గీతాంజలి మళ్లీ వచ్చింది, నవ్వించింది కూడా
x

గీతాంజలి మళ్లీ వచ్చింది, నవ్వించింది కూడా

గీతాంజల్ సీక్వెల్‌గా వచ్చిన గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా కూడా అందరినీ నవ్విచ్చింది. ఈ మూవీలో కామెడీ ఎంతలా పండిందంటే..


(సలీం బాషా)


సినిమా మొదట్లోనే " స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు వెంటనే మానేయాలి. లేకుంటే దెయ్యాలయిపోతారు" అని చెప్పించడం క్రియేటివ్‌గా, అర్థవంతంగా ఉంది. సినిమా గురించి చెప్పగానే చెప్పినట్లుంది

ఫలించిన మార్పులు చేర్పులు

ఈ మధ్యకాలంలో తెలుగులో సీక్వెల్స్ రావడం మొదలైంది. 2014లో వచ్చిన "గీతాంజలి" కి సీక్వెల్‌గా వచ్చిన సినిమా " గీతాంజలి మళ్లీ వచ్చింది". మొదటి సినిమా ఓ మోస్తారు విజయవంతం అయినా. ఈ సీక్వెల్‌లో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. ప్రధానమైన మార్పు దర్శకత్వంలో జరిగింది. మొదటి సినిమా దర్శకుడు రాజ్ కిరణ్ స్థానంలో శివ తుర్లపాటి, సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ బదులుగా సుజాత సిద్ధార్థ్, ఎడిటర్ అటుకూరి తేజ స్థానంలో చోటా కె ప్రసాద్ వచ్చారు.

మొదటి సినిమా కథ రాజ్ కిరణ్ రాయగా, సీక్వెల్ సినిమా కథని కోన వెంకట్ రాశాడు. అంతే కాకుండా కోన వెంకట్ ఈ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించాడు. ఇంకా కొన్ని చిన్న చిన్న మార్పులు జరిగాయి. ఈ సినిమాలో రైటింగ్ డిపార్ట్‌మెంట్లో అదనంగా భాను భోగవరపు (స్క్రీన్ ప్లే), నందు సవిరిగణ,(కథ) వచ్చారు. వీళ్లే సినిమాకు డైలాగులు అందించారు. తారాగణంలో కూడా కొన్ని మార్పులు జరిగాయి. మొదటి సినిమాలో ఉన్న ప్రముఖ నటుడు బ్రహ్మానందం, రావు రమేష్, వెన్నెల కిషోర్, సప్తగిరి, రఘుబాబు లాంటి వారు ఈ సినిమాలో లేరు. అంతేకాకుండా సీక్వెల్లో సునీల్, పి రవిశంకర్‌లు ఉన్నారు. అదనంగా మలయాళీ నటుడు " రాహుల్ మాధవ్" ఈ సినిమాలో ఎంట్రీ ఇచ్చాడు.

సీక్వెల్ కూడా నవ్వించింది

గీతాంజలి సిరీస్‌లో వచ్చిన సీక్వెల్ " గీతాంజలి మళ్లీ వచ్చింది", రెండోసారి కూడా నవ్వించింది. సాధారణంగా హారర్ కామెడీ సినిమాలకు సీక్వెల్స్ తీయడం పెద్ద సాహసమే. రెండు రకాలుగా కంపేర్ చేసుకుంటారు ప్రేక్షకులు. ఒకటి కామెడీ దేనిలో ఎక్కువ ఉంది. రెండు ఏది ఎక్కువ భయపెట్టింది. నిజానికి హారర్ కామెడీ సినిమాల్లో హారర్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒకవేళ చేసినా ఆ హారర్‌లో ఎంత కామెడీ ఉందో ముఖ్యం. . ఈ విషయంలో "గీతాంజలి మళ్లీ వచ్చింది", విజయం సాధించిందని చెప్పవచ్చు.

మ్యాజిక్ చేసిన లాజిక్

సినిమా అంటేనే లాజిక్ ఉండదు. పైగా ఇది హారర్ కామెడీ సినిమా. ఇంకేం లాజిక్ ఉంటుంది అనుకోవచ్చు. అయితే దర్శకుడు ఇలాంటి సీక్వెల్ సినిమాలో మొదటి సినిమాని క్రియేటివ్‌గా కనెక్ట్ చేసి, ఊహించని ఒక ఇంటర్వెల్ ట్విస్ట్ పెట్టి, రెండో భాగాన్ని కామెడీతో కూడిన హారర్ చేసి(మొదటి సినిమాలో హారర్ కొంచెం ఎక్కువే ఉంది) ఒక ఎంటర్టైనర్ తయారు చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అదే సినిమా బలం. సీక్వెల్ కథను ఈ సారి కోన వెంకట్ రాశాడు. మొదటి సినిమాలో సినిమా కథ చెప్పి, దాన్ని తీసిన తర్వాత మిగతా మూడు సినిమాలు వరుసగా ప్లాప్ సినిమాలు కావడం వల్ల కష్టపడుతున్న శ్రీను( శ్రీనివాసరెడ్డి) ఆరుద్ర, ఆత్రేయ జట్టుతో కలిసి ఇక లాభం లేదని తిరిగి తన ఊరికి వెళ్లిపోవాలని అనుకుంటున్న సమయంలో, అనుకోకుండా ఒక ప్రొడ్యూసర్ అతనికి ఛాన్స్ ఇవ్వడం. ఊటీలో ఉన్న సంగీత మహల్‌లోనే షూటింగ్ చేయాలని చెప్పడం, ఆ షూటింగ్ సమయంలో శ్రీనివాస్ రెడ్డి బృందం ఎదుర్కొన్న కష్టాలు, దెయ్యాలతో ఈ సినిమా కథ నడుస్తుంది. మొదటి భాగంలో కామెడీ బాగానే పండించిన తర్వాత, ఇంతకు ముందు చెప్పిన ఇంటర్వెల్ ట్విస్ట్ ద్వారా రెండో భాగాన్ని నడపడానికి ఒక వేదికను తయారు చేసుకున్నాడు దర్శకుడు. రెండో సగభాగంలో హారర్ కామెడీని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లి చివరికి దయ్యాలతో ఏం చేయించాడు, ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా ముగించాడు అన్నది కథ.

నవ్వులు పంచిన, నటీనటులు

ఈ సినిమాకు బలం నటీనటులే. అందులో మొదటి మార్కు జాయింట్‌గా సాధించిన వారు కమెడియన్ సత్య, సునీల్. కొన్ని సన్నివేశాలు సత్య నటన, కామెడీ టాప్ లెవెల్‌లో ఉంది. అదేవిధంగా చాలా రోజుల తర్వాత సునీల్ కూడా డీసెంట్ కామెడీని తన స్థాయిలో పండించాడు. మెథడ్ యాక్టింగ్ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతాయి. అంజలీ తన 50వ సినిమాలో పర్వాలేదనిపించింది. ఇక సత్యం రాజేష్, షకలక శంకర్ మొదటి సినిమాలాగే రెండో సినిమాలో కూడా కామెడీని పండించగలిగారు. ఇక్కడ సర్ప్రైజ్ ప్యాకేజీ విష్ణు పాత్రలో మలయాళ నటుడు రాహుల్ మాధవ్. కీలకమైన పాత్రను చాలా డీసెంట్‌గా చేసుకుంటూ వెళ్ళాడు. ఈ సినిమాలో ప్రేక్షకులు విరగబడి నవ్విన సన్నివేశాలు, నవ్వుకున్న సన్నివేశాలు చాలా ఉన్నాయి. అలాంటి ఒక సన్నివేశం సినీ జర్నలిస్టులతో ప్రెస్ కాన్ఫరెన్స్. ఇక్కడ కూడా జర్నలిస్ట్ సురేష్ కొండేటి తన స్టైల్‌లో ఒకటి రెండు ప్రశ్నలు అడగడం సరదాగా ఉంది

టాలెంట్ చూపిన దర్శకుడు

"Too many cooks spoil the dish" అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. అయితే ఈ సినిమాలో ఎక్కువమంది కమెడియన్స్ ఉన్నప్పటికీ, డిష్ మాత్రం తినదగ్గదిగా తయారు చేయడంలో సినిమా టీం సక్సెస్ అయింది. చాలామంది ఆర్టిస్టులు ఉన్నప్పటికీ, ఎవరిని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడటం అనేది ఈ సినిమాకి పనికి వచ్చింది. ఉదాహరణకు ఈ సినిమాలో అలీ ఉన్నాడు. అయితే పూర్తిస్థాయిలో లేడు. ఇక్కడే డైరెక్టర్ తెలివిగా వ్యవహరించాడు. ఒక వెంట్రిలాక్విస్ట్‌గా(బొమ్మతో మాట్లాడించే కళాకారుడు) అలీని ఉపయోగించుకున్నాడు. అలీ సునాయాసంగా ఆ పాత్రను పోషించాడు. అలాగే సునీల్ పాత్ర. చాలా రోజుల తర్వాత సునీల్ తన టాలెంట్ ను చూపించాడు. ఈ సినిమాలో దిల్ రాజును నిజజీవిత పాత్రలో కాసేపు చూపించడం బాగా వర్కౌట్ అయింది. మొదటి సినిమాలో ఉన్న కొంతమంది నటులు దీనిలో లేకపోవడం వల్ల ఇబ్బంది ఏమీ కలగలేదు. ఇలాంటి సినిమాలో పాటలు, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద స్థాయిలో అవసరం లేదు. కాబట్టి వాటి జోలికి దర్శకుడు పెద్దగా వెళ్లలేదు. దెయ్యాలు కనిపించినప్పుడు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. సినిమా మొదట్లో ఒక పాట ఆకలిరాజ్యం సినిమాలోని " సాపాటు ఎటూ లేదు" తరహాలో ఉండి కృష్ణానగర్ సినీ ఔత్సాహికుల సినిమా కష్టాలను ప్రతిబింబించింది.

అలరించే సన్నివేశాలు- పేలిన మాటల తూటాలు

ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. అందులో దెయ్యాలతో చేయించిన డాన్స్ సన్నివేశం ఒకటి. ముఖ్యమైన సన్నివేశం దెయ్యం ఏడుస్తున్నప్పుడు, సత్య వచ్చి.. ఎలా ఏడవాలో, ఎన్ని రకాలుగా ఏడవొచ్చో సత్య చేసి చూపించడం సినిమాలో హైలెట్. సంగీత్ మహల్‌లో శ్రీనివాస్ రెడ్డి టీం షూటింగ్ సన్నివేశాలు నవ్వులు కురిపిస్తాయి.

ఈ సినిమాకు మరో ముఖ్యమైన ఎంటర్టైనర్ పాయింట్ థియేటర్లో పేలిన పంచ్ డైలాగులు. " నువ్వు సినిమా తీయడానికి వచ్చావా? ప్రాణం తీయడానికి వచ్చావా?", " ఈ ఆడవాళ్ళు అంతే, ఇంటికి ఎవరు వచ్చినా ఆల్బమ్ చూపిస్తారు" అన్న సందర్భోచితమైన మాటలు. " దెయ్యం పాపం భయపడినట్టుంది", అనే క్రియేటివ్ డైలాగులు. మరో ముఖ్యమైన సీన్ లో ఉన్న డైలాగులు చెప్పాలి. బొమ్మలో ఉన్న దెయ్యం కారులో ఉన్న అలీని "నాక్కూడా సీట్ బెల్ట్ పెట్టు" అని ఆర్డర్ వేసినప్పుడు, అలీ పట్టించుకోకపోతే "బెల్ట్ పెడతావా లేక చస్తావా" అని బొమ్మలో ఉన్న దెయ్యం చెప్పినప్పుడు "? చచ్చినట్టు పెడతా" అని ఆలీ చెప్పడం క్రియేటివ్‌గా ఉంది. ఇలాంటివి సినిమాలో చాలా ఉన్నాయి

ఇంత చెప్పిన తర్వాత ఈ సినిమాలో లోపాలు లేవని కాదు. అదే పనిగా వెతికితే కొన్ని, వెతక్కుండానే మరికొన్ని మనకు కనిపిస్తాయి. కానీ ఓవరాల్‌గా సినిమా అటువంటి లోపాలను ప్రేక్షకులు పట్టించుకోకుండా ఉండేలా చేయగలిగింది. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో టిల్లు స్క్వేర్ ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తోంది. అలాగే ఈ సినిమా కూడా నవ్విస్తూ ఎంటర్‌టైన్ చేస్తుంది. ఈ వేసవిలో వినోదం కోసం, రిలీఫ్ కోసం ఈ సినిమా ఎవరైనా చూడొచ్చు

దర్శకత్వం: శివ తుర్లపాటి

కథ :కోన వెంకట్

రచన: భాను భోగవరపు (స్క్రీన్ ప్లే), నందు సవిరిగణ,

తారాగణం: అంజలి,శ్రీనివాస రెడ్డి,సత్యం రాజేష్,సత్య,షకలక శంకర్, అలీ,బ్రహ్మాజీ

పి. రవిశంకర్,రాహుల్ మాధవ్,సునీల్,సిద్ధార్థ్ గొల్లపూడి

నిర్మాతలు: ఎం.వి.వి. సత్యనారాయణ,కోన వెంకట్

సంగీతం :ప్రవీణ్ లక్కరాజు

ఛాయాగ్రహణం: సుజాత సిద్ధార్థ్, సుహత సిద్ధార్థ

ఎడిటర్: ఛోటా కె. ప్రసాద్

నిర్మాణసంస్థ:ఎం.వి.వి.సినిమా

విడుదల తేదీ:ఏప్రిల్ 11, 2024

Read More
Next Story