‘గుండమ్మ కథ’:ఎన్టీఆర్, ఏఎన్నార్ విజిల్స్ సీన్ వెనక ఇంట్రస్టింగ్ స్టోరీ
x

‘గుండమ్మ కథ’:ఎన్టీఆర్, ఏఎన్నార్ విజిల్స్ సీన్ వెనక ఇంట్రస్టింగ్ స్టోరీ

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, సావిత్రి, జమున, సూర్యకాంతం కీలక పాత్రల్లో నటించిన క్లాసిక్‌ మూవీ ‘గుండమ్మ కథ’ఇప్పటికి ఎప్పుడు టీవీల్లో వచ్చినా మనవాళ్లు చూస్తూంటారు.


ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, సావిత్రి, జమున, సూర్యకాంతం కీలక పాత్రల్లో నటించిన క్లాసిక్‌ మూవీ ‘గుండమ్మ కథ’ఇప్పటికి ఎప్పుడు టీవీల్లో వచ్చినా మనవాళ్లు చూస్తూంటారు. ఈ సినిమా విడుదలై 62 ఏళ్లు పూర్తైనా సన్నివేశాల్లో ఉన్న ప్రెషనెస్ మనలని కట్టిపారేస్తుంది. ఈ సినిమాలో చాలా విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య వచ్చే విజిల్ సీన్ బాగా క్లిక్ అయ్యింది. ఇప్పటికీ ఆ సీన్ గురించి చెప్పుకుంటారు. అయితే ఆ సీన్ వెనక ఇంట్రస్టింగ్ విషయం ఉంది.

రచయిత డి.వి.నరసరాజు ఆ సీన్‌ ఎలా రాసారో చెప్పుకొచ్చారు. నరస రాజు గారు మాట్లాడుతూ..."గుండమ్మ కథ"కు డైలాగ్స్ రాయడంలోనూ నాకు ఒక కొత్త అనుభవం! నేను సామాన్యంగా డైరెక్టరుతోనూ ప్రొడ్యుసరుతోనూ కూర్చుని కథ మొదటినుండి చివరవరకూ చర్చించి సీను ఆర్డరు రాసుకుని ప్రతి సీనులో ఏం జరుగుతుందో క్షుణ్ణంగా చర్చించుకుని ఒక అంగీకారానికి వచ్చిన తరువాత ఒక్కడినే కూర్చుని మూడు నాలుగు వారాల్లో డైలాగ్స్ రాయడం నాకు అలవాటు! నా మొదటి పిక్చర్స్ "పెద్ద మనుషులు", "దొంగరాముడు" సినిమాల్లో కె.వి. రెడ్డిగారితో పనిచేసిన పద్ధతి అది! అప్పటికీ, యిప్పటికీ అదే నా పద్ధతి!

చక్రపాణిగారితో పనిచెయ్యడం "గుండమ్మ కథ"తోనే మొదలు! మొదటి రెండురోజులు టూకీగా గుండమ్మ కుటుంబం, గుండమ్మ సవతి కూతురు, సొంత కూతురు, రమణారెడ్డి- అతని భార్య ఆ పాత్రల స్వభావాలు చర్చించుకున్నాం.

“రేపు రాసుకొస్తారా?" అన్నారు చప్రాణిగారు. నేను షాక్ అయ్యాను! కథ ఏమిటో చివరి దాకా ఏమీ అనుకొలేదు, ఎలా రాయడం!

"ఎందుకండీ! కథ పూర్తిగా అనుకున్న తరువాత రాస్తాను" అన్నాను.

"రాయండి! బాగోపోతే మళ్లీ రాసుకోవచ్చు, యిదేమన్నా వేదమా?" అన్నారాయన. ఆయనతో అప్పటికి చనువు తక్కువవల్ల ఏమీ అనలేకపోయాను. అలాగే అన్నాను.

ఆ రాత్రి ఆలోచించాను, కథ ముందు ఏం జరుగుతుందో తెలియదు. ఏం రాయడం? ఏమీ పాలుపోలా? నిద్రపోయా. పొద్దున్నే లేచా! 8.30కు స్టూడియోనుంచి కారు వస్తుంది. స్టూడియోకి వెళ్లాలి 'రాయలేదు' అని ఎలా చెప్పడం! "బాగోపోతే మళ్లీ రాసుకుందాం" అని ఒక మాట ఆయన అన్నారు గనక "రాయలేదు" అనడంకంటే ఏదో ఒకటి రాసుకుపోదాం అని కాగితాలు, కలం తీసుకుని రాశా!

తెల తెల్లవారుతోంది. సావిత్రి పెరట్లో ఏదో దంచుతోంది. సూర్యకాంతానికి మెలకువ వచ్చింది.

"ఏమిటి పొద్దునే ధనాధనామని, మమ్మల్నేం నిద్రపోనివ్వవా?" అని ఒక మొట్టి కాయవేసింది.

"కోడి కూసింది పిన్నీ"

"అది నీలాంటిదే, పనీపాటా లేక కూసివుంటుంది" అని యిలా గబగబా నాలుగు సీన్లు రాసా, కారు వచ్చింది. స్టూడియోకెళ్లా! రూంలో కూర్చున్నాం. "చదవండి". చదివాను.

"బాగానే వున్నాయ్? అంతకంటే ఏం రాస్తారు, అట్లా వుంచండి" తరువాత సీను... ఇలా మరికొన్ని సీన్లు అనుకోడం, పోద్దున్నే గబగబా రాసెయ్యడం, ఆయన వినడం, ఒకే అనడం! యిలా... జరిగింది మొత్తం స్క్రిప్టు రచన.

అయితే ఒకసారి ఒక సీనులో చిక్కు వచ్చింది. 'కోలు కోలోయమ్మ' పాటకు ముందు సీను. నాగేశ్వరరావుగారు-గుండమ్మ యింటికి వస్తారు. అప్పటికే జమునతో ప్రేమకలాపం మొదలయింది. ఇంట్లో రామారావుగారు నౌకరు వేషంలో వున్నారు. వాళ్లిద్దరూ అన్నదమ్ములన్నది ఆ యింట్లో వాళ్లకు తెలియదుగదా! నాగేశ్వరరావుగారు, రామారావుగారు ఒకర్నొకరు చూసుకున్నారు చిరునవ్వులతో.

నాగేశ్వరరావుగారు రామారావుగారిని అడగాలి! "నా ప్రేయసి ఇంట్లో వుందా?" అని. ప్రేయసి చాలా పెద్దమాట. పోనీ "నా పిట్ట యింట్లో వుందా?" చాలా చీప్ మాట. సరైన మాట దొరకలా. కారు వచ్చేటైం అవుతోంది. సీను రాసెయ్యాలి.

"నా ప్రేయసి వుందా యింట్లో" అని అర్థం వచ్చేటట్టు యీల (విజిల్) వేసి ఆడుగుతాడు అని రాశాను. దానికి సమాధానంగా రామారావుగారు కూడా యీల వేసి చెబుతాడు.

'బుల్లెమ్మా' అని సావిత్రిని పిలుస్తాడు. సావిత్రి నాగేశ్వరరావుని రామభద్రయ్యగారి కొడుకని గుర్తుపడుతుంది. సరోజ కోసం వచ్చారని చెప్పి లోనికి వెళుతుంది కాఫీ తెస్తానని.

అప్పుడు రామారావుగారు నాగేశ్వరరావుగారిని విజిల్తో అడుగుతాడు.

'చాలా బాగుంది" అని విజిల్ తోనే నాగేశ్వరరావుగారి సమాధానం. ఆ తరువాత సీను, డైలాగ్స్ గబగబ రాసేశాను. కారు వచ్చింది. స్టూడియోకి వెళ్లాను.

“చదవండి"

అలాగే చదివాను. విజిల్ వేస్తూ చదివి వినిపించాను. చక్రపాణిగారు "మళ్లీ డైలాగ్ ఎందుకు? చివరదాకా విజిల్ తోనే నడపండి సీను" అన్నారు.

"గుండమ్మకథ" 1962 జూన్ 7వ తేదీన విడుదలయింది. సరైన మాట దొరకక విజిల్ను ఆశ్రయించిన సీను. పిక్చర్లో హైలైట్ అయింది.హాల్లో జనం స్టార్ హీరోలు విజిల్స్‌ సీన్‌ చూసి తెగ ఈలలు వేశారు. రాసేటప్పుడు రచయిత సరైన మాట దొరక్క విజిల్స్‌ను ఆశ్రయిస్తే ఆ సీన్‌ సూపర్‌ హిట్‌ అయింది.

"పిక్చరు జాతకం బాగుంటే అన్నీ అలా కలిసివస్తాయ్" అన్నారు డైరక్టర్ కామేశ్వరరావుగారు. ఆయన జాతకాలలోనూ, న్యూమరాలజీ, సంఖ్యాశాస్త్రంలోనూ నిష్ణాతుడు! అంటారు నరసరాజుగారు.

Read More
Next Story