
‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ
పండగ టైమ్ పాస్
నవీన్ పోలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా తెరకెక్కిన తాజా చిత్రం 'అనగనగా ఒక రాజు'. జమీందారీ వైభవం పోయినా, ఆడంబరాలు తగ్గని ఒక యువకుడి కథ ఇది. మరి ఈ 'రాజు' బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు రాజ్యమేలాడో ఈ సమీక్షలో చూద్దాం.
కథా కమామిషు:
ఈ కథ అంతా రాజు (నవీన్ పోలిశెట్టి) అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. రాజు పరిస్థితి సరిగ్గా ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్న చందాన ఉంటుంది. జమీందారు మనవడన్న పేరే తప్ప, చేతిలో చిల్లిగవ్వ లేదు. తాతగారు ఉన్న ఆస్తినంతా తగలేయడంతో రాజు నానా పాట్లు పడుతుంటాడు. కానీ, లోకం ముందు మాత్రం తన జమీందారీ హోదాను పోనివ్వకుండా మేనేజ్ చేస్తుంటాడు. 'మింగటానికి మెతుకు లేకపోయినా మీసాలకి సంపెంగ నూనె' అన్నట్లుగా ఆడంబరాలు ప్రదర్శిస్తూ కాలం వెళ్లదీస్తుంటాడు.
ఈ క్రమంలో ఎదురైన అవమానాల నుంచి బయటపడటానికి, తన బంధువులాగే ఎవరో ఒక కోటీశ్వరుడి కూతురిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలని నిర్ణయించుకుంటాడు. అలా వెతుకుతున్న క్రమంలో భూపతిరాజు (రావు రమేష్) కూతురు చారులత (మీనాక్షి చౌదరి) అతనికి కనిపిస్తుంది. అందం, ఐశ్వర్యం ఉన్న చారులతను తన ప్రేమవలలో పడేయడానికి ‘ఆపరేషన్ చారులత’ మొదలుపెడతాడు. ఎట్టకేలకు తన ప్లాన్ వర్కవుట్ చేసి పెళ్లి పీటల దాకా వెళ్తాడు. అయితే, అసలు ట్విస్ట్ పెళ్లి తర్వాత మొదటి రాత్రే ఎదురవుతుంది. చారులత కుటుంబం, ఆస్తిపాస్తుల గురించి రాజుకు తెలిసిన ఆ దిమ్మతిరిగే నిజం ఏంటి? జమీందారు మనవడు కాస్తా సర్పంచ్ ఎన్నికల బరిలో ఎందుకు నిలబడాల్సి వచ్చింది? అన్నది వెండితెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే ?
పాత కథలకు కొత్త రంగులు అద్ది, లేటెస్ట్ పంచ్‌లతో వడ్డించడం ప్రస్తుత ట్రెండ్. ఈ సినిమా పాయింట్ కూడా గతంలో ఓ అగ్ర హీరో సినిమాలో వచ్చిన కామెడీ ట్రాక్ ఆధారంగానే సాగుతుంది. హీరో, హీరోయిన్లిద్దరూ ఒకే సమస్యతో, నిజాన్ని దాచి పెళ్లి చేసుకోవడం అనే అంశం మనకు పాత సినిమాలను గుర్తు చేస్తుంది. ముఖ్యంగా నాని ‘పిల్ల జమీందారు’ సినిమా చూడని వారికి ఇది కొంత తాజాగా అనిపించవచ్చు.
దర్శకుడు ఇవివి సత్యనారాయణ గారి మార్క్ ‘లైటర్ వీన్’ కామెడీని అనుసరించినట్లు కనిపిస్తుంది. సినిమా మొదలైన అరగంటకే మనకు ‘ఇది ఎక్కడో చూసిన కథే’ అనే భావన కలిగినా, నవీన్ పోలిశెట్టి తనదైన డైలాగ్ డెలివరీ మరియు టైమింగ్‌తో సీన్లను నిలబెట్టాడు. కథ ప్రెడిక్టబుల్ గా ఉన్నప్పటికీ, ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టకుండా సాగిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ పర్వాలేదనిపించినా, కథలో ఉండాల్సిన బలమైన డ్రామా మిస్ అయినట్లు అనిపిస్తుంది.
సెకండాఫ్ పరిస్థితి:
ద్వితీయార్ధం అంతా ఎన్నికల ప్రచారం, రాజకీయ వ్యూహాల చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ సినిమా బలాబలాలు స్పష్టంగా తెలుస్తాయి. సోషల్ మీడియా ట్రెండ్స్, రీల్స్, క్యాంపెయిన్ ఐడియాస్ మీద జోకులు వేసినా, అవి మరీ కొత్తగా సాటిరికల్ గా అనిపించవు. కొన్ని కామెడీ బ్లాక్స్ బాగా నవ్వించినా, మిగిలిన సన్నివేశాలు ఫార్ములా ప్రకారం సాగుతూ రిపీటెడ్ ఫీలింగ్ ఇస్తాయి. క్లైమాక్స్ కూడా ఊహించిన విధంగానే ముగుస్తుంది. హీరో పాత్రలో చివరి వరకు పెద్దగా మార్పుకనిపించకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్:
ఒక సాదాసీదా స్క్రిప్టును తన భుజాన వేసుకుని నడిపించడంలో నవీన్ పోలిశెట్టి మరోసారి సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా ప్యూర్ గా నవీన్ వన్ మ్యాన్ షో. తన ఎనర్జీతో వీక్ సీన్లను కూడా కవర్ చేశాడు. మీనాక్షి చౌదరి తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించింది. రావు రమేష్ ఇలాంటి పాత్రల్లో ఆరితేరిపోయారు. చమ్మక్ చంద్ర, మహేష్, మాస్టర్ రేవంత్ అక్కడక్కడా నవ్వులు పూయించారు. మిగిలిన సపోర్టింగ్ పాత్రలకు కథలో పెద్దగా ప్రాధాన్యత కనిపించదు.
సాంకేతిక వర్గం:
మిక్కీ జే మేయర్ సంగీతం పర్వాలేదు, రెండు పాటలు వినడానికి, చూడటానికి బాగున్నాయి. జె. యువరాజ్ విలేజ్ అట్మాస్ఫియర్ ను కెమెరాలో అందంగా బంధించారు. ఎడిటింగ్ విషయంలో సెకండాఫ్ పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది.
ముగింపు మాట:
‘అనగనగా ఒక రాజు’ ఒక సరదా కాలక్షేపం చిత్రం. కథలో కొత్తదనం లేకపోయినా, నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ కోసం ఈ పండగ సీజన్ లో ఒకసారి చూడొచ్చు. బలమైన ఎమోషన్స్ ఆశించకుండా కేవలం నవ్వుకోవడానికి వెళ్తే ఈ రాజు మెప్పిస్తాడు.

