2025 టాలీవుడ్: పాన్–ఇండియాకి మన స్టార్ పవర్ సరిపోలేదా?
x

2025 టాలీవుడ్: పాన్–ఇండియాకి మన స్టార్ పవర్ సరిపోలేదా?

‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘అఖండ 2’ వరకు…

2025 ముగిసేందుకు ఇంకా రెండు వారాలే మిగిలి ఉంది. మరో ప్రక్క టాలీవుడ్ బాక్సాఫీస్‌పై ఈ సంవత్సరం పెద్ద సినిమాల ప్రభావం పూర్తిగా ముగిసింది. ‘అఖండ 2’తో ఈ ఏడాది స్టార్ హీరోల విడుదలలకు ఫుల్ స్టాప్ పడింది. ఇక మిగిలిన రోజుల్లో థియేటర్లకు రావాల్సింది కొన్ని చిన్న సినిమాలే. ఈ దశలో వెనక్కి తిరిగి చూస్తే, 2025 టాలీవుడ్‌కు భారీ ఆశలు చూపించి, అంతే భారీ నిరాశను మిగిల్చిన సంవత్సరం అని స్పష్టంగా అర్థమవుతుంది.

ఈ ఏడాది టాలీవుడ్‌కు సంఖ్యల పరంగా మాత్రమే కాదు, ఆత్మపరిశీలన పరంగా కూడా కీలకంగా మారింది. ఏడాది చివరికి వచ్చేసరికి బాక్సాఫీస్ ముందు ఒక ప్రశ్న తప్పించుకోలేని స్థితిలో నిలుస్తుంది. భారీ స్టార్ క్యాస్ట్, భారీ బడ్జెట్లు, భారీ అంచనాలు ఉన్నప్పటికీ… తెలుగు సినిమా ఎందుకు పాన్–ఇండియా బాక్సాఫీస్‌ను గెలవలేకపోయింది?

ఈ ప్రశ్నకు సమాధానం ఒక్క కారణంలో లేదు. ఇది స్టార్స్, స్టోరీస్, మార్కెట్ అర్థం చేసుకోవడంలో లోపం, టైమింగ్ తప్పిదాలు అన్నీ కలిసిన ఫలితం.

2025 ఆరంభంలో టాలీవుడ్ మొత్తం పాన్–ఇండియా డ్రీమ్‌లో మునిగిపోయింది. ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ లాంటి సినిమాల తర్వాత వచ్చిన ఆత్మవిశ్వాసం ప్రతీ అడుగులోనూ కనపడింది. ప్రతి పెద్ద సినిమా తనను తాను జాతీయ స్థాయి బ్లాక్‌బస్టర్‌గా ఊహించుకుంది. కానీ ఆ ఊహ, వాస్తవం మధ్య ఉన్న దూరాన్ని ఈ ఏడాది బాక్సాఫీస్ బహిర్గతం చేసింది.

సంఖ్యలు స్పష్టంగా చెబుతున్న నిజం ఒక్కటే. 2025లో ఒక్క తెలుగు సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మార్క్‌ను దాటలేకపోయింది. అదే సమయంలో బాలీవుడ్, కోలీవుడ్, సాండల్‌వుడ్ ఇండస్ట్రీలు పాన్–ఇండియా స్థాయిలో భారీ విజయాలను అందించాయి. దేశవ్యాప్తంగా ప్రభావం చూపే సినిమాల విషయంలో ఈసారి టాలీవుడ్ వెనుకబడిందన్న వాస్తవాన్ని తప్పించుకోలేని నిజం.

సంవత్సరం మొదట్లోనే ‘గేమ్ ఛేంజర్’పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ చేసిన తొలి సోలో సినిమా కావడంతో, ఇది 2025లో టాలీవుడ్ గేమ్‌ను మార్చేస్తుందని భావించారు. శంకర్‌కు ఇది పూర్తిస్థాయి తెలుగు సినిమా కావడం, రామ్ చరణ్ పాన్–ఇండియా ఇమేజ్ పీక్‌లో ఉండటం… ఇవన్నీ కలసి ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందన్న నమ్మకాన్ని పెంచాయి.

కానీ రిలీజ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో, ఫలితం అంతే నిరాశగా మారింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 180 కోట్ల వసూళ్లకే పరిమితమైన ఈ సినిమా, భారీ బడ్జెట్‌ను రికవర్ చేయలేకపోయింది. నిర్మాత దిల్ రాజుకు థియేట్రికల్ బిజినెస్‌లో 70 కోట్లకు పైగా నష్టాలు వచ్చాయన్న మాటలు వినిపించాయి. ఏడాది మొదట్లోనే వచ్చిన ఈ షాక్, టాలీవుడ్ మోమెంటమ్‌ను తీవ్రంగా దెబ్బతీసింది.

అదే దారిలో ఎన్టీఆర్ నుంచి వచ్చిన ఫలితమూ ఆశించిన స్థాయిలో నిలబడలేదు. ‘వార్ 2’ ప్రధానంగా హిందీ సినిమా అయినప్పటికీ, తెలుగులో దీనిపై భారీ నమ్మకం పెట్టుకున్నారు. నాగా వంశీ దాదాపు 80 కోట్లకు తెలుగు రైట్స్ కొనడం ఆ విశ్వాసానికి నిదర్శనం. మొదటి వారాంతంలో ఓపెనింగ్స్ వచ్చినా, ఆ తర్వాత సినిమా వేగంగా కూలిపోయింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 365 కోట్ల వసూళ్లు వచ్చినప్పటికీ, తెలుగు మార్కెట్‌లో మాత్రం ఇది నష్టాల సినిమాగా మిగిలింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఒకే ఏడాది అంచనాలను నిలబెట్టుకోలేకపోవడంతో, టాలీవుడ్ రెండు సాధ్యమైన 500 కోట్ల పాన్–ఇండియా సినిమాలను కోల్పోయినట్టు అయ్యింది.

ఈ ఏడాది పవన్ కళ్యాణ్ కూడా కేంద్రబిందువయ్యాడు. రాజకీయ బాధ్యతల మధ్య రెండు సినిమాలు రిలీజ్ చేయడం విశేషమే. కానీ పాన్–ఇండియా కలగా భావించిన ‘హరిహర వీరమల్లు’ అన్ని భాషల్లో విఫలమై, తెలుగులో కూడా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఏడాది ఆరంభంలోనే పవన్ కళ్యాణ్‌కు నెగెటివ్ ఫలితం ఎదురైంది.

అయితే రెండు నెలలకే వచ్చిన ‘ఓజి’ పరిస్థితిని కొంతమేర మార్చింది. దాదాపు 300 కోట్ల వసూళ్లతో ఇది 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఇదే అతిపెద్ద హిట్. అయినప్పటికీ, ఇది పాన్–ఇండియా స్థాయికి చేరలేదు. లోకల్ బ్లాక్‌బస్టర్ సాధ్యమే కానీ, నేషనల్ బ్రేక్‌థ్రూ మాత్రం ఇంకా దూరంగానే ఉందన్న వాస్తవాన్ని ‘ఓజి’ కూడా నిర్ధారించింది.

టాలీవుడ్ భారీ నంబర్లను అందుకోలేకపోవడానికి మరో కీలక కారణం ఉంది. నిజమైన పాన్–ఇండియా క్రౌడ్ పుల్లర్లు అసలు బరిలోనే లేకపోవడం. ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి నటులు ఉంటే 1000 కోట్ల మార్క్ దాటడం అసాధ్యం కాదు. కానీ 2025లో వీరిద్దరికీ ఒక్క రిలీజ్ కూడా లేదు. మహేష్ బాబు కూడా ఈ ఏడాది పూర్తిగా దూరంగా ఉన్నాడు. ఈ ముగ్గురి గైర్హాజరు టాలీవుడ్ బాక్సాఫీస్‌లో పెద్ద ఖాళీని సృష్టించింది.

సీనియర్ హీరోల విషయానికి వస్తే, నాలుగుగురిలో ఒకరే నిజమైన విజయం అందుకున్నాడు. వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ దాదాపు 250 కోట్ల వసూళ్లతో ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా మారడమే కాక, 2025లో రెండో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. చిరంజీవి ఈ ఏడాదిని దాదాపు మిస్ అయ్యాడు. నాగార్జున సోలో సినిమా లేకుండా సహాయ పాత్రలకే పరిమితమయ్యాడు. బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ మాత్రం భారీ అంచనాల మధ్య విడుదలై, 100 కోట్ల మార్క్‌ను కూడా చేరుకోలేకపోయింది.

మిడ్–టయర్ హీరోల పరిస్థితి మిశ్రమంగా ఉంది. నాని ‘హిట్: ది థర్డ్ కేస్’తో తన విజయాల పరంపరను కొనసాగించాడు. విజయ్ దేవరకొండకు ‘కింగ్‌డమ్’ మరో ఎదురుదెబ్బగా మారింది. నాగ చైతన్య నటించిన ‘తండేల్’ ఓకే అనిపించినా, పెద్ద బ్రేక్ ఇచ్చే సినిమాగా నిలబడలేదు.

మొత్తం మీద 2025 టాలీవుడ్‌కు ఒక స్పష్టమైన హెచ్చరిక ఇచ్చింది. స్టార్ పవర్ ఉన్నంత మాత్రాన పాన్–ఇండియా విజయాలు ఆటోమేటిక్‌గా రావు. ఈ ఏడాది చిన్న, మిడ్ బడ్జెట్ కంటెంట్ ఆధారిత సినిమాలు స్టార్ల సినిమాలకంటే మెరుగైన ఫలితాలు ఇచ్చాయి. భారీ పేర్లు ఉన్న సినిమాలు మాత్రం అంచనాల భారాన్ని మోయలేకపోయాయి. 2025ను టాలీవుడ్ ఒక మిస్ అయిన అవకాశాల సంవత్సరంగా గుర్తుంచుకునే అవకాశం ఉంది. 2026లో ఈ పాఠం ఎంతవరకు ఉపయోగపడుతుందోనే అసలు పరీక్ష.

Read More
Next Story