
బెల్లంకొండ శ్రీనివాస్ 'కిష్కిందాపురి' రివ్యూ
సువర్ణమాయ రేడియో స్టేషన్ రహస్యం
లవర్స్ అయిన రాఘవ్ (బెల్లంకొండ సాయిశ్రీనివాస్), మైథిలి (అనుపమ) ...డబ్బు సంపాదించటానికి ఓ క్రేజీ ఐడియా వేస్తారు. తమ స్నేహితుడు (సుదర్శన్)తో కలిసి ఘోస్ట్ వాకింగ్ పేరుతో హాంటెడ్ హౌసెస్ టూర్స్‌ని నిర్వహిస్తుంటారు. రాత్రి వేళల్లో భూతాలు ఉన్నాయనే పేరున్న పాడుబడ్డ ఇళ్ళలోకి పర్యాటకులను తీసుకెళ్లి, ముందే ప్లాన్ చేసిన ట్రిక్స్‌తో భయపెట్టి, థ్రిల్ ఇస్తూంటారు. దెయ్యాల గురించి కట్టుకథలు చెబుతూ ఆ అనుభవాన్ని నిజమని నమ్మిస్తూంటారు. వాళ్లకు ఇది బాగానే నడుస్తూ ఉంటుంది. ప్రతీ టూర్‌కి కొత్త కస్టమర్లు, కొత్త అరుపులు, కొత్త నవ్వులు.
కానీ… ఒక రోజు. ఒక విచిత్రమైన కస్టమర్ వారి జీవితాన్ని శాశ్వతంగా మార్చేశాడు. ఆ వ్యక్తి—హైపర్ ఆది. అతని డిమాండ్ ఒక్కటే: “నిజంగా హాంటెడ్ ప్రదేశం చూపించండి… నకిలీలు వద్దు.”. సరే అని మరో 11మందిని తనతో కలిపి ఈ ఎడ్వెంచర్ ప్లాన్ చేసారు.
వాళ్లందరినీ తీసుకెళ్లారు… 1989లో మూతపడిపోయిన ఒక శాపగ్రస్త ప్రదేశానికి. అదే సువర్ణమాయ రేడియో స్టేషన్. అది ఒకప్పుడు వెలుగులు నింపిన స్థలం.
ప్రజలు సంగీతం విన్న, మాటలతో కట్టిపడేసిన ప్రదేశం. కానీ ఒక రాత్రి… అక్కడ ఏదో జరిగిపోయింది. అప్పటి నుంచి ఆ స్టేషన్ తలుపులు మూతపడ్డాయి.
వాళ్లు లోపల అడుగుపెట్టగానే… ఒక వింత నిశ్శబ్దం. గోడలపై తుప్పు పట్టిన ఫ్యాన్లు, పాడైపోయిన పరికరాలు, విరిగిన గాజులు… చీకటిలో వింత కదలికలు. అంతలో… రేడియోలోంచి ఒక స్వరం వినిపించింది. చల్లని, గుండె చెదరగొట్టేలా ఉన్న ఆ స్వరం ఇలా అంది—
“సువర్ణమాయలోకి అడుగుపెట్టిన మీలో ఎవ్వరినీ వదిలేది లేదు…”
మొదట వాళ్లందరూ అది కూడా ఒక గిమ్మిక్ అనుకున్నారు. అయితే కొద్ది సేపటికి ఆ స్వరం నిజమైందని తెలిసింది. ఒకరి తర్వాత ఒకరు… వాళ్లతో వచ్చిన ముగ్గురు వ్యక్తులు మర్మమైన రీతిలో చనిపోవడం మొదలైంది.
భయం ఒక్కసారిగా వారందరినీ కమ్మేసింది. పరిగెత్తినా, కేకలు వేసినా… ఆ స్టేషన్ గోడలు అన్నీ మూసేసినట్టే. ఆ తర్వాత… ఆ దెయ్యపు నీడ ఒక చిన్నారిని టార్గెట్ చేసింది. ఆ భయంకర వాతావరణంలో రాఘవ్, మైథిలి ఒక్కసారిగా గ్రహించారు— ఇది వాళ్లు వేసిన సెటప్ కాదు. ఇది నిజమైన దెయ్యం.
ఇప్పటివరకు లేనిపోని ఆత్మ కథలు చెప్పి ఇతరులను భయపెట్టిన ఆ జంట… ఇప్పుడు ఒక ఆత్మ చేతుల్లో బందీలయ్యారు.
ఇంతకీ ఆ స్వరం ఎవరిది?
సువర్ణమాయ రేడియో స్టేషన్ వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి?
అది ఎందుకు ప్రతీకారం తీర్చుకుంటోంది?
మిగిలిన వాళ్లను రాఘవ్ కాపాడగలిగాడా? లేక…
సువర్ణమాయ రహస్యం వారందరినీ మింగేసిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ :
తెలుగు కమర్షియల్ సినిమాలు ఎప్పుడూ కొత్త జాన్రాలను టచ్ చేయాలని చూస్తూనే ఉంటాయి. కానీ వాటి ఎగ్జిక్యూషన్, స్క్రీన్ ప్లే , నిర్మాణం వాటి సక్సెస్ ని నిర్ణయిస్తాయి. కిష్కిందాపురి కూడా అదే ప్రయత్నమే — devotional, horror, comedy అన్నింటినీ కలపాలని ప్రయత్నించింది.అయితే దేన్నీ పూర్తి స్దాయిలో న్యాయం చేయలేకపోయింది. “Ghost walking tours” అనే కాన్సెప్ట్ కొత్తదే అయినా, దాని ఎగ్జిక్యూషన్ అంత ఆసక్తికరంగా అనిపించదు. ఇక్కడ శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ సినిమా గుర్తు వస్తుంది.
“Drama is life with the dull bits cut out.” – Alfred Hitchcock
హిచ్‌కాక్ చెప్పిన ఈ లైన్ నిజానికి కిష్కిందాపురి సమస్యని మొదటి 45 నిమిషాల్లోనే బయటపెడుతుంది. యాక్షన్ ఎంట్రీ, రొమాంటిక్ సాంగ్, కామెడీ బిట్స్ — ఇవన్నీ రొటీన్‌గా నిండిపోవడం వల్ల అసలు మనం ఏదైతే చూడాలనుకున్నామో ఆ హారర్ డ్రామా ఆలస్యంగా మొదలవుతుంది. సువర్ణమాయ రేడియో స్టేషన్ లోకి ఎంటర్ అయ్యే వరకు, సినిమా unnecessary fatతో అది ఇబ్బంది పడతూ, మనలని ఇబ్బంది పెడుతుంది. దాంతో “డ్రామా”లో ఉండాల్సిన షార్ప్ నెస్ తగ్గిపోవటం మొదలైంది.
అలాగే ఇలాంటి సినిమాలలో మెల్లిమెల్లిగా ప్రేక్షకులకు క్లూస్ ఇవ్వాలి కానీ ఒకేసారి కుప్పగా పోయకూడదు. కిష్కిందాపురిలో సస్పెన్స్ మొదట బాగా సెట్ అవుతుంది — రేడియోలోనుంచి భయంకర స్వరం, ఎవరు చనిపోతారు, దెయ్యం అసలు ఎవరు? అన్న మిస్టరీ ఆడియన్స్‌ని intrigue చేస్తుంది. కానీ ఆ దెయ్యం మోటీవ్ ఏమిటో రివీల్ అయ్యాక స్క్రీన్‌ప్లే సూటిగా మారిపోవడం వల్ల సస్పెన్స్ ఆవిరైపోతుంది.
అలా ఐడియాకి తగ్గ ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేక సగటు స్దాయిలోనే మిగిలిపోయింది. అలాగే డివోషనల్ యాంగిల్ స్టోరీలో అసలు కలవలేదు. ఫస్టాఫ్ లో పేసింగ్ సమస్యలు ఉన్నా సౌండ్, కెమెరా వర్క్, కథ సెటప్ తో నడిచిపోయింది. కానీ సెకండాఫ్ లో అవేమీ అంత స్ట్రాంగ్ గా నిలబెట్టలేకపోయాయి. ఇలాంటి సినిమాలకు అక్కర్లేని ఫిల్లర్స్, ప్రెడిక్టబిలిటీ ఉన్నప్పుడు అందాల్సిన థ్రిల్ అందదు. అదే ఈ సినిమాకు జరిగింది.
సినిమా చివర్లో క్లైమాక్స్ ఒక ఫ్రాంచైజ్ బిల్డింగ్ మూవ్ గా కనిపిస్తుంది. కానీ సంతృప్తికరమైన ఎండ్ కాకపోవడం వల్ల ఇది కేవలం ఒక అన్ఇన్‌స్పైర్డ్ క్లిఫ్‌హ్యాంగర్‌గా నిలిచింది.
టెక్నికల్ అసెట్స్:
సినిమా రియల్ స్ట్రెంగ్త్ మ్యూజిక్ & సౌండ్ డిజైన్. చైతన్ భారద్వాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సాదాసీదా సన్నివేశాలకే పుల్స్ ఇచ్చి, హారర్‌ను మరింత లైవ్ చేశాడు. ఎం.ఆర్. రాజకృష్ణన్ సౌండ్ డిజైన్, ఈరీ అట్మాస్ఫియర్‌ని హైలైట్ చేస్తూ, థియేటర్లో మంచి ఎక్సపీరియన్స్ ఇచ్చింది. ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ జానర్ అవసరాలకు తగ్గట్టే ఉన్నాయి కానీ, ప్రత్యేకమైన విజువల్ ఫ్లేవర్ మాత్రం కనిపించలేదు.
స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ — ఇవి పూర్తిగా రొటీన్. కథలో కొత్తదనం ఉన్నా, రైటింగ్ స్థాయిలో ప్రెడిక్టబిలిటీ దెబ్బకొట్టింది.
ఫైనల్ థాట్
ఈ సినిమా యూనిక్ ఐడియా — రేడియో ద్వారా భయాన్ని ప్రసారం చేయడం కొత్తగా ఉంది. అయితే ఆ ప్రసారమే రకరకాల అంతరాయాలతో ఆగుతూ, మొదలవుతూ అన్నట్లు జరిగింది. పూర్తిగా భయపడదామని కూర్చున్న వారికి ఆశించిన అనుభూతిని ఇవ్వలేకపోయారు. అదే చెయ్యగలిగితే కిష్కిందాపురి తెలుగు హారర్ ఫిల్మ్ లలో గేమ్ ఛేంజర్ అయ్యేది.