గ్రాఫ్టెడ్ ఓటీటి మూవీ రివ్యూ!
x

'గ్రాఫ్టెడ్' ఓటీటి మూవీ రివ్యూ!

తాజాగా గత సంవత్సరం రిలీజైన హారర్ మూవీ ‘Grafted’ తెలుగులోకి డబ్ చేసి మరీ తీసుకువచ్చారు. .

భయం అనేది మనిషి మనసును వెన్నుపోటులా తాకే భావన. అందుకే హారర్ సినిమాలకు ఎప్పుడైనా, ఎక్కడైనా డిమాండ్ ఎక్కువే. ఓటీటీ సంస్దలు కూడా ఈ క్రేజ్‌ను బాగా క్యాష్ చేసుకుంటున్నాయి. ఇటీవల ఇవి పాత హారర్ సినిమాలను తిరిగి అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజాగా గత సంవత్సరం రిలీజైన హారర్ మూవీ ‘Grafted’ తెలుగులోకి డబ్ చేసి మరీ తీసుకువచ్చారు. .

ఈ న్యూజిలాండ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్‌కి శాషా రెయిన్‌బో దర్శకత్వం వహించారు. జెయేనా సన్, జెస్ హాంగ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం విజ్ఞాన పరంగా అత్యుత్సాహంతో చేసిన ప్రయోగం ఎలా భయంకరమైన పరిణామాలకు దారి తీసిందనేది విషయం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం కథేంటి, చూడదగిన చిత్రమేనా వంటి విషయాలు చూద్దాం.

కథేంటి

వీ (జోయెనా సన్) చిన్ననాటి నుంచే ఒక బాధతో, ఒక మానసిక ఒత్తిడితో జీవిస్తూంటుంది. అందుకు కారణం తన ముఖంపై పుట్టుకతో వచ్చిన మచ్చలు. వికారంగా కనిపించే ఈ మచ్చలు ఆమె తండ్రికీ ఉన్నాయి. ఒక శాస్త్రవేత్త అయిన ఆయన, తన రూపం వల్ల ఎదురైన అవమానాలను దిగమింగుకుంటూ , తన కూతురు అలాంటి దుస్థితిని ఎదుర్కొనకూడదనే తపనతో కొత్త శరీర మార్పిడి టెక్నాలజీపై శ్రమిస్తుంటాడు. తనపైనే ప్రయోగాలు చేసుకుంటూంటాడు.

అయితే అతని ప్రయోగం అనుకోని విధంగా దారితప్పి, చివరకు అతని ప్రాణాలకే ప్రమాదమవుతుంది. తండ్రి మరణించిన తర్వాత, వీ అతను వదిలిన పరిశోధనల పుస్తకాన్ని సురక్షితంగా దాచుకుంటుంది. తనకు ఆశ్రయం ఇచ్చిన చోటే తన ప్రయోగాలను ఎవరికి తెలియకుండా రహస్యంగా కొనసాగిస్తూంటుంది.

అయితే ఆ ఇంట్లో ఉండే ఏంజిలా, ఆమె స్నేహితులు తరచూ వీ రూపాన్ని కించపరుస్తూ, మానసికంగా హింసిస్తుంటారు. దాంతో ఆమె మనసులో అందంగా మారాలన్న ఆలోచన ఒక ఒత్తిడిగా మొదలై, బలమైన లక్ష్యంగా మారుతుంది.

చివరకు అందం కోసం ఆమె చేసిన ప్రయోగం... ఆమెను ఎలా మార్చింది? ఆమెలో వచ్చిన మానసికమైన మార్పు ఆమెను ఎలాంటి దారిలోకి నెట్టింది? చివరకు తన తండ్రి కలను నెరవేర్చిందా? లేక అది ఓ రక్తపాత ప్రయోగంగా మిగిలిపోయిందా? అన్నదే ఈ కథలోని అసలు హారర్.

విశ్లేషణ

‘గ్రాఫ్టెడ్’ సినిమా ప్రారంభం ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అయితే ఆ ఉత్కంఠ, ఇంట్రస్ట్ రాను రాను అంతరించిపోయేలా సీన్స్ వస్తూంటాయి. సినిమా మెల్లిమెల్లిగా రక్తపాతం, హారర్, శరీర మార్పిడి దశల్లోకి వెళ్ళిపోతుంది. ఈ క్రమంలో సినిమాలోని కీలకమైన ఎలిమెంట్ అయిన మానసిక క్షోభను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసి చూపించడంలో విఫలమయ్యింది. దాంతో చాలా సీన్స్ జస్టిఫై అయ్యినట్లుగా ఉండవు.

“నేను ముఖాన్ని మార్చినా, నా హృదయం మారదు!” — ఇదే ‘గ్రాఫ్టెడ్’ లో అసలు విషయం. దీన్ని మరింత స్పష్టంగా చెప్తే బాగుండేది. ‘గ్రాఫ్టెడ్’ అసలైన సమస్య ఏమిటంటే… ముఖాలు మారిన తర్వాత కథలో వేగం కూడా మారిపోతుంది — అయితే ముందుకి కాదు, వెనక్కి!

ఫేస్-స్వాపింగ్ అనే కీలక మలుపు వచ్చేసిన తర్వాత కథ ఓ దిశ తెలియని ప్రయాణంలా మారిపోతుంది. ప్రధాన పాత్ర వీ మనిషి నుంచి మృగంగా మారే ప్రయాణాన్ని పెయిన్ తో కలిపి చూపించలేదు. అదే సమయంలో… అందం అనే పేరుతో సమాజంలో నిత్యం చోటు చేసుకుంటున్న నిర్బంధాలపై గంభీరమైన వ్యాఖ్యానం చేయాలన్న ఆలోచనను కూడా కూడా సరిగ్గా చూపించలేకపోతుంది.

ఫైనల్ గా కథ ఏ దిశగా వెళ్లాలో దర్శకుడుకి కూడా అంతుపట్టక అయోమయంగా నిలిచి ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ సినిమా కూడా చివరికి ‘నేను నిజంగా ఏమవ్వాలని కోరుకుంటున్నాను?’ అనే ప్రధాన పాత్ర ప్రశ్న లాగే అనిపిస్తుంది.

చూడచ్చా

హారర్ సినిమాలు అంటే ఆసక్తి చూపే వాళ్లు ఓ లుక్కేయచ్చు. ఫ్యామిలీలు, ముఖ్యంగా పిల్లలు చూడదగ్గ సినిమా అయితే కాదు. కొన్ని జుగుప్సాకరమైన సీన్స్ ఉన్నాయి.

ఎక్కడ చూడచ్చు

అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది

Read More
Next Story