చిరు స్టెప్పులకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్..
మెగాస్టార్ వేసిన స్టెప్పులకు గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది.
మెగాస్టార్ వేసిన స్టెప్పులకు గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. భారత ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు అందుకున్న చిరుకు ఇప్పుడు గిన్నీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత దేశంలో ఇటువంటి ఘనత సాధించిన నటుడిగా కూడా చిరు రికార్డ్ చేశారు. సినిమా పరిశ్రమకు ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి.. ఇప్పుడు ఎందరో హీరోలకు తన పేరే బ్యాక్‌గ్రౌండ్ మార్చిన నటుడు చిరంజీవి. సినీ చరిత్రల సుదీర్ఘకాలం పాటు తన ముద్ర వేశారు. తన నటన, డైలాగ్ డెలివరీతో పాటు డ్యాన్స్ మూవ్స్‌తో కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు చలనచిత్ర సీమలో మెగాస్టార్ అన్న బిరుదును తన ఒక్కడి పేరునే ఉంచుకున్న ఘనత కూడా ఈయనదే. ఇప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో కూడా ఆయన చోటు దక్కించుకున్నారు. ఆయన సినిమాల్లో చూపిన నటనకు ఈ రికార్డ్ రాలేదు.. ఆ సినిమాల్లో ఆయన వేసిన స్టెప్పులకు ఈ ఘనత సొంతమైంది.
24వేల మూవ్స్
చిరంజీవి తన సినీ కెరీర్ మొత్తంలో ఇప్పటి వరకు 156 సినిమాల్లో 537 పాట్లకు చిందేశారు. ఈ పాట్లన్నింటిలో కలగలిపి మొత్తం 24 వేల డ్యాన్స్ మూవ్స్ చేశారు. ఇందుకే ఆయనకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గుర్తింపు దక్కింది. ఈ ఘనత సాధించడంలో భారతదేవంలోనే అత్యంత ప్రముఖ నటుడిగా కూడా చిరంజీవి అధికారికంగా నిలిచారు. చిరంజీవికి ఇప్పుడు ఈ అరుదైన ఘనత సాధించడం టాలీవుడ్‌కే గర్వకారణంగా మారింది. తెలుగు సినీ చరిత్రలో డ్యాన్స్ అనేది చిరంజీవి ముందు, చిరంజీవి తర్వాత అన్న విధంగా మార్చిన ఘనత చిరుకే సొంతమని ఎందరో ప్రముఖులు చెప్తున్నారు. ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా చిరంజీవి తన ఫైట్స్, డైలాగ్స్, యాక్టింగ్, గ్రేస్, స్వాగ్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.
ప్రముఖ స్టార్‌గా గుర్తింపు..
హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో మెగాస్టార్ చిరంజీవికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ను అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్స్ ఆమిర్ ఖాన్ కూడా పాల్గొన్నారు. ఈ అవార్డు అందిస్తూ గిన్నీస్ ప్రతినిధి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత సినీ చరిత్రలో అత్యంత ప్రముఖమైన నటుడిగా, డ్యాన్సర్‌గా చిరంజీవిని గుర్తిస్తున్నాం’’ అని ఆయన వివరించారు.
నేనెప్పుడూ ఊహించలేదు..
గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ను అందుకుంటానని తాను కలలో కూడా ఊహించలేదని ఆయన చెప్పారు. ‘‘ఎదురుచూడని ఇలాంటి గొప్ప గౌరవం లభించినందుకు భగవంతుడికి, దర్శకనిర్మాతలకు, అభిమానులకు రుణపడి ఉంటాను. వారి చూపిన అభిమానం, నమ్మకంతోనే ఈరోజు ఈ అవార్డు నాకు దక్కింది’’ అని చెప్పారు. కాగా ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆమిర్ ఖాన్.. చిరంజీవిపై ప్రశంసలు గుప్పించారు. ఒక భారతీయ నటుడికి ఇటువంటి విశేష గౌరవం అందడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, దానిని తాను అందిస్తుండటం మరింత సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు.