గాడ్ ఫాదర్: ఓ అద్భుత వెండితెర విలాసం, విలాపం
ఈ సినిమా గూర్చి ఎంతైనా మాట్లాడుకోవచ్చు, కానీ రాయడం అంత సులభం కాదు. ఎందుకంటే ఆ సినిమా పై మన భావోద్వేగాన్ని అనుభూతిని పదాల్లోకి పొందుపర్చాలంటే చాల కష్ట.
‘The Godfather, ‘ the movie based on the novel by Mario Puzo and directed by Francis Ford Coppola. Initial theatrical release on March 15, 1972. Screen capture. Paramount Pictures.
సినిమా గురించి ప్రపంచ సాహిత్యంలో అతి ఎక్కువగా ప్రచురితమైన సినిమాల్లో Citizen Kane, Casablanca తరువాతి స్థానంలో గాడ్ ఫాదర్ ఉంది. వ్యాసాలుగా, పుస్తకాలుగా, డాక్యుమెంటేషన్, వైట్ పేపర్స్, ఇలా అన్ని ప్రక్రియల్లో ప్రచురితమైన ఘనత పొందిన సినిమా కూడాను.
గాడ్‌ఫాదర్ చిత్రం ఒక అద్భుత కథా కావ్యం. ఈ చిత్రం హాలీవుడ్ చిత్ర చరిత్రలో ఒక అత్యంత ప్రముఖ స్థానంలో నిలిచి ఉన్నది. ప్రభావితమై ఎందరో దర్శకులు ,ఎన్నో ప్రపంచ భాషల్లో,వందల కొద్దీ సినిమాలు దీని కాపీ కొట్టి సినిమాలు రూపొందించారు. బహుశా సినిమా చరిత్రలో దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొపోలా, అద్భుతంగా తీర్చిదిద్దిన కథానాయకుల పాత్రలు, కథనం, చిత్రకళ, సంగీతం, నాటకం ఇలా ఎన్నో చెప్పొచ్చు. అత్యంత ఆదరణ పొందిన సినిమాగానే కాదు, అత్యుత్తమ ప్రతిభకు పట్టం కట్టారు. చూసిన అభిమానులు తమ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో ,వారినే అడగండి. ఎలాగు ఒక ముక్కలో చెప్పలేరు, ఒక వేళ చెబితే ఈ మాటే అంటారు 'సమ్మోహనం'.
ఎక్కడో చదివాను, సినిమా చూసి రివ్యూ రాస్తూ ,ఓ జర్నలిస్ట్ ఇలా అంటాడు ' కాల గమనంలో ఏంటో అభిమానించిన ఆ పాత్రలు రాలిపోతున్న, నాశనమైపోతున్న, జారిపోతున్న వాటికీ ప్రేక్షకులు థియేటర్లో నిశ్శబ్దంగా ఆ పతనానికి రోదిస్తూ, వారికి వీడ్కోలు పలకలేక సాక్షులవుతున్నారు'. ఎంత గొప్ప స్పందన కదా.
పాత్రాలు, నటులు గురించి వచ్చే శీర్షికలో మాట్లాడుకొందాం. కానీ నినో రోటా అందించిన సంగీతం, నేటికీ నన్ను వెంటాడే ఆ సౌండ్ ట్రాక్, అసంఖ్యాకమైన భావాలను పండించే హృద్యమైనది. విడదీయరాని సినిమాటిక్ ఎక్ససలెన్సు అంటాను. అంతర్గత వివరణలను పెంపొందించడంలో ఓ ఉద్వేగభరిత ఆనందంను కలుగజేస్తుంది. కాదు కప్పేస్తుంది.
ఇది మత్తు కాదు, మహత్తు. గాడ్ ఫాదర్ చిత్రం ప్రముఖ ప్రత్యక్ష ప్రభావం నుండి వేరుపడ్డాం కుదరదు, ఎవరు కోరుకోరు కూడాను. గాడ్ ఫాదర్ మీకు నెమ్మదిగా ఉండే సినిమా అయినా ,అది మీ మనసును ఆహ్లాదపరుస్తుంది, నవరసాలు పండిస్తుంది అని ఆకాంక్షిస్తున్నాను.
ముందుగా దీని వెనుక నా కథ....
ఈ సినిమా నాకు రోజువారి గౌరవమైన, తీక్షణమైన వ్యాపకం. గాడ్ ఫాదర్ ప్రత్యేకత ఏంటంటే, గత 20 ఏళ్లుగా రోజు ఒకటో ,రెండో సీన్లో చూడ్డం కానీ, సౌండ్ ట్రాక్ వినడమొ నా అలవాటు.మా అమ్మాయిలు పిలిచినప్పుడు పలకకపోతే 'గాడ్ ఫాదర్' అంటే వెంటనే పలుకుతానని వారి నమ్మకం. అంతలా అల్లుకుపోయిన గాడ్ ఫాదర్ సినిమా ఏంటని మీకు తోచవచ్చు. కొన్నంతే, అలా కుదిరిపోతాయి. దీని విలాసం చాల శ్రేష్టమైనది. దీని విలాపం చీకటి రోధ. దీని విస్తృతి మానవీయత.
మారియో పూజో రాసిన ఈ నవల చదివిన 16 ఏళ్ళు ఆ ఆలోచనలతో జీవిస్తున్న నాకు, 2005లో సినిమా చూసే భాగ్యం కలిగింది. ఇప్పుడు దాదాపు 20 య్యేళ్లుగా ఆ అద్భుతంగా తెర పై ఆవిష్కృతమైన ఆ నవలా దృశ్యాన్ని ఇంకా ఆస్వాదిస్తూనే వున్నా.ఆలోచిస్తూనే వున్నా. బాధ పడుతూనే వున్నా. నేర్చుకొంటూనే వున్నా. ఓ అంతులేని తృష్ణను తీర్చుకొంటూనే సాగుతున్నా.
నా 19వ ఏట, మొదటి సారి 'గాడ్ ఫాథర్' నవలను మా చిన్నాన్న వీడలూరు గుర్నాధం పరిచయం చేసారు.వారు వృతి రీత్యా బ్యాంకు ఆఫీసరు, పైగా నాటకాలు, సాహిత్యం ఆయన ప్రాణాలు.నేను చదివిన ,చూసిన సినిమాల పై నా అభిప్రాయాలను ఆయనకు నచ్చేవి. అందు వలన నేనంటే అభిమానం ఎక్కువ. ఎప్పుడు మేమిద్దరం కలిసినా పలు విషయాలపై చర్చించే వాడ్ని,అనుభవాలు పంచుకొనేవాళ్ళం, మేము అన్ని విషయాల పై చాలా లోతుగా సంభాషించుకొనే వాళ్ళం.
ఆయన నవల గూర్చి ముందు ఓ వారం రోజులు బ్యాంకు పనుల నుండి వీలు కుదిరినప్పుడంతా చెప్పుకొచ్చారు. ఇది కథ కాదు రా, saga. చివరిగా ,'ఇది చదివితే సాహిత్యంలో ఓ చిరస్మరణీయమైన అనుభూతికి దారులు ఏర్పడతాయి. బహుశా ఆ తరువాతి కాలంలో ఆ దారులు మనతోనే ప్రయాణిస్తుంటాయిని. తనకు అటువంటి అనుభూతే ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ఇది చదివిన ,సినిమా చూసిన వారందరూ ఇదే అనుభవించారు', అంటూ ముగించారు. ఇది చదివి నీ అభిప్రాయం చెప్పు, కుదిరితే రాసే ప్రయత్నం చేయమంటూ సూచన చేసారు.
ఈ సినిమా గూర్చి ఎంతైనా మాట్లాడుకోవచ్చు, కానీ రాయడమంటే అసలు సులభమేం కాదు. ఎందుకంటే ఆ సినిమా పై మనకుండే ఆలోచనలు, భావోద్వేగాలు దాటి పదాల్లోకి ఆ అనుభూతిని పొందుపర్చాలంటే చాల కష్టమైన పని.
బాబాయ్ కోరినట్టు అప్పుడు రాయడం కుదరలేదు,ఇప్పుడు ఇలా మిత్రులు జింకా నాగరాజు గారి ప్రోత్సహంతో రాస్తున్న ఈ సీరిస్ ఆస్వాదిస్తారని ఆసిస్తున్నాను. మా బాబాయ్ నా జీవితంలో ఓ గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తే, ఇది అందరికి తెలిసిన విషయమే. అర్ధాంతరంగా కాలం చేసిన ఆయనను చివరి సారి చూడ్డానికి కూడా వెళ్లలేని పరిస్థితి నాదైనా,ఓ మంచి మిత్రుడ్ని ,గొప్ప వ్యక్తిని మర్చిపోలేక, అందుకే ఈ సిరీస్ ఆయనకు నేను అప్పుడు సమర్పించని శ్రద్ధాంజలి, అంకితం.
-రామ్.సి