సినిమాకో ప్రేమ లేఖ...రామోజీ ‘ఉషాకిరణాలు’
ఇంతమంది సినిమా ప్రముఖులు ఉన్నా, సినిమాలపై సంపాదించిన వారు ఉన్నా రామోజీ ఫిల్మ్ సిటీ లాంటిది ఎవరూ నిర్మించలేకపోయారు.
ఉషా కిరణ్ లో కథలు వింటున్నారట...
నేను మొన్న ఫిల్మ్ సిటీకి వెళ్లి కథ చెప్పి వచ్చాను
ఈటీవి విన్ లో కథ చెప్పి ఓకే చేయించుకుంటే ప్రొడ్యూసర్ ఓకే అయ్యిపోయినట్లే...
నిత్యం సిని ఇండస్ట్రీలో వినపడే విషయాలు. ప్రత్యేకమైన స్టోరీ డిపార్టమెంట్ చాలా ఏళ్ళ నుంచి ఉషా కిరణ్ సొంతం. ఏ కథ పడితే ఆ కథ ఓకే చేయరు. సినిమాలో సమాజానికి పనికొచ్చే కంటెంట్ లేకపోయినా పాడు చేసే విషయం అయితే ఉండకూడదు. బడ్జెట్ లిమిట్ లో ఉండాలి. అవసరమైతే కొత్త వాళ్ళతో సినిమా చేసేలా ఉండాలి. ఇలా చాలా రూల్స్ ఉండేవి. అయినా ఇండస్ట్రీ జనం ఉషాకిరణ్ బేగం పేట ఆఫీస్ చుట్టూ ప్రదక్షణాలు చేసేవారు. ఎందుకంటే అక్కడ సినిమా ఓకే అయ్యిందంటే ఆ లెక్కే వేరు. ఆ విలువ వేరు. చాలా మందికి నచ్చేది కాదు ఇలా తిరగటం, వాళ్ల చెప్పినట్లు కథా కరెక్షన్స్ చేయటం అయినా మానేవారు కాదు.
అలాగే బడ్జెట్ తక్కువే. అయినా వెనకాడేవారు కాదు. ఎందుకంటే అనుకున్న ఎమౌంట్ లో పైసా కూడా ఎగ్గొట్టకుండా మన చేతికి వస్తుంది. లక్షలు లక్షలు రెమ్యునేషన్స్ చెప్పి వేలల్లో కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టే ఇండస్ట్రీలో ఎంతకు ఒప్పుకున్నారో తక్కువైనా, ఎక్కువైనా పూలల్లో పెట్టి ఇచ్చే సంస్కారం ఆ సంస్దది. ఎప్పుడూ స్టార్స్ వెనక పడలేదు. స్టార్స్ కోసం కథలు రెడీ చేయలేదు. కథే హీరో అని అందరూ చెప్పే వారు రామోజీరావు గారు అది మనసా వాచా నమ్మేవారు. అది ఆయన సినిమాల్లో స్పష్టంగా కనపడేది. అయితే గత పదిహేనేళ్లుగా సినిమా నిర్మాణం తగ్గించి టీవీ మీడియంపై పూర్తి దృష్టి పెట్టారు. అందుకు రకరకాల కారణాలు ఉండవచ్చు. అయితే రామోజీరావు గారికి సినిమా అంటే చాలా ఇష్టం అని ఆయనతో జర్ని చేసిన సినిమా ప్రముఖులు చెప్తారు. అంతెందుకు ఇంతమంది సినిమా ప్రముఖులు ఉన్నా, సినిమాలపై సంపాదించిన వారు ఉన్నా రామోజీ ఫిల్మ్ సిటీ లాంటిది ఎవరూ నిర్మించలేకపోయారు. ఈ రోజు హాలీవుడ్ సినిమాలు సైతం ఇక్కడకి వచ్చి షూటింగ్ జరుపుకుంటున్నాయి.
ఎంతలా అంటే తమ ఈనాడు దిన పత్రికలో ‘సినిమా’కంటూ ఓ ప్రత్యేకమైన పేజీ తీసుకొని రావాలన్న ఆలోచనకు అంకురార్పణ చేసింది రామోజీ రావునే. ‘ఈనాడు’లో సినిమా పేజీ మొదలుపెట్టిన తరవాత అన్ని దినపత్రికలూ మొదలెట్టాయి. అలాగే సినిమాపై ఇష్టంతో 1984లో ఉషాకిరణ్ మూవీస్ సంస్థకు మొదలెట్టారు రామోజీరావు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన క్లీన్ కామెడీ ‘శ్రీవారికి ప్రేమలేఖ’ ఈ సంస్థ నుంచి వచ్చిన తొలి చిత్రం.
ఆ తర్వాత కాంచనగంగ, ప్రేమించు – పెళ్లాడు, మౌన పోరాటం, పీపుల్ ఎన్‌కౌంటర్, మయూరి, ప్రతిఘటన, మనసు – మమత, అమ్మ, చిత్రం… ఇలా ఎన్నోసక్సెస్ ఫుల్ చిత్రాలు ఈ సంస్థ నుంచి వచ్చాయి. ఈ సంస్ద నుంచి దాదాపు 90 సినిమాలు దాకా నిర్మించారు రామోజీ రావు.ఈ రోజు ఓటీటీ సంస్దలు చెప్పే కంటెంట్ అనే పదానికి ఆయన ఎప్పుడో నమ్మి... కేవలం కంటెంట్ కే పెద్ద పీట వేసి తీసిన సినిమాలివి. ‘ప్రతిఘటన’, ‘మౌన పోరాటం’, ‘మయూరి’లాంటి చిత్రాలు ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో తప్పించి వేరే వారు తియ్యలేరు అనేది నిజం. అలాగే ఉషాకిరణ్ బ్యానర్ లో వచ్చిన సినిమాలు చాలా అవార్డ్ లు పంట పండించుకున్నాయి. 2000లో ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన ‘నువ్వే కావాలి’ నేషనల్ అవార్డును అందుకుంది. అలాగే ఈ బ్యానర్ లో వచ్చిన సినిమాలు ఎన్నో నందీ అవార్డులు సాధించాయి.
కేవలం కంటెంట్ అన్నారు కదా ఏదో ఆర్ట్ , సీరియస్ సినిమాలు తీసి జనాలు మీదకు విసరలేదు ఆయన. చాలా వరకూ జనం జడ్జిమెంట్ కు దగ్గరగా ఉండేవి ఆయన సినిమాలు. యూత్ కు పిచ్చ పిచ్చగా నచ్చిన ‘నువ్వే కావాలి’, ‘చిత్రం’, ‘ఆనందం’వంటి సినిమాలు ఆయన బ్యానర్ నుంచే వచ్చాయంటే మామూలు విషయం కాదు. ఎంతో మంది కొత్తవారిని ఇండస్ట్రకీ పరిచయం చేసారు. నువ్వే కావాలితో విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ ఎక్కడికో వెళ్లిపోయారు. చిత్రంతో తేజ అనే దర్శకుడు పరిచయమై తర్వాత ఎన్నో హిట్స్ ఇచ్చారు. ఆనందం చిత్రంతో శ్రీను వైట్ల వెనుతిరిగి చూసుకోలేదు. సినిమా తీయటం ఒకెత్తు..ప్రమోషన్ ఒకెత్తు. సినిమాకు టాక్ బాగుందంటే ఈనాడులో,ఈటీవిలో ప్రమోషన్స్ కుమ్మేసేవారు. దాంతో దర్శకులకు అందరికీ ఉషాకిరణ్ లో సినిమా చేయాలనే కోరిక ఉండేది.
అలాగే రామోజీరావు తాను కేవలం తెలుగుకే పరిమితం అవ్వకూడదనున్నారు. ఉషాకిరణ్ స్థాపించిన కొన్నేళ్లలోనే మలయాళం, హిందీ భాషల్లో సినిమాలను నిర్మించడం మొదలుపెట్టింది. తెలుగులో తెరకెక్కించిన సినిమాలనే ఇతర భాషల్లో రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ కొట్టారు.
ఇక ఉషాకిరణ్ మూవీస్ లో సినిమా ఓకే అవ్వాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. రిజెక్ట్ చేసిన సినిమాల లిస్టు కూడా చాలా పెద్దదే. సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘శివ’ లాంటి కథలు ముందు ఉషాకిరణ్ మూవీస్ దగ్గరకే వెళ్లి వెనక్కి వచ్చినవే. ఇక కొంతకాలంగా ఉషాకిరణ్ మూవీస్ లైమ్ లైట్ లో లేదు. ఉషా కిరణ్ మూవీస్.. సినిమాలను నిర్మించడంలో స్పీడు తగ్గించింది. చివరిగా 2015లో రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్ చేసిన ‘దాగుడుమూత దండాకోర్’. అయితే ఈమధ్య మళ్లీ ఉషాకిరణ్ మూవీస్ లో ఈటీవి విన్ కోసం సినిమాలు తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు రామోజీరావు మరణంతో ఆ సంస్థ పునరాగమనానికి బ్రేకులు పడకూడదని కోరుకుందాం. ఆయన సినిమాలకు రాసిన ప్రేమలేఖ ఎప్పుడూ మాసి పోకూడదు. మరకపడిపోకూడదు. పాత పడిపోకూడదు.
Next Story