
"బ్రోమాన్స్" ఓటిటి మూవీ రివ్యూ
ఓటీటీలు వచ్చాక మలయాళ సినిమాలకు తెలుగులో మరింత క్రేజ్ పెరుగుతుంది.
ఓటీటీలు వచ్చాక మళయాళ సినిమాలకు తెలుగులో మరింత క్రేజ్ పెరుగుతుంది. ఓటీటీల్లో తెలుగు డబ్బింగ్ వెర్షన్లకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు ఓటీటీలలో ఎక్కువగా మళయాళి క్రైమ్ థ్రిల్లర్స్ అగ్రభాగాన వుంటే, అప్పుడప్పుడూ కామెడీ సినిమాలు కూడా ఔట్ అఫ్ సిలబస్‌గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాయి.
అలాగే తాజాగా వచ్చిన మలయాళ కామెడీ ఫిలిం "బ్రోమాన్స్" . కేరళ థియేటర్స్ లో ఫిబ్రవరి 14న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా తెలుగులో డబ్బింగ్ అయ్యి ఓటిటి లోకి వచ్చింది. ఇంతకీ ఈ సినిమా మన తెలుగు వాళ్లకు నచ్చేదేనా, అసలు ఈ చిత్రం కథేంటి రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
ఇది షింటో (శ్యామ్ మోహన్) – బింటో (మాథ్యూ థామస్) అనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే సరదా గందరగోళ కథ. చిన్నతనం నుంచే ఇంట్లో అందరి ప్రవర్తన వలన బింటోకు తన అన్న మీద ఎక్కువ ప్రేమ కలగదు. ఇద్దరూ భిన్నమైన జీవితాలు గడుపుతుంటారు. కొచ్చి లో స్టాక్ మార్కెట్ కన్సల్టెంట్‌గా ఉన్న షింటో ఒక్కసారిగా అదృశ్యమవుతాడు.
అతని స్నేహితుడు షబీర్ (అర్జున్ అశోకన్) ఈ విషయం బింటోకు చెబుతాడు. అప్పటివరకు అన్న మీద అంత ఇష్టం లేని బింటో, అన్నను వెతకడానికి కొచ్చి బయలుదేరుతాడు. అయితే, అక్కడ అతను సోషల్ మీడియా ఫేమ్ కోసం చేసిన ఓ చిన్న పని, పెద్ద సమస్యను తెచ్చిపెడుతుంది.
ఈ క్రమంలో ఎస్సై టోనీ (బిను పప్పు)తో ఘర్షణ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే పరిస్థితులు ఎదురవుతాయి. ఇక షింటో కనపడకుండా పోవడానికి, అతని చుట్టూ తిరిగే పాత్రలైన కొరియర్ బాబు (కళాభవన్ షాజన్), డాక్టర్ ఐశ్వర్య (మహిమ నంబియార్)లతో ఉన్న సంబంధాలేమిటో కూడా బింటో తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఈ ప్రయాణం బింటో జీవితాన్ని ఎలా మార్చింది? అన్నతో సంబంధం ఎలా మలుపు తిరిగింది? అన్న అన్నదమ్ముల మధ్య ఉన్న ‘బ్రోమాన్స్’ ఎలా బయటపడింది? అన్నదే సినిమా అసలు కథ.
విశ్లేషణ
దర్శకుడు అరుణ్ డి జోస్‌కు గిరిష్ ఏ.డి తరహా రెప్యుటేషన్ ఉంది — ఆయన సినిమాలు పెద్దగా కథ బేస్ చేసుకుని ఉండవు, కానీ గందరగోళమైన పరిస్థితుల్లో హ్యూమర్‌ను క్రియేట్ చేసి ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సిద్దహస్తుడు. Jo & Jo, 18+ వంటి చిత్రాల్లోని స్టైల్‌నే ఫాలో అవుతూ, తాజా చిత్రమైన బ్రోమాన్స్ కూడా సిట్యుయేషనల్ హ్యూమర్ మీదే ఆధారపడి తీశారు.
అయితే, ఆయన మునుపటి చిత్రాల కన్నా ఈసారి కథ దశలవారీగా ముందుకెళ్లడం కొంచెం స్లోగానే అనిపిస్తుంది. ఫన్ ని రాబట్టే సీన్స్ , డైలాగ్ హ్యూమర్ తో నడిచినా, అవన్నీ క్లైమాక్స్ దగ్గరే ఊపందుకుంటాయి.
“బ్రోమాన్స్” సినిమా స్టైల్, స్క్రిప్టింగ్ ట్రీట్‌మెంట్ ఇంట్రస్టింగ్ గానే ఉంటుంది. కానీ, ఆయన గత సినిమాలకి తగ్గట్టు మొదట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్ గేర్‌లోకి వెళ్లడం కాకుండా,నిదానమే ప్రధానం అన్నట్లు సాగుతూ చివర్లో పేలుతుంది. సినిమా ప్రారంభం Thallumala ని గుర్తు చేస్తుంది. అసలైన ఫన్ మాత్రం Courier Babu ఎంట్రీ తో మొదలవుతుంది.
ఇది ప్లాట్ డ్రైవర్ సినిమా కాదు. కాబట్టి రైటర్స్ థామస్ పి సెబాస్టియన్, రవీష్ నాథ్ ఇద్దరూ ఒక్కో సీన్‌లో ఫన్ క్రియేట్ చేయడం మీద దృష్టి పెట్టారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో — గ్యాంగ్ మొత్తం ఒక మొబైల్ ఫోన్ కోసం పడే తాపత్రయం మీదే చాలా ఫన్ , టైమింగ్ ఆధారపడి ఉంటుంది.
కథ లేకపోయినా సినిమా చూడగలిగామంటే ఒక్క కారణమే — అదే హ్యూమర్. అదే ఫ్లో మిస్ అయితే, ఆ ట్రాక్ పూర్తిగా తలనొప్పిగా మారిపోయేది.
చూడచ్చా
"బ్రోమాన్స్" అన్నది కథ కోసం చూసేవాళ్ల కోసం కాక, ఎక్కడికి అక్కడ నవ్విస్తే చాలు అనుకునే వాళ్ళకి సూపర్ గా నచ్చే చిత్రంగా నిలుస్తుంది. మారుతున్న టెక్నాలజీ, కొత్తతరం మనస్తత్వాలు, బ్రేకప్ లు కవర్ చేసిన విధానం బాగుంది.
ఎక్కడుంది
సోనీ లివ్ ఓటీటీలో తెలుగులో ఉంది