కెరీర్ పీక్‌లో హత్య కేసులో జైలుకెళ్ళిన తమిళ సూపర్ స్టార్ తెలుసా?
x

కెరీర్ పీక్‌లో హత్య కేసులో జైలుకెళ్ళిన తమిళ సూపర్ స్టార్ తెలుసా?

ఆయన తమిళ సినీరంగంలోనే కాదు దక్షిణ భారతదేశంలోనే మొదటి సూపర్ స్టార్. ఆయన జైలుకు వెళ్ళటంవలనే ఎంజీఆర్ ఆ స్థానాన్ని చేజిక్కించుకుని నంబర్ వన్ అయ్యారు.


దర్శన్‌లాగే ఒక సంచలన హత్యకేసులో జైలుకు వెళ్ళి కెరీర్ మొత్తం సర్వనాశనమైపోయిన ఓ తమిళ సూపర్‌స్టార్ ఒకరు ఉన్నారని చాలామందికి తెలియకపోవచ్చు. ఆయన పేరు త్యాగరాజ భాగవతార్. సరిగ్గా 80 ఏళ్ళనాడు ఈ సంచలన హత్యకేసు చోటుచేసుకుంది. దర్శన్ లాగే ఇతను కూడా ఒక అమ్మాయి విషయంలోనే హత్యకేసులో ఇరుక్కున్నాడు. అయితే, భాగవతార్ పాపులారిటీతో పోలిస్తే దర్శన్ పాపులారిటీ పదోవంతు కూడా ఉండదని చెప్పుకోక తప్పదు. ఆయన తమిళ సినీరంగంలోనే కాదు దక్షిణ భారతదేశంలోనే మొదటి సూపర్ స్టార్. ఆయన జైలుకు వెళ్ళటంవలనే ఎంజీఆర్ ఆ స్థానాన్ని చేజిక్కించుకుని నంబర్ వన్ అయ్యారు.

భాగవతార్ మొత్తం 14 సినిమాలలో నటిస్తే వాటిలో 10 బంపర్ హిట్‌లు. అతని సినిమాలు నెలల తరబడి ధియేటర్‌లలో ఆడుతుండేవి. ముఖ్యంగా ఆయన నటించిన ‘హరిదాస్’(తెలుగులో ఎన్టీఆర్ ‘పాండురంగమహాత్యం’) సినిమా నాడు మద్రాస్‌లోని బ్రాడ్వే అనే ధియేటర్‌లో నిరాటంకంగా మూడు సంవత్సరాలపాటు ఆడింది. ఇది కాకుండా ఆయన నటించిన ‘చింతామణి’, ‘అంబికాపతి’ సినిమాలు కూడా బంపర్‌హిట్‌లే. ఆ చిత్రాలతో వ్యాపారం చేసిన నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు కుబేరులైపోయారు. మద్రాస్‌లో చింతామణి సినిమాను ప్రదర్శించిన ఒక ధియేటర్ యజమాని ఆ సినిమాలో వచ్చిన లాభాలతో మదురైలో ఒక ధియేటర్ కట్టి దానికి చింతామణి అనే పేరు పెట్టాడు. ఒక నిర్మాత ఇతని సినిమాతో వచ్చిన లాభాలతో ఒక టెక్స్‌టైల్ మిల్ పెట్టాడు.

తమిళ సంస్కృతిలో సినిమా పెనవేసుకుపోవటానికి, సినిమా నిర్మాణం ఒక పరిశ్రమగా అభివృద్ధి చెందటానికి మొదటి కారణం భాగవతారే అని చరిత్రకారులు చెబుతారు. తమిళనాడులో సినీహీరోలను ఆరాధించటం ఆయనతోనే మొదలయింది. ఆయన హెయిర్ స్టైల్‌ను యువకులు అనుకరించేవారు. పొడుగాటి జులపాలతో ఉండే భాగవతార్ ఫోటో ఉన్న అతని పాటల గ్రామ్ ఫోన్ రికార్డులు హాట్ కేకుల్లా అమ్ముడయ్యేవి. ఆ పాటలు తమిళనాడు అంతటా మార్మోగిపోయేవి. అతని ప్రజాదరణ ఏ స్థాయిలో ఉండేదంటే అతను నడిచి వెళ్ళిన నేలకు జనం సాష్టాంగ నమస్కారాలు చేసేవారు. అతను ప్రయాణిస్తున్న రైలు వెంట జనం పరుగులు తీసేవారు. తమిళనాడులో నాడు ఉన్న అనేకమంది రాజులు, జమీందారులు ఆయనను ఘనంగా సత్కరించేవారు. రావ్ బహద్దూర్ బిరుదు ప్రకటించినప్పటికీ అతను దానిని తిరస్కరించాడు.

మల్టీ ట్యాలెంటెడ్

అతని సినిమాలలో పాటలు అతనే పాడుకునేవాడు. అసలు మొదట అతని గాయకుడే. కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. మొదట పాటల కచ్చేరీలు ఇస్తుండేవాడు. తర్వాత నాటక రంగంలో ప్రవేశించి బాగా రాణించాడు. ‘పవలక్కోడి’ అనే అతని నాటకాన్ని చూసిన కొందరు నిర్మాతలు ఆ నాటకాన్నే సినిమాగా తీయటంతో 1934లో భాగవతార్ సినిమారంగంలో అడుగుపెట్టాడు. 1934 నుంచి 1944 వరకు పది సంవత్సరాల కాలంలో తొమ్మిది సినిమాలలో నటించాడు. అన్నీ హిట్‌లే. తన సినిమాలలో పాటలను తానే పాడుకునేవాడు, కొన్నింటికి సంగీత దర్శకత్వం కూడా వహించాడు.

తెలుగు మూలాలు

భాగవతార్ అసలు పేరు ముత్తువీర కృష్ణస్వామి త్యాగరాజ భాగవతార్. అతని తండ్రి పేరు కృష్ణస్వామి ఆచారి. భాగవతార్ తిరుచిరాపల్లిలో 1909లో పుట్టాడు. వారిది ఒక విశ్వకర్మ కుటుంబం. అయితే అతనికి కుటుంబానికి తెలుగు మూలాలు ఉన్నట్లు చెబుతారు. అతను ఒకసారి తండ్రి కోప్పడితే పారిపోయి కడప చేరుకుని అక్కడ నాటక సమాజంలో చేరాడు. తర్వాత తండ్రి అక్కడకు వెళ్ళి అతనిని వెనక్కు తీసుకొచ్చుకున్నాడు.

హత్యకేసులో జైలుకు

కెరీర్ బ్రహ్మాండంగా సాగిపోతుండగా, 1944లో భాగవతార్ ఒక కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళాడు. ఆ కేసు పూర్వాపరాలు ఏమిటంటే - అప్పట్లో మద్రాస్‌లో యెల్లో జర్నలిజంతో వార్తలు రాసే లక్ష్మీకాంతన్ అనే ఒక పాత్రికేయుడు ఉండేవాడు. సినిమా నటుల తెరవెనక రహస్యాలను ఉన్నవీ, లేనివీ రాస్తూ ఉండేవాడు. ఆ రహస్యాల ఆధారంగా అతను నటీనటులను బ్లాక్ మెయిల్ కూడా చేస్తూ డబ్బులు దండుకుండేవాడు. అతనికి భాగవతార్‌కు సంబంధించిన ఒక రహస్యం తెలిసింది. అది ఏమిటంటే - సినిమాలలో వేషాలకోసం భాగవతార్ వద్దుకు ఒక అందమైన యువతి వచ్చి కలిసింది. అంత అందమైన అమ్మాయి అందాన్ని ప్రపంచానికి చూపించటం ఇష్టంలేక అతను తన వద్దే ఉంచుకున్నాడు. రహస్యంగా పెళ్ళి చేసుకున్నాడు. అప్పటికే అతనికి భార్యా పిల్లలు ఉన్నారు. అతను సినిమాలలో వేసేవన్నీ పరమ భక్తుల వేషాలు కనుక ఈ రెండో పెళ్ళి విషయం బయటకు తెలిస్తే తన ఇమేజ్‌కు భంగం కలుగుతుందనో, ఏమో రెండో పెళ్ళిని రహస్యంగా ఉంచాడు. ఆ అమ్మాయి అతని వలన గర్భవతి అయింది. ఆ విషయం లక్ష్మీకాంతన్‌కు తెలిసింది. దానితో అతను భాగవతార్‌ను బ్లాక్ మెయిల్ చేశాడు.

1944 నవంబర్ 8వ తేదీ సాయంత్రం మద్రాస్ లోని కీల్పాక్‌ ప్రాంతంలో అతను రిక్షాలో వెళుతుండగా కొందరు దుండగులు వచ్చి అతనిపై కత్తులతో దాడిచేసి పారిపోయారు. కానీ లక్ష్మీ కాంతన్ ఎంత గట్టి పిండమంటే, తన కడుపులోనుంచి బయటకు వచ్చిన పేగులను లోపలకు తోసేసుకుని, దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి కంప్లెయింట్ రాసి ఇచ్చి పడిపోయాడు. భాగవతార్ తన మిత్రుడైన నాటి ప్రముఖ కమెడియన్ ఎన్ఎస్ కృష్ణన్‌తో కలిసి కిరాయి హంతకులను మాట్లాడుకుని లక్ష్మీకాంతన్‌ను హత్య చేయించాడని ఆరోపణ. లక్ష్మీకాంతన్ మరుసటి రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయాడు. డిసెంబర్ 27న షూటింగ్‌లో ఉన్న భాగవతార్‌తో పాటు, కృష్ణన్, తెలుగువాడైన నిర్మాత శ్రీరాములు నాయుడులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మనోవేదనతో మరణం

అరెస్ట్ సమయానికి అతను పది సినిమాలు సంతకం చేసి ఉన్నాడు. అతను అత్యధిక పారితోషికం తీసుకుంటుండేవాడు. ఆ పది సినిమాల నిర్మాతలు ఆ తర్వాత కొందరు భాగవతార్ తర్వాతి స్థానంలో ఉన్న పీయూ చిన్నప్పతో తీశారు, కొందరు విరమించుకున్నారు. భాగవతార్ మద్రాస్ జైలులో ఉండగా బయట మైకులలో మోగుతున్న తన సినిమా హరిదాస్ పాటలు విని అతను కన్నీళ్ళు పెట్టుకునేవాడని చెబుతారు. కోర్ట్ అతనిని దోషిగా నిర్ధారించింది. చాలా అప్పీళ్ళ తర్వాత 1947 ఏప్రిల్ 25న అతను నిర్దోషిగా విడుదలయ్యాడు. తర్వాత నాలుగైదు సినిమాలు తీసినప్పటికీ అవేమీ విజయవంతం కాలేదు. ఒక సమయంలో అత్యున్నత స్థాయిలోకి వెళ్ళి, రాజభోగాలు అనుభవించి, తదనంతరం ఆస్తులన్నీ పోయి అధఃపాతాళానికి పడిపోవటంతో ఆ మనోవేదన కారణంగా అతను ఎక్కువ కాలం బ్రతకలేకపోయాడు. 1959లో 49 ఏళ్ళ వయసులోనే చనిపోయాడు. అలా ఒక సూపర్‌స్టార్ కెరీర్ అర్థంతరంగా ముగిసిపోయింది.

Read More
Next Story