
ప్రేక్షకులకు ఊరటా? లేక మరొక భ్రమా?
కొత్త GST రేట్లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా GST సవరణలు సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు ముఖ్యంగా సినిమా టికెట్ ధరలపై ఎలా ప్రతిఫలిస్తాయో అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే, గత కొంతకాలంగా పెరిగిపోయిన ఆపరేటింగ్ ఖర్చులు, పెరుగుతున్న డిస్ట్రిబ్యూషన్ షేర్లు, మల్టీప్లెక్స్ కల్చర్ వలన టికెట్ ధరల సమస్య తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది.
కొత్త GST స్లాబ్‌లు ప్రవేశపెట్టడం వల్ల సింగిల్ స్క్రీన్‌లకు కొంత ఊరట లభించవచ్చన్న అభిప్రాయం ఉన్నప్పటికీ, సమగ్రంగా చూసినప్పుడు ఈ సవరణలు టికెట్ ధరల వ్యవస్థను మార్చేంత ప్రభావం చూపే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ లెక్కలు ఓ సారి చూద్దాం.
1. GST కట్ – పేపర్‌లో బలంగా, ప్రాక్టికల్‌గా బలహీనం
మునుపు ₹100 లోపు టికెట్‌పై 12% GST ఉండేది. ఇప్పుడు అది కేవలం 5%కి తగ్గింది. కాగితంపై చూస్తే ఇది పెద్ద రాయితీలా కనిపిస్తుంది. కానీ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలోనూ, చిన్న పట్టణాల్లోనూ కూడా ₹100 లోపు టికెట్ ధర చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తోంది. బాగా చిన్న పంచాయితీల పరథిలో ఉన్న థియేటర్స్ లోనే ఈ టిక్కెట్ ధరలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కువమందికి ఈ తగ్గింపుతో ఎలాంటి ఫలితం రాదు.
2. ₹100 పైగా ఉన్న టికెట్‌లపై 18% GST కొనసాగింపు
మెయిన్ రెవెన్యూ తెచ్చిపెట్టేది మల్టీప్లెక్స్‌లు, A-సెంటర్ థియేటర్‌లు. వీటిలో టికెట్ ధరలు ఎక్కువగా ₹150–₹300 మధ్యలో ఉంటాయి. ఇవన్నీ 18% GST పరిధిలోనే ఉంటాయి. కాబట్టి మల్టీప్లెక్స్ కల్చర్‌ను ప్రభావితం చేసేంత మార్పు జరగదు.
3. సింగిల్ స్క్రీన్ థియేటర్‌లకు కొంత ఊరట
కొన్ని బీ-సీ సెంటర్ సింగిల్ స్క్రీన్‌లలో ₹80–₹90 టికెట్ ధరలు ఉన్న చోట GST 7% తగ్గడంతో ప్రేక్షకులకు చిన్న ఉపశమనం లభిస్తుంది. అంటే 90 రూపాయల టికెట్ GST తగ్గింపుతో సుమారు 84–85 రూపాయలకు రావచ్చు. కానీ ఈ ప్రభావం పరిమిత స్థాయిలోనే ఉంటుంది.
4. ఇండస్ట్రీ అంచనా
* మల్టీప్లెక్స్‌లు : ఎలాంటి లాభం లేదు, ఎందుకంటే ₹100 కి మించిన టికెట్‌లు అన్ని 18% స్లాబ్‌లోనే ఉంటాయి.
* సింగిల్ స్క్రీన్‌లు : కొంత ఊరట ఉన్నా, క్లాసుల సంఖ్య తక్కువ. అంటే ఫుల్‌హౌస్ బెనిఫిట్ పెద్దగా ఉండదు.
* ప్రేక్షకులు : రెగ్యులర్ మూవీగోయర్‌పై ప్రభావం దాదాపు శూన్యం.
5. పాలసీ వెనుక ఉద్దేశ్యం
ప్రభుత్వం దీని ద్వారా "క్రింది స్థాయి టికెట్ ధరలు" చౌకగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, మార్కెట్ వాస్తవాలు దానికి అనుకూలంగా లేవు. ఎందుకంటే టికెట్ ధరల పెరుగుదల, ఇండస్ట్రీలోని ఆపరేటింగ్ ఖర్చులు, డిస్ట్రిబ్యూషన్ షేర్స్, ప్రొడక్షన్ ఖర్చులు ఆధారంగా ఉంటుంది. GST రేటు మార్పు ఒక్కటే ఈ సమీకరణలో పెద్దగా మార్పు తేవడం కష్టమే.
ఏదైమైనా...
కొత్త GST రేట్లు సినిమాలపై “అనౌన్స్‌మెంట్ లెవెల్‌లో ఆకర్షణీయంగా” ఉన్నా, “గ్రౌండ్ లెవెల్‌లో ప్రభావం లేనట్టే” అని చెప్పవచ్చు.
* సింగిల్ స్క్రీన్‌లు : చిన్న ఊరట.
* మల్టీప్లెక్స్‌లు : ఎలాంటి మార్పు లేదు.
* ప్రేక్షకులు : ఎక్కువమందికి ఏ మాత్రం లాభం లేదు.
ఈ GST సవరణలు సినీ ఇండస్ట్రీలోని టికెట్ రేట్ సమస్యను పరిష్కరించలేవు , కానీ ప్రభుత్వానికి "ప్రజలకు బెనిఫిట్ ఇచ్చాం" అనే ఇమేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం క్రిందే ఉండిపోతుంది.