చిరంజీవి, మమ్ముట్టీ
x
మమ్ముట్టి, చిరంజీవి (ఫైల్ ఫోటో)

మమ్ముట్టి – మలయాళ కుట్టీ.. 74/ నాటౌట్

తెలుగులో చిరంజీవీ, కేరళలో మమ్ముట్టి.. ఇద్దరూ ఇద్దరే.. సినీ లోకానికి చిరస్థాయి లెజెండ్స్


24 గంటలుగా కేరళ అంతటా సినీ అభిమానుల అభిమానంతో ఓ నటుడు తడిసి ముద్దవుతున్నాడు.. వచ్చిపోయేవాళ్లను సర్దలేక సెక్యూరిటీ వాళ్లు సతమతమవుతున్నారు. పోగుబడిన దండల్నీ, పుష్పగుచ్చాలను తీసేయలేక ఇంటి మనుషులు హడావిడిపడుతున్నారు.

ఆయన మాత్రం ముకుళిత హస్తాలతో ముచ్చటగా నిలబడి ముసిముసి నవ్వులు చిందిస్తున్నాడు. అతడే కేరళ సినీ భీష్ముడు, అనుభవంగళ్ పాళిచకల్ మమ్ముట్టీ.
తెలుగునాట చిరంజీవికి ఎంత పేరుందో ఆయనకూ అంత పేరుంది. అందుకే ఆ ఇద్దర్నీ మెగాస్టార్ అంటుంటారు వాళ్ల వాళ్ల సొంత రాష్ట్రాలలో. ఇద్దరికీ సినీ రంగంలో ఐదున్నర దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రతిభ, ఆకర్షణతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన నటులు వీళ్లిద్దరూ. ఇద్దరూ ఇద్దరే. తెలుగు మెగా స్టార్ ఆగస్టు 22న 70వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటే మమ్ముట్టి సెప్టెంబర్ 7న తన 74వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. మలయాళ సినీ ప్రపంచంలో ఓ వెలుగు మమ్ముట్టి. తెలుగునాట కూడా చిరపరిచితమైన పేరు.
మమ్ముట్టి 1951 సెప్టెంబర్ 7న చండిరూర్‌లో జన్మించారు. కేరళ లోని కొట్టాయం జిల్లా వైకోమ్ సమీపంలోని చెంపు గ్రామంలో మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో పెరిగాడు. అతని తండ్రి ఇస్మాయిల్. హోల్‌సేల్ గార్మెంట్, బియ్యం వ్యాపారం చేసేవాడు.

మమ్ముట్టి పూర్తి మహమ్మద్ కుట్టీ పనపరంబిల్ ఇస్మాయిల్ (Muhammad Kutty Panaparambil Ismail). ముద్దుగా మమ్ముట్టి అని పిలుస్తుంటారు.
అద్భుత ప్రతిభ ఆయన సొంతం. సున్నితమైన పాత్రల మొదలు సంక్లిష్ట పాత్రల వరకు ఆయనకు ఆయనే సాటి.
1971లో వచ్చిన ‘అనుభవంగళ్ పాళిచకల్’ చిత్రంతో ప్రారంభమైన ఆయన సినీ ప్రయాణం, ‘భీష్మ పర్వం’ (2022), ‘కన్నూర్ స్క్వాడ్’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ల మీదుగా కొనసాగుతూనే ఉంది. వయసు ప్రతిబంధకమేమీ కాదని మళ్ళీ మళ్ళీ నిరూపిస్తూ మమ్ముట్టి తనను తాను తిరిగి ఆవిష్కరించుకుంటూ ముందుకుసాగుతున్నారు.
ఈ సూపర్‌స్టార్ ఈ ఏడాది 74వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన అసాధారణ ప్రయాణాన్ని ఈ సందర్భంగా సంబరంగా జరుపుతున్నారు సినీ అభిమానులు.
ఆయన ఆస్తులు ఎంత ఉండొచ్చునంటే...
మనీ కంట్రోల్ సమాచారం ప్రకారం, మమ్ముట్టి సంపద సుమారు ₹340 కోట్లు. ఆయన ఆదాయం మూడు మార్గాల నుంచి వస్తోంది. అవి సినిమాలు, రియల్ ఎస్టేట్, ప్రముఖ కంపెనీలకు ప్రకటనలు. ఒక్కో చిత్రానికి ₹10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారని వినికిడి. లాభదాయకమైన బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, కేరళ, చెన్నై, బెంగళూరు, దుబాయ్‌లలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు.
ఆయనకు కొచ్చిలో సరస్సు ఒడ్డున సొగసైన బంగ్లా కూడా ఉంది.

సినిమా నటనకే పరిమితం కాకుండా, మమ్ముట్టి ఒక వ్యాపారవేత్తగా కూడా ఎదిగారు. మీడియాలోనూ ప్రవేశం ఉంది. కైరళి టీవీ ఛానెల్‌ ఆయనదే.
ప్లేహౌస్, మమ్ముట్టి కంపెనీ పేర్లతో సినిమాల నిర్మాణం, పంపిణీ రంగాల్లో అడుగుపెట్టారు. కేరళలో పలు థియేటర్లు కూడా ఉన్నాయి.
ఎంటర్‌టైన్‌మెంట్ సామ్రాజ్యంలో ఆయన మకుటం లేని మహారాజు.
చిరంజీవికి మమ్ముట్టికి పోలికలెన్నో..
మన “మెగాస్టార్” చిరంజీవికి కోలివుడ్ మెగాస్టార్ మమ్ముట్టికి చాలా పోలికలు ఉన్నాయని చెబుతుంటారు. తెలుగు సినిమాకు ప్రతీకగా నిలిచిన పేరు చిరంజీవి అయితే మలయాళ చిత్రసీమకి “మెగాస్టార్” మమ్ముట్టి. (అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు మమ్మట్టా).
చిరంజీవి సినీ ప్రయాణం 1978 లో “పునాదిరాళ్ళుతో మొదలయి ఇప్పటికి 150 దాటిపోయింది. యాక్షన్, డ్యాన్స్, కామెడీ, సామాజిక సందేశాలతో కూడిన సినిమాలు అనేకం ఆయన సొంతం. తెలుగు రాష్ట్రాల్లో అపారమైన అభిమాన గణం ఆయన ప్రత్యేకత.
ఇక, మమ్ముట్టి సినీయాత్ర 1971లో “అనుభవంగళ్ పాళిచకల్”తో ప్రారంభమై ఇప్పటికే 400 దాటిపోయింది. గంభీర పాత్రలు, క్లాసిక్ సినిమాలు, యాక్షన్ డ్రామాలు అన్నింట్లోనూ తన ముద్ర ఉంటుంది. మలయాళాన్ని దాటి భారతీయ సినిమాకే ఒక ప్రతిష్ఠ తెచ్చారు.
ఇద్దరి ఖాతాలలోనూ అసంఖ్యాక అవార్డులు, రివార్డులు ఉన్నాయి.
మమ్ముట్టి కేరళలో ప్రజల హృదయాలకు దగ్గరైన వాస్తవిక నటుడు, వినయం, సాదాసీదా నడవడితో గుర్తింపు ఉంది. ఈ ఇద్దరూ తమ తమ పరిశ్రమల్లో కాలాన్ని మించిపోయిన ప్రతీకలే.
ఒక్క మాటలో చెప్పాలంటే చిరంజీవి – మాస్, కమర్షియల్, డ్యాన్స్ & యాక్షన్‌తో తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోతే మమ్ముట్టి – వాస్తవికత, లోతైన పాత్రలు, విభిన్న భాషల్లో నటనతో భారతీయ సినీ చరిత్రలో మిగిలిపోతారు.
దుల్కర్ సల్మాన్‌తో కలయిక
మమ్ముట్టికి కుటుంబం కూడా ముచ్చటైందే. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ కూడా మంచినటుడే. ఆయనకూ దేశవ్యాప్తంగా పేరుంది. అయితే ఇప్పటివరకు తండ్రీ కొడుకూ కలిసి తెరపై కనిపించలేదు. అభిమానుల ఈ ఆతృతకు ముగింపు దగ్గరలోనే ఉంది. ఇద్దరూ కలిసి నటించిన ‘కలంకావల్’ చిత్రం త్వరలోనే రాబోతోంది.
ఈ చిత్రంలో మమ్ముట్టి శక్తివంతమైన ప్రతినాయక పాత్ర పోషిస్తుండగా, దుల్కర్ అదే పాత్ర యువకుడి రూపం సయనైడ్ మోహన్గా కనిపించనున్నారు. జితిన్ కె. జోస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మమ్ముట్టి కంపెనీ నిర్మాణంలో తయారైంది. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్ర టీజర్ ఇప్పటికే మంచి హంగామా చేస్తోంది. ఈ ఏడాదిలోనే థియేటర్లలో విడుదల కానుంది.

కుటుంబంతో మమ్ముట్టీ

74వ యేట అడుగుపెడుతున్నా, మమ్ముట్టి ప్రయాణం అప్రతిహతంగా సాగుతోంది. రెట్టించిన అభిరుచి, ప్రతిభ, నటనతో ముందుకు సాగుతున్నారు. ఆయన ప్రభావం కేవలం మలయాళ సినీ పరిశ్రమకే పరిమితం కాకుండా, మొత్తం భారతీయ సినిమాను ప్రభావితం చేస్తోంది. ఇప్పుడు ఆయన వారసత్వాన్ని కుమారుడు దుల్కర్‌ కొనసాగించబోతున్నారు.
Read More
Next Story