ఉత్తమ దర్శకుడు గురుప్రసాద్ ఆత్మహత్య...కారణాలు అనంతం,  పరిశ్రమకు బాధ్యతలేదా?
x

ఉత్తమ దర్శకుడు గురుప్రసాద్ ఆత్మహత్య...కారణాలు అనంతం, పరిశ్రమకు బాధ్యతలేదా?

ప్రముఖ కన్నడ దర్శకుడు గురుప్రసాద్ ఆత్మహత్య జరిగి రెండు రోజులు దాటినా ఇప్పటికీ సినిమావాళ్ళకు జీర్ణం కావటం లేదు..

సినీ పరిశ్రమలో ఫెయిల్యూర్, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు వాటితో వచ్చే డిప్రెషన్ చాలా సామాన్యమైన విషయాలుగా చెప్తూంటారు. అయితే మారిన పరిస్థితుల్లో అవి చాలా వరకు తగ్గాయనే చెప్పాలి. అయితే అక్కడక్కడ అప్పుడప్పుడు జరిగే ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. టాలెంట్ ఉండి, సరైన గుర్తింపు రాక, అవకాశాలు అందుకోలేక, మారిన పరిస్థితులకు ఎడ్జెస్ట్ కాలేక అందులోంచి వచ్చే వేదనను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమే. ప్రముఖ కన్నడ దర్శకుడు గురుప్రసాద్ ఆత్మహత్య జరిగి రెండు రోజులు దాటినా ఇప్పటికీ సినిమావాళ్ళకు జీర్ణం కావడం లేదు.

గురు ప్రసాద్ మరణం వెనుక ఆర్థిక ఇబ్బందులే కారణం అని తెలిసి ఇప్పుడు బాధపడుతున్నారు. బెంగళూరు రూరల్‌ నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లిలోని అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న గురుప్రసాద్‌ (52) ఉరివేసుకున్నారు. ఆయన పూర్తిపేరు గురుప్రసాద్‌ రాఘవేంద్ర శర్మ, కనకపుర స్వస్థలం. సినిమాలపై మోజుతో ఆ రంగంలోకి వచ్చి దర్శకుడయ్యారు. సామాజిక అంశాలను తన సినిమాల్లోకి తీసుకు వచ్చి బాగా చిత్రీకరించేవారు. అన్ని విషయాలపై మంచి అవగాహన ఉన్న ఆయన పరిస్థితి ఇంతలా దిగజారటం మాత్రం బాధాకరమే.

గురు ప్రసాద్ తన 18 ఏళ్ళ సినీ కెరీర్​లో ఐదు సినిమాలకు దర్శకత్వం వహించగా అనేక సినిమాలకు డైలాగ్ రైటర్​గా అలాగే కొన్ని చిత్రాల్లో నటుడిగానూ మెరిశారు. 2006లో వచ్చిన 'మఠ' చిత్రంలో డైరెక్టర్​గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు గురు ప్రసాద్. ఆ సినిమా సక్సెస్ అయ్యి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 2009లో వచ్చిన 'ఎద్దేలు మంజునాథ' కూడా ఘన విజయం సాధించడమే కాకుండా గురు ప్రసాద్​కు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందించింది.

ఆ తర్వాత 2013లో 'డైరెక్టర్ స్పెషల్', 2017లో 'ఎరడనే సలా', 2024లో 'రంగనాయక' అనే చిత్రాలను డైరెక్ట్ చేశారు. అయితే మొదటి రెండు సినిమాలు తప్ప మిగతావేవీ అంతగా విజయం సాధించలేకపోయాయి. అలాగే 'మఠ', 'ఎద్దేలు మంజునాథ','హుడుగారు', 'జిగర్తాండ', 'అనంతు వర్సెస్ నుస్రత్', 'బడవా రాస్కెల్', 'మైలారి' తదితర చిత్రాల్లో నటించారు. అలా ఓ డైరెక్టరే కాకుండా మంచి నటుడుగానూ ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ నటించిన 'హుడుగరు', అలాగే ఉపేంద్ర 'సూపర్ రంగా', అలాగే 'విజిల్' అనే సినిమాకు ఆయన డైలాగ్స్ రాశారు. అయినా ఆయన అప్పులు పాలయ్యారు. ఆర్దిక క్రమశిక్షణ లేకపోవడమే అందుకు కారణం అంటారు.

తాగుడుకి బానిసైన ఆయన అప్పులు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నేను ఆత్మహత్య చేసుకుంటానని సన్నిహితుల వద్ద చెప్పేవాడని తెలిసింది. ఇటీవల ఆయన డైరెక్ట్‌ చేసిన రంగనాయక సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. షూటింగ్‌ ముగిసినా ఓ సినిమా విడుదల కాలేదు. పర్శనల్ లైఫ్ లోనూ మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన గురుప్రసాద్‌ ఇటీవలే రెండవ వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెకు కూడా దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

ఇక సినిమాల కోసం గురుప్రసాద్‌ రూ.3 కోట్ల వరకూ అప్పులు చేశారు. అప్పులు ఇచ్చిన ఫైనాన్షియర్‌లు తరచూ ఒత్తిడి చేయటం ఆయన తట్టుకోలేకపోయారు. ఆ బాధ పడలేక ఆయన తరచూ ఇళ్లు మారుస్తూ వచ్చారు.. అప్పులతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి. చెక్‌ బౌన్స్‌ కేసులో ఒకసారి అరెస్టయ్యారు. ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.అయినా ఫలితం ఏముంది.

మంచి టాలెంట్ ఉన్న ఈ దర్శకుడు అప్పుల బాధ నుంచి బయటపడే ప్రయత్నాలు ఏమీ సక్సెస్ కాలేకపోవడం ఈ విషాదానికి దారి తీసింది. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాల్లో దర్శకులుగా ఛాన్స్ లు లేనివారు నటులుగా మారుతున్నారు. డైలాగ్ రైటర్ గా రాణిస్తున్నారు. యూట్యూబ్ వంటి వాటితో తమ జీవితాన్ని మళ్లీ దారిలో పెట్టుకుంటున్నారు. కానీ గురుప్రసాద్ కు తన స్థాయికి మించిన అప్పులతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి...డిప్రెషన్ సూసైడ్ కు దారి తీసేలా చేసాయి.

సినిమా పరిశ్రమలో ఎవరి దారి వారిదే అన్నట్లు ఉంటుంది. ఆయనతో పనిచేసిన వారు కానీ, ఆయన సినిమాల వల్ల లబ్ధి పొంది ఎదిగిన వారు కానీ ఏ మాత్రం సాయం చేసినా ఈ సిచువేషన్ క్రియేట్ అయ్యేది కాదు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. ఆయన్ను ఒడ్డున పడేయలేదు. ఆయన దారి ఆయన చూసుకున్నారు. అది ఆయన సినిమాలను అభిమానించే వారికి చాలా కష్టమైన విషయం. టాలెంట్ ను కాపాడుకోలేని దుస్థితి. ఏదైమైనా ఇంకొకరికి ఇలాంటి పరిస్థితి రాకుండా పరిశ్రమ ఏ మాత్రం కాస్త జాగ్రత్తపడినా మరిన్ని చావులు తప్పుతాయి.

Read More
Next Story