
“మన శంకర వర ప్రసాద్ గారు”: ఈవీవీ రోజులు మళ్లీ తెస్తున్నారా?
ఏమిటా స్పెషల్
ఒకప్పుడు ప్రముఖ దర్శకుడు, కామెడీ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ అయిన ఈవీవీ సత్యనారాయణ సినిమాలు ఎందుకు ఆడియన్స్‌ను థియేటర్లకు లాగేవి? సూపర్ హిట్స్ అయ్యేవి. కథ ఎంత సింపుల్ అయినా, నవ్వించినా... క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఒక నాస్టాల్జియా హుక్ తప్పకుండా ఉండేది. పాత హిట్ పాటల గోల, స్టార్ నటుల సెల్ఫ్ రిఫరెన్షియల్ మూమెంట్స్, ప్రేక్షకుడిని నవ్విస్తూ,ఆ రోజులు గుర్తు తెప్పిస్తూ థియేటర్ నుంచి బయిటకి పంపించే ఫీలింగ్. జనాలు ఫుల్ ఖుషీగా బయిటకు వెళ్లి అదే టాక్ స్పెడ్ చేసేవారు. ఇప్పుడు ఆ ఫార్ములా ని ఎవరూ ఉపయోగించటం లేదు. అసలు అలాంటి సినిమాలు మళ్లీ తిరిగి వస్తాయా అనేది సందేహమే. కానీ ఆ రోజులను మళ్లీ తిరిగి తెచ్చేందుకు “మన శంకర వర ప్రసాద్ గారు” సినిమా టీమ్ కృషి చేస్తోందని తెలుస్తోంది. ఆ సినిమా చుట్టూ ఆసక్తిని పెంచుతోంది.అదెలానో చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ను వెనక్కి తిరిగి చూస్తే, పాటలే ఒక ప్రత్యేక అధ్యాయం. 1980, 1990లలో ఆయన సినిమాల పాటలు కేవలం హిట్స్ కాదు, అప్పటి సామాజిక మూడ్‌కు సౌండ్‌ట్రాక్‌లా నిలిచాయి. ఈ రోజుకి కూడా ఫంక్షన్లు, పెళ్లిళ్లు, రాజకీయ సభలు అన్నిచోట్ల అవే పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఆ నాస్టాల్జియానే ఇప్పటికే రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ తమ సినిమాల్లో రీమిక్స్‌లుగా వాడుకున్నారు. ఇప్పుడు అదే ట్రెండ్‌ను చిరంజీవి తన సినిమాకే తీసుకురాబోతోన్నారని తెలుస్తోంది. అదే సినిమాకు ప్రత్యేకంగా మారబోతోంది అని చెప్తున్నారు.
ఇక వెంకటేష్ విషయానికి వస్తే, ఆయన కెరీర్ మొత్తం సూపర్ హిట్ ఆల్బమ్స్‌తో ముడిపడి ఉంటుంది. అలాగే ఆయన సినిమాల్లో ఎక్కువ రీమేక్ లు అయినా, వాటిలోని పాటలు తెలుగు ఆడియన్స్‌కు ఒరిజినల్‌లా అనిపించేలా నిలిచాయి. నిజంగా చెప్పాలంటే, వెంకటేష్ సినిమాల విజయంలో మ్యూజిక్ పాత్ర చాలా కీలకం. అలాంటి రెండు లెజెండరీ కెరీర్లు తొలిసారి కలవడం, అదీ సంక్రాంతి కానుకగా రావడం అనిల్ రావిపూడికి పెద్ద అవకాశమే కాదు, పెద్ద రిస్క్ కూడా.
ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం, “మన శంకర వర ప్రసాద్ గారు” సినిమాలో చిరంజీవి పాత పాటలతో పాటు, వెంకటేష్ పాత పాటలను కూడా రీమిక్స్ చేశారట. ఈ పాటలు కథ మధ్యలో కాకుండా, వీరిద్దరిపై తీసిన ఒక ప్రత్యేక ఎపిసోడ్‌లో వస్తాయని సమాచారం. ముఖ్యంగా సినిమా చివర్లో ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఈ భాగమే హైలెట్ అవుతుందని అంటున్నారు. పాత ఈవీవీ సినిమాల్లో క్లైమాక్స్ దగ్గర వచ్చే పాటల మెడ్లీలు, సెలబ్రేషన్ సీన్స్ ఎలా ఆడియన్స్‌ను థియేటర్ నుంచి చిరునవ్వుతో బయటకు పంపించాయో, అదే ఫీలింగ్‌ను రీక్రియేట్ చేయాలనే ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది.
ఇక్కడే అసలు ప్రశ్న. ఇది నిజంగా కథకు అవసరమైన నాస్టాల్జియా ఎమోషనా? లేక హిట్ కోసం వాడుతున్న సేఫ్ ఫార్ములానా? అనిల్ రావిపూడి ఇప్పటివరకు కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లలో తనకంటూ ఒక స్టైల్‌ను ప్రూవ్ చేసుకున్నారు. కానీ ఈసారి ఆయన రెండు తరాల ప్రేక్షకులను ఒకేసారి సాటిస్‌ఫై చేయాల్సిన ఛాలెంజ్ ఎదుర్కొంటున్నారు. పాత పాటలు యువ ప్రేక్షకులకు కొత్తగా అనిపించాలంటే, అవి కేవలం రీమిక్స్‌లుగా కాకుండా కథలో భాగంగా మెలగాలి.
ఏదైమైనా చిరంజీవి (Chiranjeevi), వెంకటేశ్ (Venkatesh)లను కలిపి ఒకే స్క్రీన్‌లో చూపించే అవకాశం తనకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’. నయనతార హీరోయిన్. వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. ఇప్పటికే చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న (Mana Shankara Vara Prasad Garu Release date) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవిని తాము 30 ఏళ్ల క్రితం ఎలా చూశామో, అలానే డ్యాన్స్ చేశారని, నిజంగా ఫ్యాన్స్‌కు ఇది ఒక ఫీస్ట్‌లాంటి సినిమా అని నిర్మాత తెలిపారు.
మొత్తానికి, “మన శంకర వర ప్రసాద్ గారు” కేవలం ఒక మల్టీ స్టారర్ మాత్రమే కాదు. ఇది నాస్టాల్జియా మీద వేసిన పెద్ద బెట్టింగ్. ఒకప్పుడు ఈవీవీ సత్యనారాయణ క్లైమాక్స్‌ల్లో చేసిన మ్యాజిక్‌ను అనిల్ రావిపూడి ఈ రోజున మళ్లీ సాధించగలడా? చిరంజీవి, వెంకటేష్ పాత పాటలు ప్రేక్షకుల గుండెల్లో మళ్లీ అదే రేంజ్‌లో మోగుతాయా? ఈ సంక్రాంతికి ఈ ప్రశ్నలకు సమాధానం దొరకబోతోంది.

