KCR డైలాగు కొంప ముంచుతోందా, కలిసొస్తుందా?
x

KCR డైలాగు కొంప ముంచుతోందా, కలిసొస్తుందా?

వివాదమే చాలా సార్లు సినిమాలకు ప్లస్ అవుతుంది. ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతుంది.


వివాదమే చాలా సార్లు సినిమాలకు ప్లస్ అవుతుంది. ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతుంది. జనాల దృష్టిని సినిమా వైపుకు తిప్పుకునేలా చేస్తుంది. గతంలో సెన్సార్ దగ్గర సినిమా ఆగి రిలీజ్ అయ్యిందంటే జనాలు అందులో ఏముందో అని ఎగబడేసారు. దాంతో సెన్సార్ వద్ద పోరాటం చేసి మరీ రిలీజైన సినిమా అని ప్రకటించేవారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ వచ్చిన తర్వాత కేవలం వివాదాలతోనే తమ సినిమాలకు పబ్లిసిటీ తెచ్చుకుని, ఆ ఖర్చులు మిగుల్చుకోవటం మొదలెట్టారు. ఇప్పుడు ఆయన శిష్యుడు పూరి జగన్నాథ్ సైతం ఆయన దారిలోనే వెళ్తున్నాడా అనిపిస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే...

రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఏ రేంజి సక్సెస్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రమోషన్స్ హంగామా మొదలైంది. అయితే తాజాగా విడుదలైన రెండో లిరికల్ సాంగ్ 'మార్ ముంత చోడ్ చింత' వివాదంలో ఇరుక్కుకుంది. ఈ పాటలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాయిస్‌ను ఉపయోగించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

వాస్తవానికి మార్ ముంత చోడ్ చింత అంటూ సాగిపోయే పాట జనాల్లోకి ఇనిస్టెంట్ గా వెళ్లిపోయింది. ఈ పాటలో రామ్ ఎనర్జీకి, కావ్య పాప అందాల ప్రదర్శన బాగా సెట్ అయ్యింది. కాస్లర్ శ్యామ్ రాసిన పాటకు ఓ హైప్, ఊపు తెస్తోంది. అదే టైమ్ లో.. ఈ మార్ ముంత పాట వివాదాస్పదమైంది. ఈ పాటలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫేమస్ డైలాగ్ ఒకటి వినిపిస్తుంది.

‘ఏం చేద్దామంటావ్ మరీ’ లో కేసీఆర్ వాయిస్ డైలాగ్ వినియోగించారు ఇందులో. ఇది బీఆర్ఎస్ నేతల మనో భావాలను హర్ట్ చేసింది. తమ మాజీ సీఎంని కేసీఆర్‌ను కించపరిచేలా ఈ చర్య ఉందంటూ మండిపడుతున్నారు. ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో పాటు పాట రచయిత కాసర్ల శ్యామ్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై కూడా విమర్శలు వస్తున్నాయి. ఆ డైలాగు పాట నుంచి తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే పూరి జగన్నాథ్ టీమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఈ వివాదంతో జనాల్లోకి ఈ సినిమా , పాట బాగా వెళ్తోంది. అసలు ఏముందా ఆ పాటలో, ఎలా కేసీఆర్ డైలాగుని పెట్టారా ఆని ఆసక్తితో పాటను వింటున్నారు. అదే సమయంలో పూరి జగన్నాథ్ కు సైతం కొందరు సోషల్ మీడియా అభిమానుల నుంచి మద్దతు దొరుకుతోంది. కేసీఆర్ చెప్పిన ఆ మాట...ఓ మీమ్ డైలాగుగా పాపులర్ అయ్యిపోయింది. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా వాడుకోవచ్చు అంటున్నారు.

ఇక డబుల్ ఇస్మార్ట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తున్నారు. మణి శర్మ బాణీలు సమకూరుస్తుండగా.. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆగస్టు 15న ఈ మూవీ విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, టైటిల్ సాంగ్ ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. పూరి ఈసారి డైలాగ్స్ తోనే కాకుండా మంచి యాక్షన్ డోస్ తో కూడా మెప్పించనున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి థియేటర్స్ లో డబుల్ ఇస్మార్ట్ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.

Read More
Next Story