తెరపైకి రామోజీరావు బయోపిక్, టైటిల్ ఏం పెడతారో?
x

తెరపైకి రామోజీరావు బయోపిక్, టైటిల్ ఏం పెడతారో?

అందరూ మేరు పర్వతం రామోజీరావుగారు స్వర్గస్థులయ్యారు అనే బాధలో ఉంటే.. కొందరు ఆయన బయోపిక్ తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు.

సినిమావాళ్లు ప్రతీది కమర్షియల్ కోణంలో చూస్తారు. అందరూ మేరు పర్వతం రామోజీరావుగారు స్వర్గస్థులయ్యారు అనే బాధలో ఉంటే.. కొందరు ఆయన బయోపిక్ తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు. అయితే అఫీషియల్ గా ఎవరూ పైకి స్టేట్మెంట్ లు ఇవ్వకపోయినా ఈ విషయమై డిస్కషన్స్ అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో మొదలయ్యాయి.

ఈ క్రమంలో నింగికేగిన మీడియా దిగ్గజం రామోజీరావు గురించి ప్రస్తుతం అలాంటి చర్చే జరుగుతోంది. ఒక సాధారణ దినపత్రికతో మొదలుపెట్టి దాన్ని అత్యధిక సర్కులేషన్ దాకా తీసుకెళ్లి ఏషియాలోనే అత్యంత పెద్దదైన రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం దాకా ఆయన జీవితంలో లెక్కలేనన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. వాటన్నిటితో సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఫిల్మ్ సర్కిల్స్ లో మొదలైంది.

అయితే రామోజీరావు బయోపిక్ అనేది ఈ రెండు రోజులు మాత్రమే నడిచే తాత్కాలిక ఆలోచన కావచ్చు. లేదా నిజంగానే తీద్దాం.. రామోజీ వంటి సాహసాలు చేసిన పత్రికాధిపతి గురించి చెప్పుకోవటానికి చాలా ఉందని ఫీలై ఉండవచ్చు. ఏదేమైనా బయోపిక్ తీయాలనేది నిజంగా గొప్ప ఆలోచన.

రామోజీరావు తమ ఈటీవీలో గొప్పవ్యక్తుల గురించి మార్గదర్శి అనే పోగ్రాం చేసేవారు. యువతకు స్ఫూర్తివంతంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో. అదే ఉద్దేశ్యం నుంచి చూస్తే రామోజీరావు బయోపిక్ అనేది అద్బుతమైన ఆలోచన. నిజానికి గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలను తెరకెక్కించటం కొత్తేమీ కాదు. ఈ క్రమంలో ఇప్పటిదాకా స్టార్లు, రాజకీయ నాయకులు, క్రీడాకారుల కథలు సినిమాలుగా వచ్చాయి. అందులో భాగ్ మిల్కా భాగ్, మహానటి లాంటివి అద్భుత విజయం సాధిస్తే తలైవి, ఎన్టీఆర్ లాంటివి పరాజయం పాలయ్యాయి. కానీ ఎప్పటికప్పుడు కొత్త తరానికి మహనీయుల గాథలు చెప్పడం అవసరం. రామోజీరావుగారు సైతం మయూరి వంటి స్ఫూర్తివంతమైన నిజ జీవిత కథలు తీయలేదా?

అయితే ఎన్టీఆర్ వంటి నటుడి స్థాయి నుండి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకు ఆయన జీవిత ప్రయాణాన్ని తీస్తేనే జనం చూడలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ జీవితంలో గ్లామర్ అంశాలు చాలా ఉన్నాయి. కానీ రామోజీరావుగారి జీవితంలో అలాంటివి ఉండవు. కానీ ఖచ్చితంగా ఏమీ లేని స్థాయి నుంచి మీడియా అధిపతిగా ఎదిగే క్రమంలో పడిన ఎదురుదెబ్బలు, చెణుకులు, మెరుపులు ఎన్నో ఉంటాయి. అయితే అవన్నీ చెప్పేదెవరు. అక్షరబద్దం చేసి స్క్రిప్టుగా మార్చేదెవరు. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన జీవితం గురించి సంపూర్తిగా సవివరంగా ఏ పుస్తకాలు రాలేదు.

రామోజీరావు జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, జయాపజయాలు, విమర్శలు, ఆరోపణలు. వివాదాస్పదమైన ఘట్టాలు చాలా ఉన్నాయి. అయితే అవన్నీ తీయటానికి ఒప్పుకుంటారా. రామోజీరావుగారు ఆయన గురించి తమ పత్రికల్లో రాయటానికే ఇష్టపడేవారు. తమ కుటుంబం గురించి కవరేజ్ ఆసక్తి చూపేవారు కాదు. దాంతో ఆయన గురించి అందరికీ తెలిసిన విషయాలే తప్పించి కొత్తవి బయటకు రాలేదు. కానీ ఖచ్చితంగా రామోజీరావు బయోపిక్‌ అనగానే చాలా అంచనాలుంటాయి.

అలాగని కేవలం రామోజీరావు విజయాలనే స్క్రిప్టుగా రాసుకుని సినిమాగా రాస్తే పెద్ద ఆసక్తి ఉండకపోవచ్చు. ఆయన జీవితంలో ఉన్న ఎత్తు, పల్లాలు రెండింటిని చర్చించగలగాలి. మరీ ముఖ్యంగా వైయస్ జగన్ వంటి నాయకులతో విభేధం చూపించగలిగాలి. రాజకీయ అడ్డంకులు, హెచ్చరికలు, బెదిరింపులు ఓ మీడియా అధినేతగా ఆయన ఎదుర్కొని ఉంటే వాటని బయిటపెట్టగలగాలి. కానీ అవన్నీ జరిగే పనేనా?

నిజంగా రామోజీరావుగారిపై సినిమా తీస్తారో లేదో కానీ ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవాలనే ఆలోచన అయితే చాలా మందికి ఉంది. 2011లో ఈనాడు జర్నలిజం స్కూల్ విద్యార్థులు రామోజీరావు 75 వ సంవత్సరం పుట్టినరోజుని పురస్కరించుకుని ’75 వసంతాల వెలుగు’ పేరుతో ఒక పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. ఈ పుస్తకం 291 పేజీలతో రామోజీరావు గురించిన సమగ్ర సమాచారం ఉంది.

1936 కృష్ణా జిల్లా పెదపారుపూడిలో పుట్టిన ఆయన తొలి ఇల్లు జ్ఞాపకంతో మొదలుపెట్టి తల్లి తండ్రులు, పూర్వీకులు, స్కూల్ చదువు, కళాశాల విద్య, ఉద్యోగం, వివాహం, హైదరాబాద్ రావడం, తొలి సంతానం లాంటి వ్యక్తిగత విశేషాలు ఎన్నో పొందుపరిచారు. అలాగే ఈనాడు స్థాపన, మార్గదర్శి చిట్ ఫండ్స్, డాల్ఫిన్ హోటల్, ఎరువుల వ్యాపారం, సితార – అన్నదాత – విపుల – చరిత పత్రికల ఆవిర్భావం, ఉషాకిరణ్ మూవీస్ ప్రస్థానం, ఈటీవీ ఆవిష్కరణ ఇలా చాలా సంగతులు అరుదైన ఫొటోలతో సహా ఇచ్చారు. అయితే ఇవన్నీ ఏకపక్షంగానే సాగుతాయి. ఎందుకంటే ఆ పుస్తకం ఈనాడు సంస్థ నుంచి వచ్చింది కాబట్టి.

అయితే బయోపిక్ తీయాలనుకున్నవాళ్లకు ఈనాడులో పని చేసిన గోవిందరాజు సి చక్రధర్ రాసిన ‘రామోజీరావు ఉన్నది ఉన్నట్టు’ పుస్తకం ఓ అవకాశం అయితే ఇస్తుంది. 2021లో వచ్చిన ఈ పుస్తకం మంచి సెన్సేషన్ అయ్యింది. అందులో ‘కింగ్ మేకర్’ శీర్షిక తో ఈ పుస్తకంలో అయిదవ అధ్యాయంలో ఈనాడు పత్రిక తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ ఆ పార్టీతో దాదాపు ప్రత్యక్షంగా ఎలా మమేకమైందో ఈ అధ్యాయం వివరిస్తుంది. అందులో వాక్యాలు యధాతథంగా చూస్తే...

“చైతన్యరథంపై ఎన్టీఆర్ దూసుకువెడుతుంటే తెరవెనుక ఈనాడు అన్నిరకాల అండదండలనిచ్చింది. ఎన్టీఆర్ కోసం ఉపన్యాసాలు సిద్ధం చేయించి అందజేసింది. చైతన్యరథం ఒక జిల్లా నుంచి మరో జిల్లాలోకి ప్రవేశిస్తుంటే ఈనాడు ప్రతినిధి చైతన్యరథంలో ఎన్టీఆర్ ను కలిసి ఆ జిల్లాకు సంబంధించిన స్థితిగతులను, సమస్యలను సమగ్రంగా వివరిస్తూ నోట్ అందజేసేవారు. ఎన్నికల సర్వే అని చెప్పకపోయినా ప్రజాభిప్రాయసేకరణ పేరిట తన విలేకరుల యంత్రాంగం ద్వారా సమాచారాన్ని సేకరించింది ఈనాడు. ఎక్కడ ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలున్నాయో మదింపు చేసి అభ్యర్థుల జాబితాను రూపొందించింది. బేగంపేట చికోటి గార్డెన్ లోని రామోజీ నివాసంలోనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరిగింది”.

ఇక “స్టాఫ్ దట్ మేటర్స్ ” నాలుగవ అధ్యాయం మరో ఇంట్రస్టింగ్. ఇందులో ఈనాడులో జరిగిన సమ్మెలు, ఉద్యోగస్తుల ఎంపిక విధానం, ఈనాడు నుంచి బయటకు వచ్చి, ఎదిగిన వారిని గురించిన విశేషాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే ఏడవ అధ్యాయం “కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్”లో మార్గదర్శి వివాదం, దాసరి నారాయణరావు, సూపర్ స్టార్ కృష్ణతో వచ్చిన వివాదాలను తెలుసుకోవచ్చు. ఇలాంటివి ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి. ఇలాంటి వాటిన్నటినీ క్రోడీకరించి బయోపిక్ రూపొందించవచ్చు. అయితే అందుకు కావాల్సినంత ఓపిక, రీసెర్చ్, ఎనాలసిస్, మంచి చెడుల విశ్లేషణ కావాలి. అయితే ఈ సినిమాకు ఏం పేరు పెట్టచ్చు అంటారా. కొందరు కింగ్ మేకర్ అని పెట్టాలంటే, మరకొందరు మార్గదర్శి పెడితే బాగుంటుందంటారు. ఈటీవీలో ఆయన పెట్టిన స్ఫూర్తివంతమైన పోగ్రామ్ పేరే మార్గదర్శి. ఇంతకీ ఏ పేరు పెడితే బాగుంటుందంటారు.

Read More
Next Story