పుష్ప 2: సృజనాత్మక సింగినాదం, కళాత్మక దొంగ వేషం!
అచ్చతెలుగు రజనీకాంత్ అల్లు అర్జున్
పిడుగులా వచ్చి పడింది ' పుష్ప-2'.
రికార్డు బద్దలై, బాక్స్ ఆఫీసులు తునాతునకలై నోట్లు కాదు బంగారు కాసులే కురుస్తున్నాయి. తెలుగు సినిమా చరిత్రని ఒక కొత్త మలుపు తిప్పింది పుష్ప.
ఎందుకిలా జరుగుతోంది?
ఈ ఫక్తు వ్యాపార సినిమాలో ఏముందసలు?
ఎందుకిలా జనం థియేటర్లకు పోటెత్తుతున్నారు?
ఇదొక బ్లాక్ బస్టర్ ఫార్ములా చిత్రం.
అంటే విషయం తక్కువ
విజువల్స్ ఎక్కువ!
యాక్షన్, సస్పెన్స్ తో పరిగెత్తించే సూపర్ థ్రిల్లర్. చాలా ఎంగేజింగ్ గా ఉండే మసాలా ఎంటర్ టైనర్. నిన్ను పాప్ కార్న్ తిననివ్వదు. కుర్చీలో కూర్చోనివ్వదు. సీన్ వెంట సీన్. ఫ్రేమ్ వెంట ఫ్రేమ్. వెన్నాడే దృశ్యాలు . హత్తుకునే సంగీతమ్!
రావటం రావడమే అల్లు అర్జున్, ఒక కాలికి గట్టిగా కట్టేసిన తాడుతో ఆకాశంలో వేలాడుతుంటాడు. కింద సముద్రం!
ఒక సీన్లో హీరో ఎడమ భుజం మీద చొక్కా కాలిపోతూ ఉంటుంది. ఒక క్లోజప్. అల్లు అర్జున్ లెఫ్ట్ కి తిరిగి చూస్తాడు. ఆ మంటతో నోట్లో ఉన్న పొడవాటి సిగరెట్ వెలిగిస్తాడు. ఇలాంటి కమర్షియల్ ఎలివేషన్లు కుమ్మేస్తాయి సినిమాలో.
పాత కథకి కొనసాగింపే... ఎర్రచందనం స్మగ్లింగ్. పొట్టగడవడానికి తిప్పలు పడే చదువులేని ఒక కూలివాడు చందనం స్మగ్లింగ్ సామ్రాజ్యానికి కింగ్ కావడమే, చక్రం తిప్పడమే ఈ విజయ గాధ.
కథ చెబితేనో, రెండు పాటలు బావుంటేనో చాలదు. జనం జేబులోంచి వెయ్యి కోట్లు కొట్టేయాలంటే దానికో
పెద్ద గేమ్ ఆడాలి. దాన్నే బ్లాక్ బస్టర్ టెక్నిక్ అంటారు. ప్రేక్షకుడికి ఊపిరి సలప కూడదు. వాడు నవ్వాలి. త్రిల్లవ్వాలి. ఒక షాక్ లోనే ఉండాలి. పంచ్ డైలాగు, ఫైటు, పాట, ఛేజ్, డ్యాన్స్, కత్తులు, తుపాకులు, నెత్తురు... జనం బెంబేలెత్తి పోవాలి. అదే చేసింది పుష్ప-2 The Rule. సింగినాదమే- అయినా అది సృజనాత్మకంగా ఉండాలి. దొంగ వేషమే అయినా అది కళాత్మకంగా పండాలి. అంతేనా, హీరో, హీరోయిన్, విలన్, జనం కంపించి పోయే తీవ్ర భావోద్వేగంతో నటించి శభాష్ అనిపించుకోవాలి. ‘తగ్గేదేలా’ అనే మాటకి ఏ మాత్రం తగ్గకుండా ఉండాలి. దీన్నే హిందీలో ‘జుకేగా నహీ సాలా’ అంటే యావత్ ఉత్తర భారత దేశం అల్లు అర్జున్ కు సరండరై పోతోంది.
ఇప్పటికే జనానికి బాగా నచ్చిన, విమర్శకులు మెచ్చిన ఉద్వేగ పూరితమైన జాతరలో అల్లు అర్జున్ డ్యాన్ సీను చూసి తీరవలసిందే. అతి చిన్న డీటెయిల్స్ పట్ల అలవి మాలిన శ్రద్ధతో గంగమ్మ జాత సంబరాన్ని కంపోజ్ చేసిన తీరుని అభినందించాలి. ఆ ఊపు, ఆ వేగం, ఆ రౌద్రం చెరగని ముద్ర వేస్తాయి. శ్రీవల్లిగా పాపులర్ అయిన రష్మికా మందన్న ఉదారంగా వొళ్లు ప్రదర్శించి, ఎగిరెగిరి డ్యాన్స్ చేసి కలవరపెట్టేలా నవ్వి కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసింది. విలన్ గా పోలీస్ అధికారిగా బన్వర్ లాల్ సింగ్ షెకావత్ పాత్రలో ఫాహద్ ఫాజిల్ చెలరేగి పోయాడు. హీరో పొగరు, విలన్ దురహంకారం ఆ రెండు పాత్రల ఘర్షణ సినిమాని ఒక మెట్టు పైకి తీసుకెళ్లాయి.
సాహిత్యంలో కళలో ఎలిమెంట్ ఆఫ్ షాక్ అనేది ఒకటుంటుంది. ఒక స్మిమ్మింగ్ పూల్ లో అల్లు అర్జున్ ఉచ్చపోస్తూ ఉంటాడు. ఆ..అని మనం షాక్ లో నుంచి తేరుకోకముందే “అవమానం భరించడం కష్టంగాని, వచ్చినపుడు పోసుకోవాడానికేముంది,” అంటాడు హీరో. తెలుగు సినిమాల్లో ఇలాంటివి చాలా అరుదు. దేన్నయినా సరే, చెంప చెళ్లుమనేట్టు, మాడు పగిలేట్టు చెప్పడమే డైరెక్టర్ సుకుమార్ విజయరహస్యం.
కొందరు వ్యక్తిత్వ వికాసంగాళ్లు, ‘హౌటు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ ఫ్లు యెన్స్ పీపుల్ ’ అని రాస్తూ ఉంటారు. ప్రేక్షకుల డబ్బులు తీసుకుని వాళ్లనే చిత్తుచిత్తుగా వోడించగల సినీ మాయగాడు, అల్టిమేట్ జూదగాడు సుకుమార్ – ది అన్ స్టాపబుల్ ! మొదటి సీన్ లో ఎక్కిన కిక్కు మూడుగంటల దాకా దిగకుండా నిలబెట్టిన మొనగాడు, పుష్పకి ప్రాణవాయువు సుకుమార్.
అగ్నికెరటాల్లా కదులుతున్న ఉద్రిక్త సన్నివేశాల మధ్య గొప్ప రిలీఫ్ లాగా ఒక పాట మొదలవుతుంది. అందాలు చిందే శ్ర్రీవల్లి, “’సూసేకి అగ్గి రవ్వ మాదిరే ఉంటాడు నా సామీ, మెత్తాని పత్తి పువ్వు వంటోడే నా సామీ,” అంటుంది.శ్రేయ ఘో షల్ గొంతుకి తేనె పూసి పాడిన ఆ పాట గుండెను తియ్యగా కోసేస్తుంది. మొత్తానికి ఈ సాంగ్ అండ్ డ్యాన్స్ డ్రామా అనే విజువల్ వండర్ ప్రేక్షకుడి మనసులో ఒక అనుభవంగా దాగి ఉంటుంది.
పుష్ప-2ని టెక్నికల్‌గా రెండు గొప్ప నైపుణ్యాలు నిలబెట్టాయి. ఒకటి: దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్లస్ సౌండ్ ఎఫెక్ట్స్. రెండు: అడవుల్లోకి, కొండల్లోకి, నదుల్లోకి మనల్ని లాక్కుపోయే ఫొటోగ్రఫీ. ఆయన పోలెండ్ దేశస్తుడు. పేరు మిరొస్లావ్ కూబా బ్రోజక్. ఇప్పటికే ఒక ఫిలిం ఫేర్ అవార్డు పొందిన ఉత్తమ సినిమా ఫొటోగ్రాఫర్ తెరమీద సన్నివేశాన్ని స్టన్నింగ్‌గా పండించడంలో, దాన్ని మన గుండెల్లో బాకుగా దించడంలో సూపర్ స్పెషలిస్ట్.
వందల కోట్ల ఖర్చు చేసి సినిమా తీసేస్తే సరిపోదు. తగిన హంగామా, ప్లానింగ్, పబ్లిసిటీ అవసరం. పుష్ప ట్రైలర్‌ని బీహార్ రాజధాని పట్నాలో రిలీజ్ చేశారు. తెలుగోడి దెబ్బంటే ఎలా ఉంటుందో తెలియని బీహారీలు పుష్ప దూకుడు చూసి పులకించిపోయారు. ఏకంగా రెండు లక్షల మంది ఆ సభకి వచ్చారు. ఉత్తర భారతదేశాన్ని జయించడం చాలా కీలకం అని మన తెలివైన నిర్మాతలు గ్రహించారు. ముంబై, ఢిల్లీ కాదు కొడితే వెనకబడిన బీహార్‌నే కొట్టాలి అనే వ్యూహాన్ని అమలు చేశారు. ఉత్తరాది రాష్ట్రాల జనమంతా ఇప్పుడు అల్లు అర్జున్‌నీ, రష్మికనీ చూడాలని తహతహలాడుతున్నారు. కేరళలో ‘మల్లు అర్జున్’ ఇప్పటికే పాపులర్ నటుడు. అటు చూస్తే అమెరికాలోనూ కోటి డాలర్ల వసూలు చేసి ముందుకు దూసపుకుపోతోంది పుష్ప.
ఇది నిస్సందేహంగా అంతర్జాతీయ వేదిక మీద తెలుగు సినిమా ఎగరేసిన విజయపతాకం. పచ్చి కమర్షియల్ సినిమానే, ఎంటర్ టైన్మెంట్ ముసుగేసిన పగా ప్రతీకారాల నాటకమే. అయితే ఇది వందల కోట్లతో ఆడిన పేకాట. హాలీవుడ్ చేస్తున్న పనీ ఇదే. మన హిందీ వ్యాపార యానిమల్స్ తీస్తున్నదీ ఇలాంటి చిత్రాలే. వారం తిరక్కుండానే 800కోట్ల రూపాయలు వసూలు చేసిన ఒక ప్రాంతీయ తెలుగు చిత్రంగా పుష్ప చరిత్ర సృష్టించింది. రాంగోపాలవర్మ శభాష్ అల్లు అర్జున్ అంటే, రాజమౌళి అదరగొట్టావ్ సుకుమార్ అన్నారు. విజయం -డబ్బు - ప్రతిష్ఠ అనే త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తున్న తెలుగు హీరో దర్శక నిర్మాతలు ముసిముసిగా నవ్వుతున్నారు.