పాలకుండతో ఫ్రాన్స్ కి బయల్దేరిన స్మితాపాటిల్ మంథన్
x

పాలకుండతో ఫ్రాన్స్ కి బయల్దేరిన స్మితాపాటిల్ 'మంథన్'

శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ కురియన్ ఈ సినిమాకు ప్రేరణ. పాడి వ్యాపారుల కబంధ హస్తాల నుంచి పాడి ఉత్పత్తిదారులను కాపాడడంతో పాటు సంఘంగా తీర్చిదిద్దిన తీరే మంథన్.


సముద్రాన్ని చిలికితే అమృతం వస్తుందో రాదో గాని పాలు తోడు పెట్టి పెరుగును కవ్వం పడితే మాత్రం కచ్చితంగా వచ్చేది వెన్న. అటువంటి అంశాన్ని కథావస్తువుగా చేపట్టి ఓ 50 ఏళ్ల కిందట అద్భుత సినిమా వచ్చింది. దాని పేరే మంథన్..పాత హిందీ ఫిలిం. మహామహులు నటించారు. చనిపోయి ఏ లోకాన ఉందో స్మితా పాటిల్ ఓ పల్లెటూరి పిల్ల పాత్రలో జీవించి నవరసాలను పండించారు. నజీరుద్దీన్ షా గురించైతే ఇక చెప్పాల్సిన పనే లేదు. అలాంటి సినమా అది. ఓ జాతీయ ప్రయోజనం కోసం ఈ సినిమాను ప్రముఖ దర్శకులు, తెలుగుమూలాలున్న శ్యామ్ బెనగల్ తీశారు. ఆ సినిమాను ఈ (మే) నెల 14 నుంచి 25 వరకు ఫ్రాన్స్ లో జరిగే ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబోతున్నారు. ఈ అరుదైన అవకాశం ఈ పాడి రైతుల సినిమా ‘మంథన్’కి దక్కింది. ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ పునరుద్ధరించిన ‘మంథన్’ వెర్షన్ 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమవుతోంది. కేన్స్ క్లాసిక్ విభాగం కింద ఎంపికయిన ఏకైక భారతీయ చిత్రం 'మంథన్'. ఈ సినిమా ప్రీమియర్‌కు నసీరుద్దీన్ షా, దివంగత స్మితా పాటిల్ కుటుంబం, చిత్ర నిర్మాతలు, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్‌కి చెందిన శివేంద్ర సింగ్ దుంగార్‌పూర్ హాజరుకానున్నారు.


శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ ఈ సినిమాకు ప్రేరణ. పాల కొరత ఉన్న భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా మార్చిన అసాధారణమైన యాత్ర ఆ సినిమా. పాడి రైతుల సహకార ఉద్యమానికి నాందీ పలికిన అపురూప కథా రూపం మంథన్. కష్టకాలంలో రైతులు తమ ఇంటి అవసరాలు కూడా తీర్చుకోలేని దుర్భర స్థితిలో ఉన్నప్పుడు నలుగురు పాడి రైతుల్ని ఒక చోట గుమికట్టి పాడిని నమ్ముకుంటే బతుకు బండి లాగ వచ్చునని రుజువు చేసిన సినిమా ఇది. సంఘమంటే ఏమిటో తెలియని పాడి రైతులతో సంఘాన్ని పెట్టించి అమూల్ సంస్థకు బాటలు వేసిన సినిమా అది. పాడి సంఘం ఏర్పాటుకు చిన్న, మధ్యతరహా రైతులు చేసిన పోరాటం, చిన్న చిన్న విజయాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ చిత్రాన్ని ఐదు లక్షల మంది పాడి రైతులు తలా రెండు రూపాయలు వేసుకుని తీసిన సినిమా.

ప్రముఖ భారతీయ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు శ్యామ్ బెనగల్ 1976లో తీసిన మంథన్ సినిమాకు అనేక జాతీయ అవార్డులు వచ్చాయి. సినీ నిర్మాత, ఆర్కియాలజిస్ట్ శివేంద్ర సింగ్ దుంగార్ పూర్ ఏర్పాటు చేసిన ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్, గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్‌తో కలిసి ఊరూరా తిరిగి శ్యామ్ బెనగల్ ఈ సినిమాను నిర్మించారు.
ఈ సినిమా ఉద్దేశమేమిటంటే...
హరిత విప్లవం సక్సెస్ అయినా సమాజంలో ఆర్థిక పరివర్తన ఇంకా జరగలేదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతంగా ఉన్న పాడి రంగంపై పెత్తదార్లదే రాజ్యంగా ఉంది. వాళ్లు ఎంత ఇస్తే అంతే తీసుకోవాల్సి వస్తోంది. అటువంటి దశలో కురియన్ శ్వేత విప్లవానికి నడుంకట్టారు. దాన్ని ప్రోత్సహించే క్రమంలో వచ్చిందీ ‘మంథన్’. ఓ గ్రామం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఉన్న వనరులను ఉపయోగించుకుని ఎలా ముందుకు సాగాలో, అందులో ఎదురయ్యే కష్టనష్టాలేమిటో ఈ సినిమా చూపిస్తుంది. సహకార పాడి సంఘం ఏర్పాటు దిశగా రైతుల నడిచిన మార్గాన్ని వివరిస్తుంది. ఇది మామూలుగా చెబితే జనానికి ఎక్కదు. అందుకని అందులో కాస్తంత ప్రేమ కథాంశాన్ని జోడించి ఓ నిలువెత్తు సినిమాను తీస్తారు. భావోద్వేగాలు, ఓ పల్లెటూరి పిల్లతో ప్రేమాయణం, గెలుపు బాటలో అలసిన గుండెలు వంటివి అనేక రసాలను ఇందులో పండిస్తారు. భారతీయ శ్వేత విప్లవ స్ఫూర్తికి అద్దం పడుతుంది. ఐదు లక్షల మంది పాడి రైతుల కష్టార్జితం ఈ సినిమా. సమాఖ్య స్ఫూర్తికి చక్కటి నిదర్శనం మంథన్. 1977లో మూడు జాతీయ అవార్డులను గెలుచుకుంది. 1976లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అకాడమీ అవార్డ్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఈ చిత్రంలో ప్రీతి సాగర్ పాడిన పాటకు ఉత్తమ గాయని అవార్డు లభించింది. ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డును దక్కించుకుంది.
అటువంటి ఈ సినిమా కేన్స్ కి ఎంపిక కావడం పట్ల అనేకమంది చిత్రరంగ ప్రముఖులు, పాడిపరిశ్రమతో సంబంధం ఉన్న వారు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్‌ (జి.సి.ఎం.ఎఫ్.) మాజీ ఎండీ ఆర్.ఎస్. సోధి మాటల్లో చెప్పాలంటే.. అమూల్ కోపరేటివ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సహకార సంస్థను రూపొందించడానికి సహకార పాడి రైతులు ఏకతాటిపై నిలిచి చేసిన ప్రయాణమే ఈ సినిమా అన్నారు. డెయిరీ సహకార ఉద్యమంపై మంథన్ చెప్పలేనంత ప్రభావాన్ని చూపింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఎక్కడికక్కడ సంఘాలు పెట్టుకోవడానికి స్ఫూర్తిని ఇచ్చింది.
కేన్స్ ఫెస్టివల్ కోసం ఈ సినిమాకి మళ్లీ ప్రాణం పోయాల్సివచ్చింది. దాదాపు అర్ధ శతాబ్దం తరువాత కూడా నేటికీ కథనంలో వన్నే తగ్గలేదు. మంథన్ పాడి రైతుల హృదయాన్ని కొల్లగొట్టిందంటే అతిశయోక్తి కాదు. ఆర్థిక అసమానత, కుల వివక్ష సంకెళ్లను బద్దలు కొట్టే లక్ష్యం ఉన్న చిత్రమిది. మార్పుకు శ్రీకారం చుట్టిన ఈ సినిమాను గోవింద్ నిహలానీ పునరుద్ధరించారు.
సహజనటనకు మారుపేరైన స్మితా పాటిల్, నసీరుద్దీన్ షా పోటీపడి నటించారు. నసీరుద్దీన్ షాకి అది రెండో సినిమా. పల్లెటూళ్లో ఓ గుడిసెలో ఉంటూ గేదె పాలు తీయడం నేర్చుకుని ఈ సినిమాలో నటించారు. ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ గోవింద్ నిహలానీ యాభై ఏళ్ల నాటి ‘మంథన్’ సినిమా పునరుద్ధరణలో పాల్గొని ఓ భావోద్వేగ అనుభవం పొందానంటారు.
గుజరాత్‌లోని సంగన్వా గ్రామంలో ఈ సినిమాను తీశారు. 45 రోజులు పట్టింది. చిత్ర యూనిట్ మొత్తం అక్కడే మకాం వేసి ఓ కుటుంబంలా ఉంటూ సినిమాలో లీనమయ్యారు. సినిమాటోగ్రాఫర్‌గా శ్యామ్ బెనెగల్‌ కు అదే తొలి సినిమా. అమూల్ స్వర్ణోత్సవం జరుపుకుంటున్న వేళ మంథన్ సినిమా కేన్స్ ఫెస్టివల్ కి ఎంపికైంది.
1976లో శ్యామ్ బెనెగల్ ఈ సినిమాకి దర్శకుడు. రెండు గంటల 15 నిమిషాల పాటు సాగే ఈ సినిమాలో పాడి రైతుల్ని కూడగట్టడానికి హీరో పడే పాట్లు అన్నీ ఇన్ని కావు. శ్వేత విప్లవ పితామహుడు వి. కురియన్, దర్శకుడు శ్యామ్ బెనెగల్, ప్రముఖ రచయిత విజయ్ టెండూల్కర్ స్క్రీన్ ప్లై రాశారు. వనరాజ్ భాటియా సంగీత దర్శకుడు. హీరోయిన్ స్మితా పాటిల్. నసీరుద్దీన్ షా, గిరీష్ కర్నాడ్, అమ్రిష్ పురి పోటీపడి నటించారు.
Read More
Next Story