మహేష్ కైనా,సాయి పల్లవి కైనా పాత వీడియోలతోనే ఇబ్బంది
మహేష్ బాబు, సాయి పల్లవి టార్గెట్‌గా కొందరు నెటిజన్లు వివాదంగా మారిన వాళ్ల పాత వీడియోలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారంటే..
(జోశ్యుల సూర్యప్రకాష్)
ఒకప్పుడు మీడియా వేరు.. ఇప్పటి మీడియా వేరు.. పూర్తిగా మారిపోయింది. మంచైనా, చెడైనా మీడియా ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో పాత వీడియోలు తవ్వి తీసి వైరల్ చేసే పోగ్రామ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎవరినైనా ఇబ్బంది పెట్టాలి అంటే వాళ్ల పాత స్టేట్‌మెంట్స్‌తో కూడిన వీడియోలు తీసి వైరల్ చేస్తే చాలు… అన్న స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. ఇది చాలా కాలం పొలిటీషియన్స్‌కే పరిమితం అయ్యింది. వాళ్లు గతంలో ఇలా మాట్లాడారు..ఇప్పుడు ఇలా మాట్లాడారు అని తవ్వి తీసేందుకు మీడియా సంస్థల్లో ప్రత్యేకమైన టీమ్‌లు కూడా ఉంటాయి. వాళ్లకు జీత భత్యాలు ఉంటాయి. కానీ స్టార్స్‌ని ఇబ్బంది పెట్టడానికి కొందరు కేవలం సోషల్ మీడియాలో కామెంట్స్,షేర్స్ కోసం అన్నట్లు పనిచేస్తూంటారు. అలా ఇప్పుడు సాయి పల్లవి, మహేష్ బాబు పాత వీడియోలు తీసి, వైరల్ చేసే పని పెట్టుకున్నారు.
సాయి పల్లవి విషయానికి వస్తే… బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి డ్రీం ప్రాజెక్ట్‌గా 'రామాయణ్'ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, సౌత్ బ్యూటీ సాయి పల్లవి ఇందులో సీతారాములుగా ఫిక్స్ అయ్యారు. మీడియాకు మాట మాత్రంగా అయినా చెప్పకుండా సైలెంట్‌గా మూవీ షూటింగ్ మొదలుపట్టేశాడు డైరెక్టర్ నితీష్. తాజాగా ఈ సినిమా సెట్‌లో రణ్‌బీర్.. రాముడిగా, సాయి పల్లవి సీతగా లుక్‌లో ఉన్న ఫోటోలు లీక్ అయ్యాయి. వీటిని బాలీవుడ్‌కు చెందిన పలు మీడియా, ఆడియన్స్ సోషల్ మీడిమాలో లీక్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అయితే అదే సమయంలో సాయి పల్లవి విరాట పర్వం ప్రమోషన్ టైమ్‌లో ఆమె మాట్లాడిన మాటల వీడియోను బయిటకు తీసి వైరల్ చేస్తున్నారు. దాంతో సాయిపల్లవి సోషల్ మీడియాలో ఊహించని వ్యతిరేకత ఎదుర్కొంటోంది. విరాట పర్వం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి.. కశ్మీర్ ఫైల్స్, గోహత్యల గురించి మాట్లాడింది. వీటిపై సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. దేశవ్యాప్తంగా హిందువులు ఆమె వ్యాఖ్యలని ఖండించారు. పలువురు సెలబ్రిటీలు కూడా సాయి పల్లవి వ్యాఖ్యలు వ్యతిరేకించారు. పలు పోలీస్ స్టేషన్స్‌లో సాయి పల్లవిపై కేసులు నమోదు అయ్యాయి.
గోవుల్ని తరలిస్తున్న ఓ ముస్లిం యువకుడి మీద హిందువులు దాడి చేయడాన్ని తప్పుబట్టింది. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో అంశాలతో పోలుస్తూ అక్కడ కశ్మీర్ పండిట్ల మీద దాడి తప్పయితే.. ఇక్కడ ముస్లింల మీద దాడి కూడా తప్పే కదా అని ఆమె ప్రశ్నించింది అప్పట్లో ఈ వ్యాఖ్యలపై కొంత వివాదం నడిచింది. తర్వాత సద్దుమణిగింది.
అయితే ఇప్పుడు సాయిపల్లవిని ఆ వీడియో చూపించి ఆమె హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడింది కాబట్టి... ‘రామాయణం’ చిత్రంలో హిందువులు పవిత్రంగా భావించే సీత పాత్రను ఆమె ఎలా చేస్తుందని.. ఆమె సూడో సెక్యూరలిస్ట్ అని.. అప్పటి ఇంటర్వ్యూ విషయాలను ప్రస్తావిస్తూ తనను టార్గెట్ చేస్తున్నారు. సీతగా ఆమె ఫొటోలు లీకయ్యాక మొదలైన ఈ ట్రెండ్ అంతకంతకూ ఊపందుకుంటోంది. సాయిపల్లవి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ట్రెండ్ చూస్తుంటే మూవీ రిలీజ్ టైమ్‌కు సినిమాను మరింతగా టార్గెట్ చేసే సంకేతాలు ఉన్నాయనిపిస్తోంది.
ఇక మహేష్ బాబు విషయానికి వస్తే.. ఆయన బాలీవుడ్ ఎంట్రీ గురించి చెప్పిన మాటలు వీడియో పాతది తీసి వైరల్ చేస్తున్నారు. బాలీవుడ్ పరిశ్రమపై సూపర్ స్టార్ మహేశ్ బాబు కొద్దికాలం క్రితం కామెంట్స్ చేశారు. ఆయన నిర్మించిన మేజర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మహేశ్‌కు బాలీవుడ్ ఎంట్రీపై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలీవుడ్ తనని భరించలేదని, అక్కడ సినిమాలు చేసి టైం వేస్ట్ చేయనంటూ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చాడు.
సౌత్ సూపర్ స్టార్ అయిన మహేశ్ బాబు బాలీవుడ్ ఎంట్రీపై ఎప్పటి నుంచో ఆసక్తి నెలకొంది. ఆయన హిందీలో ఓ సినిమా చేయాలని అటూ నార్త్‌తో పాటూ సౌత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన తన హిందీ డెబ్యుపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
‘‘హిందీ పరిశ్రమ నుంచి నాకు ఆఫర్లు బాగానే వచ్చాయి. కానీ నన్ను వారు భరించగలరని అనుకోవడం లేదు. నన్ను భరించలేని పరిశ్రమలో పనిచేయడం టైం వేస్ట్ చేసుకోవమే అవుతుంది. ఇక్కడ నాకు బాగానే ఆఫర్స్ వస్తున్నాయి. అంతేగాక టాలీవుడ్ నాకు మంచి గుర్తింపు, గౌరవం, స్టార్ డమ్ ఇచ్చింది. దీనిపట్ల చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే, నా పరిశ్రమను విడిచి మరేదో ఇండస్ట్రీకి పని చేయాలనే ఆలోచన నాకు లేదు’’ అంటూ మహేశ్ వివరణ ఇచ్చాడు. అప్పుడు ఆ విషయం సెన్సేషన్ అయ్యింది. ఇప్పుడు మరోసారి అదే మాటలు వైరల్ చేస్తున్నారు బాలీవుడ్ బ్యాచ్.
ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయటానికి రంగం సిద్దమైంది. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో అంటే బాలీవుడ్లో సైతం విడుదల చేస్తారు. ఓ రకంగా అఫీషియల్ గా మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ జరగబోతోంది అన్నమాట. ఇన్నాళ్లు మహేష్ డబ్బింగ్ సినిమాలు చూసిన వారు ఇప్పుడు డైరక్ట్‌గా మహేష్‌ని తమ భాషలో చూస్తారన్నమాట. రాజమౌళికి ఉన్న మార్కెట్ దృష్ట్యా నిర్మాతలు కచ్చితంగా ఆ సినిమాను బాలీవుడ్‌లో కూడా విడుదల చేస్తారనేది నిజం. నన్ను బాలీవుడ్ భరించలేదు అని కామెంట్ చేసిన మహేష్ బాబు.. బాలీవుడ్ ఎంట్రీకి సిద్దం అయ్యారనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దాంతో అప్పటి వీడియోని తీసి ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. దాని వలన డ్యామేజ్ ఎంత వరకూ అనేది ప్రక్కన పెడితే నెగిటివ్‌గా ప్రచారానికి అవకాశం ఇచ్చినట్లు అవుతోంది.