పైరసీ తో 22,400 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు, ఇండస్ట్రీ కన్నీరు
పైరసీ రక్కసి రోజు రోజుకీ విజృంభిస్తుండటంతో చిత్ర పరిశ్రమ అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. ఒకప్పుడు చిత్ర పరిశ్రమకే పరిమితమైన పైరసీ ప్రస్తుతం అంటువ్యాధిలా ఓటీటీలకూ పాకింది.
పైరసీ రక్కసి రోజు రోజుకీ విజృంభిస్తుండటంతో చిత్ర పరిశ్రమ అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. ఒకప్పుడు చిత్ర పరిశ్రమకే పరిమితమైన పైరసీ ప్రస్తుతం అంటువ్యాధిలా ఓటీటీలకూ పాకింది. దీని కారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏడాదికి రూ.22 వేల కోట్లు నష్టం వాటిల్లుతోంది.చాలా ఏళ్ళుగా సినిమా రంగాన్నిమింగేస్తున్న పైరసీదార్లు, ఇప్పుడు ఓటీటీ సంస్థల్ని ఆదాయానికి కూడా దెబ్బకొట్టడం మొదలెట్టారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, జీ5, ఆహా మొదలైన అన్ని ఓటీటీల్లో విడుదలయ్యే వివిధ భాషల సినిమాల్ని పైరసీ సైట్లలో పెట్టేస్తున్నారు. ఓటీటీల్లో వచ్చే సినిమాలు పైరసీ సైట్లలో ఉచితంగా లభిస్తూంటే ఇక ఓటీటీల్లో చందాదారులుగా ఎవరు చేరతారనేది పెద్ద ప్రశ్నగా మారింది. కేవలం సినిమాలే కాదు, ఓటీటీ వెబ్ సిరీస్ ని కూడా పైరసీ సైట్లలో పెట్టేస్తున్నారు. ఇది థియేటర్ రెవిన్యూకు, ఓటిటి రెవిన్యూకు పెద్ద దెబ్బగా మారింది.
సినిమా అంటేనే కోట్లాది రూపాయల పెట్టుబడి.. వందలు, వేల మంది ఆర్టిస్టులు,టెక్నీషియన్ల రాత్రిబవళ్లు కష్టం ఫలితం. అలాగే ఎంతోమంది అభిమానుల ఆశలకు ప్రతిరూపం అని చెప్పాలి. దర్శకుడు.. నిర్మాతకు జీవన్మరణ పోరాటం. అలాంటి సినిమాలు.. విడుదలైన మొదటి రోజుకే పైరసీ అయ్యి మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. పెద్ద సినిమాకు ఎంత పెద్ద దెబ్బో, చిన్న సినిమాకు అంతకు మించి ఉంటోంది. ఓటిటిలో రిలీజ్ చేసి వ్యూస్ కోసం చూస్తున్న సమయంలో పైరసీ ద్వారా అవి మాయమైపోతున్నాయి. పెద్ద సినిమాలకు థియేటర్ రెవిన్యూ,ఓటిటి ద్వారా రికవరీ ఉంటోంది కానీ ..ఓ మాదిరి సినిమాలైతే మరీ దారుణంగా వ్యూస్ పరంగా దెబ్బ పడుతోంది. సినిమా చూసిన వాళ్లు కనపడతున్నారు. ఆ సినిమాకు ఓటిటిలోనూ, థియేటర్స్ లోనూ జనం కనపడటం లేదు.
పైరసీ ఏ స్దాయిలో ఇండియన్ ఎంటర్టైన్మెంట్ పరిశ్రము వేధిస్తోందంటే...సినిమా థియేటర్ల నుంచి పైరసీ కంటెంట్ రూ.13,700 కోట్ల విలువను కలిగి ఉందని తేలింది, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రూ.8,700 కోట్లుగా ఉంది. రూ.4,300 కోట్ల వరకు జీఎస్‌టీ నష్టాలు ఉన్నాయని అంచనా. ఈవై, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) సంయుక్తంగా రూపొందించిన ‘ది రాబ్ రిపోర్ట్’లో ఈ విషయాలు బయిటకు వచ్చి ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. తాము ఎన్ని కోట్లు నష్టపోతున్నామో తెలిసి ఆశ్చర్యం,ఆవేదన కలుగుతోంది.
పైరసీ వల్ల 2023లో ఎంటర్నైమెంట్ ఇండస్ట్రీ రూ.22,400 కోట్ల భారీ నష్టాన్ని మూటగట్టుకుందని ఆ రిపోర్ట్ పేర్కొంది. మన దేశంలోని 51% మంది మీడియా వినియోగదార్లు పైరేటెడ్ కంటెంట్‌ను యాక్సెస్ చేస్తున్నారు. ఇందులో ఓటిటి స్ట్రీమింగ్ సేవలు 63% వాటా కలిగి ఉండటం విశేషం. అంటే 2023లో పైరసీ పరిమాణం రూ.22,400 కోట్లుగా తేలింది. ఇది భారత మీడియా, ఎంటర్నైన్మెంట్ పరిశ్రమలోని వివిధ విభాగాల వారీగా వచ్చే ఆదాయంలో నాలుగో స్థానంలో నిలిచింది. పైరసీని సమర్థంగా తగ్గించడానికి కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించింది.
ఇక పైరసీ ముఖ్యంగా 19-34 ఏళ్ల యువ ప్రేక్షకుల్లో ఎక్కువగా ఉందని తేలింది. వీరిలో మహిళలు ఓటీటీ షోలను ఇష్టపడుతుండగా, పురుషులు క్లాసిక్ చిత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు.పైరేటెడ్ కంటెంట్‌ను యాక్సెస్ చేసే వారిలో 64% మంది ప్రకటనల వచ్చినా , ఉచితంగా కంటెంట్ ఆఫర్ చేస్తే అఫీషియల్గా ఓటిటి ఛానెళ్లకు మారడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల కంటెంట్ ప్రొవైడర్లు తమ ధరల నమూనాలు, వ్యూహాలపై పునరాలోచించాల్సి ఉందని ఆ నివేదిక తేల్చింది. అయితే ఇక్కడ మరో విషయం 70% మంది పైరేటెడ్ కంటెంట్ వినియోగదార్లు తాము ఏ ఓటీటీ చందా తీసుకోవడానికి ఆసక్తిగా లేమని తెలిపి షాక్ ఇచ్చారు.
సినిమా వాళ్లు ఈ పైరసీపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక తల్లి బిడ్డను ప్రసవించడానికి ఎన్ని కష్టాలు పడుతుందో.. పుడమి తల్లి కడుపు చీల్చుకుని ఒక మొక్క పైకి వచ్చి, పెరిగి పెద్దదై ఫలాలు ఎలా ఇస్తుందో.. అలా, అన్ని కష్టాలు పడి మరీ ఒక సినిమాను విడుదల చేస్తే అది పైరసీ పాలైపోతోందని అంటున్నారు. ఆ సినిమా ఎలా ఆడుతుందోనని అంతా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తారు. ప్రేక్షకుల ఆదరణ బాగుందంటే అందరికీ ఆనందమే. కానీ ఆ ఆనందాన్ని కాస్తా ఈ పైరసీ సైట్లు ఆవిరి చేసేస్తున్నాయి. కోట్ల రూపాయల కష్టాన్ని పైరసీ సైట్ లో పెట్టేసి అంత కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసేస్తున్నారు.
దీని గురించి గతంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సహా అనేకమంది స్టార్ హీరోలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఇప్పటికీ పైరసీ భూతాన్ని అదుపులోకి తీసురాలేకపోయారు. ఎన్ని సైట్ల్ బ్లాక్ చేసినా ఎక్కడికక్కడ ఏదో ఒక రూపంలో ఇది బయట పడుతూనే ఉంది. అమెరికాలోనో.. అలాస్కాలోనో .. ఆఫ్రికా నుంచో ఈ పైరసీ సైట్లు ఆపరేట్ అవుతూనే ఉన్నాయి. తమిళంలో అయితే అచ్చంగా పైరసీ, ఇతర వ్యవహారాల మీద 'తమిళరాకర్స్' అనే సీరిస్ కూడా విడుదలైంది. యాంటీ పైరసీ స్క్వాడ్ పేరుతో కొన్ని దళాలు వచ్చినా.. సైబర్ క్రైం పోలీసులు కూడా దీనిపై ఉక్కుపాదం మోపినా పైరసీకి చెక్ చెప్పలేకపోతున్నారు.
గతంలో కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘పైరసీ కారణంగా ప్రతి ఏడాది వినోద రంగానికి రూ.20 వేల కోట్లు నష్టం వాటిల్లుతోంది. ఓ సినిమా నిర్మాణానికి పడ్డ కష్టం పైరసీ వల్ల వృథాగా పోతోంది. పైరసీని అడ్డుకోవడానికి కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖలో నోడల్ ఆఫీసర్స్‌ను నియమించడం జరిగింది’’ అన్నారు. ఆ మధ్యన సినిమాటోగ్రఫీ చట్టం–1952లో సవరణలు చేసి, కొత్త బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించిన విషయం తెలిసిందే. ఇందులో పైరసీని అరకట్టడం అనేది ఓ ప్రధానాంశం.
1952 సినిమాటోగ్రాఫ్ చట్టానికి సవరణగా ఈ బిల్లును తీసుకొచ్చారు. సినిమాలను పైరసీ చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ సవరణ బిల్లు రూపొందించారు. దీని ప్రకారం.. సినిమాల పైరసీ కాపీలను రూపొందించే వారికి మూడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. అంతేకాకుండా.. సినిమా వ్యయంలో ఐదు శాతాన్ని నిందితులకు జరిమానాగా విధించనున్నారు.
ఈ విషయమై అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ– ‘‘ ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కార్యాలయంలో,ప్రాంతీయ కార్యాలయాల్లో పైరసీ, డిజిటల్ పైరసీల ఫిర్యాదులను స్వీకరించేందుకు అధికారులను నియమించాం. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్న పైరేటెడ్ కంటెంట్‌పై నోడల్ ఆఫీసర్స్‌కు ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులు 48 గంటల్లో ఆ కంటెంట్‌ను ఆ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించేలా చర్యలు చేపడతారు’’ అని చెప్పుకొచ్చారు.
కొవిడ్ మహమ్మారి తర్వాత ఓటీటీల పైరసీ 62శాతం పెరిగిందనేది నిజం. ఇది సినిమా కళాకారుల సృజనాత్మకను దెబ్బతీయడంతో పాటు చిత్ర పరిశ్రమ ఆర్థిక స్థితిగతులు బలహీనం చేస్తోంది. సినిమాటోగ్రఫీకి సంబంధించి పాస్ చేసిన బిల్లులో థియేటర్‌లలో కెమెరా రికార్డింగ్ నిషేధంపై మాత్రమే దృష్టి సారించారు. ఆ బిల్లు ఇతర పైరసీలతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొలేదనేది అందరి వాదన. ఈ సమస్యను సమర్థంగా పరిష్కరించేందుకు కేంద్రం ప్రత్యేక చట్టాలు ప్రవేశపెట్టాలని సినిమా వాళ్లు కోరుతున్నారు.