ఓ ఉగ్రవాది వేటలో గెలిచిన దేశం... బిన్ లాడెన్ ను ఎలా చంపారంటే..
x

ఓ ఉగ్రవాది వేటలో గెలిచిన దేశం... బిన్ లాడెన్ ను ఎలా చంపారంటే..

OTT లో హోరెత్తుతున్న The American Manhunt


ఒకే లక్ష్యం – రెండు రహస్య యుద్ధాలు.
INDIA- ఆపరేషన్ సింధూర్..
America- ఆపరేషన్ నెప్టూన్ స్పియర్..
రెండింటి లక్ష్యం ఒకటే. ఉగ్రవాదం నిర్మూలన. ఉగ్రవాదుల అంతం.

యాదృచ్ఛికమే కావొచ్చుగాని ఇండియా, పాకిస్తాన్ దేశాలు ఆపరేషన్ సింధూర్ కి మే 12న విరామం ప్రకటించిన ఆ తర్వాత 48 గంటలకు 2025మే 14న Netflixలో “American Manhunt: The Search for Bin Laden” విడుదలైంది.
ఒక దేశం తన శత్రు నిర్మూలనకు సాగించిన వేట ముగిసిన వెంటనే, మరో దేశం అదే తరహా ఉగ్రవాద వ్యూహానికి సంబంధించిన డాక్యుమెంటరీని ప్రపంచానికి ఆవిష్కరించింది.
మూడు భాగాల డాక్యుమెంటరీ ఇది. ఒక్కో భాగం కాస్త అటూ ఇటుగా ఒక్కో గంట. ఈ డాక్యుమెంటరీని దర్శకులు మోర్ లూషీ, డానియేల్ సివాన్‌ ఓ రేంజ్ కి తీసుకువెళ్లారు. ఓ డాక్యుమెంటరీని సూపర్ థ్రిల్లర్‌గా చూపించడమూ సాధ్యమే! అని నిరూపించారు.
ఊహకు అందని క్లాస్తో, హాలీవుడ్ స్పీడ్, పాశ్చాత్య మానవతా బలహీనతలతో కలగలిపి ఓ సాంకేతిక భావోద్వేగ యాత్రను మన ముందుంచారు. అధికారిక లెక్కలు, ఆనాటి అధికారుల మాటలు, వ్యూహాలతో సాధికారికంగా సాగుతుంది. మరీ చివరి భాగమైతే ఇది డాక్యుమెంటరీనా?.. త్రిల్లర్ సినిమానా అనిపిస్తుంది?
American Manhunt” కేవలం ఓ గూఢచారి కథో, ఉగ్రవాది కథో కాదు. ఓ దేశం తన భవిష్యత్తు, భద్రత కోసం సాగించిన యాత్ర అది. బిన్ లాడెన్ ఎదుగుదలలో అమెరికా స్వయంకృతం మొదలు చివరకు నరహంతకుడు లాడెన్ ను మట్టుబెట్టేవరకు సాగిన పదేళ్ల ప్రయాణం ఈ డాక్యుమెంటరీ. అమెరికా పాలకుల వైఫల్యాలు, విజయాలు, పాత్రికేయుల అనుభవాలు, ప్రముఖ ఛానళ్ల ఇంటర్వ్యూలు అన్నీ ఇందులో ఉన్నాయి. ముగ్గురు అధ్యక్షులు మారినా ఓ ఉగ్రవాదిని పట్టుకోలేకపోయామే అనే క్షోభ కూడా ఇందులో ఉంది.
Bin Laden కోసం సాగించిన దశాబ్దకాల వేటను కేవలం 175 నిమిషాల్లో చూపించడమంటే మాటలు కాదు. క్షణం, క్షణం ఉత్కంఠతో సాగే ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ -1గా ఉందంటే ఆశ్యర్యం కాదు.
Bin Laden ఎలా చనిపోయాడన్నది అసలు ప్రశ్నే కాదు. అతని భావజాలాన్ని నిర్మూలించారా లేదా అన్నదే అసలైన ప్రశ్నగా మనల్ని వెంటాడుతుంది. ఒక ఉగ్రవాదిని చంపడం కాకుండా, ఉగ్రవాదానికి మూలాలైన అసమానతల్ని నిర్మూలించడమే శాశ్వత పరిష్కారంగా చూపుతుంది. ఒక వ్యక్తిని చంపడం తేలిక. కానీ అతను ప్రాతినిధ్యం వహించిన భావజాలాన్ని సమూలంగా నాశనం చేయడం అతిపెద్ద సవాలే అనే లోతైన ప్రశ్న మిగులుతుంది.
ఒక్క ఉగ్రవాది వేట కోసం అమెరికా ప్రభుత్వం ఖర్చు చేసిన $2.3 ట్రిలియన్ డాలర్లు (సమారు 200 లక్షల కోట్లు). ఈ డాక్యుమెంటరీకి చేసిన వ్యయం దాదాపు 40,42 కోట్ల రూపాయలు.
డాక్యుమెంటరీ మొదటి భాగం- రైజ్ ఆఫ్ ది ఎనిమీ- లో బిన్ లాడెన్ ఎదుగుదల, 2001 సెప్టెంబర్ 11న జరిగిన దాడి, లాడెన్ ను పట్టుకునేందుకు సీఐఏ ప్రయత్నం వంటివి మనకు తెలుస్తాయి.
ఇక రెండో భాగం- జీరో ఫ్యాక్టర్-లో లాడెన్ ఆచూకీని కనిపెట్టేందుకు చేసిన కృషి, మూడో భాగంలో-వాలీ ఆఫ్ డెత్-లో ఆపరేషన్ నెప్యూటన్ స్పీయర్ విశ్వరూపం కనిపిస్తుంది.
ఆల్ ఖైదా నేత, 9/11 వ్యూహకర్త పలానా చోట ఉన్నాడని తెలిసింది మొదలు మట్టుబెట్టే వరకు ఏయే దశల్లో ఏమేమి జరిగిందో, ప్రత్యేకించి బిన్ లాడెన్ ను పట్టుకునేందుకు అమెరికన్ సైన్యాలు బయల్దేరిన 2011 మే 1న ఆపరేషన్ ను ఎలా నిర్వహించారో, ఆసమయంలో ఆనాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా మొదలు మిగతా అధికారులందరూ ఎంత టెన్షన్ పడ్డారో, ఆ తర్వాత ఏమి జరిగిందో చూస్తుంటే మనకు తెలియకుండానే మనం అందులో ఇన్వాల్వ్ అవుతాం.
చివరి సీన్లు ఒక యుద్ధ విజయ గర్వాన్ని కలిగిస్తాయి. కానీ ఇది కథ ప్రారంభం మాత్రమే. మళ్లీ ఈ కుదురు ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలవుతుందో చెప్పలేం అనిపిస్తుంది.
బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్ ఖైదా...
అల్ ఖైదా చరిత్ర అంతా రక్తసిక్తమే. 9/11లో 2,977మంది అమెరికన్ల ప్రాణాలను బలి తీసుకుంది. ఇండోనేషియా, కెన్యా, యెమెన్, స్పెయిన్, బ్రిటన్, ఇండియా లాంటి అనేక దేశాల్లో చేసిన దాడుల్లో కనీసం 10,000 మంది చనిపోయి ఉంటారని అంచనా. మరో 25వేల మందికి పైగా గాయపడ్డారు. అల్ ఖైదా దెబ్బకు ఆఫ్ఘనిస్తాన్ ఎంతగా నష్టపోయిందో మాటల్లో వర్ణించలేం. అటువంటి లాడెన్ ను పట్టుకుని అల్ ఖైదాను లేకుండా చేయడానికి అమెరికా పెట్టిన యుద్ధ వ్యయం- $2.3 నుంచి 3 ట్రిలియన్ డాలర్లు. (ఇండియన్ కరెన్సీలో సుమారుగా ₹190-200 లక్షల కోట్లు!). ఇది కాకుండా జరిగిన ఆర్ధిక నష్టం మరో 200 నుంచి 300 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఇంత నష్టానికి కారణమైన ఒకణైతే మట్టుబెట్టగలిగారు గానీ అతను ఊపిరిపోసిన భావజాలం ఇంకా బతికే ఉంది. డాక్యుమెంటరీ ఈ సంక్షోభాన్ని స్పష్టంగా హైలైట్ చేస్తుంది.
ఒక్క ఉగ్రవాది మీద పెట్టిన ఖర్చు మరేదైనా దేశంలో పెడితే...
అమెరికా ఈ ఉగ్రవాది మీద యుద్ధానికి పెట్టిన ఖర్చును మరేదైనా ఇండియాలాంటి వర్ధమాన దేశం మీద పెడితే ఏమేమీ చేయవచ్చు? భారతదేశ బడ్జెట్ 2025-2026 ఆర్ధిక సంవత్సరానికి రూ. 50.65 లక్షల కోట్లు. ఈ లెక్కన నాలుగేళ్లకు సరిపడా బడ్టెట్ ఓ ఉగ్రవాద సంస్థను నిర్మూలించేందుకు పెట్టాల్సి వచ్చింది.
₹190-200 లక్షల కోట్లతో ఏమేమి చేయవచ్చు?
భారత్ లోని 600లకు పైగా జిల్లాలలో AIIMS స్థాయి ఆసుపత్రి పెట్టొచ్చు. ప్రతి మండల కేంద్రానికి Navodaya విద్యాలయాలు, ప్రతి గ్రామానికి నీటి వనరులు, ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, పునరుత్పాదక విద్యుత్ కేంద్రాలు, ప్రతి ఊరికి రోడ్డు వేయవచ్చు. ఇంకా అనేకం చేయవచ్చు. నిజానికి ఓ అభివృద్ధి చెందుతున్న దేశానికి ఇంతకన్నా కావాల్సిందేముంటుందీ?
ఈ వాస్తవం మనకు చెప్పేదేమంటే ఒక్కో బాంబుతో ఒక్కో అధునాతన పాఠశాల నిర్మించి భవిష్యత్తును బలోపేతం చేసుకోవచ్చు. కానీ అల్ ఖైదా ఆ పని చేయలేదు. దానికి బదులుగా తుపాకీతో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనుకుని తానే నామరూపాలు లేకుండా పోయింది.

అల్ ఖైదా భారతదేశాన్నీ వదలలేదు. బిన్ లాడెన్ ఉగ్రవాద బాధిత దేశాల్లో ఇండియా ఒకటి. 26/11 ముంబై దాడి, పుల్వామా, ఊరి లాంటి దాడులు మానవత్వంపై జరిగిన దాడులే.
అవి పునరావృతం కాకుండా ఉండాలంటే ఆర్థిక, సామాజిక సమానత్వాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలకు బిన్ లాడెన్ డాక్యుమెంటరీ ఓ చక్కటి గుణపాఠం.
నిజానికి ఈ తరహా డాక్యుమెంటరీ 2023లోనే వచ్చింది. 2011 మే 1న బిన్ లాడెన్ హత్య జరిగితే 12 తర్వాత 2023లో విడుదలైంది. అయినప్పటికీ Netflix కొత్తపాత తరాల మేళవింపుతో అదే కథను కొత్తగా చెప్పింది. 9/11ని ప్రత్యక్షంగా చూసిన పాత తరం, దాని గురించి విన్న కొత్త తరం ఇద్దరికీ ఈ కథ వినూత్న భావనను కలిగిస్తుంది. అయితే ఎక్కడా యుద్ధాన్ని కీర్తించే పని చేయదు.
అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూనే వ్యక్తుల త్యాగాలను మానవీయ కోణంలో చూపుతుంది. గతంలో వచ్చిన విమర్శల స్థానంలో తిరిగి నమ్మకాన్ని నిలపాలన్న ప్రయత్నం చేస్తుంది.
ఆర్కైవ్స్ ఆధారిత, ఇంటర్వ్యూలతో నడుస్తుంది. కొంతమేర enact చేసిన డాక్యుమెంటరీ సిరీస్‌ని చూపుతుంది. వీటికోసమే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. అత్యుత్తమ సౌండ్ డిజైన్, మోషన్ గ్రాఫిక్స్, enact చేసిన దృశ్యాల నిర్మాణం అద్భుతంగా ఉంటుంది.
ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన గ్రెగ్ బార్కర్ కి Netflix, HBOతో దీర్ఘకాల సంబంధాలున్నాయి. ఎక్కువ ఖర్చు పెట్టినా మంచి నాణ్యతతో డాక్యుమెంటరీ బయటకువస్తుందన్న నమ్మకం ఎక్కువ.
డాక్యుమెంటరీ తీయడం కూడా కత్తిమీద సామే. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యే వాళ్లు ఎప్పుడేమి చేస్తారో తెలియదు. అలా, ఇంటర్వ్యూలలో పాల్గొన్నవారు ఓ సందర్భంలో దర్శక నిర్మాతలపై తిరిగబడిన ఘటనలూ లేకపోలేదు. కోర్టులు, కేసులు సరేసరి.
బిన్ లాడెన్ ను సొంతం చేసుకున్న ఓ వర్గం నుంచి వ్యతిరేకత వస్తే ఏమి చేయాలనే దానిపై నిర్మాతలు తర్జన భర్జన పడ్డారు.
బిన్ లాడెన్ ను పట్టుకున్నది పాకిస్తాన్ లోని అబోటాబాద్ లో. పాకిస్తాన్ సైన్యానికి తెలియకుండా అమెరికా హెలికాఫ్టర్లు ఆ దేశంలోకి వెళ్లి మట్టుబెడతాయి. దీనిపై ఏవైనా అభ్యంతరాలు వస్తే ఏమి చేయాలనే దానిపైనా మల్లగుల్లాలు పడ్డారు.
వ్యాఖ్యానంలో ఎక్కడా పూనకాలకు, సంచలనాలకు తావు లేకుండా సజావుగా నడిపిస్తారు.
ఇంటర్వ్యూలు చేసిన వారిలో ఎక్కువగా అమెరికా ప్రభుత్వ వర్గాలవారే (ex-CIA, SEAL, జర్నలిస్టులు). పాకిస్తానీలు, అఫ్గాన్ పౌరులు, బిన్ లాడెన్ కుటుంబ సభ్యులు లేరు.
ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల్లో Netflix విడుదల చేసింది. వాస్తవానికి ఈ డాక్యుమెంటరీని మే 10న రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ ఆరోజు బిన్ లాడెన్ పుట్టిన రోజు కావడంతో మే 14కి వాయిదా వేశారు.
“American Manhunt”ను ఒక థ్రిల్లర్‌లా కాకుండా ఈ దురదృష్టకర సంఘటనను ఒక దేశం ఎలా జ్ఞాపకం చేసుకుంటుందీ, ఎలా సమర్థించుకుంటుందీ, ఎలా కోలుకుంటుందీ అనే దానికి దర్పణంగా చూడండని నిర్మాతలు కోరుకుంటున్నారు.
Read More
Next Story