లవ్ రెడ్డి మూవీ రివ్యూ
x

'లవ్ రెడ్డి' మూవీ రివ్యూ

దసరా సీజన్ లో పెద్ద సినిమాలు రిలీజ్ లు అయ్యిపోయాయి. ఇప్పుడు గ్యాప్ లో చిన్న సినిమాల వరద మొదలైంది. ఖాళీ థియేటర్స్ ని చిన్న సినిమాలు ఆక్యుపై చేసాయి.

దసరా సీజన్ లో పెద్ద సినిమాలు రిలీజ్ లు అయ్యిపోయాయి. ఇప్పుడు గ్యాప్ లో చిన్న సినిమాల వరద మొదలైంది. ఖాళీ థియేటర్స్ ని చిన్న సినిమాలు ఆక్యుపై చేసాయి. ఈ క్రమంలో ఈ శుక్రవారం వచ్చిన చిత్రం 'లవ్ రెడ్డి'. టైటిల్ తో, ట్రైలర్ తో క్రేజ్ క్రియేట్ చేసుకుంది. లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమాలో కంటెంట్ ఏమిటి, చూడదగ్గ సినిమాయేనా లేక ఓటిటి లో చూడచ్చా వంటి విషయాలు చూద్దాం.

కథ:

ఆంధ్ర కర్ణాటక సరిహద్దులోని ఒక గ్రామం . గార్మెంట్స్ బిజినెస్ చేసే 30 ఏళ్ల నారాయణరెడ్డి (అంజన్ రామ చంద్ర) కి ఇంకా పెళ్ళి కాలేదు. ఎలాంటి బాదరబందీ లేని ఒక ఉమ్మడి కుటుంబంలో పెద్ద కొడుకు అతను .నచ్చిన అమ్మాయి దొరికేదాకా పెల్లి చేసుకోనని కూర్చూంటాడు. ఆ క్రమంలో సంభందాలు చూస్తున్నా ఏది నచ్చదు. మరో పక్క అతని తమ్ముడు నువ్వు పెళ్లి చేసుకుంటే నేను చేసుకోవాలి అని ఇంట్లో పోరుతూంటాడు. అప్పుడే అతనికి దివ్య(శ్రావణి రెడ్డి)ని చూడటం జరుగుతుంది. బస్సులో చూసిన ఆమెతో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఫిక్సైపోతాడు. ఆ అమ్మాయి తాను పెళ్లి చూపులకు వెళ్లిన మరో అమ్మాయి స్నేహితురాలు అని తెలిసి మరింత ఆశ్చర్యపోతాడు. అంతేకాకుండా ఆమె తమకు బంధువులే అవుతారని తెలియడంతో ఇక పెళ్లికి ఇబ్బంది ఉండదని హ్యాపీ ఫీలవుతాడు.

అయితే ఇప్పటిదాకా ఇంకా అతనిది వన్ సైడ్ లవ్వే. ఆమెకు చెప్పడు. అయితే తను ప్రేమిస్తున్న విషయం ఆమె అర్దం చేసుకుందని భావిస్తూంటాడు. పరిచయం, పెళ్లిదాకా తీసుకెళ్దామనుకుంటాడు. అయితే ఈ లోగా దివ్య ఎంగేజ్మెంట్ చేసుకుందనే విషయం తెలిస్తుంది. దాంతో ఆ ఎంగేజ్మెంట్ చేసుకున్న వ్యక్తిని బెదిరించి క్యాన్సిల్ చేయిస్తాడు. ఆ తర్వాత కూడా ఆమె మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమైందనే విషయం తెలుస్తుంది. అప్పుడు ఆమెను కలిసి తన ప్రేమ విషయాన్ని చెబుతాడు. అయితే దివ్య ఒక ఊహించని షాక్ ఇస్తుంది. దివ్య ఇచ్చిన షాక్ ఏంటి? అసలు దివ్య నారాయణ రెడ్డిని ప్రేమించిందా? లేదా, చివరికి నారాయణరెడ్డి వన్ సైడ్ లవ్ ఏమైంది? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

ప్రేమ కథలకు టార్గెట్ యూత్. వాళ్లకు నచ్చితేనే ఆ సినిమాలు వర్కవుట్ అవుతాయి. అందులోనూ కొత్త వాళ్లతో సినిమా అంటే చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఉండాలి. అయితే ఈ కథ చాలా భాగం రొటీన్ గానే అనిపిస్తుంది. క్లైమాక్స్ లో ట్విస్ట్ పెట్టుకుని రాసుకున్నారు. అయితే అప్పటిదాకా ప్రేక్షకులు ఉండాలి కదా. క్లైమాక్స్ షాకింగ్ గానే ఉంది. అయితే అది ఎంతమందికి కనెక్ట్ అవుతుందనేది ప్రశ్న. దానికి తోడు ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే,యూత్ అప్పీల్ మిస్సయ్యారు. ఎప్పుడో తీసి ఇప్పుడు రిలీజ్ చేసారా అనే సందేహం వస్తూంటుంది. ఓటిటిలలో రకరకాల సినిమాలు చేస్తున్న వారికి ఈ సినిమాలో అంతకు మించిన కొత్తదనం కావాలి. పైన కథ చదివిన వాళ్లకు ఇందులో కొత్తేమీ లేదు కదా..రొటీన్ లవ్ స్టోరీ , ఎన్నో సినిమాల్లో చూసిందే కదా అనిపిస్తుంది.

అలాగే సినిమాలో అందరూ కొత్తవారే ఉండడం కొంత మైనస్. అదే ఏ పెద్ద బ్యానర్ నుంచి అయినా వస్తే కొంతలో కొంత సినిమాపై ఓ పాజిటివ్ ఒపీనియన్ ఉండేది. సినిమాలో కొత్తదనం క్లైమాక్స్, నేపధ్యం ఏపీ-కర్ణాటక బోర్డర్ కావటం , అక్కడ ప్రాంత స్లాంగ్ ఉండటం కలిసొచ్చిన అంశం.

ఎవరెలా చేసారు

నారాయణరెడ్డి పాత్రలో అంజన్ రామచంద్ర చాలా బాగా చేసాడు. కొన్ని ఎక్సప్రెషన్ లో కొత్తవాడు అని తెలిసిపోయింది కానీ ఎమోషన్స్ విషయంలో మాత్రం మంచి పరిణితి కనబరిచాడు.ఎమోషనల్ సీన్స్ లో నూ బాగా చేసారు. హీరోయిన్ చేసిన శ్రావణి రెడ్డి సహజంగా చేసింది. ముఖ్యంగా హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన కన్నడ సీరియల్ యాక్టర్ ఎన్.టి.రామస్వామి చాలా బాగా చేసారు. సాడిస్టిక్ ఫాదర్ క్యారెక్టర్లో గుర్తుండిపోయేలా చేసారు. హీరో తమ్ముడి పాత్రలో గణేష్ డి.ఎస్ కామెడీ బాగానే పండింది. మిగతావాళ్ళు తమ పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ గా చూస్తే..

దర్శకుడు స్మరణ్ రెడ్డి ఒక మామూలు కథను, ఆంధ్రా-కర్ణాటక బోర్డర్ నేటివిటీతో సహజంగా తెరకెక్కించే ప్రయత్నం చేసారు. స్క్రీన్ ప్లే కాస్త ఈ కాలానికి తగినట్లు రాసుకుని ఉంటే బాగుండేది. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు ఓకే అనిపించాయి. అలాగే లొకేషన్స్ కూడా చాలా కొత్తగా అనిపించాయి. సినిమాటోగ్రాఫర్ కష్టం స్క్రీన్ మీద కనిపించింది. లెంగ్త్ కూడా ఇబ్బంది పెట్టదు. ఎడిటర్ తనవంతుగా సినిమాని బోర్ లేకుండా లాగే ప్రయత్నం చేసారు. ప్రొడక్షన్ వాల్యూస్ చిన్న సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

చూడచ్చా

కొత్త లొకేషన్స్ లో చేసిన ఈ సినిమా అద్బుతం కాదు కానీ వీకెండ్ కాలక్షేపానికి పనికివస్తుంది.

Read More
Next Story