదు, సెన్సార్ బోర్డు (CBFC) సర్టిఫికేట్ కావాల్సిన ప్రతి థియేట్రికల్ మూవీకి (టీజర్లు, ట్రైలర్లతో సహా) ఆడియో డిస్క్రిప్షన్ మరియు క్లోజ్డ్ క్యాప్షన్స్ ఉండాల్సిందే.

ప్రభుత్వ లక్ష్యం: 'దివ్యాంగుల హక్కుల చట్టం 2016' ప్రకారం, వినోదం అందరికీ సమానంగా అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

నిర్మాతల పరిస్థితి ఏంటి? :

సినిమా పూర్తయ్యాక సబ్‌టైటిల్స్ రాయడం ఒక ఎత్తయితే, ఇప్పుడు ప్రతి సీన్‌ని వర్ణించేలా ఒక వాయిస్ ఓవర్ ఇప్పించి, దాన్ని పర్ఫెక్ట్ టైమింగ్‌తో సింక్ చేయడం నిర్మాతలకు అదనపు ఖర్చు మరియు పెద్ద తలనొప్పి.

దాంతో ఈ కొత్త నిబంధన వల్ల షూటింగ్ అయిపోయినా పని పూర్తి కాదు. సెన్సార్ బోర్డుకి అప్లై చేసే ముందే ఈ క్యాప్షన్ ఫైల్స్, ఆడియో డిస్క్రిప్షన్ ట్రాక్స్‌ సిద్ధం చేసుకోవాలి. ఇందులో ఏమాత్రం లోపం ఉన్నా సర్టిఫికేషన్ ప్రక్రియ ఆలస్యమవుతుంది. ఈ పనులు పూర్తి చేయడానికి అదనంగా 15 నుండి 20 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. దీనివల్ల లాస్ట్ మినిట్ రిలీజ్ ప్లాన్ చేసే నిర్మాతలకు రిలీజ్ డేట్లు తారుమారయ్యే ప్రమాదం ఉంది.

నిజంగా ఇది మంచిదేనా?

కంటి చూపు సరిగా లేని వారు, వినికిడి లోపం ఉన్న వారు కూడా సినిమాను అనుభూతి చెందాలన్నది సెన్సార్ బోర్డు ఉద్దేశం. ఇది మంచి నిర్ణయమే అయినా, మేకర్స్‌కి మాత్రం ఇది ఒక అదనపు భారమే అని చెప్పాలి. సెన్సార్ బోర్డు ఇప్పటికే టైటిల్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది, ఇప్పుడు ఈ అదనపు రూల్ తో ఇండస్ట్రీని మరింత స్టాండర్డైజ్ చేస్తోంది.

ఏదైమైనా ..

సెన్సార్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం ఒక గొప్ప అడుగు. సాంకేతిక పరంగా సామాన్య ప్రేక్షకుడికి థియేటర్ అనుభూతిలో ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి, ఈ మార్పును స్వాగతించాల్సిందే. కానీ మేకర్స్‌కి మాత్రం ఇది ఒక అగ్ని పరీక్షే!

Read More
Next Story