మంచి సినిమాలంటే ఇట్లుండాలే... 9 సినిమాల రివ్యూ...
x

ప్రిజన్ డైరీస్ నుంచి ...

మంచి సినిమాలంటే ఇట్లుండాలే... 9 సినిమాల రివ్యూ...

సినిమా రెండు మూడు గంటల నిడివి ఉండవలసిన అవసరం లేదని అతి తక్కువ సమయంలో మంచి సందేశంతో గొప్పగా సినిమా నిర్మాణం చేయవచ్చని నిరూపించిన సినిమాలు.


సమాజం మీద ప్రగాఢమైన ప్రభావం చూపగలిగిన మాధ్యమాలలో సినిమా అత్యంత ప్రధానమైంది. సినిమారంగం వ్యాపార ధోరణితో వెర్రితలలు వేస్తున్న సమయం. తమ రాజకీయ ప్రయోజనాలకోసం వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలతో కాశ్మీర్ ఫైల్స్, కేరళాస్టోరీ లాంటి సినిమాలు కూడా వస్తున్నాయి. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు చూడాలి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి. సరైన సమయంలో మంచిసినిమాల పండుగ హైదరాబాదులో జరగడం శుభపరిణామం.

ముందడుగు( కోల్ కత్తా ), మంచి సినిమా, ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ సదరన్ రీజియన్ హైదరాబాదు వారి ఆధ్వర్యంలో ఆదివారం 11-8-2024 నాడు మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర దాకా ఈ కార్యక్రమం జరిగింది. లకిడికా పూల్ లోని సీఏ చాంప్స్ అకాడమీ తరగతి గది ప్రేక్షకులతో నిండి పోయింది. స్థలాభావం వల్ల కొందరు నిలబడి కూడా సినిమాలను వీక్షించారు. ఇది మంచి సినిమా కోసం జనం ఎంత ఆతృతగా ఉన్నారో తెలుపుతుంది.

కలకత్తా నుంచి వచ్చిన ఐకా బాలాజీ ఆయన సహచరి నిర్మల, పశ్చిమగోదావరి నుంచి వచ్చిన గౌరవ్ లు కార్యక్రమాన్ని ఆద్యంతం ఉత్సాహంగా నడిపించారు. ప్రతి సినిమా ప్రదర్శనకు ముందుగా కీలకాంశాన్ని వివరించారు. ఒక సినిమాను ఎన్ని కోణాలలో చూడవచ్చునో బాలాజీ వివరిస్తే సినిమా తరువాత చర్చను గౌరవ్ నిర్వహించాడు. సాధారణంగా సినిమాను నాయికానాయకుల కోణం, దర్శకుడి కోణం నుంచి మాత్రమే చూస్తారు. సంగీతం, ఫోటోగ్రఫీలతో పాటు తెరవెనుక వుండే సాంకేతిక బృంద కోణాలనుంచి కూడా సినిమా చూసినప్పుడే అందులోని ఆంతర్యం పూర్తిగా ప్రేక్షకుడికి అవగతమవుతుంది.

ఈ సందర్భంగా మొత్తం తొమ్మిది లఘు చిత్రాలను ప్రదర్శించారు. ఒక్క నిమిషం కూడా వ్యర్థం కాకుండా ఆరు గంటల సమయాన్ని సార్థకం చేసిన నిర్వాహకుల నైపుణ్యాన్ని కొనియాడవలసిందే... ప్రదర్శించిన సినిమాలు కూడా అంతగొప్పవి. ఇంకా యూట్యూబ్ లో కాని ఫేస్ బుక్ లో కాని ఎక్కడా అందుబాటులో లేని సినిమాలు. సినిమా రెండు మూడు గంటల నిడివి ఉండవలసిన అవసరం లేదని అతి తక్కువ సమయంలో మంచి సందేశంతో గొప్పగా సినిమా నిర్మాణం చేయవచ్చని నిరూపించిన సినిమాలు. తొమ్మిది సినిమాలు చూసిన తరువాత వాటి ప్రదర్శనా క్రమం గమనిస్తే..ముందస్తు ప్రణాళికగా వాటిని ఆ క్రమంలోప్రదర్శించారని అనిపించింది. దాదాపు అన్ని సినిమాల నిడివి అరగంట లోపే కాని వాటిలో దర్శకులు డీల్ చేసిన సమస్యలు అనేకం. ప్రస్తుత సామాజిక సమస్యలను ఎన్నింటినో ఈ సినిమాలు ప్రేక్షకుల ముందు చర్చకు పెట్టి ఆలోచనను రేకెత్తించాయి.

మొదటగా ప్రదర్శించిన సినిమా "వైరల్ ". శ్రేయాస్ దశరథే , జంషెడ్ ఇరానీ అనే భారతదేశం - పాకిస్తాన్ లో ఉన్న ఇద్దరె దర్శకత్వంలో ఈ సినిమా నిర్మాణం జరిగింది. ఓంకార్ ప్రధాన్ సంగీతం. 2022 లో వచ్చిన సినిమా. 23 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో . .... ఒక వ్యక్తి పాకిస్తాన్ లోని కరాచీలో ఉంటాడు. ఇండియాలోని ముంబైలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ముఖ పరిచయం కూడా లేని ఈ ముగ్గురూ online లో కలుసుకొని స్నేహం చేయడం, వీడియోలు చేయడం ప్రధాన కథాంశం . అయితే ఇక్కడ కరాచి , ముంబై రెంఢూ అరేబియా సముద్రతీర నగరాలు కావడం గమనార్హం. అంతే కాదు ... ఈ రెండు నగరాలు ఆయా దేశాల ఫైనాన్షియల్ సిటీస్ కావడం మరో కోణం. ఇండియా పాకిస్తాన్ దేశాల మైత్రి ఆవశ్యకతను తెలుపుతుంది ఈ సినిమా. స్మార్ట్ ఫోన్ వాడకంతో యువత వీడియోలు తీస్తూ easy money కి అలవాటు పడుతోంది అనే మరో కోణం కూడా ఉందనిపించింది.

పల్లెల నుంచి పట్టణాలకు వలస వచ్చిన వారు నగరంలోని నియాన్ లైట్ల మెరుపులకు, హంగులకు అడ్జస్ట్ కావడానికి పడే సంఘర్షణను చిత్రించిన సినిమా నియాన్. దర్శకురాలు సాక్షి గులాటి, కథారచయిత గోవిందరాజు ప్రదర్శనకు హాజరై ప్రేక్షకుల స్పందనకు ప్రతిస్పందించారు. దర్శకురాలు సినిమా చిత్రీకరణ సమయంలోని తన అనుభవాలను పంచుకున్నారు. మా తరానికి చదువుకోవడానికి, ఉద్యోగ రీత్యా, బతుకుతెరువు కోసం నగరాలకు రావడం .... ఈ తరంలో చదువుకోసం ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళడం .... కారణాలు ఏవైనా చాలా మందివి వలస జీవితాలే... సర్దుబాటు జీవితాలే.... దీనికి అంతం ఎక్కడ? అనేది గులాటి సందేహం. ఈ సినిమా దాదాపు మనందరి జీవితాలకు దగ్గరగా ఉంటుంది. విస్తృతమైన ఊపిరాడని వలస జీవితాలలోని సర్దుబాటు తత్వాన్ని ప్రతీకాత్మకంగా కేవలం 27 నిమిషాలలో సమర్థవంతంగా చూపించింది దర్శకురాలు. తెరవెనుక సంగీతం, లైటింగ్ సందర్భానుసారంగా ఉన్నాయి.

మిస్సింగ్ సీన్స్ 6/12/1956 అనే సినిమా దర్శకుడు ఆనంద్ పాండే, రాజ్ కుమార్ తాంగ్లేలు. పందొమ్మిది నిమిషాల యాభై ఎనిమిది సెకన్ల నిడివి. 2022 లో తీసిన మరాఠీ భాషా చిత్రం. చరిత్రలో డిశంబరు ఆరో తేదీకి ఒక ప్రత్యేకత ఉన్నది. కాబట్టి దర్శకులు ఈ తేదీని ఈ సింబాలిక్ గా తీసుకొని ఉండవచ్చు.


ఈ రోజునే బాబాసాహెబ్ అంబేద్కర్ మరణించారు. కొన్ని సంవత్సరాల తరువాత ఇదే రోజున బాబ్రీ మసీదు కూల్చివేయ బడింది. ప్రస్తుతం దేశంలో పెచ్చుమీరిన కుల తత్వాన్ని ప్రతిబింబించింది ఈ సినిమా. ఒక చిన్న గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తెల్లవారితే విద్యాశాఖా అధికారి ఇన్ఫెక్షన్ ఉంటుంది. అదే పాఠశాలలో గోడ మీదున్న అంబేద్కర్ ఫోటో మిస్ అవుతుంది. అధికారులు వచ్చేసరికి ఆ ఫోటోను యథాస్థానంలో ఉంచాలనే ప్రయత్నమే సినిమా. అంబేద్కర్ ఫోటో కొరకు వెతుకుతూ ఉంటారు. ఈ క్రమంలో అంబేద్కర్ ఫోటో మా యిళ్ళలో ఎందుకుంటుంది? అనే కీలకమైన డైలాగ్ వస్తుంది. ఈ సినిమాలో పలు అంశాలున్నాయి. ఎవరి దృష్టి కోణాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ గ్రామంలో అన్నీ అగ్రవర్ణాల కుటుంబాలే ఉండడం గమనార్హం.

మరో వెంటాడే సినిమా Foot Prints (పాదముద్రలు). కథా దర్శకత్వం తథాగత ఘోష్. 2022లో బెంగాలీ భాషలో వచ్చిన సినిమా... మనందరం ఆత్మ విమర్శ చేసుకునేలా చేసే చిత్రం. ఇరవై మూడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకన్ల నిడివి గల చిత్రం. ఎలాంటి నేపథ్య సంగీతం లేదు. ఒక ఎగువ మధ్య తరగతి కుటుంబం. భార్యా భర్తా ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల. ఆ ఇంట్లో ఒక పనిపిల్ల. ఆమెకు నెలల వయసున్న కొడుకు.


పని చేస్తే గానీ ఇల్లు గడవని ఆర్థిక పరిస్థితి. ఎవరి వ్యాపకాలు వారివి. చిన్నపిల్లవాడికి డైపర్ మార్చే తీరిక కూడా ఎవరికీ ఉండదు. పని పిల్లనే ఆ పని కూడా చేస్తుంది. కుటుంబ సభ్యులందరూ పనిపిల్ల మీద ఆజమాయిషీ చేసే వారే.... ఇంటి ఇల్లాలు ఫ్రస్టేషన్ తో అరిచే రెండు మూడు అరుపులు తప్ప పెద్దగా డైలాగులు కూడా లేవు. పనమ్మాయి అత్యవసరమై ఆ యింట్లో వాష్ రూం వాడు కుంటుంది. నిరంతరం వారి వారి వ్యాపకాల్లో కుటుంబ సభ్యులు నలుగురూ ఒకే సారి దిగ్భ్రాంతిగా ఆ అమ్మాయి లోపలికి వెళ్లి తనుపేసుకున్న శబ్దానికి తలెత్తి చూస్తారు. చిన్నబాబు ఆమెవైపు స్నేహంగా చూస్తాడు. తడి కాళ్ళతో బయటకు వచ్చిన పనిపిల్ల పాదముద్రలు ఇంటి యజమాని ప్యాంటు మీద పడతాయి. ఇంట్లో ఒంటరిగా వదిలి వచ్చిన తన పసి బిడ్డను గుండెలకు హత్తుకొని, పాలిస్తూ ఏడుస్తుంది. ఆమె కళ్ళ నుంచి రెండు కన్నీటి బొట్లు జాలు వారుతాయి. దీనితో సినిమా ముగుస్తుంది. అంటే అలాంటి జీవితాలు అలా కొనసాగ వలసిందేనా? అని ప్రశ్నించినట్లు అనిపిస్తుంది ప్రేక్షకులకు. ఒళ్ళు జలద రిస్తుంది. మనకు తెలియకుండానే ఆ క్షణంలో మనం ఆత్మ విమర్శ చేసుకుంటాం. మన ఇండ్లలో పని చేసే వాళ్ళకు మనం ఎంత స్పే స్ ఇస్తు న్నాం? అని. ఎవరి పాత్రకు వాళ్ళు న్యాయం చేశారు. పని అమ్మాయి నటన అయితే అద్భుతం. మాటలకందని ఎన్నో విషయాలు ఈసినిమాలో ఉన్నాయి. అదే సినిమాకు ఉండే శక్తి. మనసుకు హత్తుకొని మెదళ్లను తొలుచుకొని ఆలోచింప చేస్తుంది.

కళారంగంలో పేరు ప్రఖ్యాతులు, అవార్డులు పొందిన వ్యక్తి స్నేహలతారెడ్డి. ఎమర్జెన్సీ సమయంలో జార్జి ఫెర్నాండెజ్ కు తన ఇంట్లో ఆశ్రయమిచ్చినందుకు అరెస్టయి జైలు జీవితం గడిపింది. దానితో ఆరోగ్యం పాడై క్రానిక్ ఆస్త్మా, లంగ్ ఇన్ఫెక్షన్ తో పెరోల్ మీద బయటకు వచ్చిన ఐదు రోజులకే మరణించింది. ఈ వివరాలన్నీ prison Dairies (జైలు డైరీలు) అనే పేరుతో ఉమాచక్రవర్తి దర్శకత్వంలో వచ్చిన డాక్యుమెంటరీ సినిమాలోనివి.


నిడివి 37 నిమిషాలు. స్నేహాలతా రెడ్డి కూతురు, కొడుకు, కుటుంబ మిత్రులిద్దరితో ఇంగ్లీషులో ఇంటర్వ్యూ రూపంలో ఈ సినిమా కొనసాగుతుంది. సినిమాకు సంగీతం కోణార్క్ రెడ్డి అందించాడు. 2019 లో నిర్మించిన చిత్రం.

టూ వే స్ట్రీట్ ( Two way street ) అనే 22 నిమిషాల షార్ట్ ఫిల్మ్ పెట్ట కొంచం - కూత ఘనం అన్నట్టుంది. దర్శకుడు అస్మిత్ పఠారే. సంగీత దర్శకుడు ఖేజాక్ గేహర్డా. కథా రచయిత్రి అన్నీజైదీ. నిర్మాత రాజ్ ఖవేర్. 2023 లో నిర్మించిన చిత్రం. పాలకులు మతం ముసుగులో గత పదేళ్లుగా చాపకింద నీరులాగా ప్రచారం చేసిన హిందూత్వ భావన ఉన్మాద స్థాయికి చేరి ఏకంగా తెరపైకే వచ్చేసిన సందర్భంలో ఇలాంటి సినిమా రావడం ఆహ్వానించదగ్గ విషయం. దాదాపు పదేళ్ళ తరువాత సొంత ఊరికి వచ్చిన


ఒక వ్యక్తి బోలేడు సామానుతో ఇంటికి వెళ్ళడానికి టాక్సీ ఎక్కుతాడు.టాక్సీ డ్రైవరుకు ఆ వ్యక్తికి మధ్య సుహృద్భావం ఉంటుంది. కొంతదూరం వచ్చాక అక్కడే దిగి పొమ్మని చెపుతాడు. ఇంత సామానుతో తాను వెళ్ళలేనని ఇంటి దగ్గర దింపాలని చెపుతాడు లోపలి వ్యక్తి. డ్రైవరుకు కోపం వస్తుంది. సామాను విసిరేస్తాడు. టాక్సీ వెనుక అద్దం మీద కోపంతో ఉన్న హనుమంతుడి బొమ్మ చూసిన ఆ వ్యక్తికి కొంత విషయం అర్థమై అలాగే మొండికేసి కూచుంటాడు. సమయం గడిచిపోతుంది. దాంతో డ్రైవర్ ఆదాయం పోతుంది. ఇంక లాభం లేదని గ్రహించిన టాక్సీ డ్రైవర్ సామాను లోపల పెట్టి ఇంటివరకూ తీసుకు వెళ్తూ మీ వాళ్ళ టాక్సీ మాట్లాడుకోవచ్చు కదా అంటాడు. నువ్వు మావాడివే అనుకున్నా అంటాడు లోపలి వ్యక్తి. ఇక్కడ ఇది చాలా కీలకమైన డైలాగు. చివరి సీనులో ఇద్దరూ తమ తమ చోట్లలో భోజనం చేస్తూ ఆలోచనలో పడడంతో సినిమా ముగుస్తుంది. పదేళ్ళ కాలంలో మతం పేరుతో మనుషులు ఎంతగా విభజించ బడ్డారో చెపుతూ మతం కంటే మానవత్వమే ఈ సందర్భంలో అత్యవసరం అని చాటి చెపుతుంది ఈ సినిమా.

2023 లో మలయాళంలో ... సోను కుమ్మిల్ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ది అన్ నోన్ కేరళా స్టోరీస్. దీనిని ఒక రకంగా కేరళా స్టోరీ.


సినిమాకు కౌంటర్ సినిమాగా చెప్పొచ్చు. శక్తివంతమైన సినిమాను పాలక వర్గాలు తమ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఈనాడు సాధారణమైంది. వివిధ వాస్తవ సంఘటనలతో కేరళలో భిన్న మతాల ప్రజల మధ్య ఉన్న స్నేహ సంబంధాలను తెరకెక్కించిన చిత్రం.

మహాసత్తా ( super power ) విక్రమ్ బోలే గావే దర్శకత్వంలో నిర్మించిన ఇరవై నిమిషాల చిత్రం. 2021 లో మరాఠీ భాషలో వచ్చింది . తండ్రీ కొడుకు లిద్దరూ పడుకొని కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో మహాసత్తా అంటే ఎవరు? అని కొడుకు తండ్రిని అడుగుతాడు. తండ్రి అమెరికా అని జవాబు చెపుతాడు. మరో వైపు దేశంలోని దుర్భర పరిస్థితులను చూపుతాడు దర్శకుడు. ప్రతీక్ శేఖర్ దర్శకత్వంలో, 2019 లో, హిందీ భాషలో నిర్మించిన సినిమా ఛాయ్ దర్బారీ. సాధారణంగా డాక్యుమెంటరీ సినిమాలు సామాన్య ప్రేక్షకులకు విసుగునే కలిగిస్తాయి. కానీ డాక్యుమెంటరీ చిత్రాన్ని కూడా ఎంత హృద్యంగా తీయవచ్చునో ప్రయోగాత్మకంగా నిరూపించిన సినిమా ఇది. సాధారణ టీ కొట్టు దగ్గర చాయ్ తాగుతూ జనం మాట్లాడుకునే సంభాషణలతో అయోధ్య రామమందిర నిర్మాణం పట్ల సామాన్య ప్రజల అభిప్రాయాలను చెప్పడమే సినిమా. గంభీరమైన విషయాన్ని ప్రజల శక్తివంతమైన డైలాగులతో హాస్యంగా చెప్పిన సినిమా. ఇది దర్శకుడి ప్రతిభకు తార్కాణం. నాకైతే చార్లీ చాప్లిన్ సినిమాలు గుర్తొచ్చాయి. లఘు చిత్రంలో గంభీరమైన విషయాన్ని ఇలా చెప్పడం చాలా గొప్పవిషయం.

ప్రదర్శించిన తొమ్మిది సినిమాలలో చాలా వాటికి ఒక్కొక్క సినిమాకు ఒక వ్యాసం రాయొచ్చు. టూ వే స్ట్రీట్ లఘు చిత్రం మీద శివలక్ష్మి గారు లోతైన విశ్లేషణతో విపులంగా ఒక వ్యాసమే రాసింది. film festival లో ప్రదర్శించిన అన్ని సినిమాలను పాఠకుల దృష్టికి తేవడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం. సందేశాత్మకమైన, కళాత్మకమైన ఈ గొప్ప చిత్రాలన్నీ వీలైనంత తొందరలో online లో ప్రజలకు అందుబాటులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమా పండగలు తరచుగా హైదరాబాదులో నిర్వహించాలని నిర్వాహకులను అభ్యర్థిస్తున్నాను.

అప్పుడే ఈ స్తబ్ద జీవితాల నుంచి జనాలు బయట పడదానికి అవకాశం ఉంటుంది .


Read More
Next Story