
‘ఛాంపియన్’ : ఓటిటి డీల్ ఓకే...అసలు అగ్నిపరీక్ష వేరే చోట
కంటెంట్ క్లిక్ అయితేనే కలిసొస్తుంది
తెలుగు సినిమా ట్రేడ్‌లో ఇప్పుడొక చర్చ హాట్ టాపిక్‌గా మారింది. డిసెంబర్ 25న క్రిస్మస్ టార్గెట్‌గా వస్తున్న ‘ఛాంపియన్’ నిజంగా ఛాంపియన్ అవుతుందా? లేదా అతి భారీ అంచనాల భారంలోనే ఆగిపోతుందా? ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం ఒక్కటే. రోషన్ మేకా (హీరో శ్రీకాంత్ కొడుకు) లాంటి దాదాపు కొత్త హీరో మీద రూ.47 కోట్ల బడ్జెట్ పెట్టడం ఎంతవరకు సేఫ్? కానీ ట్రేడ్‌లో వినిపిస్తున్న మాట మాత్రం వేరేలా ఉంది. “ఇది రోషన్ సినిమా కాదు… ఇది అశ్వనీదత్ ఫ్యామిలీ బ్యానర్ సినిమా” అన్న కాన్ఫిడెన్స్.
అదే ‘ఛాంపియన్’ కథలోని మొదటి ట్విస్ట్.
కొత్త హీరో… కానీ భారీ బ్యానర్ ఇచ్చిన ధైర్యం
స్వప్న సినిమాస్ అంటేనే ట్రేడ్‌లో ఒక బ్రాండ్. ‘మహానటి’, ‘జాతిరత్నాలు’, ‘కల్కి 2898 AD’ లాంటి సినిమాల తర్వాత ఆ బ్యానర్ నుంచి వస్తున్న సినిమా అంటేనే మార్కెట్‌లో ఒక నమ్మకం. అందుకే “కొత్త హీరో అయితే ఏముంది… కంటెంట్ ఉంటే చాలు” అనే ఆలోచనతోనే ఈ ప్రాజెక్ట్‌కు రూ.47 కోట్ల వరకు బడ్జెట్ వెళ్లిందని ట్రేడ్ వర్గాల టాక్.
రోషన్ మేకా కెరీర్ విషయానికి వస్తే, ‘పెళ్లి సందD’తో హిట్ అందుకున్నా, ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. అందుకే ‘ఛాంపియన్’ అతనికి సాధారణ సినిమా కాదు. ఇది కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకెళ్లే సినిమా అవుతుందా, లేక అవకాశాలు మరింత కష్టమయ్యే మలుపు అవుతుందా అనే ఉత్కంఠ ఉంది. దీనికితోడు క్రిస్మస్ సీజన్ కావడం, అదే రోజు మరికొన్ని సినిమాలు కూడా థియేటర్లకు రావడం వల్ల పోటీ తీవ్రంగా ఉండనుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం వచ్చే ఈ సీజన్‌లో, మొదటి రోజు టాక్ చాలా కీలకం కానుంది.
ఇప్పుడు ‘ఛాంపియన్’ అతనికి కంబ్యాక్ కాదు… సర్వైవల్ ఫిల్మ్ .
OTT డీల్ – సినిమా విడుదలకుముందే గెలుపా?
థియేటర్లకు రాకముందే ‘ఛాంపియన్’ ఒక కీలక మ్యాచ్ గెలిచింది. నెట్‌ఫ్లిక్స్‌తో దాదాపు రూ.16 కోట్లకు డిజిటల్ హక్కులు అమ్ముడవ్వడం మిడ్ రేంజ్ సినిమాకు పెద్ద ప్లస్. ఇది పూర్తిగా సినిమాపై నమ్మకమా, లేక స్వప్న సినిమాస్ ట్రాక్ రికార్డ్ వల్ల వచ్చిన డీలా అనే చర్చ ట్రేడ్‌లో నడుస్తోంది. అయితే ఇది పూర్తిగా సినిమా కంటెంట్ మీద కంటే ప్రొడ్యూసర్స్ ట్రాక్ రికార్డ్ మీద వచ్చిన నమ్మకమే అని ట్రేడ్ ఓపెన్‌గా చెబుతోంది. కానీ ఈ డీల్‌తో మేకర్స్‌కు పెద్ద రిలీఫ్ వచ్చింది.
కానీ… ఇది మొత్తం కథలో సగం మాత్రమే.
అసలు అస్సలు టెన్షన్ – US మార్కెట్
అసలు టెన్షన్ అంతా యూఎస్ మార్కెట్ దగ్గరే మొదలవుతోంది. ‘ఛాంపియన్’కు అక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాదాపు 700 వేల డాలర్లు అని సమాచారం. దాదాపు కొత్త హీరో లాంటి రోషన్ చ్చే సినిమాకు ఇది చాలా పెద్ద సంఖ్య.
ఇటీవలే మంచి టాక్ తెచ్చుకున్న
‘రాజు వెడ్స్ రాంబాయి’,
‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’
లాంటివే $100K కూడా టచ్ చేయలేకపోయాయి.
అలాంటి పరిస్థితుల్లో
న్యూ హీరో, నో స్టార్ ప్యాకేజింగ్ ఉన్న ‘ఛాంపియన్’
$700K అంటే…
ట్రేడ్ భాషలో చెప్పాలంటే
హెర్క్యులియన్ టాస్క్ .
‘ఛాంపియన్’ ఈ టార్గెట్ చేరాలంటే కేవలం మంచి కాదు, అసాధారణంగా బలమైన కంటెంట్ అవసరం అనే మాట ట్రేడ్‌లో ఓపెన్‌గా వినిపిస్తోంది. ఇక్కడే సినిమా భవితవ్యం తేలనుంది. కథ ప్రేక్షకులను బలంగా పట్టుకుంటే, వర్డ్ ఆఫ్ మౌత్ పనిచేస్తే, నెమ్మదిగా అయినా నంబర్లు పెరుగుతాయి. అదే కనెక్ట్ కాకపోతే, ఎంత పెద్ద బ్యానర్ అయినా, ఎంత భారీ బడ్జెట్ అయినా యూఎస్ మార్కెట్ క్షమించదు. క్రిస్మస్ హాలిడేస్ కూడా అప్పుడు సినిమాకు ఉపయోగపడవు.
---
క్రిస్మస్ క్లాష్ – మల్టిప్లయర్ అవుతుందా మైనస్ అవుతుందా?
డిసెంబర్ 25 అంటే ఫ్యామిలీ ఆడియన్స్, సెలవులు, లాంగ్ వీకెండ్. కానీ అదే రోజు ‘ధండోరా’, ‘ఈషా’, ‘శంభాల’ లాంటి సినిమాలు కూడా వస్తున్నాయి. అంటే స్క్రీన్స్ చీలిపోతాయి.
షోస్ తగ్గుతాయి. మౌత్ టాక్ బలహీనంగా ఉంటే… సినిమా మాయమవుతుంది. ఇక్కడ ‘ఛాంపియన్’కు ఒక్కటే ఛాన్స్. డే 1 నుంచే స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్.
కంటెంట్ లేకపోతే నంబర్లు అబద్ధం చెప్పవు. ఈ సినిమా విషయంలో పోస్టర్స్, ట్రైలర్, బ్యానర్ అన్నీ ఒక హైప్ క్రియేట్ చేశాయి. కానీ US మార్కెట్ హైప్‌ను కాదు… ఎమోషన్‌ను కొంటుంది. కథ కనెక్ట్ అయితే స్లో బర్న్‌గా అయినా నంబర్లు పెరుగుతాయి. కనెక్ట్ కాకపోత ఎంత పెద్ద బ్యానర్ అయినా ఎంత పెద్ద OTT డీల్ అయినా బాక్సాఫీస్ దగ్గర పనికిరాదు.
ఫైనల్ ట్రేడ్ వెర్డిక్ట్
‘ఛాంపియన్’ ఒక రిస్క్ సినిమా. కానీ అది అజ్ఞానపు రిస్క్ కాదు. బ్యానర్ స్ట్రెంగ్త్ మీద తీసుకున్న కాన్ఫిడెంట్ రిస్క్. ‘ఛాంపియన్’ ఒక సాధారణ రిలీజ్ కాదు. ఇది రోషన్ మేకాకు కీలకమైన పరీక్ష. అలాగే కొత్త హీరోలపై భారీ బడ్జెట్ పెట్టొచ్చా లేదా అనే అంశానికి కూడా ఒక ఉదాహరణ. కంటెంట్ గెలిస్తే ఇది ఛాంపియన్ అవుతుంది. అదే తడబడితే, ట్రేడ్‌లో ఈ సినిమా గురించి జరిగే చర్చలు మరో దిశలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే. ఈ భారీ నమ్మకాన్ని ‘ఛాంపియన్’ నిజంగా నిలబెట్టుకుంటుందా లేదా అనే సమాధానం డిసెంబర్ 25 తర్వాతే బయటపడుతుంది.
ఇప్పుడు నిజంగా ఒకే ప్రశ్న మిగిలింది
‘ఛాంపియన్’ కంటెంట్ నిజంగానే ఛాంపియన్‌లా ఉందా?
లేదా బ్యానర్ నమ్మకమే మోయాల్సిన భారం అవుతుందా?

