అభిమానం హద్దులు దాటితే, హీరోగారు హత్యలు చేయాల్సి వస్తుంది
x

అభిమానం హద్దులు దాటితే, హీరోగారు హత్యలు చేయాల్సి వస్తుంది

అభిమానం ముదిరి హీరో పర్సనల్ విషయాల్లో కలగచేసుకుని ప్రాణాలు మీదకు తెచ్చుకోవటం బాధాకరం. దర్శన్ చేసింది పెద్ద తప్పే. కానీ మూల్యం చెల్లించింది మాత్రం రేణుకాస్వామి.

మన సౌత్ లో హీరోలపై అభిమానం ఏ రేంజిలో ఉంటుందో తెలిసిందే. ఇక స్టార్ హీరోల డైహార్ట్ ఫ్యాన్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. హీరోల కోసం ప్రాణ త్యాగాల‌కు సైతం సిద్ధపడే అభిమానులు ఎక్కడ చూసినా కనపడతారు. అభిమాన హీరో రిలీజ్ అవుతుందంటే థియేట‌ర్ ని అందంగా ముస్తాబు చేయ‌డంలో ముందుంటారు. షో ఏదైనా ముందు చూసేది తామే అంటారు. అందుకోసం ఎంత డబ్బు అయినా బెనిఫిట్ షో టిట్కెట్లకు ఖర్చుపెడతారు.

ఇక గ్రామాల్లో సైతం హీరోల పోస్ట‌ర్లు.. క‌టౌట్లు భారీగా సొంత డబ్బుతో పెడుతూంటారు. అలాగే ఎలాంటి పండ‌గొచ్చినా తమ హీరోల పోస్ట‌ర్లు వేయ‌డంలో ముందుంటారు. సంక్రాంతి, న్యూ ఇయ‌ర్ లాంటి పోస్ట‌ర్లు అయితే అంద‌రి హీరోల అభిమానులు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తుంటారు. పోస్ట‌ర్ లో అభిమాన హీరో పెద్ద బొమ్మ‌ని వేసి కిందా.. పైనా.. అటువైపు.. ఇటువైపు.. వాళ్ల పాస్ పోర్ట్ ఫోటోలు వేసుకుని అభిమానం చాటుకుంటారు. ఇక కొందరు చేతిపై టాటూ లాంటివి వేసుకుంటూ వుంటారు. మరి కొందరు తమ అభిమాన హీరో గురించి ఎవరైనా ఏమైనా అంటే గొడవ వేసుకుంటారు. వారి వారి ఆలోచన బట్టి.. అభిమాన హీరోపై వారు చూపే అభిమానం వేర్వేరుగా ఉంటుంది.

తమ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్ చేసే హంగామానే వేరు. ఫ్లెక్సీల ఏర్పాటు నుంచి పాలాభిషేకం వరకు అభిమానులదే కోలాహలం. ఇక అభిమాన నటీనటులకు ఆరోగ్య సమస్య వస్తే.. ఆలయాల్లో అర్చనలు, యాగాలు చేస్తారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వంటివి జరిగినప్పుడు తొక్కిసలాటలో, కరెంట్ షార్ట్ సర్క్యూట్ అనో, యాక్సిడెంట్ అనో చచ్చిపోయేది వీళ్లే. ఇవన్నీ తెలిసినవే అంటారా.. ఇంక అభిమానం ముదిరిపోతే ఎలా ఉంటుంది. అది హీరో చేతిలో మర్డర్ అయ్యేదాకానా అంటే నిజమే అనిపిస్తుంది దర్శన్ ఉదంతం చూస్తుంటే.

రేణుకాస్వామి అనే అతను కర్ణాటక చిత్రదుర్గంలో లక్ష్మీ వెంకటేశ్వర బరంగేసి నివాసి. ఓ మెడికల్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతను కన్నడ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరైన దర్శన్ కు వీరాభిమాని. అతను కేవలం దర్శన్ సినిమాలు చూసి సంతోషించడంతో ఆగిపోలేదు. దర్శన్ కుటుంబం గురించి కూడా తీవ్రంగా ఆలోచించేవాడు. ఈ క్రమంలో అతనికి హీరో భార్య విజయలక్ష్మి ఇబ్బందుల్లో ఉందని తెలిసింది. దర్శన్‌ తన భార్య విజయలక్ష్మి ని పట్టించుకోకుండా నటి పవిత్రగౌడతో సహజీవనం చేస్తున్నాడని అర్థమైంది. రేణుకాస్వామి కోపం కట్టలు తెంచుకుంది. తన అభిమాన హీరో భార్యా పిల్లలతో సంతోషంగా ఉండాలి అని, ఆమెను అడ్డం తొలిగించాలి అని రంగంలోకి దూకాడు.

దర్శన్ ని ఏమీ అనలేక అతని ప్రియురాలు నటి పవిత్ర గౌడ్ ని టార్గెట్ చేసి వాళ్ల కాపురం చక్కదిద్దాలనుకున్నాడు. ఈ క్రమంలో పవిత్రగౌడపై వాట్సాప్, ఇన్‌స్టా తదితర సోషల్‌ మీడియా మాధ్యమాలో పోస్టులు పెట్టడం మొదలెట్టాడు. అంతేకాకుండా ఆమెకు అసభ్యంగా మెసేజ్‌లు పంపడం ప్రారంభించాడు. ఆమె రెస్పాండ్ కాలేదు. దీంతో మెసేజ్ ల డోస్ పెంచాడు. తన మర్మాంగాన్ని ఫోటో తీసి పవిత్రకు పంపించి.. నేను దర్శన్‌ కంటే తక్కువ కాదు, నా వద్దకు కూడా రా అంటూ హేళనగా మెసేజ్‌ పంపాడు.

అప్పుడు ఆమె దర్శన్‌కు రేణుకస్వామి వ్యవహారంపై సీరియస్ గా ఫిర్యాదు చేసింది. దర్శన్... రేణుకాస్వామిపై మండిపడ్డాడు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. పవిత్ర ఇక రేణుకాస్వామి అకౌంట్‌ని బ్లాక్‌ చేయడంతో.. అతడు మరో కొత్త ఖాతాతో మెసేజ్‌లు పంపించేవాడు. అప్పుడు తెరపై హీరోలా కనిపించే దర్శన్ లోని విలన్ బయిటకు వచ్చాడు. గత ఆరేళ్లుగా పవిత్ర గౌడ తో రిలేషన్ షిప్ లో ఉన్న దర్శన్ ఆమెని తన ఫ్యాన్ ఇబ్బంది పెట్టడం తట్టుకోలేకపోయాడు. కోపంతో అతన్ని చంపేయాలని డిసైడ్ అయ్యాడు. చిత్రదుర్గ దర్శన్‌ ఫ్యాన్‌ క్లబ్‌ కన్వీనర్‌ రాఘవేంద్ర (రఘు) ని సీన్ లోకి తెచ్చాడు.

ప్లాన్ ప్రకారం రఘు సాయింతో.. రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు తీసుకువచ్చి కామాక్షిపాళ్యలో షెడ్‌లో బంధించి హింసించి చంపారు. శవాన్ని ఎలా తరలించాలనేది చర్చించారు. అందుకోసం ఒక గ్యాంగ్‌కు చెందిన ముగ్గురిని పిలిపించి రూ.30 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఒకవేళ పోలీసులు కనిపెట్టి విచారణ చేపడితే లొంగిపోయేలా ఒప్పందం చేసుకున్నారు. అనుకున్నట్టుగానే శవం లభించాక పోలీసులు విచారణ చేపట్టారు. వారి ప్రవర్తనలో తేడా ఉండడంతో పోలీసులు వారిని విడివిడిగా విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. దర్శన్‌ అనుచరులతో ముగ్గురు నిందితులూ రాత్రంతా ఫోన్‌లో మాట్లాడిన కాల్‌ రికార్డులు ఆధారంగా మారాయి.

హత్య కేసులో హీరో దర్శన్‌ని రెండవ నిందితునిగా చేర్చారు. ఇక అభిమాని రేణుకాస్వామి హత్య కేసు సీబీఐకి అప్పగించాలని కోరుతూ వందలాదిమంది ర్యాలీలు చేపట్టారు. కలెక్టర్‌ కార్యాలయం ముందు చేరి దర్శన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దర్శన్‌ ఫోటోకు చెప్పుల హారం వేసి ఊరేగించి దగ్ధం చేశారు.

ఇక తన కుమారుడుని ఎంత దారుణంగా చంపారో అదేరీతిలో ఆ హీరోని కూడా చంపాలి అంటూ రేణుకాస్వామి తల్లిదండ్రులు విలపించారు. భర్త మృతదేహాన్ని చూసి అతని భార్య సహన రోదిస్తుంటే ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఆమె ఇప్పుడు మూడో నెల గర్భంతో ఉంది. బిడ్డ పుట్టకముందే తండ్రి చనిపోవడంతో ధారగా విలపిస్తోంది. దర్శన్‌ని కూడా ఇలాగే చంపాలని కుటుంబ సభ్యులు శాపనార్థాలు పెట్టారు.

ఇప్పుడు దర్శన్ ని అరెస్ట్ చేసారు.. నేరం రుజువైతే శిక్ష కూడా పడొచ్చు. కానీ రేణుకాస్వామి వెనక్కి రాడు. ఆ కుటుంబం దిక్కులేనిదవుతుంది. అభిమానం ముదిరి నెక్ట్స్ లెవల్ కు వెళ్లి హీరో పర్సనల్ విషయాల్లో కలగ చేసుకుని అతని ప్రాణాలు మీదకు తెచ్చుకోవటం చాలా బాధాకరం. దర్శన్ చేసింది పెద్ద తప్పే. కానీ అందుకు మూల్యం చెల్లించింది మాత్రం రేణుకాస్వామి అనేది పచ్చి నిజం.

అలాగే ఇక్కడ మరో విషయం కూడా దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని చంపటానికి వినియోగించింది మరో అభిమాని రఘునే. అతను కూడా ఈ మర్డర్ కేసులో ఇరుక్కుపోయాడు. దర్శన్ అభిమానులు అవటమే వీళ్ల తప్పేమో.

Read More
Next Story