ఓటీటీ రేట్ ఫిక్స్ కాకుండానే ‘సంక్రాంతికి వస్తున్నాం (రా)’?
x

ఓటీటీ రేట్ ఫిక్స్ కాకుండానే ‘సంక్రాంతికి వస్తున్నాం (రా)’?

భారీ డీల్ ప్రక్కన పెట్టి మరీ దిల్ రాజు రిస్క్ చేస్తున్నాడా ?


ఇప్పుడు ఉన్న పరిస్దితిలలో తెలుగు సినిమాకు OTT డీల్ అనేది అతి ముఖ్యమైన వనరు గా మారింది. ఎంతలా అంటే సినిమా పూజకు ముందే ఓటీటీ ఎంత పలుకుతుందనే లెక్కలు వేస్తున్నారు. ఓటీటీలో ఎంత వస్తుందనేదాన్ని బట్టే హీరో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.

నిర్మాతలు పెంచి బడ్జెట్ లు పెడుతున్నారు. అయితే చిన్న సినిమాకు ఓటీటీ పెద్ద ఎండమావే. కానీ పెద్ద సినిమాకు , పెద్ద ప్రొడ్యూసర్స్ కు ఇది బంగారు బాతు. ఇలాంటి చిత్రమైన పరిస్థితుల్లో కూడా ఓటీటీ డీల్స్ లేకుండా సినిమా రిలీజ్ కు వెళ్లటం అనేది సాహసమనే చెప్పాలి. కానీ దిల్ రాజుకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది.

ఆ మధ్యన రవితేజ చిత్రం ఈగల్ కి పీపుల్స్ మీడియా వారు ఓటీటీ డీల్ లేకుండానే థియేటర్ రిలీజ్ కు వెళ్లారు. అయితే ఆ తర్వాత సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాకపోవటంతో నామ మాత్రపు రేటుతో ఓటీటీ డీల్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు వెంకటేష్ తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ కు కూడా ఓటీటీ డీల్ ఎగ్రిమెంట్ లేకుండానే ముందుకు వెళ్తున్నారని సమాచారం. ఓటీటీ కోసం ఎదురుచూస్తే సంక్రాంతి రిలీజ్ డేట్ మిస్ అయ్యిపోతుంది. టైటిల్ జస్టిఫికేషన్ అవ్వదని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారట.
వెంకటేశ్‌ హీరోగా కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి డైరక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకులు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది (Sankranthiki Vasthunnam). అయితే ఈ సినిమా ఓటీటీ డీల్ ఇంకా కాలేదని ట్రేడ్ వర్గాల సమాచారం.
వెంకటేష్ , అనిల్ రావిపూడి కాంబోకి ఓటీటీ డీల్ సెట్ కాకపోవటం ఏమిటనేది ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ రిలీజ్ డేట్ ని బట్టే ఓటీటీ సంస్దలు రేటుని ఫిక్స్ చేస్తున్నాయి. సంక్రాంతికి మరో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ ఉన్నప్పుడు మూడో సినిమాని వాళ్లు ఒప్పుకోవటం లేదు.
తమ స్లాట్స్ ఖాళీ లేదని చెప్తున్నాయి. అందుకు కారణం...తమ ఓటీటీలలో ఈ పెద్ద సినిమాలు ఒకే సారి రిలీజ్ అయ్యి...పోటీ పడి వ్యూస్ విషయంలో దెబ్బ కొడతాయి. అయినా సరే అంటే ఏదో ఒక రేటుకు ఓటీటీ సంస్దలు సినిమాలు తీసుకుంటాయి. సాధారణంగా చాలా తక్కువ రేటుకే అడుగుతాయి.
కానీ ఇక్కడ రిస్క్ ఒకటి ఉంది. సినిమా హిట్ అయితే ఏ సమస్యా లేదు. కానీ సినిమా యావరేజ్ కానీ తేడా గానీ అయితే ఆ తర్వాత ఓటీటీ రేటు అసలు పలకదు. ఇవన్నీ దిల్ రాజు కు తెలియనవి కాదు. కానీ రిస్క్ చేస్తున్నారంటే తన సినిమాపై ఆయన కు ఉన్న నమ్మకం అలాంటిదని చెప్పాలి.
దానికి తోడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని టైటిల్ పెట్టి సంక్రాంతి వెళ్లాక థియేటర్స్ లో దిగితే బాగోదు. అలాగే వెంకటేష్ సినిమాలకు వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే సినిమా ఇది. అలాంటప్పుడు సంక్రాంతి సీజన్ కరెక్ట్.
చిత్రం గురించి వెంకటేశ్‌ (Venkatesh) మాట్లాడుతూ ‘‘సంక్రాంతికి వస్తున్నాం అనే ఈ చిత్రాన్ని మొదలుపెట్టాం. అనుకున్నట్టుగానే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. అభిమానులకి, కుటుంబ ప్రేక్షకులకు అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. అనిల్‌తో పనిచేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది.
నా కెరీర్‌లోనే అత్యుత్తమ కుటుంబ వినోదాత్మక చిత్రమిది. పండగకి ఒక అద్భుతమైన సినిమాని ప్రేక్షకులు చూస్తారు. ఈ సారి రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్‌’ కూడా విడుదలవుతున్నాయి. అన్ని సినిమాలు ఆడాలి. అప్పుడే పరిశ్రమ బాగుంటుంది’’ అన్నారు.
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘మేం ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సినిమాలతో అద్భుతాల్ని సృష్టించబోతున్నాం. బాలకృష్ణ ‘డాకు మహారాజ్‌’ సినిమాని కూడా మేమే విడుదల చేస్తున్నాం. ఈ మూడు సినిమాలు పెద్ద విజయాల్ని సాధించనున్నాయి’’ అన్నారు.
దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘‘సంక్రాంతికీ, నాకూ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నేను తీసిన ‘ఎఫ్‌2’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు సంక్రాంతికే వచ్చి పెద్ద విజయాల్ని అందుకున్నాయి. నాకు ఇష్టమైన హీరో, నాకు ఇష్టమైన నిర్మాతలతో కలిసి అందరినీ నవ్వించడం కోసం చేసిన సినిమా ఇది.
క్రైమ్ నేపథ్యంలో సాగే కథతో చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాం. కచ్చితంగా ప్రేక్షకులు థ్రిల్‌కి గురవుతారు. క్లైమాక్స్‌ వన్‌ మేన్‌ షోలా అందరూ ఆస్వాదించేలా ఉంటుంది. ఈసారి సంక్రాంతికి అన్ని తరహా కథలూ వస్తున్నాయి. ప్రేక్షకులకు అసలు సిసలైన సంబరం ఈసారి సంక్రాంతి పండగ’’ అన్నారు .
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు సంక్రాంతికి వస్తున్నాం అనే ఈ సినిమాకు 55 కోట్ల వరకు ఖర్చయింది. థియేటర్ మీద 30 కోట్ల వరకు రికవరీ వస్తుందని లెక్కలు వేస్తున్నారు. ఆడియో రైట్స్ రెండున్నర కోట్ల మేరకు వచ్చాయి. అంటే మరో పాతిక కోట్లు రావాల్సి ఉంది. హిట్ అయ్యిందా దిల్ రాజు నక్కను తొక్కినట్లే..ఓటీటీ రైట్స్ ముప్పై కోట్లు పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


Read More
Next Story