జోజు జార్జ్ 'పని' (సోనీ లివ్) మూవీ OTT రివ్యూ!
నటుడుగా ఎంతో పేరు తెచ్చుకున్న జోజు జార్జ్ డైరక్షన్ వైపు టర్న్ అయ్యి దర్శకత్వం వహించిన తొలి చిత్రం పానీ.
నటుడుగా ఎంతో పేరు తెచ్చుకున్న జోజు జార్జ్ డైరక్షన్ వైపు టర్న్ అయ్యి దర్శకత్వం వహించిన తొలి చిత్రం పానీ. అందుకోసం ఓ కొత్త పాయింట్ ని ఎంచుకున్నాడు. ప్రశాంత జీవితాన్ని ఇబ్బందుల్లో తోయటానికి ఎక్కువ సంఘటనలు అవసరం లేదు. కేవలం ఒకే ఒక సంఘటన సాధారణ జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసి, దాచిన రహస్యాలను బహిర్గతం చేయగలదు. అలాగే మనవారికి మన పట్ల ఉండే , విధేయతలను పరీక్షించి భయంకరమైన అనుభవాలను ఇవ్వగలదు. ఈ విషయాన్ని ఓ కథలో ఇమిడ్చి చేసిన ఈ సినిమా లో అసలు కంటెంట్ ఏమిటి, తెలుగువారికి నచ్చుతుందా ? సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ తర్వాత ఓటిటిలోకి వచ్చిన ఈ చిత్రం మరిన్ని విశేషాలను రివ్యూ లో చూద్దాం.
స్టోరీ లైన్
త్రిసూర్ లో గిరి (జోజు జార్జ్) పెద్ద గ్యాంగస్టర్. అతనంటే చుట్టు ప్రక్కల వాళ్లకు భయం. కొత్తగా వచ్చిన కమిషనర్ రంజిత్ వేలాయుధన్ వాళ్లను గురించి ఆరాతీస్తూ తగిన అవకాసం కోసం ఎదురూచూస్తూంటాడు. భార్య గౌరీ (అభినయ) తో హ్యాపీగా నడుస్తోన్న అతని జీవితం ఓ అనుకోని సంఘటనతో ఛిన్నాభిన్న అవుతుంది.
మెకానిక్ షెడ్ లో పనిచేసే సెబాస్టియన్ (సాగర్ సూర్య) సిజూ (జునైద్) లు ఈజీ 'మనీ' కోసం తాపత్రయపడుతూంటారు. అందులో భాగంగా సురేశ్ అనే వ్యక్తిని మర్డర్ చేసిన ఈ ఇద్దరూ, తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. ఒక రోజున సూపర్ మార్కెట్ లో గౌరిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు వాళ్లిద్దరు. గిరి గురించి అతని బ్యాక్ గ్రౌండ్ గురించి సెబాస్టియన్ కీ గానీ .. సిజూకి గాని తెలియకపోవటంతో ఆ సమస్య వస్తుంది.
ఈ క్రమంలో గిరి చేతిలో వాళ్లిద్దరూ తన్నులు తింటారు. అయితే గిరి అంతకు మించి వారిని సీరియస్ గా తీసుకోడు. కానీ వాళ్లిద్దరూ గిరిని సీరియస్ గా తీసుకుని ప్రతీకారం మొదలెడతారు. అప్పుడు ఏమైంది. వాళ్లిద్దరు కారణంగా గిరి లాంటి గ్యాంగస్టర్ ఎలాంటి సిట్యువేషన్స్ ఎదుర్కొన్నాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా మాత్రమే కాకుండా, మానవ మనస్తత్వాన్ని లోతుగా ప్రతిబింబించేలా డిజైన్ చేసుకున్నారు. గ్యాంగస్టర్ డ్రామాగానే కాకుండా ఇదో భావోద్వేగ ప్రయాణంగా మలిచారు. దర్శకత్వం, రచనతో పాటు నటుడిగానూ జోజు జార్జ్ కనిపించే ఈ చిత్రం స్క్రిప్టు పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మనష్యుల్లో అంతర్గతంగా దాగి ఉన్న నిజాలను వెలికి తీయడానికి కొన్ని సంఘటనలు ఎలా తోర్పడతాయో చెప్పుకొచ్చారు.
అయితే అదే సమయంలో ఆ నిజాలు బహిర్గతం చేయడానికి అయ్యే వ్యయ ప్రయాసలను వెల్లడిస్తుంది. ఇది కుటుంబం, విధేయత, న్యాయం, ప్రతీకారానికి సంబంధించినది, ఇక్కడ ప్రతి నిర్ణయం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందనే విషయం నిక్కచ్చిగా చెప్తుంది. 400 మంది అనుచరులతో ఏర్పాటు చేసుకున్న ఒక గ్యాంగ్ ను కొత్తగా రౌడీయిజం మొదలెట్టిన ఇద్దరు ఆకతాయిలు ఎదిరించి పోరాడటమనేది కొత్తగా అనిపిస్తుంది. అదే ఈ సినిమాలో హైలెట్ కూడా.
టెక్నికల్ గా
ఈ సినిమాలో వేణు - జింటో జార్జ్ ఫొటోగ్రఫీ హైలెట్ గా సాగుతుంది. నైట్ ఎఫెక్ట్ సీన్స్ .. ఛేజింగ్ సీన్స్ ను షూట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. సామ్ సీఎస్ .. సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అనే చెప్పాలి. మను ఆంటోని ఎడిటింగ్ కూడా పెర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. రియాజ్ ఆడమ్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల్లో ... సాగర్ సూర్య, జునైజ్ వి.పి, బాబీ కురియన్, అభినయ, (Abhinaya) అభయ హిరణ్మయి, సీమ, చాందిని శ్రీధరన్, ప్రశాంత్ అలెగ్జాండర్, సుజిత్ శంకర్, రినోష్ జార్జ్ కీలక పాత్రలు పోషించారు.
చూడచ్చా
యాక్షన్ థ్రిల్లర్ జోనర్ కథలను ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
ఎక్కడ చూడచ్చు
సోనీ లివ్ లో తెలుగులో ఉంది