‘డాకు మహారాజ్’కి వింత పరిస్థితి: బజ్ లేదు, భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు
సంక్రాంతి సినిమా సంబరాలు గేమ్ ఛేంజర్ సినిమా తో మరికొద్ది గంటల్లో మొదలు కానున్నాయి.
సంక్రాంతి సినిమా సంబరాలు గేమ్ ఛేంజర్ సినిమా తో మరికొద్ది గంటల్లో మొదలు కానున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ మంచి ఊపు మీద ఉన్నాయి. సినిమాకు కావాల్సినంత బజ్ క్రియేట్ చేసి పెట్టాయి. రిజల్ట్ ను బట్టి ఆ సినిమా సక్సెస్ ఏ స్దాయి అని తేలిపోతుంది. అలాగే దిల్ రాజు మరో చిత్రం సంక్రాంతికి వస్తున్నాం కు కూడా ఇప్పటికే కావాల్సినంత క్రేజ్ ని ప్రమోషన్స్ తో అనిల్ రావిపూడి, వెంకటేష్ తెచ్చి పెట్టారు. అయితే మధ్యలో వచ్చే బాలయ్య డాకూ మహారాజ్ కే ఎక్కడా బజ్ వినపడటం లేదు. చాలా సైలెంట్ గా ఉంది. సినిమా రిలీజ్ అనేది తప్పించి మిగతా విషయాలు కాని చివరకు గాసిప్స్ కూడా ఈ సినిమా గురించి ఎక్కడా వినిపించటం లేదు. ఇది నందమూరి అభిమానులను ఆశ్చర్యం తో పాటు సాధారణ ప్రేక్షకులను నిరాశలో ముంచెత్తుతోంది. ఎక్కడ సమస్య ఉందో ఎవరికీ అర్థం కావడం లేదు.
వాస్తవానికి బాలయ్య కు సంక్రాంతి బాగా కలిసొచ్చిన పండగ. అందులోనూ వరుస బ్లాక్ బస్టర్ తో ఊపుమీదున్నాడు బాలకృష్ణ . అలాగే వాల్తేరు వీరయ్య వంటి కమర్షియల్ హిట్ ఇచ్చిన బాబి డైరక్షన్. అయినా ఎక్కడా చడీ చప్పుడు లేదు. ఈ సినిమా కూడా పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే నిండి ఉందని, ఎప్పుడూ చూడని ఒక స్టైలిష్ యాక్షన్ సినిమా ఇస్తామని నిర్మాత నాగవంశీ అనేక ఇంటర్వ్యూలలో చెప్పారు. వీటిన్నటితో అభిమానుల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. కానీ సినిమా గురించి సామాన్య ప్రేక్షకులు ఎక్కడా డిస్కస్ చేయకపోవటం, సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా ప్రస్తావన పెద్దగా వినపడకపోవటం వింతగా అనిపిస్తుంది.
అందుకు కారణం ఇప్పటిదాకా కథకు సంబంధించిన క్లూస్ ఇచ్చేలా ఎలాంటి కంటెంట్ వదలక పోవడం అని ట్రేడ్ అంటోంది. అమెరికా డల్లాస్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ లాంఛనం పూర్తి అయ్యింది. అక్కడ పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. ఎక్కడ జరిగింది లోపం అంటే..డిజిటల్ మార్కెటింగ్ సరిగ్గా లేకపోవడమే అనేది నెటిజన్లు ఉవాచ.అలాగే సినిమా రిలీజ్ కు ముందు నుంచి ఓ ప్లానింగ్ ప్రకారం పబ్లిసిటీ క్యాంపైన్ కూడా ఈ సినిమాకు నిర్వహించకపోవడం ఓ కావచ్చు. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల స్థాయిలో ఈ సినిమాకు పబ్లిసిటీ జరగలేదు.
ట్రైలర్ బాగున్నా....
ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ఉన్నప్పటికీ, ఎలాంటి కథ చూడబోతున్నాం అనే విషయంలో క్లారిటీ లేదు. ఈ సినిమా గురించి మాట్లాడుకోవటానికి క్లూలెస్‌గా కనిపిస్తుంది. ప్రత్యేకమైన ప్లానింగ్ ని ప్రక్కన పెట్టినా బేసిక్ కంటెంట్‌ను ప్రేక్షకులకు ఇవ్వటంలో కూడా వారు కష్టపడుతున్నారని అర్దమవుతోంది. డల్లాస్‌లో కేంద్ర మంత్రి పెమ్మసాని సమక్షంలో, జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్, భారీ ఖర్చు పెట్టినా ప్రేక్షకులలో చెప్పుకోదగ్గ సెన్సేషన్ క్రియేట్ చేయలేకపోయింది. బాలయ్యకు భారీగా ఎన్‌ఆర్‌ఐ అభిమానులు ఉన్నారు, కానీ ఇప్పటికీ అక్కడ స్పీడు లేదు.
చూస్తుంటే కేవలం నిర్మాత నాగ వంశీ మాత్రమే ఈ సినిమా ప్రమోషన్‌లను తన భుజాలపై మోస్తూ మీడియాకు కంటెంట్ ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన శక్తి చాలటం లేదు. సినిమా డిజిటల్ ఔట్రీచ్ చాలా తక్కువగా ఉంది. బాలకృష్ణ, తన వంతుగా, ప్రమోషన్లకు పూర్తిగా సపోర్ట్ ఇస్తూ, కొంత ఇంట్రస్ట్ ని కలిగించడానికి అన్‌స్టాపబుల్ వంటి షోలలో కనిపించాడు.
గేమ్ ఛేంజర్ యొక్క USA ఈవెంట్ అద్భుతమైన సక్సెస్ సాధించింది. అయితే డాకు మహారాజ్ కు ఈ ఊపు లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది.ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ చూస్తూంటే బాలకృష్ణ రీసెంట్ గా వచ్చిన హిట్‌ల కంటే భారీ ఓపెనింగ్స్‌ని అందజేస్తుందని ఎక్సెపెక్టేషన్స్ ఉన్నాయి. వాటిని ఇలాంటి పూర్ ప్రమోషన్స్ తో ఎలా అందుకోగలుగుతారనేది పెద్ద సమస్య.
ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాయలసీమలోని అనంతపురంలో గురువారం నిర్వహించాలని చిత్ర టీమ్ నిర్ణయించింది. అందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తి అయ్యాయి. బాలయ్య అభిమానుల కోలాహలం మధ్య జరగనున్న ఈ కార్యక్రమానికి బాలయ్య అల్లుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు.
అయితే ఏ ఒక్కరూ ఊహించని విధంగా బుధవారం రాత్రి తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో తోపులాట జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు సహా ఆరుగురు చనిపోయారు. దీంతో ఏపీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ విషాద ఘటనకు సంతాప సూచకంగా బాలయ్య సినిమా వేడుకను రద్దు చేస్తూ ఆ సినిమా నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా రిలీజ్ దగ్గర పడటంతో ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండదని తెలుస్తోంది. ఇది పెద్ద దెబ్బే.
టైమ్ బాగా తక్కువ
ఏదైమైనా టీమ్ డాకు మహారాజ్ ఈ నాలుగు రోజులు పూర్తిగా వినియోగించుకోవాలి. సినిమా ప్రమోషన్స్ విన్నూతనంగా ప్లాన్ చేయాలి. తమ దగ్గర ఉన్న కంటెంట్‌ను జనాల్లోకి తీసుకెళ్లటానికి ఇది సరైన సమయం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి బ్యానర్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై తనదైన ముద్ర వేయాలి. చిత్రనిర్మాతలు కూడా తమ డిజిటల్ విధానాన్ని స్ట్రాంగ్ చేసుకుని, సోషల్ మీడియా ప్రాముఖ్యతను గుర్తించాలి.
డాకూ మహారాజ్ లో ...జనం రాజుగా పిలుచుకునే ఒక మంచివాడు గా బాలకృష్ణ కనిపిస్తున్నారు . బందిపోట్ల పాలిట సింహస్వప్నం. హఠాత్తుగా ఒక రోజు నానాజీగా స్కూలుకు వెళ్లే పాప ముందు ప్రత్యక్షమవుతాడు. తర్వాత కొన్ని రోజులకు మరో వేషంలో సీతారాంగా దర్శనమిస్తాడు. ఇంకోవైపు బయటికి కనిపించని ఒక చీకటి ప్రపంచంలో జంతువులతో వ్యాపారం చేసే ఒక రాక్షసుడు (బాబీ డియోల్) వల్ల ప్రజలు బానిసలుగా మారి కష్టాలు పడుతూ ఉంటారు. అసలు డాకు అంటే ఎవరు, అతనికి పాపకు ఉన్న సంబంధం ఏమిటి, శత్రువులతో ఏర్పడిన గొడవలో ఎవరెవరు భాగమయ్యారు అనే ప్రశ్నలకు సమాధానం జనవరి 12 థియేటర్లలో చూడాలి.