Death threats | మరికొంతమంది బాలీవుడ్ ప్రముఖులకు ప్రాణహాని బెదిరింపులు
కమెడియన్ కపిల్ శర్మ, రాజ్‌పాల్ యాదవ్, రేమో డిసోజాకు చంపేస్తామని పాకిస్థాన్ నుంచి ఇ మెయిల్స్ వచ్చినట్లు ముంబై పోలీసులు చెబుతున్నారు.
బాలీవుడ్ (Bollywood) సెలబ్రిటీలకు బెదిరింపు మెయిల్స్ వస్తూనే ఉన్నాయి. గతంలో నటులు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, కంగనా రనౌత్, ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ ఈ తరహా మెయిల్స్ వచ్చాయి. తాజాగా కామెడియన్ కపిల్ శర్మ, నటుడు రాజ్‌పాల్ యాదవ్, కొరియోగ్రాఫర్ రేమో డిసోజాకు వచ్చాయి. అయితే ఇవి ‘బిష్ణు’ పేరిట వచ్చినట్లు సమాచారం.
కపిల్ శర్మ(Kapil Sharma)కు బెదిరింపు..
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే ‘ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో’తో కపిల్ శర్మ మంచి గుర్తింపు లభించింది. బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, రణబీర్ కపూర్ పాల్గొన్న ఈ షోకు ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా కపిల్ శర్మకు బెదిరింపు మెయిల్ రావడతో మరోసారి వార్తలో నిలిచారు. ఈ ఘటనపై ఆయన ఫిర్యాదు చేయడంతో ముంబై(Mumbai) పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
రాజ్‌పాల్ యాదవ్‌కు కూడా..
‘భూల్ భులైయా 3’ చిత్రంలో నటించిన రాజ్‌పాల్ యాదవ్(Rajpal Yadav)కు డిసెంబర్ 14, 2024న ఇలాంటి బెదిరింపు మెయిల్ (E-mail) వచ్చింది. మెయిల్ వచ్చిన సమయం నుంచి 8 గంటలలోపు స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అందులో హెచ్చరించారు. దీంతో తీవ్ర ఆందోళనకు లోనయిన రాజ్‌పాల్ యాదవ్ భార్య రాధా వెంటనే అంబోలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. IPC సెక్షన్ 351(3) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
దర్యాప్తులో ముంబై పోలీసులు..
ఈ బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులను కనిపెట్టడంపై ముంబై పోలీసులు దృష్టి పెట్టారు. ప్రాథమిక విచారణలో ఈ మెయిల్స్ పాకిస్తాన్ (Pakistan) నుంచి వచ్చినట్లు సమాచారం. బాలీవుడ్ నటులకు తరుచుగా బెదిరింపు మెయిల్స్ రావడం, వారితో సన్నిహితంగా ఉండే వారిని హతమారుస్తున్న నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
గతంలో చాలా మంది బాలీవుడ్ ప్రముఖులకు..
గతంలో సల్మాన్ ఖాన్‌కు ప్రాణహాని బెదిరింపులు వచ్చాయి. రాజస్థాన్‌లో తాము దైవంగా భావించే కృష్ణ జింకలను వేటాడి చంపాడన్న కారణంతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్నోయ్ నుంచి సల్మాన్‌కు ఈ బెదిరింపులు వచ్చాయి. పఠాన్ మూవీ విడుదల సమయంలో కూడా నటుడు షారుఖ్ ఖాన్ బెదిరింపులు ఎదుర్కొన్నారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కంగనాకు కూడా అనేక సార్లు బెదిరింపులు వచ్చాయి.